సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1538వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • కర్మానుసారం కష్టాలొస్తాయి - బాబా గట్టెక్కిస్తారు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!


సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాననుకున్న నా ప్రతి కోరికా తీరింది, ప్రతి కష్టమూ గట్టెక్కింది. ఇందువల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే, 'సాయి తమ భక్తుల జీవితాలలో ప్రతి క్షణం, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఉన్నారు. అలా ఉన్నారని అనుభూతినిచ్చే  అనుభవాలను పంచుకోవడం వల్ల వాటిని చదివే భక్తుల్లో బాబా సర్వవ్యాపకత్వం, సర్వసమర్ధత్వం మీద విశ్వాసం అంతకంతకు దృడమవుతుంది. అందుకే బ్లాగులో పంచుకుంటాననుకోగానే సాయి మన కోరికలు తీరుస్తున్నార'ని. నేను ఇప్పుడు నన్ను ఎప్పటినుంచో ఆందోళనకు గురిచేసిన సమస్యలు తీరడంతో వాటిని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.


ఈరోజుల్లో చదువు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే! కొన్ని పరిస్థితుల వల్ల మా అక్క బీటెక్ పూర్తి చేయలేకపోయింది. అప్పటినుంచి తనకీ, నాకూ దిగులుగా ఉండేది. కొన్నాళ్ళకు తను ఎలాగైనా డిగ్రీ సంపాదించాలని BA LLBలో చేరింది. ఇంతలో బాబా అనుగ్రహంతో తనకి పెళ్లైంది. పెళ్లి అయ్యాక చదువుకోవడం చాలా కష్టం. సరిగ్గా అక్క పరీక్షల సమయంలో తన అత్తింటిలో ఏదో ఒక ఫంక్షన్ జరగడం, లేకపొతే ఇంకేమైనా పనులు ఉండటం జరుగుతుండేది. వాటివల్ల తను పరీక్షలు బాగా వ్రాయలేకపోయేది. ఫలితంగా పెళ్లికి ముందు అన్నీ సబ్జెక్టులు పాస్ అయ్యే అక్క ఫెయిల్ అయి సబ్జెక్ట్‌లు మిగిలేవి. అంటే ఆ సబ్జెక్టులు మళ్ళీ వ్రాయాలి. అందువల్ల అక్క చాలా ఒత్తిడికి గురైయ్యేది. అదికాక చివరి సెమిస్టర్‌లో కాలేజీవాళ్ళు హాజరు తప్పనిసరి చేసారు. వేరే ఊరిలో ఉండే అక్కకు రోజూ కాలేజీకి వెళ్లాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అందుచేత కాలేజీవాళ్ళతో మాట్లాడితే, "ఖచ్చితంగా కాలేజీకి రావలసిందే, రాకపోతే పరీక్షలు వ్రాయనివ్వమ"ని అన్నారు. అక్క చాలా బాధపడింది. ఒకపక్క సబ్జెక్టులు చాలా ఉన్నాయి, ఇంకోపక్క హాజరు తప్పనిసరి అయింది, మరోపక్క ఇంట్లో పనులు. ఈ పరిస్థితితుల్లో మాకు ఏం చేయాలో అర్ధంకాక అక్క డిగ్రీ పూర్థికాదేమోనని చాలా ఆందోళనగా ఉండేది. అక్కా, నేనూ, "ఎలాగైనా అడ్డంకులన్నీ తొలగి చదువు పూర్తి కావాలి" అని రోజూ బాబాను వేడుకుంటూ ఉండేవాళ్ళము. బాబా మా ఇద్దరి ప్రార్థనలు విన్నారు. ఆయన దయతో సెమిస్టర్ చివరిలో అటెండెన్స్ కంపల్సరీ అన్న నియమాన్ని తొలగించారు. దాంతో ఇబ్బంది లేకుండా అక్కకి హాల్ టికెట్ వచ్చింది. ఒక సమస్య తీరింది. ఇప్పుడు మరో సమస్య ఏమిటంటే, తను అన్నీ సబ్జెక్టులు ఒకేసారి వ్రాయాల్సి ఉండటం. అయితే బాబా ఆశీస్సులతో అక్క 9 పేపర్లు బాగా వ్రాసి, అన్నిటిలో పాస్ అయింది. చివరిగా ఇంకో పరీక్ష మిగిలింది. అది 6 నెలలు తరువాత జరిగింది. బాబా అనుగ్రహంతో అక్క ఆ పరీక్ష కూడా బాగా రాసి పాస్ అయి డిగ్రీ సంపాదించింది. తను అన్నీ పరీక్షలు పాస్ అయ్యి డిగ్రీ తీసుకున్నందుకు తనతోపాటు మేము ఎంత సంతోషపడ్డామో మాటల్లో చెప్పలేము. తృప్తిగా అనిపించింది. నిజానికి ఒకానొక సమయంలో అసలు అక్క డిగ్రీ పూర్తవుతుందా అనిపించింది. అలాంటిది బాబా అనుగ్రహంతో మేము అనుకున్న దానికంటే ముందే అక్క చేతికి డిగ్రీ వచ్చింది. బాబా తన భక్తుల యోగక్షేమాలు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉంటారనేదానికి ఇదే నిదర్శనం.


ఇకపోతే, నేను ఈమద్య నా వృత్తికి సంబంధించిన ఒక పరీక్ష వ్రాసాను. ఆ పరీక్ష సులభమనే ఉద్దేశ్యంతో నేను ఆ పరీక్షకి ప్రిపేర్ అవ్వలేదు. అయితే పరీక్ష ముందురోజు ఎందుకో, "నేను ఏం చదవలేదు, పరీక్ష కఠినంగా ఉంటే ఏం చేయాలి?" అని భయమేసింది. వెంటనే నేను బాబాని తలుచుకొని, "సాయీ! నేను పరీక్ష బాగా వ్రాసి పాసైతే మీ అనుగ్రహం గురించి బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. సాయి అనుగ్రహంతో నేను అనుకున్నట్లే పరీక్ష పేపర్ చాలా తేలికగా వచ్చింది. దానితో నేను ఊపిరి పిల్చుకొని సాయికి కృతజ్ఞతలు చెప్పుకొని పరీక్ష బాగా వ్రాసి పాసయ్యాను. కొన్నిసార్లు నాకనిపిస్తుంది, "బాబానే ప్రతి విషయంలో తమ భక్తులు తమని తలుచుకోవాలని, భారం తమపై వేసి నిశ్చింతగా ఉండాలని ఇలాంటి భయాలు మనకి తెప్పిస్తారేమో!" అని. ఎందుకంటే, నేను ఎప్పుడైనా బాబాకి మ్రొక్కుకుంటే తర్వాత ఏమి జరిగినా ఇంకా బాబా ఇచ్చానుసారంగా జరుగుతుందనే స్థిమితం నాకు వస్తుంది. 


ఒకసారి మా బంధువు ఒకరు నన్ను ఒక సహాయం అడిగారు. అది నా సామర్థ్యానికి మించిన సహాయం, కొంచం బాధ్యతతో కూడిన వ్యవహారం. నిజం చెప్పాలంటే, నేను ఆ సహాయం చేసే స్థితిలో లేను. కానీ నేను ఏదో చేస్తానని ఆ బంధువు నా మీద ఆశ పెట్టుకున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎప్పటిలాగే బాబాకి చెప్పుకొని ఆ సహాయం చేసే ప్రయత్నం చేసాను. అయితే కొంత సమయం గడిచాక ఆ బంధువే "వద్దు, నేనే చూసుకుంటాను" అని చెప్పారు. అప్పుడు నాకు చాలా స్థిమితంగా అనిపించింది ఎందుకంటే, ఆ బంధువు మాకు చాలా దగ్గర వ్యక్తి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదనుకుంటారేమో అని చాలా ఆందోళనకి గురయ్యాను. కాని బాబా అనుగ్రహంతో తనంతటతానే వద్దన్నారు. ఆ బంధువే ఇంకోసారి మా నాన్నని ఇంకో విషయంగా సహాయం అడిగారు. మా నాన్న ఆ సహాయం చేయడానికి ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాలేదు .దాంతో ఆ బంధువు మేము కావాలనే సహాయం చేసే ప్రయత్నం చేయట్లేదనుకుంటారేమో అని నాకు భయమేసి బాబాకి మొరపెట్టుకున్నాను. తరువాత అనుకున్న ఫలితం రాలేదని ఆ బంధువుతో చెపితే, తను అర్థం చేసుకొని మమ్మల్ని తప్పుగా అనుకోలేదు. అంత ఆ సాయినాథుని అనుగ్రహం. కర్మానుసారం కష్టాలొచ్చినప్పటికీ బాబా ప్రతి నిమిషం మనతో ఉండి వాటిల్లో నుండి మనల్ని గట్టెక్కిస్తారు. 


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sai Sri Sai Jaya jeya sai

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo