సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1526వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తమ అనుగ్రహం నా కుటుంబం మీద ఉందని నిరూపించిన బాబా
2. బాబా దయతో నెలరోజుల్లోనే తగ్గిన నాలుగేళ్లనాటి చర్మవ్యాధి - కష్టకాలంలో వీసా

తమ అనుగ్రహం నా కుటుంబం మీద ఉందని నిరూపించిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సద్గురు సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రమ్య. బాబా ప్రసాదించిన అనుభవాలు మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్ళై రెండు సంవత్సరాలైంది. నా భర్త ఒక ప్రభుత్వోద్యోగి. అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్న ఆయన పని ఒత్తిడి వల్ల 2021 నుండి తరచూ తలనొప్పితో బాధపడుతుండేవారు. దాంతో ఆయనకి ప్రతిరోజూ టాబ్లెట్లు వేసుకోవడం, అమృతాంజన్ రాసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. చివరికి ఆ సమస్యకి ఏం చేయాలో తెలియక నేను బాబా సహాయాన్ని అర్థిస్తూ, "బాబా! నా భర్తకి తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ ఆయన ఆ తలనొప్పితో బాధపడుతున్నారు. నేను తన బాధను చూడలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరకి వెళ్దామంటే తను రావటం లేదు. మీరే ఆ తలనొప్పి తగ్గేలా చేయండి. ఆయనకి తలనొప్పి తగ్గితే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన తమ అనుగ్రహం నా కుటుంబం మీద ఉందని నిరూపించారు. ఇప్పుడు మా ఆయనకి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి నార్మల్‌గా ఉన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను ఈ బ్లాగులో పంచుకొనే గురుబంధువుల అనుభవాలను మా అమ్మకి ఫోన్‌లో చదివి వినిపిస్తూ ఉంటే ఆమె శ్రద్ధగా వింటూ ఉంటుంది. ఈమధ్య ఆమె గొంతునొప్పితో నాలుగైదు రోజులు చాలా బాధపడింది. డాక్టర్ దగ్గరకి వెళ్లి చూపించుకున్నా తగ్గలేదు. అమ్మ నాతో, "నొప్పి తగ్గడం లేదు. ఈ ఎండల్లో వేడినీళ్లు తాగుతున్న కూడా గొంతునొప్పి అలానే ఉంది. కాళ్లుచేతులు, ముఖం పొంగుతున్నాయి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. 'నా బాధ తీర్చు బాబా' అని బాబాకే చెప్పుకుంటున్నాను. ఆయన నామమే స్మరిస్తున్నాను" అని చెప్పి చాలా బాధపడింది. అది వినగానే నేను కూడా, "బాబా! అమ్మ నొప్పి తగ్గిపోతే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను. దయచేసి అమ్మని మంచి డాక్టర్ దగ్గరకి తీసువెళ్లి, మంచి ట్రీట్మెంట్ ఇప్పించు బాబా" అని వేడుకున్నాను. తరువాత మా అన్నయ్య అమ్మని ఒక మంచి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాడు. ఆయన, "నార్మల్ ఇన్ఫెక్షన్" అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. బాబా దయవల్ల ఆ మందులతో అమ్మకి నయమై ఇప్పుడు సంతోషంగా ఫోన్లో నాతో మాట్లాడుతుంది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ ఆశీస్సులు అందరిమీద ఉండాలని కోరుకుంటున్నాను".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


బాబా దయతో నెలరోజుల్లోనే తగ్గిన నాలుగేళ్లనాటి చర్మవ్యాధి - కష్టకాలంలో వీసా


సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతి చిన్న విషయానికి బాబాను ప్రార్థిస్తూ ఉంటాను. ఆయన ప్రతిదీ నేను అడిగిన వెంటనే తీరుస్తూ ఉంటారు. నాలుగేళ్ల క్రితం మా అబ్బాయికి ఒక చర్మ వ్యాధి వచ్చింది. ఎందరో డాక్టర్లకు చూపించాము. కానీ తగ్గలేదు. అలా నాలుగేళ్లు ఆ చర్మ వ్యాధితో తను బాధపడ్డాడు. చివరికి నేను, "బాబా! నా కొడుకు సమస్యను తగ్గించండి. మీ అనుగ్రహాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఒక్క నెల రోజుల్లోనే మా అబ్బాయి చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. "బాబా మీకు శతకోటి వందనాలు".


వీసాలు రావడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో నా మనవడు వీసాకి అప్లై చేసాడు. తరువాత వీసా వస్తుందో, లేదో అని వాడు, వాళ్ళమ్మ భయపడుతూ ఉండేవారు. అప్పుడు నేను నా మనవడితో, "నువ్వు ఐదు గురువారాలు బాబా గుడికి వెళ్ళు" అని చెప్పాను. అందుకు వాడు సరేనని గుడికి వెళ్లడం మొదలుపెట్టాడు. బాబా దయవల్ల నాలుగో వారంలో వీసా ఇంటర్వ్యూకి రమ్మని వాడికి ఫోన్ వచ్చింది. నేను తనతో, "భయపడకు. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళేటప్పుడు వెళుతూ బాబాని స్మరించుకో" అని చెప్పాను. నా మనవడికి ఇంటర్వ్యూ చేసిన అతని ముఖంలో బాబా కనిపించారు. ఆయన దయతో వాడికి వీసా వచ్చింది. వాడి ప్రయాణం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అంతా బాబా కృప. వారికి కోటికోటి ధన్యవాదాలు. నేను ఎన్నోసార్లు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకోవాలనుకున్నాను. కానీ వ్రాయలేకపోయాను. చివరికి బాబా దయవల్ల నా కోరిక ఈరోజు నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!



2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo