సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1548వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీయాత్రలోని చిన్ని చిన్ని అనుభూతులు 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు కుమారి. ఈ మధ్యనే ఒక అక్క నాకు ఈ బ్లాగ్ గురించి చెప్పింది. తన వల్లనే నేను ఈ బ్లాగుకు సంబంధించిన గ్రూపులో చేరే అవకాశం నాకు వచ్చింది. తనకు నా కృతజ్ఞతలు. బాబా దయతో నేనిప్పుడు మొదటిసారి నా అనుభవాలు మీ అందరితో పంచుకుంటున్నాను. అవి చిన్న అనుభవాలే అయినా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.


2022, అక్టోబరులో విజయదశమి ముందురోజు నేను ఒక షాపుకు వెళ్ళినప్పుడు ఎవరో తెలియని ఒక ఆవిడ, "మేము శిరిడీ వెళ్ళొచ్చాము. ఈ ఊదీ తీసుకో. అందరికీ పంచగా మిగిలిన చివరి ప్యాకెట్ ఇది" అని నాకు ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసి నా కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత బాబా దగ్గరకి వెళ్లి ఆయన ముందు నిల్చొని, "వచ్చే విజయదశమి నాటికల్లా నేను శిరిడీ వెళ్ళాలి" అని బాబాకి చెప్పుకున్నాను. నిజానికి నేను ఉన్న పరిస్థితుల్లో శిరిడీ వెళ్లడానికి కుదరదు. కానీ బాబా నా కోరిక తీర్చారు. 2023, ఏప్రిల్ 27న శిరిడీ వెళ్లే అవకాశం నాకు వచ్చింది. అయితే మా ఫ్యామిలీతో కాదు, వేరే ఆంటీవాళ్ళ ఫ్యామిలీతో. మా ఫ్యామిలీతో కాకుండా వేరే వాళ్ళతో వెళ్లడం నా జీవితంలో ఇదే మొదటిసారి. నిజానికి ఆ సమయంలో నా దగర డబ్బులు లేవు. అంటీవాళ్లు డబ్బులు గురించి తర్వాత చూసుకుందాం అన్నారు. నేను సరేనని బాబా మీద భారం వేసాను. ఆయన అద్భుతం చూపారు. శిరిడీ వెళ్ళడానికి రెండు వారాల ముందు నా బ్యాంకు పుస్తకంలో డబ్బులుండటం చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే, నేను ఆ బ్యాంకు పుస్తకం మూడు సంవత్సరాలుగా ఉపయోగించలేదు. అందులో డబ్బులున్నట్టు నాకు అస్సలు గుర్తులేదు. అంతా బాబా దయ అనుకొని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చాను.


తరువాత శిరిడీ ప్రయాణం రేపనగా నాకు ఒక పెద్ద సమస్య వచ్చి శిరిడీ వెళ్ళలేనేమోనని చాలా బాధపడ్డాను. ఏమి చేయాలో తెలియక బాబా మీద భారం వేశాను. బాబా నా శిరిడీ  ప్రయాణం ఆగిపోకుండా చూసారు. బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని సంతోషంగా ట్రైన్ ఎక్కాను. తరువాత ఫోన్‌లో ఈ బ్లాగు ఓపెన్ చేసి ఒక భక్తురాలి ఐదు శిరిడీ అనుభవాలు చదివి, "నాకు ఒక అనుభవం జరిగినా చాలు. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని మనసులో 'ఆరతి చూడాలి, సమాధి మీద పువ్వులు నాకు కావాలి' అని పదేపదే బాబాను అడిగాను.


శిరిడీ చేరుకున్నాక దూళి దర్శనంకు వెళ్ళినప్పుడు బాబాను చూసి నాకు మాటలు రాలేదు. నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. ఆ క్షణం నాకు కలిగిన అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. అయితే అప్పుడు నాకు సమాధి మీద పువ్వు లభించలేదు. తర్వాత ద్వారకామాయికి వెళ్ళాను. అక్కడ బాబా పాదాల వద్ద ఒక పసుపు గులాబీ ఉంది. దాన్ని ఎవరూ తీసుకోకపోవడం చూసి అది నా కోసమేననిపించి తీసుకున్నాను. సమాధి మందిరంలో బాబా సమాధి మీద పువ్వు లభించకపోయినా ఇలా దొరికిందని చాలా సంతోషపడ్డాను.


తరువాత దర్శనానికి వెళ్ళినప్పుడు గురుస్థాన్ వద్ద నాతో వచ్చిన చెల్లికి వేపాకులు దొరికాయి. కానీ నాకు దొరకలేదు. అప్పుడు నేను బాబా చేతుల మీదగా తీసుకోవాలని అనుకున్నాను. కాసేపటికి అక్కడున్న ఒక పెద్దాయన అందరికీ వేపాకులు ఇస్తూ నాకు కూడా ఇచ్చారు. ఆయన రూపంలో బాబానే ఇచ్చారని ఆనందపడ్డాను. ఆ తర్వాత నేను మరోసారి ప్రయత్నం చేస్తే నాకు కూడా వేపాకులు దొరికాయి.


తరువాత నందదీపం, బాబా భక్తుల సమాధులు, అక్కడ ఉండే టెంపుల్స్, బావి చూశాక  పారాయణ హల్ కనిపించింది. నేను నాతో వచ్చిన వాళ్ళతో ఎక్కువసేపు అంటే వద్దంటారేమోనని ఒక 5 నిముషాల్లో వచ్చేస్తానని చెప్పి పారాయణ హాలులోకి వెళ్ళాను. వాళ్ళు కూడా నాతో లోపలికి వచ్చి 30 నిముషాలు ఉన్నారు. నేను చాలా చాలా ఆనందపడిపోయాను. నిజానికి నేను ఇంటి వద్ద పారాయణ హాల్లో పారాయణ చేయాలి, కానీ చేయగలుగుతానో, లేదో అనుకున్నాను. ఆ విషయాన్నీ నేను మరిచిపోయానా బాబా మర్చిపోకుండా నా చిన్న కోరికను తీర్చారు.


మరుసటిరోజు మేము ఆరతికి వెళదామని సంధ్య ఆరతి సమయానికి ముందు క్యూలైనులోకి వెళ్ళాం. మాకు ఆరతికి లోపలుండే అవకాశం రాలేదుగానీ 5.30 నుండి 6 వరకు అంటే అరగంటపాటు సమాధి మందిరంలో బాబాను దర్శించుకొనే భాగ్యం దక్కినందుకు చాలా చాలా సంతోషమేసింది. బయటకి వచ్చేముందు బాబా సమాధి అరుగును క్లీన్ చేస్తున్నారు. అప్పుడు బాబా పాదాలు మీద కొన్ని పువ్వులు ఉంటే అవి నాకోసమే అని తీసుకున్నాను. కానీ సమాధి తాకే అవకాశం కలగనందుకు బాధపడ్డాను. తరువాత కిటికీ గుండా బాబా ముఖదర్శనమయ్యే చోటకి వెళ్ళి బాబాని చూస్తూ ఆరతి పాడుకున్నాను. మాటల్లో చెప్పలేని అనుభూతది. ఆరతి అనంతరం బాబాకి నివేదించిన ప్రసాదం మాకు లభించింది.


బాబా దయతో మా శనిసింగణాపూర్, నాశిక్ యాత్రలు బాగా జరిగాయి. మేము సోమవారం, ఏకాదశిరోజున నాశిక్ దర్శించాము. అది బాబా చేసినా మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే, మేము అక్కడికి ముందురోజు వెళ్ళాలనుకుంటే మరుసటిరోజు వెళ్లేలా బాబా చేశారు.


శిరిడీలోని చివరిరోజు ఈరోజు అయినా బాబా సమాధి తాకాలనుకున్న నాకు బాబా దయతో ఆ అదృష్టం నాకు లభించేసరికి కలో, నిజమో నాకే తెలియలేదు. అక్కడున్న పూజారిగారు నేను అడగగానే సమాధి మీద పువ్వులు నాకిచ్చారు. ఒక్కసారి దొరికితే చాలు అనుకున్న నాకు బాబా రెండుసార్లు పువ్వులు ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి ఈ జన్మకు?


నేను ఎప్పటినుండి ధునిలో కొబ్బరికాయలు వేయాలని అనుకుంటున్నప్పటికీ అది ఎలా అన్నది నాకు తెలీదు. నాతో వచ్చినా వాళ్ళకి కూడా దాని గురించి తెలియదు. చివరిరోజు మేము ద్వారకామాయి ఎదురుగా ఉన్న షాపులో షాపింగ్ చేస్తున్నప్పుడు నాకు ద్వారకామాయి లోపలికి వెళ్లాలనిపించి నాతో ఉన్న ఆంటీవాళ్ళని అడిగితే, "వద్దు. జనాలున్నారు" అన్నారు. కానీ నాకు వెళ్ళాలని బాగా ఉండింది. చాలాసేపటి తర్వాత నాతో వచ్చిన తముడు, "అక్కా! ద్వారకామాయిలో జనాలు తగ్గారు. ఇప్పుడు వెళ్ళు" అన్నాడు. నేను సరేనని వాళ్ళెవరూ రాకపోయినా ఒక్కదాన్నే ద్వారకామాయి లోపలికి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటకి వస్తున్నప్పుడు అక్కడ ధునికోసం కొబ్బరికాయలు వేయడానికి పెద్ద బాక్స్ ఉండటం, ఎవరో వేస్తుండటం చూసి 'ఇప్పుడేగా ఆ పక్కనుంచి వెళ్ళాను. కానీ ఆ బాక్స్‌ని చూడలేద'ని షాకయ్యాను. వెంటనే నేను ఆ బాక్స్‌‌లో కొబ్బరికాయ వేయాలని అనుకున్నాను. కానీ మళ్ళీ అంతలోనే ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కడుంటాయో అనిపించింది. చూస్తే, నేను ఉన్న చోటుకి ఎదురుగానే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. వెంటనే కొన్ని కొబ్బరికాయలు తీసుకొని అక్కడున్న బాక్స్‌లో వేసి చాలా సంతోషంతో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలా తిరుగు ప్రయాణమయ్యేముందు ద్వారకామాయికి వెళ్ళడం, ధునిలో కొబ్బరికాయలు వేయడం అనుకోకుండా జరిగాయి. నేను మర్చిపోయినా నా ఈ చిన్న కోరికను కూడా బాబా తీర్చారు.


తరువాత మేము శిరిడీ నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. మరుసటిరోజు మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ ఉండటంతో మేము పెద్దమ్మతల్లి గుడికి వెళ్ళాలనుకున్నాము. అయితే ట్రాఫిక్ వల్ల మేము గుడికి వెళ్లేసరికి ఆలస్యమవ్వడంతో గుడి మూసేస్తారని అన్నారు. అప్పుడు నేను, "బాబా! అప్పుడే గుడి మూసేయకుండా ఉండి మేము అమ్మవారి దర్శనం చేసుకుంటే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల గుడి మూయలేదు. మాకు అమ్మవారి దర్శనమైంది.


నేను శిరిడీ వెళ్ళేముందు మళ్ళీ ఎప్పుడు వెళ్తానో, కనీసం నాకు ఒక పది ప్యాకెట్ల ఊదీ లభించాలని అనుకున్నాను. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే శిరిడీలో నాకు ఏడు ఊదీ ప్యాకెట్లే లభించాయి. సరేలే పాతవి ఒక రెండు ఉన్నాయి కదా! నలుగురికి నాలుగు ప్యాకెట్లు ఇచ్చేస్తే నాకు 5 ఉంటాయి అనుకున్నాను. అయితే బాబా లీల చూడండి. నేను ఎవరితో వెళ్లానో ఆ ఆంటీ ఫోన్ చేసి, "నీకు ఒక 5 పాకెట్లు ఊదీ ఇవ్వనా? సరిపోతాయా?" అని అన్నారు. నేను సరేనన్నాను. నా దగర మిగిలినవి 5, ఆంటీ 5 ప్యాకెట్లు ఇచ్చారు. మొత్తం 10  ప్యాకెట్లు. అంటే శిరీడీ వెళ్లేముందు నేను ఎన్ని అనుకున్నానో అన్ని ప్యాకెట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అంతా బాబా దయ.


చివరిగా ఇంకో అనుభవం, 2023, ఫిబ్రవరిలో నా చెల్లికి పెళ్లైంది. అప్పుడు నేను బాబా ఫొటో ఒకటి తనకి కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. ఆ ఫోటో కూడా శిరిడీ నుండి వచ్చినదై ఉండాలని నా ఆశ. కానీ ఆ సమయంలో అది కుదరలేదు. అయితే నేను అస్సలు అనుకోకపోయినా తరువాత నేను శిరిడీ వెళ్లి, నా చేతులతో ఫోటో తీసుకొచ్చి మా చెల్లివాళ్ళకి ఇచ్చాను. మా చెల్లి చాలా చాలా ఆనందించింది. అంతా బాబా దయ.


"అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఇంతకన్నా ఏమి చెప్పను బాబా? నేను చాలా సమస్యల్లో ఉన్నానని మీకు తెలుసు. వాటినుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి బాబా. మాకు మీరు తప్ప ఎవరూ లేరు సాయీ. మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా మీరే చూసుకోవాలి సాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. కాస్త ఆలస్యమైనా మాకు ఏది మంచిదో అది చేస్తారు మీరు. ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయి ఉన్నా, తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు బాబా. అలాగే మరికొన్ని అనుభవాలు పంచుకొనే అవకాశం ఇవ్వండి బాబా. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉండి రక్షించు సాయిబాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


12 comments:

  1. Om Sai Sri Sai Jai Sai Jai Sai

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  6. Om sai ram 🙏🙏🙏

    ReplyDelete
  7. om sai ram🙏🙏🙏

    ReplyDelete
  8. Click here to , check answers by sai baba satcharitha
    https://saibabaspeaks.com - ASK SHIRDI SAI BABA

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo