1. పునర్జన్మనిచ్చిన బాబా
2. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పూర్తి చేయడంలో బాబా అనుగ్రహం
పునర్జన్మనిచ్చిన బాబా
నా పేరు ఉష. నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి సాయిని పూజిస్తున్నాను. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం బాబా కృప. ఆయన దయతో నా జీవితంలోని ఎన్నో సమస్యలు తొలగిపోయాయి. బాబా నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. మొదటిసారి బాబా చూపిన దయను, ప్రేమను మీతో పంచుకుంటున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పని చేస్తున్నారు. 2022, డిసెంబర్ 13న డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉండగా ఉదయం 10 గంటల సమయంలో మావారికి గుండెల్లో మంటగా అనిపించింది. గ్యాస్ సమస్య అనుకోని జెలుసిల్ సిరప్ త్రాగి మచిలీపట్నంకి బయలుదేరారు. అయితే గుండెల్లో మంట తగ్గకపోవడంతో పామర్రులో గ్యాస్టిక్‌కి ఇంజెక్షన్ చేయించుకొని మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం డిపో నుండి మాకు ఫోన్ చేసి, "నా గుండెలో మంటగా ఉంది. వచ్చి, నన్ను తీసుకెళ్లండి" అని చెప్పారు. నేను, మా పాప కంగారుగా డిపోకి వెళ్లి, మావారిని స్థానిక హార్ట్ డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళాము. ఆ డాక్టరు టెస్టులు చేసి, "మీవారికి గ్యాస్ సమస్య కాదు. సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇక్కడివరకు ఎలా వచ్చారో నాకు అర్దం కావడం లేదు" అన్నారు. అది విని నేను బాబాను తలచుకున్నాను. డాక్టరు స్టంట్ వేద్దామంటే, మేము సరే అన్నాము. కానీ యాంజియోగ్రామ్ చేసాక బైపాస్ సర్జరీ చేయాలన్నారు. మేము వెంటనే మావారిని అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్లి రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. సర్జన్ 20% మాత్రమే గ్యారెంటీ అన్నారు. నేను, "బాబా! ఆయన్ని మాకు దక్కించు" అని బాబాను వేడుకున్నాను. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటికొచ్చిన మా అమ్మాయి, "బాబా మీద భారమేసి సర్జరీ చేయమ"ని చెప్పింది. బాబా దయ వల్ల సర్జరీ సక్సెస్ అయ్యింది. మేము 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. నేను రోజూ మావారి దగ్గర కూర్చొని బాబా నామస్మరణ, బ్లాగులోని బాబా లీలలు చదవడం చేస్తుండడాన్ని. బాబా దయతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాము. ఒక వారం తరువాత చెకప్‌కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్టు చేసి బ్లడ్‌లో క్లాట్స్ ఏర్పడ్డాయి అని చెప్పారు. నేను, "బాబా! ఈ ఆపద నుండి ఆయనని కాపాడండి" అని బాబాను వేడుకున్నాను. ఐదు రోజుల కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. బాబా దయవల్ల క్లాట్స్ కరిగాయి. కానీ మరో పది రోజులకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. డాక్టరు, "ఇప్పుడు ఈ సమస్య రావాల్సింది కాదు. అయినా పాజిటివ్ గా ఉండండి" అన్నారు. నేను, "బాబా! ఈ ప్రాబ్లం నుండి నువ్వే రక్షించాలి. ఆయనకి నయమైతే నేను నా జీవితాంతం ఓక పూట భోజనం చేస్తాను" అనుకున్నాను. బాబా దయవల్ల మావారికి స్టెంట్ వేసి ఒక నెలకు ఆ స్టెంట్ తీశారు. కానీ మావారు బాగా వీక్ అయ్యారు. నేను, "బాబా! ఆయన కొలుకుంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు మావారు బాగానే ఉన్నారు. మావారికి ఉదయం 10 గంటలకి హార్ట్ ఎటాక్ వస్తే, మధ్యాహ్నం 2 గంటలకి మచిలీపట్నంలో చూపించాము, సాయంత్రం 5 గంటలకి విజయవాడలో ట్రీట్మెంట్ అందింది. అంటే సుమారు ఏడు గంటలు సమయం సరైన ట్రీట్మెంట్ జరగకపోయినప్పటికీ బాబా దయవల్లనే మావారు మాకు దక్కారు. బాబా ప్రతి గురువారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తమ గుడిలో సేవ చేసే తమ బిడ్డని(మావారిని) 3 సార్లు హార్ట్ ఎటాక్, బ్లడ్ క్లాట్స్, కిడ్ని సమస్యల నుండి కాపాడి పునర్జన్మనిచ్చి మాకు తిరిగి ఇచ్చారు. మా పాప వాళ్ళ నాన్నని తిరిగి ఇచ్చినందుకు బాబాపట్ల కృతజ్ఞతతో జీవితాంతం బుధవారం రైస్‌కి సంబందిచినవి తిననని, అలాగే గురువారంనాడు ఎవరైనా ఒక పేదవానికి అన్నం పెడతానని అనుకుంది. "బాబా! మీకు కోటి కోటి కృతజ్ఞతలు. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం?".
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పూర్తి చేయడంలో బాబా అనుగ్రహం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
"సాయిబాబా! మీ పాదపద్మములకు నమస్కారాలు. తండ్రీ! నీ దయతో నేను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పాసయ్యాను. ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను తండ్రీ". నా పేరు రఘు. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకి సంబంధించి 10 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కో నెల ఒక్కో మాడ్యూల్ పరీక్ష ఉంటుంది. నేను ప్రతి నెల ఆన్లైన్ క్లాసులకి అటెండై పరీక్షకి ప్రిపేరై, బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! మంచి మార్కులతో పరీక్ష పాసయ్యేలా దీవించండి. నేను అన్ని మాడ్యూల్స్ పాసయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకొని ప్రతి మాడ్యూల్ పరీక్ష వ్రాసాను. ప్రతి పరీక్షలో బాబా నాకు సహాయం చేశారు. ఆయన దయతో నేను 10 మాడ్యూల్స్ పాసయ్యాను. మా గ్రూపులో నేను మాత్రమే అన్ని మాడ్యూల్స్ పాసయ్యాను. మిగిలినవాళ్ళు 9, 8 అలా పాసయ్యారు. అంతేకాదు, బాబా దయతో నాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. అలాగే సర్టిఫికెట్ కూడా వచ్చింది. "ధన్యవాదాలు తండ్రీ! దయతో నన్ను తొందరగా శిరిడీకి రప్పించుకోండి. మీకు మాటిచ్చినట్లు పెడా పంచుతాను. నా భార్య తల తిరగడం, డిస్క్ బల్జ్ సమస్యలతో బాధపడుతుంది. తనకి నయం చేసి ఆరోగ్య విషయాలలో, ఉద్యోగ విషయంలో ఎల్లవేళలా ఏ సమస్య లేకుండా రక్షించు తండ్రీ. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai ram
ReplyDeleteOm Sairam 🙏🙏🙏
ReplyDeleteOmsairam omsairam omsairam
ReplyDelete😁😁😁😁😁😁😁😁😁😁😁
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete