- బిడ్డలను సంతోషపెట్టే బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు జాన్‌బీ. మాది హైదరాబాద్. నేను ఏ గుడికెళ్ళినా అక్కడున్న దేవుడిని 'బాబా' అనే పిలుస్తాను/తలుస్తాను. ఆ తరువాతనే ఆ దేవాలయంలో ఉన్న దేవుడిని ప్రార్థిస్తాను. అది తప్పో, ఒప్పో నాకు తెలీదుకానీ, బాబా అంటే నాకు ప్రాణం. ఆయన కేవలం దైవం మాత్రమే కాదు, నాకు ఆయనే తల్లి, తండ్రి, స్నేహితుడు, ఆప్తుడు, గురువు, దైవం, సర్వమూ. ఆయనతోనే నా సంతోషాన్ని, బాధని పంచుకోవడం, కోపమొస్తే కోప్పడటం, అలగడం, మళ్ళీ ఆయన దగ్గరకే పరుగెత్తడం. ఇదే నా పని. ఆయన నామం తలవని, ఆయనని గుర్తుచేసుకోని క్షణమంటూ నా జీవితంలో ఇప్పటివరకూ రాలేదు, ఇకమీదట కూడా రాకూడదని ఆయన్ని వేడుకుంటున్నాను. ఇకపోతే, తోటి భక్తులతో అనుభవాలు పంచుకోవడమంటే సాక్షాత్తు బాబాతోనే పంచుకోవడమనేదే నా ఉద్దేశ్యం. ఆయన తన బిడ్డలని ఎలా సంతోషపెడతారో, ఆయన బిడ్డ చెప్పినది ఎలా నిజం చేస్తారో ఈ నా అనుభవం చదివితే మీకే తెలుస్తుంది.
ఒకసారి నా చెల్లివాళ్ళు కార్తీకపౌర్ణమికి శ్రీశైలం వెళ్తూ, "వస్తావా?" అని నన్ను అడిగారు. నేను నా మనసులో, 'అబ్బా.. శిరిడీ అయితే బాగుండు కదా!' అని అనుకున్నాను. అంతేకాదు, "శిరిడీ పోవచ్చు కదా!" అని చెల్లితో అన్నాను కూడా. అందుకు తను, "ఎప్పుడూ (శిరిడీ)పోతూనే ఉంటావు కదా! ఈసారి ఇటు పోదాం, రా" అని అంది. అమ్మ కూడా, "రా, వెళదాం" అంది. నేను కొంచెం అటుఇటుగా ఉన్నాను. ఎందుకంటే, నా మనస్సులో బాబానే ఉన్నారు. కానీ చెల్లి రమ్మని పట్టుబట్టింది. సరే, ఇక బాబా ఇష్టం అనుకున్నాను. వాళ్ళు హైదరాబాద్ వచ్చాక అందరం కలిసి బస్టాండుకి వెళ్ళాము. అక్కడ బస్సుకోసం ఎదురుచూస్తుండగా నేను చెల్లితో మళ్ళీ, "శిరిడీ వెళితే బాగుంటుంది కదా!" అని, మనసులో "శివయ్యా! నన్ను క్షమించవయ్యా. నన్ను తప్పుగా అనుకోకు. నాకు బాబా తరువాతనే అందరూ. అందరూ ఒక్కటేనని తెలుసు. అయినా తల్లి తల్లే కదా! నేను తెలిసీతెలియక ఏమైనా అనివుంటే క్షమించు" అని క్షమాపణ కోరుకున్నాను. మా చెల్లి, "వెళితే ఇది(శ్రీశైలం) కూడా చూడొచ్చు కదా!" అని అంది. నేను, "సరే, పద వస్తాను. కానీ మనకి శివయ్య దర్శనం కన్నా ముందు బాబా దర్శనమవుతుంది చూడు!" అని చెప్పాను. తను, "అవునా! సరేలే చూద్దాం" అంది. అందుకు నేను, "తెల్లని కఫినీ, తలకి తెల్లని తలపాగా, ఒక చేతిలో కర్ర, మరో చేతిలో జోలె, కాళ్ళకి చెప్పులు లేకుండా, మెడలో రుద్రాక్షతో సాక్షాత్తు బాబానే వచ్చి దర్శనమిస్తారు చూడు! ఏమనుకుంటున్నావో?" అని అన్నాను. తను, "నీకు బాబా పిచ్చి ఎక్కువైందే. మరీ ఇంతలా ఉండొద్దు" అంది.
ఆరోజు సాయంత్రానికి మేము శ్రీశైలం చేరుకున్నాము. ఆరోజు కార్తీకపౌర్ణమి అయినందున చాలామంది భక్తులు వచ్చారు. అందువల్ల మాకు రూమ్ దొరకలేదు. సరే, కామన్ హాల్లోనైనా చూద్దామని వెళితే, బాబా దయవల్ల ఉండటానికి చోటు దొరికింది. అమ్మని, పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి నేను, చెల్లి మంచినీళ్ళు తెద్దామని బయటికి వెళ్ళాము. అలా వెళ్తుండగా మా చెల్లి, "అక్కా, అక్కా" అని రెండు, మూడుసార్లు అదోలా నన్ను పిలిస్తే, "ఏంటి?" అన్నాను. తను సరిగా చెప్పలేక, "చూడు, చూడవే అటు" అంటుంటే ఏముందని ఎదురుగా చూసి అవాక్కయ్యాను. నేను ఏవిధంగా అయితే బాబా దర్శనమిస్తారని చెల్లికి చెప్పానో అచ్చం అలానే ఒక వ్యక్తి మా ముందున్నారు. ఒక్కసారిగా నాలో నేను లేను, నాకేమైందో తెలీదు. నేను, చెల్లి ముందుకు అడుగులు వేస్తూ ఆయన్ని పరిశీలించడంలో మునిగిపోయాము తప్ప ఆయనకి నమస్కరించలేదు. మా చెల్లి 'బాబా, బాబా' అనుకుంటుంది. ఆయన తెల్లని కఫినీ, తలపాగా ధరించి ఉన్నారు. నేను ఆయన చేతిలో కర్ర, జోలె ఉన్నాయా, లేదా అని చూశాను. నేను చెప్పినట్లుగా అన్నీ ఉన్నాయి. ఆ రూపం బాబా రూపంలానే ఉంది. నేననుకున్నట్లే ఆ బాబానే వచ్చారనుకుంటూ, నిశితంగా పరిశీలిస్తూ ఆయన ప్రక్కకి వెళ్ళాను. అంతసేపూ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్లు ఉన్న ఆయన హఠాత్తుగా అక్కడినుండి వెళ్లిపోయారు. మా చెల్లి, "అక్కా! ఏంటే ఇది? ఇది కలా, నిజమా? నువ్వు అన్నట్లుగానే ముందు బాబా తమ దర్శనమిచ్చారే. నువ్వు చెప్పినవన్నీ ఆయన ధరించి ఉన్నారే. నాకేమీ అర్థం కావడం లేదు అక్కా. ఎంత పనిచేశామే అక్కా? స్వయంగా బాబా వస్తే మనం ఆయన పాదాలకు మ్రొక్కలేదే" అని బాధపడింది. "అవును, నేనూ ఏదో లోకంలో ఉన్నాను. పోనీలే, ఆ తండ్రికి అన్నీ తెలుసు కదా! తప్పకుండా మళ్ళీ కనపడతారు. అప్పుడు మ్రొక్కుదామ"ని చెప్పాను నేను.
మరుసటిరోజు మేము శివయ్య దర్శనం చేసుకొని లోపలినుండి ధ్వజస్తంభం వైపు నడుచుకుంటూ వస్తున్నాము. అద్బుతం! మళ్ళీ బాబా మా ముందు ఉన్నారు. మా చెల్లి, "అక్కా! నిజంగానే బాబా మళ్ళీ కనిపించారే. ఈసారి మనం ఆయన పాదాలు పట్టుకుందామే" అంది. సరేనని మేము ముందుకు కదిలాము. ఇంతలో పిల్లలు త్వరత్వరగా బయటికి వెళ్లిపోయారు. మా చెల్లి, "అయ్యో! పిల్లలు కూడా బాబాని చూస్తారు. నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాన"ని వాళ్ళని తేవడానికి బయటకి వెళ్ళింది. నేను, "అమ్మా, బాబానే" అని అమ్మకి చూపించాను. తను, "అవును" అంది. మేమిద్దరం బాబా వెనకాలే నడిచాము. ఆయన ప్రసాదం కౌంటర్ దగ్గర ఆగారు. నేను ధ్వజస్తంభం దగ్గర ఆగి చెల్లికోసం ఎదురుచూడసాగాను. కాసేపటికి బాబా ముందుకెళ్ళిపోసాగారు. కానీ చెల్లి ఇంకా రాలేదు. ఇక నేను ఒక్కక్షణం కూడా ఆగకుండా ఆయన వెనకాలనే నడుస్తూ., 'బాబా' అని గట్టిగా పిలిచాను. 'ఆ..' అని ఆయన వెనక్కి తిరిగి చూసి ఆగారు. నేను అమాంతం ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన ప్రేమగా నన్ను ఆశీర్వదిస్తూ పైకి లేపారు. తరువాత అమ్మ కూడా ఆయన పాదాలకు మ్రొక్కింది. ఆయన అమ్మ భుజాలు తడుతూ పైకి లేపారు. ఏమని చెప్పాలి ఆ క్షణం నేను అనుభవించిన ఆనందం గురించి? 'ఎన్ని జన్మలలో ఫుణ్యం చేసుకుంటే ఇలాంటి దర్శనం, ఆశీర్వాదం దొరుకుతుంది?' అనుకున్నాను. అమ్మ, "నిజంగా బాబానే వచ్చారే. ఇలా కూడా జరుగుతుందని నాకిప్పటివరకు తెలీదు" అని ఆనందపడింది. మా చెల్లికి అంతా ఒక మాయలా అనిపించిందంట. ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నమ్మలేగానీ ఆయన లేని చోటంటూ ఉందా ఈ లోకంలో? ఆయన మీద నమ్మకం ఉండాలేగానీ ఆయన చేయలేనిదంటూ ఏమైనా ఉందా? ఆ క్షణం నుండి నాకు ఒక విధమైన బంధం బాబాతో ఏర్పడింది. ఇప్పటికీ నాడు దర్శించిన ఆ రూపం నా కళ్ళలో మెదులుతూ 'బాబా ఉన్నారు' అనే దైర్యం, ధీమా నా మనసుకి కలుగుతుంది. "తండ్రీ! ఈ బిడ్డకి మీ పాదాల చెంత ఉండిపోయే అదృష్టాన్ని ప్రసాదించండి".
ఇక బాబా నా కోరిక తీర్చి నన్ను ఆనందంగా ఇంటికి ఎలా చేర్చారో మీతో పంచుకుంటాను. 2023, ఫిబ్రవరిలో నా స్నేహితులు విజయవాడ వెళ్తూ నన్ను కూడా తమతో రమ్మన్నారు. వాళ్ళు అమ్మవారి మెట్లపూజ చేయడానికి వెళ్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను కూడా ఆ పూజ చేసుకుందామని వాళ్లతో వెళ్ళాను. నా కుటుంబం కోసం, బాధలలో ఉన్న బాబా ఇచ్చిన మా బంధువు కోసం ప్రతి మెట్టుకు రెండుసార్లు పసుపు బొట్టు పెట్టుకుంటూ మెట్లపూజ చేశాను. ఆ తల్లి దయ, బాబా అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. మామూలుగా నేను ఇంట్లో నుండి కాలు బయటపెట్టిన క్షణం నుండి బాబా కోసం చూస్తూ ఉంటాను. నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ గుడికెళ్ళినా నాకు ముందు బాబా కనపడాలి. అప్పుడే నాకు ఆనందం. ఆయన ఏదో ఒక విధంగా తమ దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన దర్శనం కాకపోతే నా మనస్సంతా ఎలానో ఉంటుంది. అలాంటిది విజయవాడలో మెట్లపూజ, అమ్మవారి దర్శనం అయిపోగానే తెనాలి వెళ్లి, అక్కడినుండి మంగళగిరి వెళ్లి పానకాలస్వామిని దర్శించుకొని మేము ఏవేవైతే చూడాలనుకున్నామో అవన్నీ చూసేశాముగానీ నాకు బాబా దర్శనం కాలేదు. ఇక రేపు తిరిగి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతామనగా 'బాబా దర్శనం కాలేద'ని మనస్సులో ఏదో తెలియని వెలితి. ఆయన అన్నీ చూపించారు, అందుకు చాలా సంతోషం. కానీ బిడ్డకి ఎంతమంది బంధువులున్నా కన్నతల్లి కన్నతల్లే కదా! నేను ఆటోలో కూర్చొని, "బాబా! నీకు ఈ బిడ్డ గురించి తెలుసు, ఎందరిని చూసినా మిమ్మల్ని చూడకపోతే నా మనస్సు కుదుటపడదని. నా యాత్ర సంపూర్ణం అయ్యేది మీ దర్శనంతోనే. అప్పుడే ఈ బిడ్డ సంతోషపడేది, సంతోషంగా ఇంటికి వెళ్ళేది. నన్ను సంతోషంగా పంపుతావో లేక బాధతో పంపుతావో మీ ఇష్టం తండ్రీ" అని మనసులో అనుకుంటూ ఉన్నాను. అద్భుతం! నేను అలా నా మనసులో అనుకొన్న తర్వాత ఐదంటే ఐదే నిమిషాలలో మేము వెళ్తున్న దారిలో బాబా గుడి కనిపించింది. మొదట నేను అది నా భ్రమనుకున్నాను. బాబా గురించి ఆలోచిస్తున్నాను కదా, అలా కనిపించిదనుకున్నాను. మళ్ళీ చూశాను కదా! నాది భ్రమ కాదు. నిజంగానే బాబా గుడి. మరుక్షణం, "ఆపండి అన్నా. అది బాబా గుడే కదా" అని ఆటో నడుపుతున్న అతన్ని అడిగాను. అతను, "అవునమ్మా" అన్నాడు. నాకు మాట రాలేదు. కళ్ళలో ఆనందభాష్పాలు, మనసంతా ఏదో మైకం. "అన్నా! ఒక్క ఐదు నిమిషాలు ఆపు అన్నా. నా బాబాని చూసుకుని వస్తాన"ని చెప్పాను. నా ఉత్సాహాన్ని గమనించిన అతను, "ఆగమ్మా! వెళుదువు. నేను ఆటో పక్కన ఆపి పెట్టుకుంటాను" అని ఆటో పక్కకు తీసి ఆపాడు. నేను ఉరికే ఉత్సాహంతో పరుగుపరుగున నా తండ్రి దగ్గరకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే బాబాని దర్శించానో అప్పుడే నా యాత్ర సంపూర్ణమైనట్లు భావించాను. ఆ సమయంలో ఆరతి జరుగుతోంది. ఆనందంగా ఆరతి పాడుకొని, ప్రసాదం తీసుకున్నాను. బాబా తమ పాదసేవ చేసుకునే అదృష్టాన్ని కూడా నాకు కల్పించారు. చెప్పలేనంత సంతోషం. ఇంకేమి కావాలి నాకు? "బాబా! మీరు లేకపోతే నేనేమైపోతాను? మీరు తప్ప నాకు ఎవరూ లేరు బాబా. మీ పాదాల చెంత నా జీవితాన్ని ఎప్పుడో ఉంచాను తండ్రీ. ఈ బిడ్డ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకో తండ్రీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
చాలా చాలా బాగుంది.నాకు బాబా ఫోటో రూపం లో దర్శనం అవుతుంది.ఫొటోకి బాబా కి తేడా లేదు.రెండూ ఒక్క టే అని సాయి చెప్పారు.తలచిన వెంటనే అక్కడ వుంటారు.ఓం సాయి రామ్.
ReplyDeleteమనం అందరం సాయి సమీపం లో ఉన్నాం.ఓం సాయి రామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram, antha neeve tandri, antha neeve chudukovali
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDelete