సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1533వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్పటికప్పుడు సమస్యలు తొలగిస్తున్న సాయితండ్రి
2. బాబాకి చెప్పుకుంటే కాని పని లేదు - వారంలోనే కోరిక తీర్చిన బాబా

ప్పటికప్పుడు సమస్యలు తొలగిస్తున్న సాయితండ్రి


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. తాము ప్రసాదించిన అనుభవాన్ని మీ అందరితో పంచుకొనే అవకాశమిచ్చిన పిలిస్తే పలికే నా సాయితండ్రికి పాదాభివందనాలు. నేను 'సాయిభక్తుల అనుభవమాలిక 1317వ భాగం'లో మా అన్నయ్యవాళ్ళు నాకిచ్చిన ప్లాట్‌లో మా చిన్నబాబు ఇల్లు కట్టుకుంటానన్నాడని, తరువాత ఆ ప్లాట్ ఎక్కడ ఉందో చూపించడంలో బాబా చేసిన సహాయాన్ని మీతో పంచుకున్నాను. ఆ తర్వాత బాబా అనుగ్రహంతో మేము మా అన్నయ్య పేరు మీద ఉన్న ప్లాట్‌ని మా చిన్నబాబు పేరు మీద రిజిస్టర్ చేశాము. తర్వాత బాబుకి పెళ్లిసంబంధం కుదిరింది. పెళ్లయ్యాక వాళ్ళకి అద్దెఇల్లు కాకుండా సొంతిల్లు ఉండాలని నేను అనుకున్నాను. కానీ ఇల్లు కట్టడానికి కావాల్సినంత డబ్బు మా దగ్గర లేదు. కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆగస్టులో కొంత డబ్బు వస్తుంది. కాబట్టి అప్పుడే ఇంటి నిర్మాణం చేద్దామని అనుకున్నాము. ఆ సమయంలో మా ఇంటిపక్కన ఒక ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి యజమాని, "అమ్మా! మీరూ ఇల్లు కట్టడం ప్రారంభించండి. అంతా ఆ భగవంతుడే చూస్తాడు. అంతా హ్యాపీగా జరిగిపోతుంది" అని నాతో అన్నారు. నేను వెంటనే అయ్యవారిని అడిగి ఇంటి నిర్మాణానికి ముహూర్తం పెట్టించి భూమిపూజ చేశాను. భూమిపూజ చేశాక బోర్ వేయాలి కదా! బోర్ వేసే ముందు నేను నా సాయితండ్రికి నమస్కారం చేసి, కొబ్బరికాయ కొట్టి, 'మంచిగా నీళ్లు రావాల'ని కోరుకుని 'బాబా.. బాబా' అని అనుకోసాగాను. బాబా దయతో 25 అడుగులకే నీళ్లు పడ్డాయి. ఇంకా లోతుకు వెళ్తుంటే చిన్న చిన్న గులకరాళ్లు వచ్చాయి. అయినా 50 అడుగుల వరకు బోర్ వేశారు. ఆపై లోతుకు వెళ్లాలంటే సాధ్యపడలేదు. ఆ బోరు వేసే ఆయన, "25 అడుగులకే నాలుగు ఇంచులు నీళ్లు పడ్డాయి, ఇంటి అవసరాలకి సరిపోతాయి. మీకు అనుమానం ఉంటే మోటర్ పెట్టి చూడండి" అన్నారు. నేను, "బాబా! నాకు అంతా నీవే. నేను ఎన్నో సమస్యలలో ఉన్నాను. అన్నీ సవ్యంగా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. మీ పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. ఇంటి నిర్మాణం చేస్తున్న అతను ఒక అతనిని రప్పించి మోటార్ పెట్టించారు. నీళ్లు 15 నిమిషాలపాటు వచ్చాయి, మరుసటిరోజు అరగంటసేపు వచ్చాయి. దాంతో మరోచోట బోర్ వేయాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు, బోర్ వేయడానికి లక్షా పదివేల రూపాయలు అవుతుందనుకుంటే కేవలం 75 వేల రూపాయలకే అయిపోయింది. నా సమస్యలు తెలిసిన నా సాయితండ్రి ఎక్కువ మొత్తం ఖర్చు కాకుండా తక్కువలోనే నీళ్లు తెప్పించి నన్ను టెన్షన్ నుండి బయటపడేశారు.


ఇకపోతే, చిన్నబాబు లోన్ కోసం ప్రయత్నించేటప్పుడు బ్యాంకువాళ్ళు లింక్ డాక్యుమెంట్ కావాలన్నారు. అవి మా దగ్గర లేనందున మా అన్నయ్యని అడిగితే, "వాటిని మీకే ఇచ్చి నేను హైదరాబాద్ వచ్చాను" అని చెప్పారు. ఇంక మాకు టెన్షన్ మొదలైంది. నేను, "బాబా! నువ్వే దిక్కు. మీ దయతో నేను ఇంటి నిర్మాణం మొదలుపెట్టాను. అంతా సవ్యంగా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తర్వాత బాబు మళ్ళీ ఆ లోన్ ప్రాసెస్ చేశాడు. ఈసారి బాబా దయవల్ల అంతా సక్రమంగా జరిగి ఏ ఆటంకాలు లేకుండా లోన్ శాంక్షన్ అయింది. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని చూపు నాపై, మా కుటుంబంపై సదా ఉండనీ తండ్రీ".


బాబాకి చెప్పుకుంటే కాని పని లేదు - వారంలోనే కోరిక తీర్చిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః!!! 


సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదువుతుంటే బాబాపట్ల భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నా పేరు రాంబాబు. నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. రెండు సంవత్సరాల ముందు నాకు వేరే డిపార్ట్‌మెంట్‌కి డిప్యుటేషన్ వచ్చింది. కానీ మా ఆఫీసర్స్ నన్ను రిలీవ్ చేయలేదు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి నేను, "బాబా! నన్ను రిలీవ్ చేస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించి మరుసటి గురువారం నా వంతు ప్రయత్నం నేను చేశాను. అంతే, బాబా దయవల్ల మా పైఆఫీసర్ వెంటనే నా ఫైల్‌పై సంతకం చేశారు. మరుసటి గురువారానికల్లా నన్ను రిలీవ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. రెండు సంవత్సరాలుగా కాని పని ఒక వారంలో అయినందుకు నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, నేను ఇంత సులువుగా పని అవుతుందని అనుకోలేదు. అంతా బాబా దయ. అయితే కొత్తగా చేరిన చోట పని కొంచెం కొత్తగా ఉంది. సాయి దయవల్ల నాకు ముందునుండి అనుభవమున్న పని అప్పగిస్తే బాగుంటుందని, ఆ కోరిక కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అదే జరిగితే మళ్ళీ నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. మాపై మీ దయ ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సాయీ".



4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo