సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1551వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉదయానికల్లా నొప్పి తగ్గించిన బాబా 
2. బాబా చేసిన సహాయం

ఉదయానికల్లా నొప్పి తగ్గించిన బాబా 


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా సాయినాథునికి నా హృదయపూర్వక ప్రణామాలు. సాయిబంధుకోటికి వందనాలు. నా పేరు అమరనాథ్. నా ఆరోగ్యం అంతగా బాగుండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వుంటాను. ఈమధ్య తరచుగా నడుంనొప్పి వస్తుంది. ఒకసారి ఆ నొప్పి వచ్చిందంటే కనీసం 15రోజులు దానితో ఇబ్బందిపడాల్సిందే. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమేగానే శాశ్వత నివారణోపాయం దొరకలేదు. అసలే నేను ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట ఉంటాను. ఆ సమయంలో నొప్పి వస్తే నరకం కనపడుతుంది. 2023, మే నెల మొదటి వారంలో ఆ నొప్పి వచ్చినప్పుడు నాకు చాలా భయమేసింది. నాకు ఏ బాధ కలిగినా నేను మొదట తలుచుకొనేది సాయిబాబానే. వెంటనే సాయినాథునికి నమస్కరించి, ఊదీ నొప్పి ఉన్న చోట రాసుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ పడుకొన్నాను. బాబా దయవల్ల ఉదయానికి నొప్పి లేదు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే దైవం బాబా. ఆయన మహిమను ప్రత్యక్షంగా అనుభవించాను.


ఒకరోజు మా అబ్బాయి యుఎస్ఏ నుండి ఫోన్ చేసి, "ఇక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకడం లేదు" అని చాలా బాధగా మాట్లాడాడు. నేను వాడితో, "బాబాని స్మరించి, ఉద్యోగం వెతుక్కో" అని చెప్పాను. అంతే! బాబా రెండు రోజుల్లో ఒక మంచి షాపులో తనకి ఉద్యోగం చూపించారు. ఇప్పుడు వాడు చాలా సంతోషంగా ఉదోగ్యం చేసుకుంటున్నాడు. "శతకోటి వందనాలు తండ్రీ. మా పిల్లల చదువుల గురించి కొన్ని కోరికలు మీతో వినిపించుకున్నాను. వాటిని త్వరగా అనుగ్రహించు బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజ పరభ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


బాబా చేసిన సహాయం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రేవతి. బాబా నాకు చేసిన సహాయం చెప్తాను. మేము ఎప్పటినుండో మందపల్లి వెళ్ళాలనుకుంటున్నాము. కానీ ఏదో ఒక కారణంతో వెళ్లడానికి కుదర్లేదు. 2023, మే 26న వెళ్దామనుకుంటే రెండు రోజుల ముందు నాకు బాగా జలుబు చేసి, కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. మందపల్లిలో శనీశ్వరుని పూజకు కనీసం గంటన్నర సమయం పడుతుంది. అది కూడా తలకు స్నానం చేసి, తడి బట్టలతో పూజ చేయాలి. పూజయ్యాక మళ్ళీ స్నానం చేసి బట్టలు అక్కడ వదిలేయాలి. 'జలుబు, జ్వరంతో అసలు అవన్నీ చేయగలనా?' అని నాకు భయమేసింది. మావారు కూడా, "ఈ పరిస్థితుల్లో వెళ్ళడమెందుకు? ఇంకోసారి వెళ్దాం" అన్నారు. నాకేమో స్కూళ్లు తెరిచాక వెళ్లడం అంటే ఎప్పటికీ కుదురుతుందో ఏమోననిపించి పరిస్థితి బాబాకి చెప్పుకొని, 'వెళ్లాలా?', 'వద్దా?' అని అడిగాను. 'ఊదీ సేవించి వెళ్ళు' అని బాబా సమాధానం వచ్చింది.  దాంతో నేను మావారిని వెళ్లడానికి ఒప్పించాను. హఠాత్తుగా ప్రయాణమవడం వల్ల రిజర్వేషన్ చేయడానికి కుదర్లేదు. కానీ బాబాని ప్రార్థిస్తే జరగనిది ఉంటుందా? మాకు ట్రైన్‌లో సీట్లు దొరకడమే కాదు, రిజర్వేషన్ చేయించినట్లు పడుకోవడానికి బెర్త్ కూడా దొరికింది. అంతేకాదు, అప్పటివరకు నాకున్న జలుబు తగ్గింది. కాకపోతే, ట్రైన్‌లో మా పాపకి బాగా జలుబు చేసింది. బాబాని ప్రార్థిస్తే 10 నిమిషాల్లో తగ్గిపోయింది. ఆ సాయి దయవల్ల మందపల్లిలో పూజ చక్కగా జరిగింది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, మరే విధమైన ఇబ్బందులు గానీ లేకుండా మే 27 రాత్రి తిరిగి మేము మా ఇంటికి చేరుకున్నాము. బాబా పదేళ్లుగా నాకున్న గ్యాస్ట్రిక్ సమస్యను, ఈమధ్య వారం రోజుల పాటు ఉన్న తలనొప్పిని కేవలం ఊదీ నీళ్లతో తగ్గించారు(గతంలో ఆ అనుభవాలు ఈ 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకున్నాను). ఇప్పుడు జలుబు కూడా అలాగే తగ్గించారు. ఇలా బాబా నా ఆరోగ్య సమస్యలకి ఊదీ సేవించమని తెలియజేసి మరీ నాకు నయం చేస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. నా ఆరోగ్యం గురించి నాకన్నా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్న మిమ్మల్ని ఎలా అభినందించాలి? ప్రతి జన్మలోనూ నేను మీ భక్తురాలుగానే ఉండే భాగ్యం నాకు ప్రసాదిస్తారని ఆశిస్తూ.. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు".


సాయిభక్తుల అనుభవమాలిక 1550వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి కష్టంలో తోడుగా ఉన్నానని నిరూపిస్తున్న సాయితండ్రి

సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రకళ. 2022, అక్టోబర్ 5, విజయదశమికి ముందు ఒకరోజు మావారు పనిమీద బ్యాంకు మేనేజర్‌ని కలవడానికి వెళ్లారు. అప్పుడు ఆ మేనేజర్, "మీకు క్రెడిట్ స్కోర్ బాగా ఉంది. ఏమైనా లోన్ కావాలంటే ఇస్తాము" అని అన్నారు. మావారు ఇంటికి వచ్చి నాతో, "మనం చాలా రోజులుగా కారు తీసుకుపోవాలనుకుంటున్నాము కదా! మేనేజర్ లోన్ ఇస్తామన్నారు. కారు తీసుకుందామా?" అని అన్నారు. నేను, "తీసుకొనేటట్లయితే దసరా పండుగరోజు తీసుకుందాం. లేదంటే జనవరి వరకు వద్దు" అని అన్నాను. మావారు మేనేజర్ దగ్గరకి వెళ్లి, "దసరా పండగ ఐదు రోజుల్లో ఉంది. ఈలోగా మీరు లోన్ ఇచ్చేటట్లయితే తీసుకుంటామ"ని అన్నారు. అందుకు ఆ మేనేజర్, "ప్రూఫ్స్ అన్నీ ఇవ్వండి. ఇస్తాము" అన్నారు. ఇటు మూడు రోజుల్లో మేము ప్రూఫ్స్ ఇవ్వడం, బ్యాంకు ఓకే చేయడం జరుగుతుండగా అటు షోరూంవాళ్ళు, "బ్యాంక్ లోన్ ఓకే అయితే వెంటనే కారు డెలివరీ ఇస్తాము. పండగ ముందు నాలుగవ తేదీన రండి. అమౌంట్ మా అకౌంట్‌లో పడుతూనే బండి షెడ్‌లో నుండి బయటకు తీసి పెడతాము. ఐదవ తేదీన మీరు డెలివరీ తీసుకోండి" అని అన్నారు. సరేనని మేము నాల్గవ తేదీన షోరూంకి వెళ్లి కావాల్సన అన్ని ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళు, "అన్ని సరిగా ఉన్నాయని బ్యాంకు నుంచి అమౌంటు అకౌంట్‌లో పడుతూనే కారు తెస్తామ"ని అన్నారు. కానీ అరగంట తర్వాత వచ్చి "మీ ఆధార్ మరియు బ్యాంకు అడ్రస్ వేరుగా ఉన్నాయి. అమౌంట్ ట్రాన్స్ఫర్ కష్టమవుతుంది. అందువల్ల ఈరోజు పని కాదు. రేపు షోరూం హాలిడే కాబట్టి తర్వాత చూద్దాం" అన్నారు. మావారు, "రెండురోజులు ముందే మీకు అన్ని సబ్మిట్ చేస్తే, మీరు ఓకే అని చెప్పి ఇప్పుడు కాదంటే ఎలా?" అని గట్టిగా వాళ్లతో వాదనకు దిగారు. నాకు ఏం చేయాలో తెలియక, "తండ్రీ ఈ సమస్యను మీరే తీర్చి ఏ సమస్యా లేకుండా రేపు దసరా పండగనాడు మాకు కారు ఇప్పించండి" అని బాబాను వేడుకొని బయటకి వచ్చి కూర్చున్నాను. 10 నిమిషాల్లో మావారు, "సమస్య పరిష్కారమైంది. వచ్చి సంతకం చేయి" అన్నారు. ఆ మాట వింటూనే నా కళ్ళ ముందు బాబా రూపం కనిపించినట్లనిపించి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. చూసారా! ఆ తండ్రిని తలుచుకుంటే సమస్య ఎంత సులువుగా పరిష్కారమైందో! అలా దసరా పండుగరోజు మాకు కారు అనుగ్రహించారు బాబా.


మా పాప పీజీ పూర్తి చేసి తెలంగాణ సెట్‌కు ప్రిపేర్ అయింది. ఆ సమయంలో తను, "కాంపిటీషన్ చాలా ఉంటుంది. అదీకాకుండా ఏపీకి చెందిన మనం నాన్ లోకల్ కిందకు వస్తాము. ఎగ్జామ్ క్వాలిఫై అవుతానా" అని చాలా టెన్షన్ పడింది. నేను తనకి సచ్చరిత్రలోని షేవడే వృత్తాంతం చెప్పి, "నువ్వు గట్టిగా ప్రయత్నం చేసి బాబాపై విశ్వాసం ఉంచి ఫలితం ఆ తండ్రికి వదిలిపెట్టు" అని చెప్పాను. నేను చెప్పినట్లే తను బాబాపై విశ్వాసముంచి పరీక్షకి ప్రిపేర్ అయి 2023, ఏప్రిల్ 18న ఎగ్జామ్స్ సెంటర్‌కి వెళితే, సెంటర్లోకి అడుగుపెడుతూనే తనకి బాబా నవ్వుతూ దర్శనం ఇచ్చారు. ఇంకా సమయముందని తను గార్డెన్లో ఒక చోట చెట్టు కింద కూర్చుని పైకి చూస్తే, అది బిల్వవృక్షం. వెంటనే తను నాకు ఫోన్ చేసి, "బాబా, శివుడు నాకు ఆశీస్సులు ఇచ్చారు. పరీక్ష బాగా వ్రాస్తాన"ని చెప్పింది. నాకు చాలా సంతోషమేసింది. పాప పరీక్ష బాగా వ్రాసి మంచి మార్కులతో టీఎస్ సెట్ క్వాలిఫై అయింది. చూశారా! ఆ తండ్రి మీద నమ్మకం ఉంచితే ఏదైనా తీరుతుంది.


మా ఆడపడుచుకి భర్త లేరు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లకు పెళ్లి చేయవలసిన బాధ్యత మాపై ఉంది. పెద్దబ్బాయికి పెళ్లి చేయాలని నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయికోసం వెతుకుతుంటే ఎన్ని సంబంధాలు చూసినా ఏవీ కుదరలేదు. ఈలోగా అబ్బాయికి 29 సంవత్సరాలు వస్తుండటం వల్ల, 'ఇంకా ఆలస్యమైతే మంచి పిల్లలు దొరకర'ని మాకు, అబ్బాయికి చాలా టెన్షన్‌గా ఉండేది. ఆ సమయంలో నేను ఒకరోజు అబ్బాయితో, "బాబా గుడికి పోయి, బాబా కళ్ళల్లోకి చూస్తూ నీ మనసులోని బాధలన్నీ చెప్పుకొని నాకు ఈ రోజుతో అన్ని తీరిపోయాయి అనుకొని రా" అని చెప్పాను. తను అలానే చేశాడు. నేను కూడా, "అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి అనుగ్రహంతో పది రోజుల్లోనే మేము ఊహించిన దానికంటే మంచి సంబంధం వచ్చింది. 2023, జూన్ 1, గురువారంనాడు పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. మాకు చాలా సంతోషమేసింది. బాబా దయతో పెళ్లి మంచిగా జరగాలని కోరుకున్నాము. అయితే పెళ్ళికి మా పాప పీరియడ్స్ సమస్య వచ్చింది. ఆ విషయంగా నేను బాబాను, "బాబా! గురువారంలోపు పీరియడ్స్ వచ్చి పెళ్లికి సమస్య లేకుండా చేయండి. ఈ సమస్య తీరితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. ఆ సమస్యను ఒక వారం ముందే తీర్చి ప్రతి నిమిషం నా వెంటే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా తండ్రి సాయిశ్వరుడికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి?


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1549వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్‌ను అనుగ్రహించిన బాబా
2. సాయి నామమే రక్ష - ఊదీయే పరమ ఔషధం

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్‌ను అనుగ్రహించిన బాబా


సాయి మహరాజ్‌కు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా కుటుంబమంతా సాయి భక్తులం. ఒక సంవత్సరం నుండి మాకు బాబాతో అనుబంధం ఏర్పడింది. బాబా మాకు ఎన్నో లీలలు చూపారు, ఎన్నో బాధలు తీర్చారు. ఇప్పుడు నా ప్రమోషన్ విషయంలోని బాబా అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను 11 సంవత్సరాలుగా ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ సంస్థలో చేరిన మూడేళ్ళకి నాకు ప్రమోషన్ వచ్చింది కానీ, తరువాత 7 ఏళ్లలో ఇంక్రిమెంట్లు తప్ప ప్రమోషన్ లేదు. ఆ కాలంలో నాపై ఇద్దరు హెడ్ ఆఫీసర్స్ మారారు. వాళ్ళు నా వర్క్ విషయంలో హ్యాపీగా ఉన్నట్టే ఉండేవారు కానీ, ప్రమోషన్‌‌కు రికమెండ్ చేసేవారు కాదు. అందువలన నేను బాధపడుతూ ఉండేదాన్ని. అలా ఉండగా 2022 ఆరంభంలో అప్రయిజల్స్ తీసుకున్నప్పుడు మా హెడ్ "ఈసారి తప్పకుండా నీ ప్రమోషన్‌కి రికమెండ్ చేస్తాను" అన్నట్టు మాట్లాడితే నేను చాలా సంతోషపడ్డాను. కానీ 4, 5 నెలలు గడిచాక ఒకరోజు ఆమె, "ఈసారి కూడా నీకు ప్రమోషన్ రావడం కష్టం. నీ జూనియర్‌కి స్కిల్ లెవెల్లో ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి" అంది. అది విని నేను ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. నాకైతే ఇక నాకు ప్రమోషన్ రావడం అసాధ్యమనిపించింది. అట్టి స్థితిలో, 'ఇప్పుడు బాబా తప్ప నన్ను ఎవరూ ఆదుకోలేర'ని ఆయననే వేడుకున్నాను. వేడుకున్నాననే కంటే వేదించానంటే బాగుంటుందేమో! ఎందుకంటే, రాత్రీపగలూ తేడా లేదు. నేనూ నిద్రపోలేదు, బాబానూ నిద్రపోనిలేదు. "బాబా! నాకు ప్రమోషన్ ఇవ్వు.. ఇవ్వు" అంతే వేరే మాట లేదు. క్వశ్చన్ ఆన్సర్ సైట్‌లో చూస్తే సానుకూలంగా సమాధానాలు వచ్చినప్పటికీ ఏదో భయం. బాబా గుడికి వెళితే, "ప్రమోషన్ రాకపోతే జూనియర్స్ ముందు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా తండ్రి నన్ను కాపాడు" అని వేడుకోవడం, ధునిలో కొబ్బరికాయ వేసినా అదే కోరుకోవడం చేసేదాన్ని. మహాపారాయణలో జాయిన్ అయ్యాను. స్తవనమంజరి, సచ్చరిత్ర, గురుచరిత్ర చదివాను. ఏం చేసినా ప్రమోషన్ రావాలనే బాబాని అడిగేదాన్ని. చివరికి అప్రయిజల్స్ తీసుకున్న ఒక సంవత్సరానికి 2023, ఫిబ్రవరిలో బాబా, దత్తాత్రేయస్వామి దయతో నాకు ప్రమోషన్ వచ్చింది. "నా కోరిక తీర్చినందుకు మీకు శతకోటి నమస్కారాలు దేవా. ఇంతకంటే నేను మీకేం ఇవ్వగలను?".


ఒక సంవత్సరం నుండి మా బాబుకి స్కిన్ అలెర్జీ ఉంది. మందు రాస్తున్నప్పుడు తగ్గటం, మానేయగానే మళ్ళీ అలెర్జీ పెరగటం జరుగుతుండేది. మేము బాబానే వేడుకుంటూ బాబుని గాణ్గాపురం తీసుకెళ్ళి, అక్కడ భస్మంతో స్నానం చేయించి తీసుకొచ్చాం. ఆపై బాబా ఊదీ రాస్తూ ఉండగా ఇప్పుడు బాబుకి అలెర్జీ చాలావరకు తగ్గింది. "ధన్యవాదాలు దత్తదేవా, సాయిదేవా. అందరినీ రక్షించు సాయి".


సాయి నామమే రక్ష - ఊదీయే పరమ ఔషధం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నా స్నేహితురాలి పేరు  కూడా శ్రీదేవి. సాయి భక్తురాలైన తను రోజూ మందిరంలో బాబా సేవ ఎంతో శ్రద్ధగా చేసుకుంటుంది. ఈమధ్య ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ అయి వాంతులు, విరేచనాలతో తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. తను అనుభవిస్తున్న తీవ్రమైన బాధను చూడలేక నేను బాబాను, "నా స్నేహితురాలిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేయండి బాబా. తను త్వరగా డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి వస్తే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. తను కూడా హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఊదీ సేవిస్తూ, నుదుటన ధరిస్తూ నిరంతరం సాయి నామస్మరణలో గడిపింది. బాబా దయవల్ల తను గురువారం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఏ సమస్య వచ్చినా 'బాబా! ఈ కష్టాన్ని తొలగించు. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని ప్రార్ధించగానే సమస్య తీరిపోతుందంటే నిజంగా ఈ బ్లాగు బాబా అనుగ్రహానికి చిహ్నం. మనందరికీ సాయి నామమే రక్ష. ఊదీయే పరమ ఔషధం. పిలిస్తే పలికే నా సాయితండ్రికి నా హృదయపూర్వక శతకోటి వందనాలు.


సాయిభక్తుల అనుభవమాలిక 1548వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీయాత్రలోని చిన్ని చిన్ని అనుభూతులు 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు కుమారి. ఈ మధ్యనే ఒక అక్క నాకు ఈ బ్లాగ్ గురించి చెప్పింది. తన వల్లనే నేను ఈ బ్లాగుకు సంబంధించిన గ్రూపులో చేరే అవకాశం నాకు వచ్చింది. తనకు నా కృతజ్ఞతలు. బాబా దయతో నేనిప్పుడు మొదటిసారి నా అనుభవాలు మీ అందరితో పంచుకుంటున్నాను. అవి చిన్న అనుభవాలే అయినా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.


2022, అక్టోబరులో విజయదశమి ముందురోజు నేను ఒక షాపుకు వెళ్ళినప్పుడు ఎవరో తెలియని ఒక ఆవిడ, "మేము శిరిడీ వెళ్ళొచ్చాము. ఈ ఊదీ తీసుకో. అందరికీ పంచగా మిగిలిన చివరి ప్యాకెట్ ఇది" అని నాకు ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసి నా కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత బాబా దగ్గరకి వెళ్లి ఆయన ముందు నిల్చొని, "వచ్చే విజయదశమి నాటికల్లా నేను శిరిడీ వెళ్ళాలి" అని బాబాకి చెప్పుకున్నాను. నిజానికి నేను ఉన్న పరిస్థితుల్లో శిరిడీ వెళ్లడానికి కుదరదు. కానీ బాబా నా కోరిక తీర్చారు. 2023, ఏప్రిల్ 27న శిరిడీ వెళ్లే అవకాశం నాకు వచ్చింది. అయితే మా ఫ్యామిలీతో కాదు, వేరే ఆంటీవాళ్ళ ఫ్యామిలీతో. మా ఫ్యామిలీతో కాకుండా వేరే వాళ్ళతో వెళ్లడం నా జీవితంలో ఇదే మొదటిసారి. నిజానికి ఆ సమయంలో నా దగర డబ్బులు లేవు. అంటీవాళ్లు డబ్బులు గురించి తర్వాత చూసుకుందాం అన్నారు. నేను సరేనని బాబా మీద భారం వేసాను. ఆయన అద్భుతం చూపారు. శిరిడీ వెళ్ళడానికి రెండు వారాల ముందు నా బ్యాంకు పుస్తకంలో డబ్బులుండటం చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే, నేను ఆ బ్యాంకు పుస్తకం మూడు సంవత్సరాలుగా ఉపయోగించలేదు. అందులో డబ్బులున్నట్టు నాకు అస్సలు గుర్తులేదు. అంతా బాబా దయ అనుకొని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చాను.


తరువాత శిరిడీ ప్రయాణం రేపనగా నాకు ఒక పెద్ద సమస్య వచ్చి శిరిడీ వెళ్ళలేనేమోనని చాలా బాధపడ్డాను. ఏమి చేయాలో తెలియక బాబా మీద భారం వేశాను. బాబా నా శిరిడీ  ప్రయాణం ఆగిపోకుండా చూసారు. బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని సంతోషంగా ట్రైన్ ఎక్కాను. తరువాత ఫోన్‌లో ఈ బ్లాగు ఓపెన్ చేసి ఒక భక్తురాలి ఐదు శిరిడీ అనుభవాలు చదివి, "నాకు ఒక అనుభవం జరిగినా చాలు. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని మనసులో 'ఆరతి చూడాలి, సమాధి మీద పువ్వులు నాకు కావాలి' అని పదేపదే బాబాను అడిగాను.


శిరిడీ చేరుకున్నాక దూళి దర్శనంకు వెళ్ళినప్పుడు బాబాను చూసి నాకు మాటలు రాలేదు. నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. ఆ క్షణం నాకు కలిగిన అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. అయితే అప్పుడు నాకు సమాధి మీద పువ్వు లభించలేదు. తర్వాత ద్వారకామాయికి వెళ్ళాను. అక్కడ బాబా పాదాల వద్ద ఒక పసుపు గులాబీ ఉంది. దాన్ని ఎవరూ తీసుకోకపోవడం చూసి అది నా కోసమేననిపించి తీసుకున్నాను. సమాధి మందిరంలో బాబా సమాధి మీద పువ్వు లభించకపోయినా ఇలా దొరికిందని చాలా సంతోషపడ్డాను.


తరువాత దర్శనానికి వెళ్ళినప్పుడు గురుస్థాన్ వద్ద నాతో వచ్చిన చెల్లికి వేపాకులు దొరికాయి. కానీ నాకు దొరకలేదు. అప్పుడు నేను బాబా చేతుల మీదగా తీసుకోవాలని అనుకున్నాను. కాసేపటికి అక్కడున్న ఒక పెద్దాయన అందరికీ వేపాకులు ఇస్తూ నాకు కూడా ఇచ్చారు. ఆయన రూపంలో బాబానే ఇచ్చారని ఆనందపడ్డాను. ఆ తర్వాత నేను మరోసారి ప్రయత్నం చేస్తే నాకు కూడా వేపాకులు దొరికాయి.


తరువాత నందదీపం, బాబా భక్తుల సమాధులు, అక్కడ ఉండే టెంపుల్స్, బావి చూశాక  పారాయణ హల్ కనిపించింది. నేను నాతో వచ్చిన వాళ్ళతో ఎక్కువసేపు అంటే వద్దంటారేమోనని ఒక 5 నిముషాల్లో వచ్చేస్తానని చెప్పి పారాయణ హాలులోకి వెళ్ళాను. వాళ్ళు కూడా నాతో లోపలికి వచ్చి 30 నిముషాలు ఉన్నారు. నేను చాలా చాలా ఆనందపడిపోయాను. నిజానికి నేను ఇంటి వద్ద పారాయణ హాల్లో పారాయణ చేయాలి, కానీ చేయగలుగుతానో, లేదో అనుకున్నాను. ఆ విషయాన్నీ నేను మరిచిపోయానా బాబా మర్చిపోకుండా నా చిన్న కోరికను తీర్చారు.


మరుసటిరోజు మేము ఆరతికి వెళదామని సంధ్య ఆరతి సమయానికి ముందు క్యూలైనులోకి వెళ్ళాం. మాకు ఆరతికి లోపలుండే అవకాశం రాలేదుగానీ 5.30 నుండి 6 వరకు అంటే అరగంటపాటు సమాధి మందిరంలో బాబాను దర్శించుకొనే భాగ్యం దక్కినందుకు చాలా చాలా సంతోషమేసింది. బయటకి వచ్చేముందు బాబా సమాధి అరుగును క్లీన్ చేస్తున్నారు. అప్పుడు బాబా పాదాలు మీద కొన్ని పువ్వులు ఉంటే అవి నాకోసమే అని తీసుకున్నాను. కానీ సమాధి తాకే అవకాశం కలగనందుకు బాధపడ్డాను. తరువాత కిటికీ గుండా బాబా ముఖదర్శనమయ్యే చోటకి వెళ్ళి బాబాని చూస్తూ ఆరతి పాడుకున్నాను. మాటల్లో చెప్పలేని అనుభూతది. ఆరతి అనంతరం బాబాకి నివేదించిన ప్రసాదం మాకు లభించింది.


బాబా దయతో మా శనిసింగణాపూర్, నాశిక్ యాత్రలు బాగా జరిగాయి. మేము సోమవారం, ఏకాదశిరోజున నాశిక్ దర్శించాము. అది బాబా చేసినా మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే, మేము అక్కడికి ముందురోజు వెళ్ళాలనుకుంటే మరుసటిరోజు వెళ్లేలా బాబా చేశారు.


శిరిడీలోని చివరిరోజు ఈరోజు అయినా బాబా సమాధి తాకాలనుకున్న నాకు బాబా దయతో ఆ అదృష్టం నాకు లభించేసరికి కలో, నిజమో నాకే తెలియలేదు. అక్కడున్న పూజారిగారు నేను అడగగానే సమాధి మీద పువ్వులు నాకిచ్చారు. ఒక్కసారి దొరికితే చాలు అనుకున్న నాకు బాబా రెండుసార్లు పువ్వులు ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి ఈ జన్మకు?


నేను ఎప్పటినుండి ధునిలో కొబ్బరికాయలు వేయాలని అనుకుంటున్నప్పటికీ అది ఎలా అన్నది నాకు తెలీదు. నాతో వచ్చినా వాళ్ళకి కూడా దాని గురించి తెలియదు. చివరిరోజు మేము ద్వారకామాయి ఎదురుగా ఉన్న షాపులో షాపింగ్ చేస్తున్నప్పుడు నాకు ద్వారకామాయి లోపలికి వెళ్లాలనిపించి నాతో ఉన్న ఆంటీవాళ్ళని అడిగితే, "వద్దు. జనాలున్నారు" అన్నారు. కానీ నాకు వెళ్ళాలని బాగా ఉండింది. చాలాసేపటి తర్వాత నాతో వచ్చిన తముడు, "అక్కా! ద్వారకామాయిలో జనాలు తగ్గారు. ఇప్పుడు వెళ్ళు" అన్నాడు. నేను సరేనని వాళ్ళెవరూ రాకపోయినా ఒక్కదాన్నే ద్వారకామాయి లోపలికి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటకి వస్తున్నప్పుడు అక్కడ ధునికోసం కొబ్బరికాయలు వేయడానికి పెద్ద బాక్స్ ఉండటం, ఎవరో వేస్తుండటం చూసి 'ఇప్పుడేగా ఆ పక్కనుంచి వెళ్ళాను. కానీ ఆ బాక్స్‌ని చూడలేద'ని షాకయ్యాను. వెంటనే నేను ఆ బాక్స్‌‌లో కొబ్బరికాయ వేయాలని అనుకున్నాను. కానీ మళ్ళీ అంతలోనే ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కడుంటాయో అనిపించింది. చూస్తే, నేను ఉన్న చోటుకి ఎదురుగానే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. వెంటనే కొన్ని కొబ్బరికాయలు తీసుకొని అక్కడున్న బాక్స్‌లో వేసి చాలా సంతోషంతో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలా తిరుగు ప్రయాణమయ్యేముందు ద్వారకామాయికి వెళ్ళడం, ధునిలో కొబ్బరికాయలు వేయడం అనుకోకుండా జరిగాయి. నేను మర్చిపోయినా నా ఈ చిన్న కోరికను కూడా బాబా తీర్చారు.


తరువాత మేము శిరిడీ నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. మరుసటిరోజు మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ ఉండటంతో మేము పెద్దమ్మతల్లి గుడికి వెళ్ళాలనుకున్నాము. అయితే ట్రాఫిక్ వల్ల మేము గుడికి వెళ్లేసరికి ఆలస్యమవ్వడంతో గుడి మూసేస్తారని అన్నారు. అప్పుడు నేను, "బాబా! అప్పుడే గుడి మూసేయకుండా ఉండి మేము అమ్మవారి దర్శనం చేసుకుంటే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల గుడి మూయలేదు. మాకు అమ్మవారి దర్శనమైంది.


నేను శిరిడీ వెళ్ళేముందు మళ్ళీ ఎప్పుడు వెళ్తానో, కనీసం నాకు ఒక పది ప్యాకెట్ల ఊదీ లభించాలని అనుకున్నాను. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే శిరిడీలో నాకు ఏడు ఊదీ ప్యాకెట్లే లభించాయి. సరేలే పాతవి ఒక రెండు ఉన్నాయి కదా! నలుగురికి నాలుగు ప్యాకెట్లు ఇచ్చేస్తే నాకు 5 ఉంటాయి అనుకున్నాను. అయితే బాబా లీల చూడండి. నేను ఎవరితో వెళ్లానో ఆ ఆంటీ ఫోన్ చేసి, "నీకు ఒక 5 పాకెట్లు ఊదీ ఇవ్వనా? సరిపోతాయా?" అని అన్నారు. నేను సరేనన్నాను. నా దగర మిగిలినవి 5, ఆంటీ 5 ప్యాకెట్లు ఇచ్చారు. మొత్తం 10  ప్యాకెట్లు. అంటే శిరీడీ వెళ్లేముందు నేను ఎన్ని అనుకున్నానో అన్ని ప్యాకెట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అంతా బాబా దయ.


చివరిగా ఇంకో అనుభవం, 2023, ఫిబ్రవరిలో నా చెల్లికి పెళ్లైంది. అప్పుడు నేను బాబా ఫొటో ఒకటి తనకి కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. ఆ ఫోటో కూడా శిరిడీ నుండి వచ్చినదై ఉండాలని నా ఆశ. కానీ ఆ సమయంలో అది కుదరలేదు. అయితే నేను అస్సలు అనుకోకపోయినా తరువాత నేను శిరిడీ వెళ్లి, నా చేతులతో ఫోటో తీసుకొచ్చి మా చెల్లివాళ్ళకి ఇచ్చాను. మా చెల్లి చాలా చాలా ఆనందించింది. అంతా బాబా దయ.


"అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఇంతకన్నా ఏమి చెప్పను బాబా? నేను చాలా సమస్యల్లో ఉన్నానని మీకు తెలుసు. వాటినుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి బాబా. మాకు మీరు తప్ప ఎవరూ లేరు సాయీ. మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా మీరే చూసుకోవాలి సాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. కాస్త ఆలస్యమైనా మాకు ఏది మంచిదో అది చేస్తారు మీరు. ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయి ఉన్నా, తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు బాబా. అలాగే మరికొన్ని అనుభవాలు పంచుకొనే అవకాశం ఇవ్వండి బాబా. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉండి రక్షించు సాయిబాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1547వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

1. బాబా సర్వాంతర్యామి - మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంటారు

         2. బాధను నివారణ చేసిన బాబా


బాబా సర్వాంతర్యామి - మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంటారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


శ్రీసాయినాథుని పాదపద్మాలకు నా అనంతకోటి నమస్కారాలు. నేను సాయి భక్తురాలిని. నేను శిరిడీ వెళ్లాలని చాలా రోజుల నుండి అనుకుంటుండగా ఈమధ్య అనుకోకుండా శిరిడీ ప్రయాణం పెట్టుకున్నాము. అప్పుడు నేను, "బాబా! ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము శిరిడీ దర్శించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తర్వాత అన్ని ముడుపులు తీసుకొని మేము శిరిడీ వెళ్ళాము. బాబా దయవల్ల ఆయన దర్శనం, సమాధి దర్శనం బాగా జరిగింది. నేను సమాధిని తాకి నమస్కరించుకున్నాను. ఇంకా బాబా తమని చాలాసేపు చూసుకొనే అవకాశం నాకు ప్రసాదించారు. మధ్యాహ్న హారతి కూడా దర్శించాము. తర్వాత శిరిడీ నుండి పండరీపురం వెళ్లి పాండురంగని దర్శించాము. ఆ తర్వాత కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించి బాబా దయతో ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము.


ఒకసారి మా పనిమనిషి కిందపడి కాలునొప్పి వల్ల పనికి రాలేకపోయింది. ఆమె బాగా పనిచేస్తుంది కాబట్టి, తను వస్తే బాగుంటుందని, "బాబా! ఎలాగైనా తన కాలునొప్పి తగ్గించి, తిరిగి పనికి వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయతో తనకి నొప్పి తగ్గి పనికి వస్తానని చెప్పింది. ఒకసారి మా అమ్మకు ఆయాసం ఎక్కువై ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్లో చేరింది. అప్పుడు నేను, "బాబా! అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించి హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేర్చు" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల కొంచెం నీరసంగా ఉంటున్నప్పటికీ ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. అమ్మ కోటి రామజపం చేయాలని చేస్తుంది. ఇంకా మిగిలి ఉన్న ఐదు లక్షల జపం చేసే శక్తిని ఆమెకు ప్రసాదించు తండ్రి".


2023, మే 4, గురువారం. ఆరోజు ఉదయం నేను సాయి దివ్యపూజ చేశాను. మధ్యాహ్నం 1:30 నుండి 3:30 మధ్యలో పని ఉండటంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాను. కానీ నేను వచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోని కప్ బోర్డులన్నీ తెరిచి ఉన్నాయి. సీసీ కెమెరాలో చూస్తే, 3 - 3:30 మధ్యలో ఇద్దరు దొంగలు మా ఇంటిలోకి దూరి తాళాలు తీసి కప్ బోర్డులన్నీ వెతికారు. అయితే బాబా దయవల్ల ఇంట్లో బంగారం ఏమీ లేదు. వాళ్ళు వెతికిన కప్ బోర్డులో వెండి వస్తువులున్నప్పటికీ అవేవీ పోలేదు. ఒక చిన్న పాత సెల్ ఫోన్ తప్ప ఇంట్లో ఏ వస్తువులూ పోలేదు. కానీ మరుసటిరోజు అమ్మవారి బంగారు బొట్టు, గాజులు దొంగలు వెతికిన కాప్ బోర్డులో ఉన్నాయని గుర్తొచ్చి, "బాబా! ఎలాగైనా అవి పోకుండా ఉండేటట్లు చూడు" అని బాబాను ప్రార్థించాను. తరువాత వెళ్లి కప్ బోర్డు తెరిస్తూనే అమ్మవారి బొట్టు, గాజులు ఉన్న పర్స్ కనిపించింది. వాటిని చూసిన నా సంతోషానికి అవధులు లేవు. అవి మా పూర్వికుల నుండి వస్తున్నవి. వాటిని దొంగల కళ్ళల్లో పడకుండా బాబా కాపాడారు. మా ఇంటినీ కాపాడారు.


మా చిన్నపాప ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మ్యాథ్స్ పేపర్ సరిగా వ్రాయలేదని చెప్పింది. నేను భారం బాబా మీద వేశాను. ఆయన దయవల్ల పాప 96.4% మార్కులతో పాస్ అయింది. ఇలా నా విషయంలో బాబా ప్రతి నిమిషం నాతోనే ఉంటారు. నేను ఏది చెప్పినా, మాట్లాడినా వింటారు. ఆయన సర్వాంతర్యామి, మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంటారు. "నేను ఉండగా భయం ఎందుకు? నిశ్చింతగా ఉండు" అని నన్ను హెచ్చరిస్తుంటారు. "థాంక్యూ బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ పాప మీద ఇలానే ఉండాలి. మీ కరుణ ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలి. ఈ అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాధను నివారణ చేసిన బాబా


నా పేరు మోహన్. 2023, మే నెల ఆఖరులో నేను భరించలేని తలనొప్పి మరియు స్వల్ప జ్వరంతో బాధపడ్డాను. టాబ్లెట్లు వేసుకుంటూ బాబా నామస్మరణ చేస్తున్నా ఐదురోజుల వరకు తగ్గలేదు. చివరిక 30వ తేదీ రాత్రి నేను బాధను తట్టుకోలేక, "బాబా! దయచేసి నా బాధను నివారించండి. మీ అనుగ్రహాన్ని సాయి భక్తులతో పంచుకునేందుకు వెంటనే బ్లాగుకు పంపుతాను" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయతో ఒక అరగంటలో ఆ బాధ నుండి ఉపశమనం కలిగించారు, కానీ నేను నిద్రలోకి జారుకున్నందు వల్ల ఆ విషయాన్ని అప్పుడు సరిగా గుర్తించలేదు. మరుసటిరోజు ఉదయం మాత్రం బాబాకు కృపకు నేను చాలా సంతోషించాను. ఆయన దయతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. శ్రద్ధ, సబూరీ కలిగి ఉంటే తప్పక బాబా సహాయం అందరికీ అందుతుంది.  "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1546వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇంటి సమస్యల నుండి బయటపడేసిన బాబా
2. డిస్మిస్‌ కాకుండా కరుణ చూపిన బాబా

ఇంటి సమస్యల నుండి బయటపడేసిన బాబా

ఓం నమో శ్రీసాయినాథాయ నమః!!!

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను పాతిక సంవత్సరాలుగా బాబా సేవ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఏ పని విషయంలోనైనా 'ఆ పని చేయాలా? వద్దా?' అని నిర్ణయించుకోలేకపోయినప్పుడు బాబా దగ్గర రెండు చీటీలు వేసి, చిన్న పిల్లలతో తీయించి అందులో వచ్చిన దాన్నే బాబా నిర్ణయంగా భావించి చేస్తాను. అయితే ఈమధ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను బాబాను అడగటం మర్చిపోయాను. అదేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం మేము ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. సమస్య వచ్చిన ప్రతిసారీ, "బాబా! ఎందుకిలా నాకు పరీక్షలు పెడుతున్నావు?" అని ఎంతో బాధపడుతూ చివరికి కొద్దిరోజుల తర్వాత ఇల్లు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆపై చాలాసార్లు, "ఇల్లు త్వరగా అమ్ముడైపోవాల"ని బాబాను వేడుకున్నాను కానీ, అసలు 'ఇల్లు అమ్మాలా, వద్దా' అని బాబాను అడగడం మర్చిపోయాను. కొద్దిరోజులకు ఒక వ్యక్తి ఇల్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇల్లు అమ్మాలా, వద్దా అని తీవ్రంగా ఆలోచించాము. కనీసం అప్పుడైనా నేను బాబా సలహా తీసుకుని ఉండాల్సింది. కానీ అడగకుండా మళ్ళీ పొరపాటు చేశాను. తీరా ఆ వ్యక్తికే అమ్మాలని నిర్ణయించుకుంటే అతను మాకు సగం డబ్బులిచ్చి మిగతా సగం డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టాడు. మేము తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాం. చివరికి నేను బాబాను శరణుజొచ్చి ఆయననే ధ్యానిస్తూ కూర్చున్నాను. అప్పుడు ఆ వ్యక్తి, "రేపు రిజిస్ట్రేషన్ చేయించుకుందాము. డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను" అంటే, సరేనన్నాను. కానీ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మళ్ళీ ఇబ్బందులకు గురిచేశాడు. నేను మరుసటిరోజు ఉదయాన్నే 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపు ఓపెన్ చేస్తే, అక్కడ అనుభవమాలికలో ఒక భక్తురాలు తనకు వచ్చిన కష్టాన్ని బాబా ఏ విధంగా పరిష్కరించింది పంచుకున్నారు. అది చదివిన నాకు అది దాదాపు నా సమస్యలానే ఉందనిపించి అప్పటినుంచి నేను ప్రతిక్షణం బాబానే ధ్యానిస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి ఆంజనేయస్వామివారి ఆపదామపహర్తారం శ్లోకం చదవమని నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నట్లు అనిపించింది. అలా ప్రేరేపిస్తుంది ఎవరో కాదు బాబానే అనిపించి ఆ శ్లోకం చదువుతూ ఆంజనేయస్వామి ఫోటో ముందు కూర్చుండిపోయాను. ఒక అర్ధగంటలో ఆ వ్యక్తి ఫోన్ చేసి, "మీ సొమ్ము అంతా మీకు చెల్లిస్తాను. రిజిస్ట్రేషన్‌కి వెళ్ళిపోదాము" అని చెప్పి, ఆ మాట మీదే నిలబడి సొమ్ము అంతా మాకు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. నేను అడగకపోయినా బాబా నిరంతరం నా వెంట ఉండి నన్ను నడిపించారని, అలాగే ఇకపై ఎప్పుడూ బాబాను అడగకుండా ఏదీ చేయకూడదని ఈ అనుభవం ద్వారా తెలుసుకుని బాబాకు సర్వస్య శరణాగతి వేడుతున్నాను.

ఓం నమో శ్రీసాయినాథాయ నమః!!!

డిస్మిస్‌ కాకుండా కరుణ చూపిన బాబా


నా పేరు ఉమ. మేము ప్రస్తుతం యుఎస్ఏలో ఉంటున్నాము. మా బాబు 11 గ్రేడ్ చదువుతున్నాడు. తనకి 2022, డిసెంబరు 24 నుంచి 2023, జనవరి 10 వరకు క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. మా కుటుంబమంతా డిసెంబర్ 24న యుఎస్ఏలో బయల్దేరి హైదరాబాద్ వచ్చాము. 2023, జనవరి 17న ఇండియా నుండి తిరుగు ప్రయాణమయ్యాము. ఆరోజు మేము బయలుదేరేముందు మా బాబు స్కూలు నుండి, "5 రోజుల సెలవు పూర్తైనందున బాబుని డిస్మిస్ చేస్తామ"ని మాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, స్కూలు సెలవులు మరియు శని, అది వారాలు మినహాయిస్తే మా బాబు మొత్తం 6 రోజులు స్కూలుకి సెలవు పెట్టాడు. స్కూలు రూల్స్ ప్రకారం 5 రోజులకి మించి సెలవు పెట్టకూడదన్న విషయం మాకు తెలియదు. నాకు ఏమి చేయాలో తోచక  బాబాని తలుచుకొని, "బాబా! డిస్మిస్ చేస్తే బాబుకి ఒక సంవత్సరం చదువు వేస్ట్ అయిపోతుంది. ఒక్కరోజే అదనంగా సెలవు పెట్టినందుకు బాబుని డిస్మిస్ చేయకూడదు. తనని స్కూలువాళ్ళు క్లాసులకి అనుమతించాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. మేము జనవరి 19వ తేదీ ఉదయానికి యుఎస్ఏ చేరుకున్నాము. బాబు స్కూలుకి వెళ్లి మా ట్రావెల్ టికెట్లన్నీ చూపిస్తే, వాళ్ళు తనని స్కూల్లోకి అనుమతించారు. ఇది బాబా కరుణ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. "వేల నమస్కారాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1545వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  • ఆలస్యమైనా మంచిగా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు చంద్రశేఖర్. ఊరు పాతర్లగడ్డ. 2022, ఏప్రిల్ 9న నా నడుముకు ఆపరేషన్ జరిగింది. దాంతో నేను ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను, "నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది బాబా? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించికోవాలి తండ్రీ?" అని బాబాను ప్రార్థిస్తుండేవాడిని. బాబా దయవలన మా కంపెనీవాళ్ళు 5నెలలపాటు నెలనెలా జీతం నా అకౌంటులో వేశారు. నా ఆరోగ్యం బాగైనా తర్వాత అదే సంవత్సరం జూలైలో రెండు, మూడు రోజులకు ఒకసారి డ్యూటీకి వెళ్లడం మొదలుపెట్టాను. అయితే ఆగస్టు నెలలో నాకు డెంగ్యూ జ్వరమొచ్చి ప్లేట్లెట్లు 55 వేలకు పడిపోయాయి. దాంతో హాస్పిటల్లో రోజూ రెండు పూటలా నాకు సెలైన్లు ఎక్కించారు. ఆ సమయంలో నేను, "బాబా! ఇప్పటికీ నడుముకు జరిగిన ఆపరేషన్‌తో బాదపడుతున్నాను. మళ్ళీ ఇంతలోనే ఈ డెంగ్యూ జ్వరం ఏమిటి? ఈ జ్వరం తగ్గి నా ఉద్యోగం నేను చేసుకునేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను ప్రార్థిస్తూ ప్రతిరోజూ ఆయన నామాన్ని స్మరిస్తుండేవాడిని. బాబా దయవలన 12 రోజులలో నా ప్లేట్లెట్ల సంఖ్యా 1,30,000కు పెరిగాయి. దాంతో డాక్టర్ సెలైనులు ఎక్కించడం ఆపి మందులతో చికిత్స చేసారు. బాబా దయవలన నేను తొందరగా కోలుకున్నాను. అయితే డెంగ్యూ జ్వరం వలన నేను ఒక నెల రోజుల డ్యూటీకి వెళ్ళలేదు. నాకు కొద్దిగా బాగున్న తర్వాత సెప్టెంబర్‌లో మా సార్‌కి ఫోన్ చేసి, "డ్యూటీకి వస్తాను సార్" అని చెపితే, "ఇప్పుడు వద్దు. తర్వాత వద్డువుగాని" అని ఫోన్ పెట్టేసారు. నాకు ఏమీ అర్థంకాక, "బాబా! నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నాకు మళ్ళీ ఉద్యోగమొస్తే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులందరితో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని సాయి సచ్చరిత్ర రెండుసార్లు, సాయి లీలామృతం ఒకసారి పారాయణ చేశాను. అలా నాలుగు నెలలు గడిచాక 2023, జనవరిలో బాబా దయవలన నా ఫ్రెండ్ ఒకరు నాకు ఫోన్ చేసి, "ఏమిటి సంగతి, ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. నేను తనతో నా పరిస్థితి తెలియజేయగా, "మీ కంపెనీవాళ్ళు నీకు ఫోన్ చేయకపోతే నువ్వు కడియపులంకలో మా బావగారి నర్సరీకి వచ్చి ఉద్యోగం చేసుకో" అని చెప్పాడు. అది విని నాకు చాలా సంతోషమేసింది. ఇది బాబా లీల కాకపోతే మరేంటి? ఆయన దయతో వచ్చిన ఆ ఉద్యోగంలో చేరి నా కుటుంబానికి దూరంగా ఉండసాగాను. అప్పుడు, "బాబా! దయ చూపించి మరలా పాత కంపెనీలో ఉద్యోగం చేసుకునేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. వారం తిరగకుండానే బాబా చేసిన అద్భుతం చూడండి. మా సార్ ఫోన్ చేసి, "శేఖర్ ఎక్కడున్నావు? మంచిరోజు చూసుకుని డ్యూటీకి రా" అని చెప్పారు. దాంతో నేను మళ్ళీ పాత కంపెనీకి వెళ్లి నా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇదంతా బాబా దయే. ఆలస్యమైనా మంచిగా అనుగ్రహించారు. ఇదంతా బాబా నాపై చూపుతున్న ప్రేమ. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరి రెండు నెలలవుతుంది. మేము చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము. నాయందు దయుంచి ఆ కోరిక ఈ నెలలో నెరవేర్చు తండ్రి. వెంటనే మీ బ్లాగు ద్వారా సాయి భక్తులందరితో మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను సాయి".


కొన్నాళ్ళ క్రితం మా పిన్ని భర్త హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆ బాధలో ఉండగా రెండు నెలలకు ఆమె కూతురు కూడా కరోనాతో చనిపోయింది. దాంతో ఆమె మానసికంగా చాలా కృంగిపోయి సరిగా భోజనం చేయకపోవడంతో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. గ్యాస్టిక్ సమస్య వలన పొట్ట ఉబ్బిపోయి, మలవిసర్జన కూడా జరగక ఆమె చాలా ఇబ్బందిపడుతూ బాగా నీరసపడిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టరు టెస్టులు చేసి, "గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. ప్రేగులకు కూడా ఇన్స్ఫెక్షన్ అయింది. చాలా ప్రమాదం" అని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు నేను, "బాబా! అసలే ఆమె భర్త, కూతురు చనిపోయిన బాధలో ఉంది. దానికి తోడు ఈ ఆరోగ్య సమస్యలు ఏమిటి బాబా? ఆమె ఆరోగ్యం బాగుండాలి. తొందరగా కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తే మీ అనుగ్రహాన్ని సాయి భక్తులందరితో ఈ బ్లాగు ద్వారా పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన ఏ ప్రమాదం లేకుండా పది రోజుల్లో ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. దయతో మా పిన్నిని తన  కోడలు బాగా చూసుకునేలా చేసి, ఆమెకు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా చల్లగా ఉండేలా చూడు తండ్రి".


2023, మార్చి నెలలో మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మగారి ఊరు వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు తను ఒక పొట్లంలో కట్టి బ్యాగులో పెట్టిన తన చెవిరింగులను బస్సులో ఎక్కడో జారవిడుచుకుంది. ఇంటికి వచ్చిన తరువాత బ్యాగులో చూసుకుంటే చెవిరింగులు కనబడలేదు. నేను, "ఏమిటి సాయీ? ఇప్పటికే నేను ఆరోగ్యపరంగానూ, అర్దికంగాను చాలా ఇబ్బందులలో ఉన్నాను. దయ చూపి అమ్మాయి చెవిరింగులు కనబడేలా చేయి తండ్రి. అవి దొరికితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా సాయి భక్తులందరితో పంచుకుంటాను బాబా" అని ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తుండేవాడిని. తర్వాత ఏప్రిల్ నెలలో నేను శిరిడీ వెళ్ళాను. అక్కడ సమాధి మందిరంలో కూడా బాబాని, "దయ చూపించు తండ్రీ. మా అమ్మాయి చెవిరింగులు దొరికేలా ఆశీర్వదించు బాబా" అని ఎంతగానో బాబాను వేడుకున్నాను. బాబా దయచూపారు. 2023, జూన్ 12, సాయంత్రం మా అమ‌్మాయి తనకి ఏదో వస్తువు అవసరమై మా ఇంట్లో ఉన్న కప్ బోర్డులో వెతుకుతుంటే రెండు, మూడు నెలల క్రితం కనపడకుండా పోయిన ఆ చెవిరింగులు దొరికాయి. బాబా చేసిన అద్భుతం చూడండి. ఎక్కడో బస్సులో పడిపోయిన చెవిరింగులు ఇంట్లో కనపడ్డాయి. "ధన్యవాదాలు బాబా. నేను మీకిచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. నేను 5 నెలలుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. దయతో ఆ కోరిక కూడా తీరేలా చేయి తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1544వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కుటుంబానికి అండగా ఉన్న బాబా
2. వేడుకున్న వారం లోపలే బుక్స్ అందేలా అనుగ్రహించిన బాబా

కుటుంబానికి అండగా ఉన్న బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు మాధవికృష్ణ. నేను ఒక సాయి భక్తురాలిని. నేను మహాపారాయణ గ్రూపు MP-2628N1లో సభ్యురాలిని. ఈ బ్లాగులోని సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. బాబా ప్రేమకు కళ్ళంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. నేను నా అనుభవాలు ఎప్పటికప్పుడు సాయి భక్తులందరితో పంచుకోవాలనుకుంటూనే ఆలస్యం చేశాను. మొదట్లో నేను అందరి దేవుళ్ళ పటాలతో పాటు బాబా విగ్రహం పెట్టుకుని నాకు చేతనైనట్లు పూజ చేసుకునేదాన్ని. దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల నుంచే నాకు బాబా మీద అపారమైన భక్తి, విశ్వాసాలు కుదిరాయి. అదెలా అంటే నేను సరదగా సాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్లోకి వెళ్లి ఏదో ఒక కోరిక అనుకోని బాబా సమాధానం కోసం చూసేదాన్ని. దాదాపు ఆయన ఇచ్చే సమాధానాలు నాకు సరిగ్గా సరిపోయేవి. నెమ్మదిగా నాకు బాబా మీద నమ్మకం కుదరనారభించి ఈరోజు బాబా తప్ప మాకు వేరే దైవం లేరు అన్నంతగా మారింది. అంతలా భక్తివిశ్వాసాలు కుదిరాయి. అప్పటినుండి బాబా మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమూ అయి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన మాకు చేసిన అద్భుతాలు ఎన్నో.


నా భర్త ఆర్మీ నుండి రిటైర్ అయిన తరవాత ఏవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసారు. కానీ సరిగా స్థిరపడలేదు. దాంతో ఫ్రెండ్స్‌ని నమ్మి చిన్న బిజినెస్ మొదలుపెట్టారు. అది కూడా సెట్‌కాక ఆర్థికంగా నష్టపోయారు. ఇంకా ఆయనలో మార్పు వచ్చి సొంతిల్లు అమ్ముకోవాల్సి వచ్చి పిల్లలతో ఏకాకిగా నిలబడినప్పుడు మా వెనక ఉండి నన్ను అధైర్యపడకుండా చేసి ఒక వ్యక్తి ద్వారా ఉద్యోగం ఇప్పించి మా జీవితాలను నిలబెట్టారు బాబా. అలా ప్రతి ఆపదలో నాకు తోడుగా ఉండి పిల్లల్ని, నన్ను అక్కున చేర్చుకున్నారు. చేతిలో డబ్బులు లేని పరిస్థితిలో బాబుని అమెరికా పంపామంటే, సమయానికి డబ్బు అందేలా చేసి మా బాబు జీవితాన్ని మలుపు తిప్పింది బాబానే. ఇంకా కోరుకున్న వ్యక్తితో మా అమ్మాయి వివాహం జరిపించారు బాబా. ఇంతలో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ అయిపోయి మావారు మరల ఉద్యోగం కోల్పోతే మేము చాలా బాధపడ్డాము. అప్పుడు, "బాబా! ఏమిటి ఈ పరిస్థితి? అంతా బాగానే ఉందనుకునేలోపు మరలా ఉద్యోగం పోయింది. మా బాధ్యతలు పూర్తిగా తీరలేదు. మా పరిస్థితి మీకు తెలుసు. మమ్మల్ని కాపాడు బాబా" అని వేడుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్లో చూస్తే, "నీ పూర్వవైభం వస్తుంది" అని సమాధానం వచ్చింది. అలాగే బాబా దయవలన ముందు ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి ద్వారా మావారికి మరో ఉద్యోగం వచ్చింది. బాబా చెప్పినట్లే జరిగింది. ఆయనే ఆ వ్యక్తి రూపంలో ఉద్యోగం ఇప్పించారని మా ప్రగాఢ విశ్వాసం. నాకు కరోనా వచ్చినప్పుడు చాలా తేలిగ్గా తగ్గించేశారు బాబా.


ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నిద్రపోయేముందు, "బాబా! ఒక్కసారి కనిపించు. మాకు ఇంత సహాయం చేస్తున్న నిన్ను చూడాలని ఉంది" అని అనుకుంటూ పడుకున్నాను. మధ్య రాత్రిలో నా తల దగ్గర ఎవరో నిలబడి నా చేతి మీద తట్టినట్లు అనిపిస్తే భయపడుతూ కళ్ళు తెరిచి చూశాను. ఆకుపచ్చ రంగు కఫనీ ధరించిన ఒక వ్యక్తి పక్కనే నిలబడి ఉండటం చూసి భయంతో గట్టిగా అరిచేసరికి ఆయన అదృశ్యమయ్యారు. నా అజ్ఞానానికి బాధపడ్డప్పటికీ, "పోనీలే, బాబా మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు" అని చాలా సంతోషించాను. నేను బాబాను నమ్మిన తర్వాత నమ్మకముందు ఎప్పుడూ ఆయన మా కుటుంబానికి అండగా ఉన్నారు, ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన మా చేయి పట్టుకుని నడిపిస్తారన్న నమ్మకం మాకుంది. ఆయన తమని నమ్మిన వారికి అన్యాయం చేయరు. ఆయనను నమ్మితే చాలు అద్భుతాలు జరుగుతాయి. మా ఇంట్లో అందరికీ ఆయన మీద పరిపూర్ణమైన భక్తి, విశ్వాసాలు. మేము మాకు చేతనైనంతలో ఆయనకి సేవ చేసుకుంటున్నాము. "ధన్యవాదాలు బాబా. బాబుకి 'హెచ్ వన్' వీసా రాలేదు. అదే కొరతగా ఉంది. ఇంకా సమయం రాలేదేమో బాబా! దయతో బాబుని జీవితంలో స్థిరపరచి మంచి అమ్మాయితో పెళ్లి జరిపించు. ఇటీవల ఒక ఇల్లు తీసుకున్నాము బాబా. ఆ విషయంలో సమస్యగా ఉంది, పరిష్కరించండి బాబా".


చివరిగా ఒక మాట, 'సచ్చరిత్ర పఠనం మన జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుంది. మనం ఎలా బ్రతకలో నేర్పిస్తుంది'.


వేడుకున్న వారం లోపలే బుక్స్ అందేలా అనుగ్రహించిన బాబా


అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, కోటి సూర్యల కాంతితో వెలుగొందు నా తండ్రి సాయినాథునికి శతకోటి వందనాలు. నా పేరు జ్యోతి. నేను చిన్నప్పటినుండి అనగా డిగ్రీ చదివేటప్పటి నుండి సాయిబిడ్డను. నా జీవితంలో బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. నాకు ఈ మధ్యనే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు పరిచయమైంది. ఇందులో అనుభవాలు చదివేటప్పుడు నాకు ఒక సమస్య మొదలైంది. అదేమిటంటే, మా అమ్మాయి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఢిల్లీ నుండి పోస్టల్ ద్వారా తనకి రావాల్సిన పుస్తకాలు రెండు నెలలైనా, పరీక్షలు కూడా దగ్గరపడుతున్నా రాలేదు. ఆ విషయంగా నేను, "బాబా! పరీక్షలకు ముందే బుక్స్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని అని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, రెండు నెలలుగా రాని  బుక్స్ ఒక వారం లోపలే వచ్చి పరీక్షల సమయానికి అందాయి బాబా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1543వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మీటరు కాలిపోయినా కరెంటు వచ్చేలా అనుగ్రహించిన బాబా
2. ఎంతకీ పూర్తికాని వర్క్‌ని పూర్తిచేయించిన బాబా

మీటరు కాలిపోయినా కరెంటు వచ్చేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. మేము హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నాము. మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పటినుండి కరెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నాము. 2023, మే 9న, రాత్రి గం.2.30ని.ల సమయంలో కరెంట్ పోయింది. బయటకి వెళ్లి చూస్తే అందరికీ కరెంటు ఉంది, సమీపంలో ఉన్న మూడు స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతున్నాయి. అంటే, మాకు మాత్రమే కరెంటు లేదు. కిందకి వెళ్లి చూస్తే, మా మీటర్ కాలిపోయి ఉంది. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. మండు వేసవిలో కరెంటు పోతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! నేను అదే ఆలోచిస్తూ, "బాబా! ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు. కరెంట్ వచ్చేలా చేయండి. ఇది అసాధ్యం అని తెలుసు తండ్రీ. అయినా సాధ్యం చేయండి బాబా. మీరు నేను కోరింది చేస్తే మాటలు రాని మా బాబుకి మాటలు వస్తాయని మీరు మాకు అభయం ఇచ్చినట్లే బాబా! ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మీ వల్ల అవుతుంది బాబా. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఒక గంట తర్వాత మావారు, "ఇలా కాదు. పిల్లల్ని తీసుకొని మా చెల్లివాళ్ళింటికి వెళదాం" అన్నారు. నేను, "నాలుగున్నర అయింది. ఇప్పుడు నేను రాను. మంచినీళ్లు వస్తాయి. అవి పట్టి పెట్టాలి. అసలే మోటార్ కూడా రాదు. నీళ్లకి ఇబ్బంది అవుతుంది" అని వెళ్ళలేదు. మావారు మా బాబుని తీసుకొని వెళ్లారు. వాళ్ళు వెళ్లిన పది నిమిషాలకి అంతటా కరెంట్ పోయి చీకటి అయిపోయింది. కొద్దిసేపటికి మాకు మాత్రమే కరెంట్ వచ్చి, తరువాత అందరికీ వచ్చింది. అసలు అదెలా సాధ్యమైందో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, 'మీటర్ కాలిపోయింది, ఇక కరెంటు రాద'ని మేము ఆశలు వదిలేసుకున్నాం. కానీ బాబా మా బాధను అర్థం చేసుకొని కరెంటు వచ్చేలా చేశారు. బాబా దయకి నా కళ్ళనుండి నీళ్ళొచ్చాయి. మావారికి ఫోన్ చేసి, "కరెంటు వచ్చింద"ని చెపితే, "అలా ఎలా వచ్చింది?" అన్నారు. నేను నా మనసులో, "అంతా బాబా దయ" అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ఇంత చక్కని అనుభవం వ్రాయడానికి రెండు రోజులు ఆలస్యమైంది. అందుకు నన్ను క్షమించండి బాబా".


నేను ఒకరోజు ఈ బ్లాగులో 'మా ఇంట్లోకి పాము వచ్చింద'ని ఒక భక్తుని అనుభవంలో చదివాను. అది చదివిన కొద్దిసేపటికి మా పెద్దమ్మ ఫోన్ చేసి, "మీ ఇంట్లోకి పాము దూరింద"ని మా అమ్మతో చెప్పింది. అప్పటికి రెండు రోజుల ముందే మా అమ్మ మా ఇంటికి వచ్చింది. అమ్మ ఆ విషయం నాకు చెప్పగానే ఆశ్చర్యంతో 'ఇప్పుడే కదా అదే విషయం గురించి బ్లాగులో చదివాను. ఇంతలోనే మా ఇంట్లో పాము దూరడం చిత్రంగా ఉంది' అనుకొని, "ఆ పాముని వెళ్లగొట్టమ"ని బాబాను వేడుకొని భారం ఆయన మీద వేశాము. తరువాత ఒకరోజు ఇంట్లో వెతికిస్తే, పాము ఎక్కడా కనిపించలేదు. అంత బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓం సద్గురు సాయినాథాయ నమః!!!


ఎంతకీ పూర్తికాని వర్క్‌ని పూర్తిచేయించిన బాబా 


శిరిడీ సాయి భక్తులకు నమస్కారం. నా పేరు ఆశాదీప్తి. నేను హైదరాబాదులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఈమధ్యనే ఆ కంపెనీకి మారాను. కొత్త ఉద్యోగం, పని ఎలా ఉంటుందో? నేను నిలబడగలనో, లేదో అని ఎంతో భయపడ్డప్పటికీ అన్నింటికీ ఆ సాయి మీద భారమేసి నేను ముందుకు కదిలాను. బాబా అనుగ్రహంతో నేను ఆశించినట్లు అంతా సవ్యంగా సాగింది. అలా అంతా బాగా జరుగుతున్న సమయంలో మా టీమ్‌కి కొన్ని ఫీచర్స్ డెవలప్ చేయమని ఇచ్చారు. వాటిలోనుండి నేను ఒక ఫీచర్ తీసుకుని బాబా దయతో ఏ ఇబ్బందీ లేకుండా విజయవంతంగా పూర్తిచేశాను. అయితే, వేరే టీమ్‌వాళ్ళు తీసుకున్న ఇంకో ఫీచర్ విషయంలో వాళ్ళు పెద్దగా ముందుకు సాగలేకపోయారు. నేను తీసుకున్న ఫీచర్ పూర్తికావడంతో నన్ను ఆ ఫీచర్ చేయమని అన్నారు. అది నాకు కూడా కొత్త కావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాకాలం సెలవులు, నిద్ర లేకుండా అందరం కష్టపడ్డాం. అయినా అనుకున్న ఫలితం కనబడలేదు. చివరికి నేను, "ఈ ఫీచర్ పూర్తిచేయించండి" అని ఆ సాయినాథుని వేడుకున్నాను. తరువాత బాబా అనుగ్రహంతో మేము ఆ ఫీచర్ విషయంలో చకచకా ముందుకు సాగుతూ ఎన్నో అనుకోని కష్టనష్టాలను అధిగమించి దానిని 2023, మే మూడో వారంలో పూర్తిచేయగలిగాం. ఆ కష్టసమయంలో మమ్మల్ని ఆదుకున్న మన సాయి ప్రేమను భక్తులతో పంచుకునే చిరు ప్రయత్నమే నా ఈ అనుభవం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

 

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1542వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని కరుణాకటాక్ష వీక్షణాలు
2. ఆటంకాలు తొలగించి ప్రయాణం చేయించిన బాబా

సాయినాథుని కరుణాకటాక్ష వీక్షణాలు


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా శ్రీసాయినాథుని దివ్య పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒకసారి మావారు జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో ఇబ్బందిపడ్డారు. ఆరోజు మధ్యాహ్నం ఆయన కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ పక్కనున్న ఏదో అందుకోవడానికి అటుఇటు జరిగారు. ఆ క్రమంలో ఆయన కూర్చున్నది ప్లాస్టిక్ కుర్చీ అయినందున టైల్స్ మీద జారి కిందపడ్డారు. కుర్చీ విరిగిపోయింది. ఆయన కుడి పక్కటెముకల్లో నొప్పి వచ్చింది. తల దగ్గర, కుడి చెవి క్రింద కొంచెం వాపు వచ్చింది. ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. మరుసటిరోజు ఆఫీసులో ఆడిట్ ఉన్నందువల్ల ఆ స్థితిలో ఎలా పని చేయాలని మావారు టెన్షన్ పడ్డారు. నేను వెంటనే బాబాకు నమస్కరించుకొని, "మావారికి జ్వరం, అన్నీ నొప్పులు, వాపులు తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. ప్రక్కరోజు మావారు ఆఫీసుకి వెళ్తే ఆడిట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఇంకా జ్వరం, ఒళ్ళునొప్పులు, వాపు చాలావరకు తగ్గి రెండు రోజులకు పూర్తిగా నార్మల్ అయ్యారు. నా తండ్రి సాయినాథుడు ఏదో పెద్ద ప్రమాదం నుంచి నా భర్తను కాపాడారని అనుకుంటున్నాను. "చాలా థాంక్స్ బాబా. మీ చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు నా కుటుంబం మీద, అందరి మీద ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సాయినాథా".


20 సంవత్సరాల క్రితం నాకు పంటి చిగుళ్ళకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి పంటి చిగుళ్ల నొప్పి అంటే నాకు చాలా భయం. నాలుగు సంవత్సరాల కిందట చెకప్ కోసం డెంటిస్ట్ వద్దకి వెళ్తే, "ఒక పంటికి రూట్ కెనాల్ చేస్తే మంచిది" అన్నారు. అప్పుడు నేను బాబా దగ్గర చీటీలు వేస్తే, 'రూట్ కెనాల్ వద్దు' అని వచ్చింది. ఇంకా నేను రూట్ కెనాల్ చేయించుకోలేదు. బాబా దయవల్ల తర్వాత నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇటీవల ఒకసారి పంటినొప్పి, చిగుళ్ల వాపు వచ్చాయి. అప్పుడు నేను భయపడి బాబాకి దణ్ణం పెట్టుకొని, "డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండానే ఊదితో, గృహ చికిత్సలతో నొప్పి తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయ చూపించారు. నాలుగు రోజులలో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని కరుణాకటాక్షాలు నామీద ఎల్లప్పుడూ ఉండాలి బాబా". 


ఆటంకాలు తొలగించి ప్రయాణం చేయించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


నేను ఒక సాయి భక్తుడిని. మా అక్క కూతురు పెళ్లి మే నెలలో నిశ్చయమైంది. మేము ఒక నెల ముందే ట్రైన్ టికెట్లు బుక్ చేసాము. కానీ సమయం దగ్గర పడుతున్నా టిక్కెట్లు RACలోనే ఉండటంతో నేను, "బాబా! టికెట్ కంఫర్మ్ అవ్వకుండా 8 నెలల బాబుతో 24 గంటలు ప్రయాణం చాలా కష్టం. మీ దయతో మా టికెట్లు కన్ఫర్మ్ అయితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని ఆయన మీద భారం వేసాను. ఆ తండ్రి దయవల్ల ప్రయాణానికి రెండు రోజుల ముందు టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇకపోతే, నేను ప్రయాణమయ్యే రోజు కూడా సెలవు తీసుకుని అన్నీ సర్దుకుని రాత్రి ట్రైన్ ఎక్కుదామనుకున్నాను. కానీ ఆ ముందురోజు సాయంత్రం వచ్చిన ఆఫీస్ ఆర్డర్ (తరువాత రోజు డ్యూటీ డిస్క్రిప్షన్ డీటెయిల్)లో మరుసటిరోజు నాకు డ్యూటీ వేసినట్లు ఉంది. నేను వెంటనే మా ఇంచార్జికి ఫోన్ చేసి అడిగితే, "వేరే ఇంజినీర్లు అందుబాటులో లేనందున సెలవు ఇవ్వడం కుదరదు" అని అన్నారు. నేను, "ఈరోజు రాత్రే నా ప్రయాణం" అని చెప్పినా అతను వినలేదు(కనీసం అలా చెప్తేనైనా వదులుతారని అలా చెప్పాను). నేను వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! ఎలా అయినా సెలవు ఇచ్చేలా చూడు తండ్రీ. మీ ఈ అనుగ్రహాన్ని కూడా బ్లాగుకి పంపుతాను" అని చెప్పుకున్నాను. 30 నిముషాల్లో ఆ ఇంచార్జ్ తనంతటతానే నాకు ఫోన్ చేసి, "నువ్వు సెలవు తీసుకోవచ్చు" అని అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని, "బాబా! నేను రేపు ట్రైన్ ఎక్కేవరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎవరి కంటా పడకుండా చూడు తండ్రి" అని ప్రార్థించాను. ఆ కరుణామయుడిపై భారం వేసాక ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మా ప్రయాణం ఎటువంటి ఇబ్బందీ లేకుండా చక్కగా జరిగింది. పెళ్లి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. మేము క్షేమంగా మా ఇంటికి తిరిగి వచ్చాము. అంతా ఆ బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నా భార్యాబిడ్డలను సదా సంరక్షించు తండ్రీ. అలాగే మీ అనుగ్రహం మీ భక్తులందరిపై వర్షించు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1541వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయవల్ల ప్రయత్నం సఫలం
2. సాయి దయతో సమస్య పరిష్కారం

బాబా దయవల్ల ప్రయత్నం సఫలం


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!


సాయిభక్తులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయినాథుని ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆయన అనంతుడు, ఆనంద నిధి, తల్లి, తండ్రి, గురువు మరియు సర్వం. పిల్లలు కొన్నిసార్లు చెప్పేది వినరు. స్వతహా ఉపాధ్యాయురాలినైన నేను కొన్ని పరిస్థితుల్లో పిల్లలికి బోధించడానికి లేదా హెచ్చరించడానికి లేదా కొట్టడానికి ప్రయత్నిస్తాము. అలాగే మన సద్గురువైన సాయి మనం సరైన దారిలో వెళ్లని కొన్ని సందర్భాలలో కాస్త భయపెట్టైనా సరే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. అందుకే నేను, 'ఆయన కరుణే రక్షణ, శిక్షణ, పర్యవేక్షణ' అని అనుకుంటూ ఉంటాను. ఇక అసలు విషయానికి వస్తే..


మా నాలుగేళ్ళ బాబు 'సాయి తాత' అంటూ బాబా తన సొంతం అనుకుంటూ ఉంటాడు. ఎంతైనా వాడు సాయి ఆశీర్వాదం మరి. 2023, జనవరి నుండి మేము మా బాబుని ఒక కొత్త స్కూలుకి పంపుతున్నాము. వాడు చాలా అల్లరి చేసినప్పటికీ కొంచెం గట్టిగా చెప్తే వింటాడు. కానీ స్కూల్లో టీచర్స్ చాలా కఠినంగా వుంటూ ప్రతి చిన్నదానికీ వద్దని చెప్పడం, రూల్స్ ఫాలో అవ్వడం లేదని హెచ్చరిస్తుండటం వల్ల ఒక నెల రోజులకి మాకు తెలియకుండానే బాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. వాడు చాలా మొండిగా తయారయ్యాడు. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చేమో కానీ, నాకు చాలా ఆందోళనగా అనిపించింది. నేను బాబుకి ఏ సమస్య వచ్చినా బాబాకి మొక్కుకొని 3 వారాలు బాబుకి ఊదీ పెడుతుంటాను. ఇప్పుడు కూడా, "అంతా బాగుండాల"ని బాబాకి మొక్కుకుని ఊదీ పెట్టడం మొదలుపెట్టాను. బాబా మీద భారమేసి ఇంట్లో ఉన్నప్పుడు పదేపదే బాబుకి నచ్చజెప్తూ మా ప్రయత్నం మేము చేస్తూండేవాళ్ళము. కానీ ఎందుకో ప్రతి గురువారం ఏదో ఒక ఫిర్యాదు వస్తుండేది. చివరికి బాబా నాకేదైనా నేర్పించటానికి ఇలా సమస్య ఇస్తున్నారేమోనని నాకనిపించింది. సహజంగా నేను ఎవరినీ విమర్శించను, ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోను. కానీ మా బాబు పుట్టడానికి ముందు నా స్నేహితురాలి కొడుకు విషయంలో చనువుతో అనవసరమైన సలహాలిస్తుండేదాన్ని. మావారు కూడా బాబు అల్లరికి విసుక్కునేవారు. పిల్లలు భగవంతుడితో సమానమని వూరికే అంటారా? ఇప్పుడు అవన్నీ మేము మా బాబు విషయంలో పడుతున్నాం. బాబా కరుణామయులు కదా! ఆ భారం తగ్గించి చిన్నగా అనుభవించేలా చేస్తున్నారు.


సరే, ఒక బుధవారం మా బాబు స్కూల్లో టీచరుని బాగా విసిగిస్తే, ఆవిడ వాడిని ప్రిన్సిపాల్ దగ్గరకి పంపింది. ప్రిన్సిపాల్ అడిగిన ప్రశ్నలు మావాడికి అర్ధంకాక వాడు అన్ని ప్రశ్నలకు వ్యతిరేఖంగా సమాధానం ఇచ్చాడు. దాంతో ప్రిన్సిపాల్‌కి కోపమొచ్చి మావారికి ఫిర్యాదు చేసి, "మీ పిల్లాడికి ఏదైనా సమస్య ఉంటే బిహేవియర్ థెరపిస్ట్‌కి చూపించండి" అని చెప్పారు. 4 ఏళ్లు బాబు గురించి అలా అనేసరికి మావారికి చాలా కోపం వచ్చి, "మీ స్కూలు రూల్స్ వల్లే మావాడు ఒత్తిడికి గురి అవుతున్నాడేమో!" అని అన్నారు. స్కూల్ గురించి అలా అనేసరికి ప్రిన్సిపాల్, "మీకు అలా అనిపిస్తే, ఈ స్కూలు మీవాడికి సరైనది కాదేమో! మీ నిర్ణయం మీరు తీసుకోండి" అని అన్నారు. ఇంటికి వచ్చాక నాకు విషయమంతా తెలిసి దిగులు పట్టుకుంది. ఎందుకంటే, నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగస్థులం. అదికాక అమెరికాలో ఇతరుల సహాయం అందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వేరే స్కూలు దొరకడం కష్టం. అందువల్ల నేను బాబా మీద భారం వేసి, "ఈ సమస్య నుండి బయటపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. మరుసటిరోజు నేను స్కూలుకి వెళ్లి, "నేను బాబుకి ఎలా వుండాలో నేర్పిస్తాను" అని సర్ది చెప్పాను. బాబా దయవల్ల నా ప్రయత్నం సఫలమైంది. ఆ సమయమంతా నేను బాబాని 'దారి చూపమ'ని తలుచుకుంటూ ఉన్నాను. ఆయనే మార్గదర్శి కదా! ఇప్పుడు బాబు కొంచెం కొంచెంగా వింటూ ఉన్నాడు. ఫిర్యాదులు కూడా కొంచెం తగ్గాయి. బాబా దయవల్ల వాడికి మంచి టీచర్ దొరికితే, క్రమంగా వాడు మంచి నడవడిలోకి వస్తాడు అని నా ఆశ. బాబా దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు అని నా నమ్మకం. చిన్న విషయాన్ని చాలా పెద్దగా వ్రాసినందుకు క్షమించండి. కానీ పరిస్థితి అలాంటిది. "కృతజ్ఞతలు సాయితండ్రి".


సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


సాయి దయతో సమస్య పరిష్కారం


తోటి సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు రజనీకాంత్. ఈమధ్య నేను పని చేస్తున్న కంపెనీలో ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. నేను ఎంత కరెక్ట్‌గా ఆ టాస్క్ చేసినా అవుట్‌ఫుట్‌లో ఏదో ఎర్రర్ వస్తుండేది. అలా ఎందుకు వస్తుందో నాకు అర్దం కాలేదు. చాలా ప్రయత్నించాను కానీ సమస్య ఏమిటో తెలియలేదు. అప్పుడు, "బాబా! ఆ టాస్క్ సరిగా వచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల సమస్య ఏమిటో తెలిసి టాస్క్ పూర్తైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించు తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo