సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 121వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. 'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు
  2. కడుపునొప్పి తగ్గించిన బాబా

'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు

జై సాయిరామ్! నా పేరు వల్లంకొండ మహేశ్వరి. మాది రాజమండ్రి. నేనిప్పుడు మీతో నాకు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకుంటాను. సాయిభక్తుల కోసం బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదములు.

మొదటి అనుభవం:

ఒకప్పుడు మేము గృహనిర్మాణం చేస్తున్నాము. ఆ నిర్మాణం జరుగుతున్నచోటే నేను కూర్చుని ప్రతిరోజూ సచ్చరిత్ర పారాయణ చేస్తుండేదాన్ని. పారాయణ పూర్తయ్యాక అన్నదానం చెయ్యాలి కదా! గురువారంనాడు ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుడి వద్ద ఉండే బిచ్చగాళ్ళకు ఏదైనా ఇద్దామని అనుకున్నాను. అయితే ఆరోజు ఉదయం నాకు ఇంటివద్ద పనులు ఉండి గుడికి వెళ్ళడం కుదరలేదు. సాయంత్రం గుడికి వెళితే ఒక్క బిచ్చగాడు కూడా లేడు. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. గుడిలోకి వెళ్లి భజనలో కూర్చున్నాను. కానీ, 'బిచ్చగాళ్ళకి డబ్బులు ఇద్దామనుకుంటే ఎవరూ లేరే' అని లోలోపల బాధపడుతున్నాను. ఈ లోపల ఒక ముసలాయన వచ్చారు. ఆయన మురికిబట్టలతో బిచ్చగాడిలాగానే ఉన్నారు. కానీ గుడి లోపలకి బిచ్చగాళ్ళు రారు కదా! ఒకవేళ ఆయన బిచ్చగాడు కాకపోతే, నేను డబ్బులిస్తే బాధపడతారేమోనని సందిగ్ధంలో పడ్డాను. ఇంతలో అతను అందరివద్ద చేయి చాచి అడుగుతున్నారు. నేను గబగబా లేచి డబ్బులిచ్చి అన్నం తినమని చెప్పాను. కానీ నేను పిచ్చిదాన్ని, మనసులో నేను అనుకున్నవన్నీ కళ్ళముందే జరుగుతుంటే ఆయన బాబాయే అయివుంటారని నాకు అర్థం కాలేదు. తరువాత అంతా గుర్తు చేసుకుంటే ఆయన్ని గుర్తుపట్టలేకపోయానని చాలా బాధవేసింది. ఆయనే వచ్చి నా సంకల్పాన్ని నెరవేర్చారు. ఎంతటి భాగ్యం నాది!

రెండవ అనుభవం:

2016లో మేము శిరిడీ వెళ్లి నాలుగురోజులు అక్కడ ఉన్నాము. తిరుగుప్రయాణమయ్యే ముందు మళ్ళీ ఒకసారి ముఖదర్శనం చేసుకోవడానికి వెళ్లి అక్కడ కూర్చున్నాం. అప్పుడే మధ్యాహ్న ఆరతి పూర్తై ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. మా వారికి బాగా చెమటలు పడుతున్నాయి. ఒకతను వచ్చి అక్కడున్న స్విచ్చులన్నీ ఆన్ చేశారు, కానీ ఫ్యాన్ తిరగలేదు. కాసేపటికి తెల్లని దుస్తులు ధరించిన ఒకాయన మా వైపే వస్తుండటం నేను చూసాను. ఆయన చూడటానికి అచ్చం సాయిబాబాలాగానే అనిపించారు. ఆయన్ని చూస్తుంటే నమస్కారం పెట్టాలనిపించింది. కానీ ఏదో తెలియని సందిగ్ధంలో ఆగిపోయాను. అయితే ఆయన నన్ను చూసి నమస్కారం పెట్టారు. మేము ఉన్న చోటకి వచ్చి స్విచ్ ఆన్ చేసారు. వెంటనే ఫ్యాన్ తిరిగింది. నేను నిజంగా ఆయన సాయిబాబాయే అనుకున్నాను. లేకపోతే నేను మనసులో నమస్కరించాలనుకుంటే ఆయనకు ఎలా తెలిసింది? ముందు ఒకతను అన్ని స్విచ్చులు వేసినా తిరగని ఫ్యాన్ ఈయన ఒక్క స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరిగింది, ఇదెలా సాధ్యం? బయటకి వచ్చాక మావారితో, మా అమ్మాయితో ఈ విషయం చెప్తే, వాళ్ళు మేము ఎవరినీ చూడలేదు అన్నారు. పైగా నేను చూపించలేదని మావారు నామీద కోపగించుకున్నారు.

మూడవ అనుభవం:

బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో శిరిడీలో సేవ చేసుకునే భాగ్యాన్ని బాబా నాకిచ్చారు. అప్పుడొకరోజు మా సేవ పూర్తి చేసుకుని, ఆ పరిసరాలలో తిరుగుతూ అంతా చూశాము. కిటికీ గుండా బాబా కనిపించేచోట సాయంత్రం మేమంతా కూర్చున్నాం. అందులో ఒకామె నాతో, "మీరు పాటలు పాడుతారు కదా! ఒక పాట పాడండి" అని అడిగింది. జనం చాలామంది ఉన్నందున నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా పాడటం మొదలుపెట్టాను. అయితే నా స్వరం కాస్త చిన్నగా ఉండటంతో వాళ్ళకి వినిపిస్తుందో లేదోనని బాధపడ్డాను. ఇంతలో గుంపుగా కూర్చుని ఉన్న అందరినీ దాటుకుంటూ ఒక కుక్క నా వద్దకు వచ్చి నా ఒడిలో తలపెట్టి పడుకుంది. అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. నేను మూడు పాటలు పాడాను. అంతసేపూ ఆ కుక్క నా ఒడిలోనే కళ్ళు మూసుకుని, చెవులు పైకి పెట్టి వింటూనే ఉంది. 'బాబాయే ఆ రూపంలో వచ్చి నా పాటలు వింటున్నారా' అని అనిపించి నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 'ఎంతటి భాగ్యమ'ని మా వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మేము గదులు చేరుకున్నాక కూడా మా వాళ్ళంతా అదే విషయాన్ని నెమరువేసుకుంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేసారు.

కడుపునొప్పి తగ్గించిన బాబా

హైదరాబాదునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. ఇటీవల ఒకసారి మా అబ్బాయి కడుపునొప్పితో నాలుగు రోజులు బాధపడ్డాడు. ఆ బాధ తట్టుకోలేక వాడు ఏడుస్తూ ఉండేవాడు. మేము డాక్టరుని సంప్రదించి ఆయనిచ్చిన మందులు వాడుతున్నా, అప్పుడప్పుడు నొప్పి వస్తుండేది. తననలా చూడలేక నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు ఉదయం తను కడుపునొప్పి అంటూ నిద్రలేచాడు. మందులు వేసుకున్న ఒక గంట తరువాత కూడా నొప్పి అలానే ఉంది. నేను, "బాబా! తన కడుపునొప్పిని తొలగించండి. రాత్రి వరకు తనకి నొప్పి రాకపోయినట్లైతే నేను ఈ అనుభవాన్ని ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపవలన రాత్రి వరకు తనకు కడుపునొప్పి రాలేదు. తను హాయిగా నిద్రపోయాడు. "బాబా! మీ కృపకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి నాకు మంచి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి. మా వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చేలా చేసి మా ఆర్థిక సమస్యలను తొలగించండి".

ఓం శ్రీ సాయినాథాయ నమః.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2320.html

సాయి అనుగ్రహసుమాలు - 80వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 80వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 143

నీలకంఠరావు అలియాస్ బాబా సాహెబ్ సహస్రబుద్దే గారు 12-3-1910 తారీఖు శిరిడీ నుండి కాకాసాహెబ్ కు ఆంగ్లంలో వ్రాసిన ఉత్తరానికి అనువాదం:

శిరిడీ నుండి బయలుదేరడానికి అనుమతి నాకు ఇంకా ఎందుకు లభించలేదో, ఆ చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. కర్టిస్ సాహెబ్ (ఆ రోజులలో మధ్య భారత కమిషనర్), వారి పత్ని మిసెస్ కర్టిస్, మెక్ లీన్ సాహెబ్ (నేటివ్ అసిస్టెంట్) వగైరా మండలి 10వ తారీఖు ఉదయం ఇక్కడకు వచ్చారు. వారు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అసలు లేదు. బహుశః, వారి రాకకు కారణం మేము ఇక్కడ రాజకీయాలలో మునిగి తేలుతున్నామేమో తెలుసుకోవడానికి వచ్చినట్లు ఉంది. కారణం, వీరు రాక ముందు బాబా ఉన్నట్టుండి కోపోద్రిక్తులై తమ కఫ్నీని పైకెత్తి “ఏం చూడాలి. నేను ఒక ఫకీరుని. నా వద్ద ముందర....., వెనుక... ఉన్నాయి” అని అన్నారు. ఎప్పుడైతే ఈ మండలి వచ్చిందో, అప్పుడు బాబా మాటలలోని అర్థం బోధపడింది. బాబాను కలవాలనే కోరికతో వచ్చినా, వారి అధికారగర్వం వలన, చివరకు బాబాను కలవకుండానే వెళ్ళిపోయారు.

ఎప్పుడైతే ఈ మండలి వచ్చిందో, ఆ సమయానికి శ్రీ బాలాసాహెబ్ భాటేగారు ఇంట్లో ఉన్నారు. “చావడికి వచ్చి కలవాల్సిందిగా" శ్రీ జోగ్లేకర్ గారి వద్దనుండి శ్రీ బాబాసాహెబ్ కు సందేశం వచ్చింది. బాబాసాహెబ్ ఆ సందేశాన్ని పట్టించుకోలేదు, అయినప్పటికీ నేను చెప్పడం వలన శ్రీ జోగ్లేకర్ స్వయంగా బాలాసాహెబ్ గారింటికి వచ్చారు. తరువాత మేమందరం చావడికి వెళ్ళాము. కర్టిస్ సాహెబ్ మరియు మెక్ లీన్ సాహెబ్ నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు జవాబులు ఎంత సమాధాన పూర్వకంగా జరిగాయంటే, వెళ్ళేటప్పుడు బాబాకు ఇవ్వడానికి ఇద్దరు సాహెబ్లు నాకు రూ. 5/- చొప్పున ఇచ్చారు. శ్రీ జోగ్లేకర్ గారు  రూ. 2/- ఇచ్చారు. మొత్తం కలిపి రూ.12/- ఇచ్చారు. మొదట బాబా ఆ దక్షిణను తీసుకోవడానికి తిరస్కరించారు. కానీ తరువాత తీసుకొని, ఆ డబ్బులను సమీపంలో కూర్చొన్న ఒక పేదవానికి ఇచ్చేసారు. ఆ రోజు సాయంకాలమే నేను శ్రీ జోగ్లేకర్ గారికి పెద్ద ఉత్తరం వ్రాసాను. తరువాత నాకు కమీషనర్ సాహెబ్ యొక్క ఆఫీసులోని ఒక గుమస్తా నుండి తెలిసిన విషయం ఏమిటంటే ఆ ఉత్తరం శ్రీమతి కర్టిస్ కు ఎంతో నచ్చి, ఆ ఉత్తరాన్ని ఆమె దాచుకుంది అని! ఈ రోజు శ్రీమతి కర్టిస్ కు చూపించమని శ్రీ జోగ్లేకర్ కు ఇంకో ఉత్తరం వ్రాస్తున్నాను. ఆ ఉత్తరాన్ని శ్రీ బాలాసాహెబ్ భాటేకు చూపించాను. మొత్తానికి అంతా ఎంతో సమాధానపూర్వకంగా జరిగింది. ఇక్కడ ఏం లభిస్తుందో, దానిని ఎలా లభ్యం చేసుకోవాలో ఇప్పుడు ఆ సాహెబ్ కు మరియు ఆయన శ్రీమతికి అర్థమైంది. ఈరోజు ఉదయం ఇంకొక ఉత్తరాన్ని పంపించడానికి అనుమతి కోసమై నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు, బాబా నా శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి, నాకు విశేషమైన ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. 

పై ఉత్తరానికి సంబంధించి మాకు (సాయిలీల ప్రచురణ కర్తలకు) బాబాసాహెబ్ ద్వారానే క్రింది విధంగా ఇంకొన్ని వివరాలు తెలిసాయి:

ఈ సర్వమండలి ఏ చావడిలో అయితే బాబా నిద్రించేవారో ఆ చావడిలో బసచేసారు. వీళ్ళు వచ్చిన సమాయానికి బాబా ముఖం కడుక్కుంటున్నారు. ఆ తరువాత బాబా తమ రోజువారి కార్యక్రమం ప్రకారం భిక్షకు బయలుదేరారు. బాబా చావడి ముందుకు రాగానే, శ్రీమతి కర్టిస్ చావడి నుండి దిగి వచ్చి, గౌరవపూర్వకంగా బాబా వద్దకు వచ్చి, వారి సాంప్రదాయం ప్రకారం చేతులు జోడించి “మీతో మాట్లాడాలి” అని బాబాతో చెప్పింది. అప్పుడు బాబా “అర్థగంట ఆగు” అని చెప్పారు. భిక్ష పూర్తయ్యాక బాబా తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీమతి కర్టిస్ పైన చెప్పిన విధంగానే మరలా వచ్చి అడిగింది. “ఒక గంట ఆగు” అని బాబా చెప్పారు. అది బాబా అల్పాహారం తీసుకునే సమయం. కానీ వారి వద్ద సమయం ఎక్కువ లేకపోవడంతో బాబాను కలవకుండానే వారు ముందుకు కదలిపోయారు. పైన వివరించిన రూ.12/- లను బాబాసాహెబ్ ఎప్పుడైతే బాబా ముందర ఉంచారో, అప్పుడు బాబా "సాహెబ్ ఇచ్చిన దక్షిణ రూ. 30/- లు” అని అన్నారు. కానీ బాబాసాహెబ్ కు, కర్టిస్ సాహెబ్ నుండి వచ్చింది కేవలం రూ.10/-లు. దాంతో బాబా మాటలకు బాబాసాహెబ్ విస్మయానికి గురయ్యాడు. “బాబా మాటలు ఎన్నడూ వృథా కావు” అని తనకు కచ్చితంగా తెలుసు. చివరకు ఆ విషయం గురించి విచారణ చేయగా చావడిలో వారి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిసింది. కర్టిస్ సాహెబ్ బాబాకు దక్షిణగా ఇవ్వడానికి మొదట కేవలం రెండు రూపాయలను మాత్రమే బయటకు తీసారు. అప్పుడు శ్రీమతి కర్టిస్ మీ “అధికార యోగ్యతను బట్టి మీరు కనీసం రూ.25/- లు ఇవ్వాలి” అని చెప్పారు. అలా చూసినప్పుడు కర్టిస్ సాహెబ్ది రూ.25/ -లు మరియు మెక్ నీల్ సాహెబ్ ది రూ. 5/-లు మొత్తం కలిసి రూ. 30/- లు. ఆ విధంగా సంభాషణ జరిగిందని బాబా తమదైన శైలిలో వివరించారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 120వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.
  2. ఊదీతో కంటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం

మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.

సాయిభక్తుడు వై. శ్రీనివాసరావుగారు తమ రీసెంట్ అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఇదివరకు నేను బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన అనుభవం గురించి తెలియజేస్తాను. నా జీవితంలో శ్రీసాయిబాబా మాకు చేసిన మేలు, ఆ తండ్రి మాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతగా ఆదుకుంటున్న ఆ తండ్రిని నేను గుర్తించలేకపోవడం నా లోభత్వమని ఇదివరకే ఒక అనుభవంలో ప్రస్తావించాను. పదిరోజుల క్రితం పంచుకున్న నా గత అనుభవం చివరలో, "నా పెద్ద కుమారునికి త్వరగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా!" అని వేడుకున్నాను. ఆయన ఎంత త్వరగా అనుగ్రహించారంటే. ఆ అనుభవం బ్లాగులో పబ్లిష్ అయిన మూడురోజుల్లోనే!

మా అబ్బాయి బి.టెక్(మెకానికల్ ఇంజనీరింగ్) పూర్తిచేశాడు. 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే తనకి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అది తను చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించి కాకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అందువలన మా అబ్బాయి, "నేను చదువుతున్న కోర్సుకి సంబంధించిన ఉద్యోగం చేయడం నాకిష్టమ"ని చెప్పి ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. తరువాత తను బి.టెక్ పూర్తిచేసి కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. తను హాజరైన ప్రతీ ఇంటర్వ్యూలో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. కానీ ఏదో ఒక కారణంచేత ఉద్యోగం వచ్చేది కాదు. అందువలన మా అబ్బాయి చాలా దిగులుపడేవాడు. మేము, "బాబాను నమ్ముకో, ఆయన నీకు మంచి చేస్తార"ని తనకి ధైర్యం చెప్పేవాళ్ళం. నేను, నా భార్య పద్మావతి బాబా మందిరానికి వెళ్లి, "మా అబ్బాయి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి బాబా! ఈ విషయమై మేము 'నవగురువారవ్రతం' మొదలుపెడతాము. ఆ వ్రతం పూర్తయ్యేలోగా తనకి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా!" అని వేడుకున్నాము. తరువాత నేను, నా భార్య వ్రతాన్ని మొదలుపెట్టాము. అలా ఉండగా ఒకరోజు నేను ఉద్యోగ విషయమై బాబాని ప్రశ్నలు&సమాధానాలు సైట్ లో అడిగాను. అప్పుడు బాబా నుండి "బిడ్డని తీసుకుని శిరిడీ వెళ్లి దర్శనం చేసుకుంటే తనకి ఉద్యోగం ప్రసాదిస్తాను" అని సమాధానం వచ్చింది. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. అంతకుముందు మేము శిరిడీ వెళదామని రెండు, మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక అవాంతరం ఏర్పడి వెళ్లలేకపోయాము. కానీ ఇప్పుడు బాబా పిలుపుతో అప్పటివరకు దొరకని రానూపోనూ ట్రైన్ టికెట్స్ దొరికి నేను, మా అబ్బాయి శిరిడీ వెళ్ళాము. బాబా మూడుసార్లు తమ దర్శనం ప్రసాదించడంతోపాటు సంధ్య ఆరతి చూసే భాగ్యం కూడా మాకిచ్చారు. శిరిడీ వెళ్లి వచ్చిన తరువాత గతంలో హాజరైన ఒక కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకు రమ్మని మెయిల్ చేశారు. 22.07.2019న మా అబ్బాయి ఆ ఇంటర్వ్యూకి హాజరవగా, దానిలో మావాడు సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. మా వ్రతంలో ఇంకా రెండువారాలు ఉండగానే బాబా అనుగ్రహాన్ని మాపై కురిపించారు. ఇష్టపడ్డ ఉద్యోగం రావడంతో మావాడు, మేము చాలా చాలా సంతోషించాము. ఇంతగా మాకు అండగా ఉంటూ అవసరంలో ఆదుకుంటున్న నా తండ్రి బాబాకు ఏమిచ్చి కృతజ్ఞతలు తెలుపుకోగలము, జీవితాంతం ఆ తండ్రిని కొలవడం తప్ప! "బాబా! మీ చల్లని చూపు మా అందరిమీద ఉంచి, మా పిల్లల భవిష్యత్తు బాగుండేటట్లు, బంధుమిత్రులందరూ బాగుండేటట్లు ఆశీర్వదించండి తండ్రీ!"

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

ఊదీతో కంటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం

బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబాకు అంకిత భక్తురాలిని. ఆయనపై నాకు అపారమైన నమ్మకం. నా ప్రియమైన సాయి నాకు అనేక అద్భుతమైన అనుభవాలనిచ్చారు. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

ఒకరోజు ఉదయం నిద్ర లేచాక నా రెండు కళ్ళు ఎర్రగా ఉండటం గమనించాను. కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది. బహుశా కళ్ళకి ఇన్ఫెక్షన్ సోకిందేమో అనుకున్నాను. కానీ ఆరోజు ఆఫీసులో ముఖ్యమైన పని ఉండటం వలన సెలవు తీసుకునే అవకాశం కూడా లేదని చాలా బాధపడ్డాను. వెంటనే, "బాబా! నా కంటి ఇన్ఫెక్షన్‌ను నయం చేయండి. మీ కృపవలన నాకు ఉపశమనం లభిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి కళ్ళపై ఊదీ రాసుకున్నాను. తరువాత ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతున్నాను. అంతలోనే బాబా దయతో కళ్ళ ఎర్రదనం తగ్గడం ప్రారంభమైంది. ఆఫీసు చేరుకునేసరికి చాలావరకు ఉపశమనంగా అనిపించింది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆఫీసు పని చేసుకోగలిగాను. తరువాత ఐ డ్రాప్స్ కూడా వేసుకోవడం మొదలుపెట్టాను. కంటి ఇన్ఫెక్షన్ సాధారణంగా 5 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. కానీ కేవలం రెండు రోజుల్లో నాకు పూర్తి ఉపశమనం లభించింది. రెండు రోజులలో నయం కావడం అసాధ్యమైనప్పటికీ సాయి ఆశీస్సులతో సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ! దయచేసి మా కుటుంబం మీద, మీ భక్తులందరి మీద మీ దీవెనలు సదా కురిపించండి".

సాయి అనుగ్రహసుమాలు - 79వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 79వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 142

శ్రీ గణేశ్ బాలాజీ దేశ్ పాండే గారి అనుభవం.

నాసిక్ కు చెందిన శ్రీ భావుసాహెబ్ ధుమాళ్ గారు (అడ్వకేట్), బాబాకు ఎప్పటినుంచో ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన భక్తులు. ఆయన గుమస్తా శ్రీ గణేష్ బాలాజీ దేశపాండే గారికి శ్రీ భావుసాహెబ్ వలన బాబాపై పూర్ణశ్రద్ద కుదిరింది. 1921వ సంవత్సరం నుండి బాబా చిత్రపటానికి భక్తితో పూజ చేయసాగారు. దేశ్ పాండే శిరిడీకి ఎప్పుడూ వెళ్ళలేదు. గత సంవత్సరం నుండి శ్రీ దేశ్ పాండే భార్యకు కడుపునొప్పి బాగా బాధించసాగింది. ఎన్నో ఔషధాలు ఉపయోగించారు. కానీ, ఏ మాత్రం గుణం కనపడలేదు. ఆ విధంగా ఆమె తొమ్మిది నెలలు బాధపడింది. భావుసాహెబ్ కు ఈ విషయం తెలియగానే, శ్రీ భావుసాహెబ్ తన గుమస్తాకు అన్ని ఔషధాలను ఆపివేయమని చెప్పి, బాబా ఊదీని మాత్రమే తీసుకుంటూ కడుపునొప్పి తగ్గగానే, బాబా దర్శనానికి వస్తానని మొక్కుకోమని చెప్పారు. శ్రీ దేశ్ పాండే ఆ విధంగానే చేసారు. చమత్కార మేమిటంటే ఊదీ పెట్టినప్పటి నుండి ఆమె కడుపునొప్పి తగ్గిపోయింది. దేశ్ పాండే  ఈ మధ్యనే శిరిడీకి వచ్చి తమ మొక్కు తీర్చుకొని వెళ్ళారు.

శ్రీ మాధవరావు దేశ్ పాండే గారు శ్రీ హరి సీతారాం దీక్షిత్  కు 15-11-1910న వ్రాసిన ఉత్తరం.

చరణ సేవకుని యొక్క శిరఃసాష్టాంగ నమస్కారములు. శ్రీ సమర్థ కృప వలన ఇక్కడ చిన్నా, పెద్ద అందరూ కుశలము. శ్రీ సమర్థ ఆరోగ్యంగా ఉన్నారు. శ్రీ సమర్ధుని కాలిన చేయ్యి ఇప్పుడు బాగవుతూ రాసాగింది. ప్రస్తుతం కాలినచోట తడారిపోయింది. ప్రతిరోజు ఆనందంగా ఉంటున్నారు. మీ ఉత్తరం నిన్ననే చదివి వినిపించి, మీ నమస్కారం తెలియచేసాను. శ్రీ సదాశివరావు గారి శ్రీమతి గురించి తెలియచేసాను. కాని “ఇదంతా ఆ భగవంతుని కేళి. ఆయనే నివారణ చేస్తారు. మనం ఎందుకు ఆందోళన పడాలి” అని శ్రీ సమర్థ అన్నారు. ఇక్కడ పది, పన్నెండు రోజుల నుండి రాజదండం, చామరలు, నెమలి పింఛపు విసన కర్రలు మొదలగునవన్నీ శ్రీ సమర్థ చావడికి వెళ్ళేటప్పుడు, ఆరతి జరిగేటప్పుడు ఉపయోగించడం ప్రారంభమైంది. చోప్ దార్ లాల్కరి చేయడం (గౌరవపూర్వకంగా “రాజాధిరాజ...” అంటూ బిగ్గరగా ఉచ్చరించడం) ప్రారంభమైంది. ఈ విధంగా కొత్త సంగతులు చోటుచేసుకున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మీరు పంపించిన బాలాజీ ఆనందరావు ఈ రోజే శ్రీ సమర్థ దర్శనానికి వచ్చాడు. బాబా లెండీ నుండి వచ్చేటప్పుడు తాను బండి దిగి వచ్చి దర్శనం చేసుకున్నారు. తన కాలిలో ముల్లు గుచ్చుకుంది. ముల్లు లోతుగా దిగింది. వాడాకు వచ్చిన తరువాత ముల్లును తీసివేసాము. సద్గురు కృప వలన బాధ ఎక్కువ కాలేదు. శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ గారు శ్రీ సాఠె సాహెబ్ గారికి బాబా అనుమతితో వాడా కట్టే విషయమై ఉత్తరం వ్రాసారు. ఆయన కూడా అందుకు సమ్మతించారు. రేపు లేదా ఎల్లుండి వాడా కట్టే పని ప్రారంభిస్తారు. గాలి, నీరు అంతా సౌలభ్యంగా ఉంది.

శిరిడీ నుండి శ్రీ మాధవరావు దేశపాండే గారు శ్రీ హరి సీతారాం దీక్షిత్ కు వ్రాసిన ఉత్తరాలలోని సారాంశం 17-9-10 న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం :

శ్రీ సమర్థులు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మొన్నటి రోజు ఈ వృద్దుడు (బాబా) మంటలో (ధునిలో) చేయి పెట్టాడు. అందువలన చేతి చర్మం కాలిపోయి వాపు వచ్చింది. ప్రతిరోజు లేపనం పూస్తున్నాము. ఆయన లీలలు ఆయనకే ఎరుక. మిగతా అంతా మీరు ఉన్నప్పుడు ఎలా జరిగేదో, అలాగే అంతా ఆనందంగా జరుగుతోంది.

8-10-1910న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం:

నిన్నటిరోజు అంటే 7వ తారీఖున శ్రీ దాసగణు గారి భార్య 'తాయి' మన వాడాకు దగ్గరలోనున్న కాలువలోకి దూకింది. కాలువలో నీరు 3, 4 అడుగుల వరకు ఉంది. కాని తనకు ఏమీ దెబ్బలు తగల్లేదు. వెంటనే కొందరు మనుషులు కాలువలోకి దిగి తనను కాపాడారు. చాలామంది అక్కడకు వచ్చారు. తనకు ఏ మాత్రం దెబ్బలు తగల్లేదు.

30-10-1910 న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం: 

ఇక్కడి విశేషమైన సంగతులు ఏమిటంటే, శ్రీ సమర్థ ఆరోగ్యం బాగుంది. చేతికి కాలిన గాయం అలాగే ఉంది. కొంచెం వాపు తగ్గింది. ఇంకెవరి చేత ఔషధం పూయించుకోవడం లేదు. నేను స్వయంగా ఔషధం పూస్తున్నాను. ఆయన లీలలు ఆయనకే ఎరుక.

9-11-1910 న తాసిన ఉత్తరంలోని సారాంశం: 

ప్రతిరోజు ఆరతి సమయంలో నెమలి పింఛాల చామరము, గొడుగు వగైరా ఎంతో వైభవంగా చోటుచేసుకోసాగాయి. అదేవిధంగా రాత్రి చావడికి వెళ్ళేటప్పుడు చోప్ దారు, ఛత్రి, చామరాలు వగైరా వంటి వాటి ప్రారంభం మొన్నటి నుండి జరిగింది. ఇక్కడ అంతా ఆనందమే!

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 119వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.
  2. బాబా నిలిపిన నా వైవాహిక జీవితం

పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.

వాట్సాప్ ద్వారా వేంకటేష్ గారు పంపిన అనుభవం:

ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను చిత్తూరులోని ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాను. 2019 మే నెలలో నా కర్మకొద్దీ నేను ఏ తప్పూ చేయకపోయినా ఒక పెద్ద చిక్కులో పడ్డాను. మా సంస్థ బంగారు నగలు కుదువ పెట్టుకుని ఋణాలు మంజూరు చేస్తుంది. సంస్థలో పనిచేసే అప్రైజర్(నగల నాణ్యత పరిశీలన చేసే ఉద్యోగి) మమ్మల్ని బాగా నమ్మించి మా కళ్ళుగప్పి గిల్టునగలు ఉంచి, ఏకంగా దాదాపు కోటి రూపాయల వరకు డబ్బులు కొట్టేసాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఇందుకు బాధ్యులైన వారిని పోలీసులకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నా తప్పు లేకపోయినా అప్పు మంజూరు చేసేందుకు సంతకం చేసిన పాపానికి నేను కూడా బాధ్యుడనయ్యాను. కోటి రూపాయలంటే మాటలా! నాలాంటి సగటు ఉద్యోగికి అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? ఆ కారణంచేత నేను చాలా ఆందోళనకు గురయ్యాను. సాయిబాబా ఎదుట నిలబడి పుట్టెడు దుఃఖంతో 'రక్షించమ'ని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. అధికారుల మనసు మారింది. సంస్థకు చెడ్డపేరు రాకుండా అన్ని లోన్లూ కట్టి గిల్టునగలు పూర్తిగా విడిపించుకోవడానికి కొంత గడువు ఇచ్చారు. దాదాపు నలభైరోజులు నిద్రలేదు. తీవ్ర భయాందోళనలతో సతమతమయ్యాను. ఎట్టకేలకు సాయిబాబా ఆశీస్సులతో తేది. 17-07-2019 నాటికి అన్ని లోన్లూ క్లియర్ చేసేశాం. సాయి కృప వల్ల ఎవ్వరూ పోలీస్ కేసుల్లో ఇరుక్కోలేదు. కానీ నేను ఇరవై లక్షల రూపాయల అప్పుల్లో పడ్డాను. నా అప్పుల భారం కూడా సాయిబాబా కరుణతో త్వరలోనే తీరిపోతుందని గట్టి నమ్మకం నాకుంది. బాబా తన బిడ్డలను ఎన్నటికీ చేయి వదలలేరు. ఎలాంటి కష్టం వచ్చినా ఆయన తప్పకుండా ఆదుకుంటారు. ఇది ముమ్మాటికీ సత్యం. "థాంక్యూ వెరీ మచ్  సాయిబాబా!"

జై జై సాయి రాం..

బాబా నిలిపిన నా వైవాహిక జీవితం

ఢిల్లీ నుండి సాయిభక్తురాలు స్వప్న తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా జీవితంలో బాబా ప్రసాదించిన చాలా ముఖ్యమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆ అనుభవం ద్వారా కష్టసమయంలో తన భక్తులకు తోడుగా ఉంటానని బాబా నాకు తెలియజేశారు. ఆ తరువాత కూడా బాబా నాకెన్నో విషయాలు నేర్పించారు. ఇక నా అనుభవానికి వస్తే...

నాకు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక నా ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. ఒకటి తరువాత ఒకటి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నేను బాధపడుతూ ఉండేదాన్ని. అవి నాకు, నా భర్తకు మధ్య విభేదాలకు దారితీశాయి. అలా కొన్నినెలలు గడిచాక నా భర్త నాతో వింతగా ప్రవర్తిస్తూ, నాకు దూరంగా ఉండేవారు. ఒకరోజు అర్థరాత్రి నేను తనని నిలదీశాను. అప్పుడు తనకి వేరే స్త్రీతో సంబంధం ఉందన్న సమాధానం విని నేను నిర్ఘాంతపోయాను. అటువంటి మోసాన్ని నేనెప్పుడూ తననుంచి ఊహించలేదు. అలాంటిది హఠాత్తుగా భయంకరమైన నిజం తెలిసేసరికి నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. తరువాత నాకు, నా భర్తకు మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగి చివరికి విడాకుల వరకు దారితీశాయి. మళ్ళీ మేము ఒకటవుతామని ఎవరూ ఊహించలేదు.

ఆ కష్టసమయంలో నేను బాబానే నమ్ముకున్నాను. ఆ సమయమంతా నేను అనేక రకాలుగా పూజలు చేస్తూ, లెక్కలేనన్నిసార్లు నామజపం చేస్తూ ఉండేదాన్ని. ఆ కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డానంటే అది నా బాబా ఇచ్చిన ధైర్యమే అని నాకు బాగా తెలుసు. ఆయన ఎన్నో లీలలను చూపించారు. వివిధ రూపాలలో ఆయన ఉనికిని నాకు తెలియజేస్తూ నాలో విశ్వాసాన్ని పెంచుతూ, పోరాడే శక్తినిచ్చారు. అనేకరకాల బలహీనతల నుండి బయటకు తీసి నన్ను దృఢంగా తయారుచేసారు. చివరికి నా భర్తను మార్చి, మళ్ళీ నాకు అప్పగించారు. ఇప్పుడు నా భర్త మునుపటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు. ముందు మా గొడవలు చూసిన వాళ్ళు ఇప్పుడు మేము అన్యోన్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతా బాబా నాపై చూపిన కరుణ. నేను నా అనుభవాన్ని చాలా సింపుల్ గా చెప్పాను. బాబా నడిపిన ప్రతి ఒక్క సంఘటనను వివరిస్తే ఒక పుస్తకమైపోతుంది.

ఇటువంటి సమస్యలలో ఉన్న వారు నన్ను నమ్మండి. బాబా మనకోసం ఉన్నారు. తన భక్తులు కష్టకాలంలో ఉంటే ఆయన వాళ్ళకి తోడుగా ఉంటారు. ఇది నూటికి నూరుశాతం నిజం. మనం బాధపడుతుంటే ఆయన చూడలేరు. అది నేను ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా గ్రహించాను. అయితే మనకు ఉండవలసింది ఆయనపట్ల చెదరని విశ్వాసం. ఆయన స్మరణ చేస్తూ ఉంటే పెనుతుఫానులను సైతం ఆయన దాటిస్తారు. నన్ను నమ్మండి, నేను ఆయన కృపవలన మాత్రమే ఆ కష్టకాలం నుండి బయటపడ్డాను. ఆయన మాత్రమే మన సమస్యలు పరిష్కరించగలరు. ఆయనను మన గురువుగా, దైవంగా కలిగివుండటం మన అదృష్టం. ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టకండి.

సాయి అనుగ్రహసుమాలు - 78వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 78వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 141 

గోవా బ్రాహ్మణుల కథ.

సుమారు ఇరవై సంవత్సరాలకు పూర్వం బుందేల్ ఖండ్ కు చెందిన ఇద్దరు దక్షిణ బ్రాహ్మణులు శిరిడికి బాబా దర్శనానికై వచ్చారు. దర్శనం కోసం ఎవరైనా వస్తే బాబా వద్దకు వారిని తీసుకువెళ్ళే పనిని ఎప్పుడూ మాధవరావు చేస్తుంటాడు. అదే విధంగా ఆ ఇద్దరు బ్రాహ్మణులను మాధవరావు బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ ఇద్దరూ బాబాకు నమస్కారం చేసుకుని కూర్చొన్నారు. అప్పుడు బాబా ఒక బ్రాహ్మణుని వైపు చేయి చూపిస్తూ మాధవరావుతో “షామా, తన దగ్గర రూ. 15/- అడుగు” అని అన్నారు. మాధవరావు ఆ విధంగానే తనను 15 రూపాయలు అడగడంతో, ఆ గృహస్థు 15 రూపాయలను సమర్పించారు. బాబా ఆ డబ్బులను స్వీకరించారు. ఇంకొక బ్రాహ్మణుడు తనకు తానే 35 రూపాయలను బాబాకు సమర్పించారు. బాబా ఆ 35 రూపాయలను చేతిలోకి తీసుకొని, మరలా ఆ బ్రాహ్మణునికి తిరిగి ఇచ్చేసారు. అదిచూసి మాధవరావు “దేవా, ఇటువంటి వ్యవహారం నేనెప్పుడు చూడలేదు. తనకు తానే స్వయంగా 35 రూపాయలిస్తే తీసుకోలేదు, అదే ఇంకొకరి దగ్గరనుండి అడిగి మరీ 15 రూపాయలను తీసుకున్నారు” అని బాబాను అడిగారు. బాబా మొదట ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపటి తరువాత బాబా “షామా, ఆ 35 రూపాయిలు మనవికావు. కానీ ఆ పదిహేను రూపాయలు దత్తునివి. దత్తుడు ద్వారకామాయి తల్లికి ఇచ్చాడు" (బాబా అప్పుడప్పుడు ద్వారకామాయిని ద్వారకామాయితల్లి అని అంటారు) అని అన్నారు. తరువాత ఆ సంఘటనకు సంబంధించి ఇలా చెప్పారు. ఒకసారి నేను తిరుగుతూ, తిరుగుతూ ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాను. వారు నాకు భోజనం పెట్టారు. తరువాత నేను అక్కడే నిద్రపోయాను. నా జేబులో 35 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. నేను నిద్రలో ఉండగా ఆ జేబు కత్తిరించి ఆ డబ్బులను దొంగిలించారు. సమీపం లో కిటికీ  ఉంది. ఆ కిటికీ ఊచలను తొలగించి దొంగలు లోపలికి వచ్చారు. నేను నిద్ర మేల్కొన్నాక చూస్తే నా జేబులో డబ్బులు లేవు. అప్పుడు నేను ఆ బ్రాహ్మణులతో నా డబ్బులు ఇచ్చేయమని అడిగాను. నేను విచారవదనంతో ఇంటి అరుగుపై కూర్చొన్నాను. అలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి ఒక ఫకీరు వచ్చాడు. నాతో "బాబా అలా ఎందుకు ఉదాసీనంగా కనిపిస్తున్నావు?” అని అడిగారు. అప్పుడు నేను ఆ ఫకీరుతో నా డబ్బులన్నీ దొంగిలించబడ్డాయని చెప్పాను. అప్పుడు ఆ ఫకీరు “నీవు ఆ ఫకీరుకు మొక్కుకో! నీకు ఇష్టమైన పదార్థం ఏదైతే ఉందో, దానిని వదిలేయి. అప్పుడు నీ డబ్బులు నీకు దొరుకుతాయి” అని చెప్పారు. నాకు అన్నం చాలా ఇష్టం, అందువలన దానిని వదలి వేసి మొక్కుకున్నాను. 15 రోజులలోపు ఆ బ్రాహ్మణులు కన్నం వేసి ఏ డబ్బులనైతే దొంగిలించారో, ఆ డబ్బులను తీసుకువచ్చి ఇచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. తరువాత నేను అక్కడ నుండి బయలుదేరి తిరుగుతూ, తిరుగుతూ గోవా దారిలోకి వచ్చాను. ఒకరోజు రాత్రి ఆ ఫకీరు నా స్వప్నంలోకి వచ్చి, “ఇంకా ఆ ఫకీరు వద్దకు వెళ్ళలేదా?” అని అడిగారు అప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నౌక దగ్గరకు వస్తే, నౌక పూర్తిగా నిండిపోయి ఉంది. సాహెబ్ నన్ను నౌక ఎక్కనివ్వలేదు. అప్పుడు ఒక సిపాయి సాహెబ్ తో "తనను ఎక్కనివ్వండి, మన మనిషే” అని చెప్పారు. అప్పుడు సాహెబ్ మమ్మల్ని నౌకలోకి ఎక్కనిచ్చాడు. తరువాత నేను ముంబాయికి వచ్చాను. ఫకీరును కలిసాను. అందువలన నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బాబా ఈ విషయం అంతా చెపుతూ ఉండగా, ఆ ఇద్దరి బ్రాహ్మణుల కళ్ళనుండి అశ్రుధార ప్రవహించసాగింది.

ఈ గోష్టి పూర్తయ్యాక బాబా మాధవరావుతో “షామా, వీరిద్దరినీ ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్టు” అని అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం మాధవరావు వారిద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భోజనం పూర్తయ్యాక మాధవరావు ఆ గృహస్థులతో “బాబా ఏ విషయం అయితే చెప్పారో, అది నాకు ఏమీ అర్థం కాలేదు. కాని బాబా చెప్పింది మీ గురించేనని అర్థమవుతుంది. బాబా చెప్పేటప్పుడు మీ కళ్ళలో నుండి అశ్రుధార ప్రవహించింది. ఒకవేళ, బాబా చెప్పింది మీకు అర్థమయ్యుంటే, దయచేసి నాకు కూడా చెప్పండి” అని అన్నాడు. అప్పుడు వారిలో ఒక గృహస్థు “ఈ గోష్ఠి ద్వారా బాబా తమ అంతర సాక్షిత్వాన్ని మాకు అర్థమయ్యేటట్లు చేసారు. అసలు విషయం ఏమిటంటే, మేము దక్షిణ్ లో ఉంటాము. ఉద్యోగ నిమిత్తం బుందేల్ ఖండ్ కు  వెళ్ళాము. మొదట 15 రూపాయల జీతం లభించసాగింది. అప్పుడు దత్తాత్రేయునికి రూ.15/- ఇస్తాను అని మొక్కుకున్నాను. ప్రస్తుతం నాకు రూ. 100/- ల జీతం వస్తుంది. కానీ 15 రూపాయల మొక్కు చెల్లించడం అలాగే ఉండిపోయింది. ఆ విషయాన్ని బాబా నర్మగర్భంగా చెప్పి, 15 రూపాయలను అడిగి తీసుకొని, నన్ను మొక్కునుండి విముక్తుడను చేస్తారు. జీతం బాగా వస్తుండటం వలన నేను చాలా డబ్బు కూడబెట్టాను. కానీ ఒకసారి నా బ్రాహ్మణుడు కిటికీ ఊచలు తీసి, ఆ డబ్బును దొంగిలించాడు. ముప్పై ఒక్క వేల రూపాయల నోట్లను దొంగిలించారు. ఆ బ్రాహ్మడు ముప్పై సంవత్సరాల నుండి నా వద్ద పనిచేస్తున్నారు. దొంగతనం గురించి పోలీసులకు పిర్యాదు చేసాను. కానీ డబ్బు గురించి ఏ విధమైన సమాచారం తెలియకపోవడంతో నేను బాధతో ఖిన్నుడనయ్యాను. ఒకసారి నా వద్దకు ఒక ఫకీరు వచ్చి “నేను శిరిడీ నుండి వచ్చాను. నువ్వు శిరిడీ సాయిబాబా దర్శనానికి వెళతానని మొక్కుకో. నీకు బాగా ఇష్టమైన పదార్ధాన్ని అంతవరకు వదులుకో, అప్పుడు నీ డబ్బులు నీకు దొరుకుతాయి” అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే నేను మొక్కుకున్నాను. నాకు బాగా ఇష్టమైన అన్నాన్ని తినడం మానివేసాను. తరువాత సుమారు 15 రోజులకు ఆ బ్రాహ్మణుడు తనకు తానే నా వద్ద నుండి దొంగిలించిన ముప్పై ఒక్క వేల రూపాయిలను తీసుకు వచ్చి ఇచ్చాడు. దాంతో నేను పరమానందభరితుడనయ్యాను. ఆ డబ్బులలో రూ. 2000/- రూపాయిలను ఆ బ్రాహ్మణునికి సంతోషంగా బహుమతిగా ఇచ్చాను. తరువాత 2-3 నెలలకు ఏదో పని మీద గోవా పక్క వచ్చాను. ఒకరోజు రాత్రి స్వప్నం వచ్చి, ఆ స్వప్నంలో బాబా కనపడ్డారు. అప్పుడు వెను వెంటనే శిరిడీకి వచ్చి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నౌక వద్దకు వస్తే, నౌకలో ఖాళీ లేదు. అప్పుడు ఒక సిపాయి “వీరు మనవాళ్ళే” అని చెప్పి మమ్మల్ని నౌకలోకి ఎక్కించారు. ఆ నౌకలో ముంబాయికి వచ్చి, అక్కడి నుండి ఇక్కడకు వచ్చాము. ఆ విధంగా జరిగిన సంఘటనను బాబా వివరిస్తుంటే, మేము ఆశ్చర్యచకితులమయ్యాము. సహజంగానే మా కళ్ళనుండి ఆనందాశ్రువులు ధారగా కారాయి.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


సాయిభక్తుల అనుభవమాలిక 118వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1.  సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...
  2. డ్రైవింగ్ నేర్చుకోవడంలో బాబా సహాయం
  3. తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా

 సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ సాయిరామ్! ఇటీవల బాబా నాకు ఇష్టమైన టెక్నాలజీలో పనిచేసే అవకాశంతోపాటు ప్రమోషన్ కూడా ఇచ్చిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేనొక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను నాకు ఇష్టంలేని టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టులో పని చేయాల్సి వచ్చింది. ఆ విషయమై నేను సాయిని ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. తరువాత నా మేనేజరుని కలిసి నాకు ఇష్టమైన టెక్నాలజీలో పనిచేసే అవకాశం ఇవ్వమని కోరాను. అతను, "నేను ప్రయత్నిస్తాను, కానీ మాటివ్వలేను" అని అన్నారు. నేను రెండు సప్తాహాలు పారాయణ పూర్తి చేశాక నా మేనేజరు తనని కలవమని ఫోన్ చేసి చెప్పారు. నేను అతన్ని కలిస్తే, ఒక ప్రాజెక్ట్ విషయంగా నా రెజ్యూమ్ ఇవ్వమని అడిగారు. నేను నా రెజ్యూమ్ అతనికిచ్చి మరో సప్తాహపారాయణ మొదలుపెట్టాను. బాబా కృపతో నాకు ఇష్టమైన టెక్నాలజీ మీద పనిచేసే ప్రాజెక్టులోకి నేను ఎంపికయ్యాను. తరువాత నేను ఊహించని విధంగా నాకు ప్రమోషన్ వచ్చేలా బాబా సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా! దయచేసి ఇలాగే మీ ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికీ అందజేయండి. కోటి కోటి ప్రణామాలు బాబా!"


డ్రైవింగ్ నేర్చుకోవడంలో బాబా సహాయం

యు.కే నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ సాయిరామ్! నేను సాయిబాబా భక్తురాలిని. నేను ఆయనను అపారంగా నమ్ముతాను. నా ప్రతిరోజు బాబా స్మరణతోనే మొదలై బాబా స్మరణతోనే ముగుస్తుంది. ఆయనే నా జీవితం. చాలా కష్టసమయాలలో భక్తుల అనుభవాలు మా విశ్వాసాన్ని నిజంగా పెంపొందిస్తున్నాయి. డ్రైవింగ్ విషయంలో బాబా నాకు ఏ విధంగా సహాయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నాకు డ్రైవింగ్ అంటే చాలా భయం. ప్రత్యేకించి కారు డ్రైవింగ్ అంటే మరీ భయం. ఆ కారణంచేత నేను డ్రైవింగ్ నేర్చుకోవడాన్ని వాయిదావేస్తూ ఉండేదాన్ని. కానీ నా కూతురు విద్యాభ్యాసం మొదలుపెట్టాక డ్రైవింగ్ నేర్చుకోవడం నాకు తప్పనిసరైంది.

బాబాను ప్రార్థించి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. బాబా కృపతో నా భయాన్ని తీసివేయటానికి సహాయపడే మంచి శిక్షకురాలు దొరికింది. ఆమె చాలా ప్రశాంతంగా అన్నీ నేర్పేది. నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లేముందే బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకునేదాన్ని. అలా చేయడం నాకెంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేది. కొద్దినెలల తరువాత నేను డ్రైవింగ్ పరీక్షకు బుక్ చేసుకున్నాను. నేను ఉద్దేశ్యపూర్వకంగా బాబారోజు అని గురువారాలలోనే థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేలా ఎంచుకున్నాను. అప్పటినుండి పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యేలా అనుగ్రహించమని రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆలోగా చాలాసార్లు ఒక నిర్ణీత సమయంలో బాబా రూపం కనిపించినట్లైతే నేను నా పరీక్ష ఉత్తీర్ణురాలినవుతానని అనుకుంటుండేదాన్ని. బాబా నాకటువంటి సూచనలు చాలా ఇచ్చారు. దాంతో, 'బాబా నాతో ఉన్నారు, నేను పరీక్షలో ఉత్తీర్ణురాలినవుతాన'న్న విశ్వాసం నాలో దృఢమైంది. చివరికి పరీక్షరోజు వచ్చింది. ఆరోజు నేను, "బాబా! నేను నా ఈ మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణురాలినైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. బాబా కృపతో మొదటి ప్రయత్నంలోనే నేను పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యాను. "బాబా! నాతో ఉంటూ ప్రతి చిన్న(కొన్నిసార్లు సిల్లీ) కోరికలను నెరవేరుస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి ఎల్లప్పుడూ ప్రపంచంలోని అన్ని జీవులపై మీ ఆశీర్వాదాలు కురిపించండి".


సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2382.html

తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా

యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా చెప్తున్నారు:

సాయిభక్తుల అనుభవాలు చదవడంతో నా రోజు మొదలై, మళ్ళీ వాటిని చదవడంతో ముగుస్తుంది. ఒకసారి క్రింది దవడ సెన్సిటివిటీతో చాలా బాధపడ్డాను. డెంటల్ క్లినిక్‌కి వెళ్లి దంతాలు శుభ్రం చేయించుకున్నాను. కానీ సెన్సిటివిటీ మాత్రం తగ్గలేదు. ఆ నొప్పి తీవ్రత వలన తలనొప్పి కూడా వచ్చింది. నొప్పి తట్టుకోలేక రోజూ నొప్పి నివారణ మందులు తీసుకున్నాను. 4 రోజుల్లో మొత్తం 7 టాబ్లెట్స్ తీసుకున్నాను. అయినా నొప్పి తగ్గలేదు. చివరికి ఒకరోజు సాయంత్రం దవడకు బాబా ఊదీ రాసాను. అంతే! కొద్దిక్షణాల్లో తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా. సెన్సిటివిటీ ఇంకా ఉంది, కానీ ప్రధానమైన తలనొప్పిని బాబా నయం చేశారు. "బాబా! దయచేసి నాకు తోడుగా ఉండండి. అన్నీ సక్రమంగా జరిగేలా చూడండి".
సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2386.html

సాయిభక్తుల అనుభవమాలిక 117వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • సాయిబాబానే చీకటిలో మార్గాన్ని చూపుతారు

బెంగళూరునుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

30 సంవత్సరాలకు పైగా నేను సాయిభక్తుడిని. బ్లాగుల్లోని సాయి భక్తుల అనుభవాలు చదవడం ద్వారా బాబాపట్ల నా విశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది. "ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి దుఃఖానికి ఉపశమనం ఉంటుంది. సాయిబాబా ప్రతీ సమస్యను అద్భుతరీతిన పరిష్కరిస్తారు. మనం చేయాల్సింది కేవలం ఆయనపై నమ్మకాన్ని ఉంచడమే" అని ఎక్కడో చదివాను. నిజం! చాలా కరెక్టుగా చెప్పారు. ఇది నేను కష్టంలో ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది - సాయిబాబానే ఆ చీకటిలో మార్గాన్ని చూపుతారు(మనం గుర్తించినా, గుర్తించకపోయినా). నేనిప్పుడు చెప్పబోయే అనుభవం దానిని ఋజువు చేస్తుంది.

2017లో కంపెనీ ఉద్యోగస్తులను తగ్గించుకునే(downsizing) ప్రక్రియలో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అప్పటికి నేను సీనియర్ పొజిషన్లో మంచి జీతం సంపాదిస్తున్నాను. హఠాత్తుగా అలా జరిగేసరికి నేను చాలా కృంగిపోయాను. "త్వరగా ఉద్యోగం దొరికేలా చూడమ"ని బాబాను ప్రార్థించాను. తరువాత కూడా కుదురుగా ఉండలేక ఇద్దరు జ్యోతిష్యులను కలిసాను. వాళ్లలో ఒకరు '7-8 నెలల తరువాత నాకు ఉద్యోగం వస్తుంద'ని చెపితే, మరొకరు 'అసలు ఉద్యోగరేఖే కనిపించడంలేదు, అయినా కానీ ఆర్థికపరంగా సమస్యలు ఉండవు' అని చెప్పారు. కానీ బాబా కృపవలన అద్భుతంగా కేవలం ఒక నెలలోనే నాకు ఉద్యోగం వచ్చింది. అది కూడా మా ఇంటికి అతిసమీపంలో! ఇక్కడ ఒక్క విషయం గుర్తించండి. 'జ్యోతిష్యులిద్దరి అంచనాలు తప్పు అని తేలిపోయాయి. కేవలం బాబా యందు ఉన్న విశ్వాసమే పని చేసింది. మిగతా అంతా బాబా ముందు పక్కకు తప్పుకుంది'. అయితే కొత్త ఉద్యోగంలో నేను ముందు సంపాందించే దానికన్నా 25% తక్కువ జీతం నిర్ణయించారు. అయినా నేను దాని గురించి దిగులుపడకుండా అంతా బాబా చూసుకుంటారని సంతోషంగా ఆ అవకాశాన్ని స్వీకరించాను.

ఒక నెల గడిచేసరికి అనేక కారణాలరీత్యా నేను ఆ ఉద్యోగంలో సంతోషంగా ఉండలేకపోయాను. దానితో వేరే ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాను. అయితే ఆ సమయంలో మార్కెట్‌లో ఉద్యోగాలు లేవు. అదే సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీ పనితీరు దిగజారిపోవడం మొదలైంది. జీతాలు రావడం ఆలస్యం అవుతూ ఉండేది. 2018 జనవరి వచ్చేసరికి పరిస్థితి ఇంకా హీనం అయిపోయింది. జీతాలలో 40% తగ్గించేశారు. అందువలన నేను చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఉన్నపళాన వేరే ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేసినా నాకు సరైన అవకాశం దక్కలేదు. 'నాకెందుకీ పరిస్థితి? అసలు ఏమి జరగబోతుంది?' అని అన్నీ ప్రశ్నలే నా ముందు. ఏమి చేయాలో నాకేమీ అర్థం కాలేదు. అటువంటి సమయంలో సాయి దివ్యపూజ, సచ్చరిత్ర సప్తాహపారాయణ చేశాను. 'నాకెప్పుడు ఉద్యోగం వస్తుంద'ని నేనడిగిన ప్రతిసారీ సాయిబాబా ప్రశ్నలు&సమాధానాలు పుస్తకంలో సానుకూలమైన సమాధానాలు లభిస్తూ ఉండేవి.

2018 జనవరి చివరివారం, ఫిబ్రవరి మొదటివారం మధ్యలో దాదాపు నాకు క్రొత్త ఉద్యోగం వచ్చినట్లే అనుకున్నాను. కానీ చివరినిమిషంలో అది చేజారిపోయింది. అలా ఏదీ నాకు కలిసిరాక బాగా కృంగిపోయాను. ఆ సమయంలో ఎటువంటి చంచలత్వం లేకుండా దృఢమైన విశ్వాసం, నమ్మకం సాయిబాబాపై పెట్టాలని నిశ్చయించుకుని మళ్ళీ సచ్చరిత్ర పారాయణ చేశాను. శిరిడీ కూడా వెళ్లి వచ్చాను. కానీ ఆ తరువాత కూడా కంపెనీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అసలు మెరుగుపడే సూచనలు కూడా కనపడలేదు. నా జీతం కట్ చేసి ఇస్తున్నందువల్ల, ఇంకా వేరే ఇతర కారణాలవలన కంపెనీ నాకు దాదాపు 4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు వదులుకోలేను. అలాగని సౌకర్యంగా లేనిచోట ఉద్యోగం కొనసాగించలేక ఇరకాటంలో పడిపోయాను.

చివరికి 2018 నవంబరులో కంపెనీ వాళ్ళు, "మీకింక మేము జీతం చెల్లించలేము. మీరు వెళ్లిపోవచ్చ"ని నిర్మొహమాటంగా చెప్పేశారు. నేను నిర్ఘాంతపోయాను. అయితే ఆ సమయమంతా 'నేను నీకు సహాయం చేస్తాను' అని బాబా నుండి సంకేతాలు అందుతూనే ఉండేవి. ఒకవైపు బాబా సహాయం చేస్తారని తెలిసినా, ఆరోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఆందోళనపడకుండా ఉండలేకపోయేవాడిని. చాలా చాలా మానసిక సంఘర్షణను అనుభవించాను. చాలా బాధాకరమైన రోజులవి. అలా ఉండగా హఠాత్తుగా క్రొత్తగా మొదలుపెట్టిన మహాపారాయణ గ్రూపులో నాకు అవకాశం వచ్చింది. నేను ఆనందంతో పులకరించిపోయాను. చివరికి 2018 డిసెంబరు 24న బాబా నాకు దారి చూపించారు. దానితో నాకు ఉద్యోగం వచ్చింది. అదొక అద్భుతమైన లీల. 

Linkedin లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక లింక్ నా దృష్టిలో పడింది. నిజానికి అది మూడువారాల ముందు షేర్ చేయబడింది. పైగా నా నైపుణ్యానికి సంబంధించినది కాదు. అయినా కూడా నేను దానికి దరఖాస్తు చేశాక నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నేను ఇంటర్వ్యూ గదిలో అడుగుపెడుతూనే సాయిబాబా ఫోటోని చూసాను. అద్భుతం! అంతకన్నా నాకు ఇంకేమి కావాలి? బాబా దగ్గరుండి నా ఇంటర్వ్యూ సక్రమంగా నడిపించారు. ఆయన కృపతో నా పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన ఒక్కరోజు ముందు నాకు ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ బాబా, మీ అపారమైన కృపకు, దయకు". నేను ఎక్కువగా ఆందోళనపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, నా జీవితం బాబా పాదాల చెంత ఉంది. బాబా నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. "ప్రణామాలు బాబా! అందరికీ శాంతి చేకూర్చండి".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2387.html

సాయిభక్తుల అనుభవమాలిక 116వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఊదీ మహిమ - అయిదు నిమిషాల్లో తలనొప్పి మాయం
  2. డిలీట్ చేయబడిన ఇ-మెయిల్ దొరికేలా చేసిన బాబా
  3. బాబా నా కోరిక మన్నించారు

ఊదీ మహిమ - అయిదు నిమిషాల్లో తలనొప్పి మాయం

సాయిబంధువులందరికీ సాయిరామ్! నా పేరు శిరీష. ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2019, జులై 14 ఆదివారంనాడు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోజు రాత్రి 1.30 సమయంలో నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాను. ఆ అర్థరాత్రి వేళ నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. నొప్పి భరించలేకపోయాను. సమయానికి మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు. ఆ సమయంలో నా తల్లిదండ్రులను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక బాబాను తలచుకొని ఊదీని నా నుదుటిపై రాసుకున్నాను. ఆశ్చర్యం! కేవలం 5 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రపోయాను. బాబా ఊదీ అద్భుతం! "థాంక్యూ సో మచ్ బాబా!"

డిలీట్ చేయబడిన ఇ-మెయిల్ దొరికేలా చేసిన బాబా

కెనడా నుండి సాయిభక్తురాలు రితికా మల్హోత్రా తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను మన సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. నా ఈ అనుభవాన్ని పంచుకునేందుకు అనుమతించిన సాయిబాబాకు ధన్యవాదాలు. నేను డిలీట్ చేసిన ఒక ఇ-మెయిల్  తిరిగి పొందగలిగినట్లైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని సాయిబాబాకు చెప్పుకున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. "నా అనుభవాన్ని వివరించడంలో ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి బాబా!"

నా మొబైల్ ఫోనులో ఇ-మెయిల్ అప్లికేషన్ ఒకటి ఇన్స్టాల్ చేయబడివుంది. అందులో చాలా ముఖ్యమైన మెయిల్స్ ఉన్నాయి. ఒకసారి నేను నిర్లక్ష్యంగా కొన్ని మెయిల్స్ తొలగించాను. వాటిని తిరిగి పునరుద్ధరించడానికి నా ఫోనులో, మావారి లాప్‌టాప్‌లో రెండు మూడుసార్లు ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక వాటిని ఎప్పటికీ తిరిగి పొందలేనని అనుకున్నాను.

తరువాత తేదీ.18/12/2018న నేను, నా భర్త కారులో వెళ్తున్నప్పుడు, నా భర్త, "మళ్ళీ ఒకసారి ఆ ఇ-మెయిల్ వెతకమ"ని చెప్పారు. అందువలన నేను, "మెయిల్ దొరకడంలో సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించి మెయిల్ దొరికితే ఆ చిన్న అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని కూడా చెప్పుకున్నాను. ఆరోజు, మరుసటిరోజు నేను ప్రయత్నించి, ప్రయోజనం లేకపోవడంతో ఇక ఆ మెయిల్ తిరిగి పొందలేనని అనుకున్నాను. కానీ బాబా ప్రణాళిక వేరుగా వుందనుకుంటా! తేదీ.20.12.2018న నేను లాప్‌టాప్‌లో 'డిలీట్ ఐటెమ్స్ ఫోల్డర్' ఖాళీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా 'రికవర్ ఐటమ్స్ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్' అనే ఒక లింక్ ఆప్షన్‌ను గమనించాను. ఆశ్చర్యం! దాన్ని క్లిక్ చేస్తే తొలగించిన మెయిల్స్ చూపించింది. అందులో నాకు కావాల్సిన మెయిల్ కోసం వెతికాను. బాబా దయవలన మెయిల్ దొరికింది. ఆరోజు గురువారం, సాయిబాబా రోజు. "మెయిల్ దొరికేలా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


బాబా నా కోరిక మన్నించారు

యు.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! బాబా ఎన్నో అనుభవాలతో నన్ను ఆశీర్వదించారు. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా ఇంటికి దగ్గరగా వుండే ఉద్యోగం కోసం నేను వెతుకుతున్నాను. నా తల్లిదండ్రులు నాతోపాటు ఉంటున్నారు. అందువలన ఉద్యోగం చేసే చోటు ఇంటికి కాస్త దగ్గరలో  ఉంటే బాగుంటుందని నేను ఆశించాను. అది కష్టమని తెలుసు. అయితే నా పూర్వ అనుభవాల దృష్ట్యా మనకు శ్రేయస్కరమైతే బాబా వాటిని నెరవేరుస్తారని కూడా నాకు తెలుసు. అందువలన నేను రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నేను ఆఫీసుకు వెళ్లేముందు, "బాబా! నాకు మంచిదైతే మీరు ఇంటికి దగ్గరగా ఉద్యోగాన్ని చూపిస్తారని నాకు తెలుసు. కాని రోజూ ఈ ట్రిఫిక్‌లో దూరంగా ఉన్న ఆఫీసుకు వెళ్లిరావడం నాకు కష్టమవుతోంది. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేయండి" అని ప్రార్థించాను. తరువాత నేను ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టడానికి నా మెయిల్స్ తెరచి చూసాను. అద్భుతం! మొదటి మెయిల్ మా ఇంటికి దగ్గరలోనే ఉద్యోగ అవకాశానికి సంబంధించినది. పైగా పని చేసే సమయాలను నేనే ఎంచుకునే అవకాశం కూడా ఉంది. నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. "నాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! శ్రద్ధ, సబూరీలతో వేచివుంటే మీరు తప్పకుండా సహాయం చేస్తారని నాకు తెలుసు. బాబా! మీరెప్పుడూ నాకు తోడుగా ఉండండి. నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడంలో నాకు సహాయం చెయ్యండి",
సోర్స్: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2383.html

సాయి అనుగ్రహసుమాలు - 75వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 75వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 138

శ్రీ రామచంద్ర కేశవ్ నాయక్ గారి అనుభవం.

శ్రీ సాయిభక్త పరాయణులైన శ్రీ భావుసాహెబ్ హరిసీతారాం దీక్షిత్ గారికి, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి విషయానికి సంబంధించి అనుభవాన్ని వ్రాసి పంపుతున్నాను. మీకు యోగ్యమైనదిగా అనిపిస్తే శ్రీ సాయిలీల పత్రికలో ప్రచురించవలసినదిగా వినతి. 

నేను పూనాలో జన్మించాను. అక్కడ మా తండ్రిగారు మిలటరీలోని అకౌంట్స్ ఆఫీసులో పని చేస్తారు. శ్రీ అక్కల్ కోట్ మహారాజ్ గారి దర్శనానికై ముంబాయికి చెందిన లక్ష్మణ్ పండిట్ మరియు నగర్ కు చెందిన నానా జోషి రేఖే అక్కల్ కోటకు బయలుదేరారు. వారు పూనాలోని మా వాడాలోనే బస చేస్తారు. వారితో పాటుగా మా తండ్రిగారు నన్ను తీసుకొని అక్కల్ కోటకు వెళ్ళారు. ప్రతినెలా వారు అక్కల్ కోటకు నియమంగా యాత్ర చేసేవారు. వారితోపాటుగా తరచు నేనూ వెళ్ళేవాడిని. ఒకసారి అక్కల్ కోట నుండి “వెంటనే బయలుదేరి రమ్మని” మా తండ్రిగారికి టెలిగ్రాం వచ్చింది. ఆ టెలిగ్రాం చూడగానే మా తండ్రిగారు నన్ను తీసుకొని అక్కల్ కోటకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మహారాజ్ తుదిశ్వాస విడిచే క్షణాలు దగ్గర పడ్డాయని అర్థమైంది. మా తండ్రిగారు అక్కల్ కోట్ మహారాజ్ ను “ఇప్పుడు నాకు, నా పిల్లవానికి దిక్కెవరు?” అని అడిగారు. అప్పుడు స్వామి సమర్థ తమ పాదుకలను నాకు ఇచ్చి “వీటిని పూజించుకో” అని అన్నారు. “అహ్మద్ నగర్ జిల్లాలోని శిరిడీ గ్రామంలో, నా అవతారం ఉంది. నన్ను ఎలాగైతే భక్తి, ప్రేమలతో పూజించుకుంటున్నారో, అలానే అక్కడ కూడా చేయి. అప్పుడు నీ మనసుకు సుఖసమాధానాలు లభ్యమవుతాయి” అని అన్నారు.

అక్కడే కొన్నిరోజులుండి, తరువాత లక్ష్మణ్ పండిట్, నానా రేఖ్ మరియు మేము కలిసి శిరిడీకి వచ్చాము. దారిలో వారు మా తండ్రిగారితో “శిరిడీలోని పిచ్చి ఫకీరు గురించి మాకు తెలుసు. మేము ముసల్మాను పాదాలపై పడము. మీరు కావాలంటే ఆయన పాదాలకు నమస్కారం చేసుకోండి, తరచుగా అక్కడికి వెళ్ళి సేవ చేసుకోండి” అని అన్నారు. కానీ మా తండ్రి గారి నిశ్చయం ఏ మాత్రం సడలకుండా, మమ్మల్నందరిని తీసుకొని శిరిడీ వెళ్ళారు. ఆ ఫకీరు మమ్మల్నందరినీ చూడగానే దారిలో జరిగిన సంభాషణ అంతా చెప్పసాగారు. చివరగా నా వైపు మరియు నా తండ్రిగారి వైపు చూసి “వీరు ఛాందస బ్రాహ్మణులు. నీవు, నీ కుమారుడు కావాలంటే ఇక్కడకు రావచ్చు” అని చెప్పారు. తరువాత నాకు ముందరనున్న వేపచెట్టుని చూపించి, ఆ చెట్టు ఆకులను తెమ్మని చెప్పారు. వాటిని తేగానే మా అందరికీ ఇచ్చి మమ్మలను తినమని చెప్పారు. వారిద్దరికీ ఆ ఆకులు అతి చేదుగా ఉండి, నాకు, మా తండ్రి గారికి ఎంతో మధురంగా ఉన్నాయి. వారిద్దరు ఎంతో బేజారుకు గురయ్యారు. మా తండ్రి గారికి చేదు వేపాకులను తినిపించడంలోని అర్థం బోధపడింది. అక్కల్ కోట స్వామి కూడా అక్కల్ కోటలోని వేపచెట్టు సగభాగాన్ని తీపిగా చేసి, గాణాపూర్ నుండి వచ్చిన భక్తులకు నేను నృసింహ సరస్వతీ అవతారమనే అనుభవాన్ని ఇచ్చారు. అలాగే శ్రీ సాయిబాబా కూడా అటువంటి అనుభవాన్ని ఇచ్చి, తాము సాక్షాత్తు అక్కల్ కోట స్వామి గారి అవతారమనే అనుభవం ప్రసాదించారు.

ఆ రోజులలోని శ్రీ సాయిబాబా ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. ఎవరైన చూడాలనుకుంటే నా దగ్గరకు రావచ్చు. మూడు భిన్న రీతులలో ఉన్న శ్రీ సాయిబాబా ముఖారవిందాన్ని ఒకే చిత్రంగా గీసిన ఫోటో శిరిడీలోని ప్రభుజాతికి చెందిన శ్రీ బాలక్ రామ్  గారు మరణించిన తరువాత ఆయన పుస్తకంలో వారి కుమారునికి లభించింది. కైలాసవాసి ఆత్మారామ్ బాలాజీ ఆ ఫోటో కాపీలను నాకు చూపించగానే ఆ గురుమూర్తిని దర్శించి, నా మనసు అత్యంత సుఖసమాధానాలకు లోనయింది.

తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు నేను కూడా శిరిడీకి వెళుతుండేవాడిని. ఒకసారి శ్రీ ఆనందనాథ్ మహారాజ్ (శ్రీ అక్కల్ కోట మహారాజ్ గారి శిష్యులు) గారి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఆయన శ్రీ శిరిడీ సాయిబాబా గురించి ప్రస్తావిస్తూ "ఆయన వేరెవరో కాదు, సాక్షాత్తూ భగవంతుని అవతారం” అని అన్నారు. ఆ మాటలు వినగానే నా మనసుకి పరమానందం కలిగింది.

తరువాత నుండి అక్కల్ కోట స్వామి దర్శనానికి వెళ్ళే ముందు శిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, తరువాత అక్కల్ కోటకు వెళ్ళుతున్నాను. తరువాతి రోజులలో నాకు శ్రీ సాయిబాబా ప్రసాదించిన అనుభవాలను త్వరలోనే పంపుతాను.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 115వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా
  2. గురుపూర్ణిమనాడు బాబా దర్శనం - ఆయనిచ్చిన ఆనందం.

గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా

సాయిభక్తురాలు సగుణ్ లంబా గురుపూర్ణిమనాటి తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా సాయి కుటుంబసభ్యులకు సాయిరామ్! గురుపూర్ణిమనాడు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

సాయిసోదరి సజల్ ఏప్రిల్‌ నెలలో శిరిడీ సందర్శించినప్పుడు ఒక బాబా విగ్రహాన్ని తీసుకుని నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. కానీ మా ఇంటినుండి 20 గంటల ప్రయాణం చేసేంత దూరంలో ఆమె ఉంటున్నందున నేరుగా ఆ బహుమతిని నాకివ్వడానికి తనకి కుదరలేదు. కాబట్టి తన బంధువులు, స్నేహితులలో ఎవరైనా ఢిల్లీ సందర్శించినట్లైతే వారి ద్వారా ఆ బహుమతిని నాకు పంపే విధంగా మేము అనుకున్నాము. కానీ అలా కూడా జరగలేదు. బాబా ప్రణాళికలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన నాకెంతో ఆనందాన్నిచ్చే ప్రణాళిక సిద్ధం చేసి పెట్టారు. మూడు నెలలు గడిచాక సజల్ ఆ బహుమతిని ఇండియన్ పోస్టల్ ద్వారా నాకు పంపాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే 2019, జూలై 12న ఆమె పోస్టల్ సర్వీసెస్‌లో ఆ బహుమతిని ఇచ్చింది. మేమిద్దరం ఆ బహుమతి జూలై 16, గురుపూర్ణిమనాడు  ఢిల్లీ చేరుకోవచ్చని అనుకున్నాము. అయితే పార్సెల్ జూలై 15నే ఢిల్లీ చేరుకుంది. ఆరోజే వాళ్ళు డెలివరీ చేయడానికి మా ఇంటికి వస్తే, మా ఇంటి డోర్ లాక్ చేయబడి ఉండటంతో వెనుదిరిగి వెళ్లిపోయారని నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరూ ఇంటికి రాలేదు. నాకంతా గందరగోళంగా అనిపించి మరుసటిరోజు స్వయంగా పోస్టాఫీసుకు వెళ్లి పార్సెల్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను. మరుసటిరోజు గురుపూర్ణిమ వచ్చింది. ఆరోజు నేను పోస్టాఫీసుకు వెళ్తే, పార్సెల్ డెలివరీ చేయడానికి పంపబడిందని చెప్పారు. బాబా ఇంటికి వస్తున్నారని నాకు సంతోషంగా అనిపించింది. కానీ ఆరోజు గ్రహణం ఉండటంతో ఆందోళనపడ్డాను. ఎందుకంటే సాయంత్రం 4:31 నుండి గ్రహణ సూతక సమయం ఉంది. "ఆ సమయంలో పార్సెల్ నాకు డెలివరీ అవుతుందేమో! ఒకవేళ అలా అయితే ఆ సమయంలో నేను నా బాబాను చూడలేను" అని అనుకున్నాను.

నేను బాబా కోసం వంటచేసి, ఆ ఆహారపదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి బాబా రాకకోసం ఎదురుచూస్తున్నాను. నిమిషానికోసారి డోరు వైపు చూస్తూ ఎంతో ఆత్రంగా ఉన్నాను. కాసేపటికి లంచ్ టైం అవుతుండటంతో ఇంట్లోని బాబా విగ్రహాలను టేబుల్ మీద పెట్టి, ప్లేట్ కూడా పెట్టాను. కానీ పార్సెల్ కూడా వస్తే, ఆ బాబాకి కూడా తినిపించవచ్చని నేను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతిక్షణం నా హృదయంలో బాబాని ప్రార్థిస్తున్నాను. కాని నేను అనుకున్నట్లు జరగలేదు. ఆలస్యమైపోతుందని ఇక నేను భజన పాటలు ఆన్ చేసి, చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను. అద్భుతం! "థోడా ధ్యాన్ లగా, సాయి దౌడే దౌడే ఆయేంగే" అనే భజన పాట మొదలైంది. అంతలో ఎవరో తలుపు తట్టారు. అది మరెవరో కాదు... నా బాబా! నా ఎదురుగా పార్సెల్‌లో ఉన్నారు. పార్సెల్‌ను నా చేతిలోకి తీసుకుంటూనే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంట్లో బాబాలకు తినిపించడానికి డైనింగ్ టేబుల్ మీద ఆహారం సిద్ధంగా ఉంది. అంతలో నా బాబా వచ్చారు. రెప్పపాటుకాలంలో జరిగిన పరిణామాలకు నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. వెంటనే ఆ బాబా మూర్తిని మా ఇంటి పూజగదిలో పెట్టి, కొన్ని పువ్వులు అర్పించాను. తరువాత ఆహారాన్ని పళ్లెంలో వడ్డించి నా సాయిబాబాకు, ఇతర దేవతలకు సమర్పించాను. బాబాకి ఆహారాన్ని తినిపిస్తూ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను.

జరిగినదంతా సచ్చరిత్ర 40వ అధ్యాయంలోని హేమాడ్‌పంత్‌కి జరిగిన సంఘటనని గుర్తుకు తెచ్చింది. హోలీ పండుగనాడు హేమాడ్‌పంత్ ఇంటికి భోజన సమయానికి బాబా వెళ్లినట్లుగా గురుపూర్ణిమనాడు మా ఇంటికి బాబా వచ్చి మర్చిపోలేని అద్భుతమైన అనుభవాన్నిచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

గురుపూర్ణిమనాడు బాబా దర్శనం - ఆయనిచ్చిన ఆనందం.

ఓం శ్రీ సాయిరాం! నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు నా ప్రణామాలు. నేను 9 గురువారాలు సాయిబాబా గుడికి వెళ్లి సచ్చరిత్ర పారాయణ చేస్తానని అనుకున్నాను. అందులో భాగంగా మొదటి గురువారం బాబా తన మెడలోని పూలమాలను నాకు ప్రసాదించి పారాయణకు సమ్మతి తెలియచేసిన లీలను ఇంతకుముందు నేను మీతో పంచుకున్నాను. రెండవవారం నేను పారాయణ మొదలుపెట్టే ముందు, “బాబా! ఈ వారం కూడా మీ అనుగ్రహాన్ని నాపై కురిపించండి" అని బాబాని ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ ముగించిన తరువాత పల్లకీ మోసే అవకాశాన్ని నాకిచ్చి రెండవవారం కూడా ఆయన అనుగ్రహాన్ని నాపై కురిపించారు. ఇలాగే 9 గురువారాలూ ఆయన లీలలు మాపై కురిపించాలని బాబాను మనసారా కోరుకుంటున్నాను. శ్రీ సాయినాథుడు చాలా విషయాలలో నాకు ఆయన సహాయాన్ని అందించారు. ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న కోరికను తీరుస్తారని ఆశిస్తున్నాను. ఇకపొతే నేను పరమపవిత్రమైన గురుపూర్ణిమరోజున సాయిబాబా దర్శన భాగ్యాన్ని కోల్పోయానని బాధపడితే అనూహ్యరీతిన ఆయన నాకు తమ దర్శనంతోపాటు అమితమైన ఆనందాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

గురుపూర్ణిమరోజు ఉదయాన నేను ఎలాగైనా బాబా గుడికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే, నేను నవగురువార వ్రతం చేస్తున్న సమయంలో గురుపూర్ణిమ కలసిరావడం నేనెంతో అదృష్టంగా భావించాను. కానీ ఆరోజు మా ఇంట్లో పనిచేసే ఆమె రానందున ఇంట్లో పనులన్నీ చేసుకుని గుడికి వెళ్దామనుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. సరే సాయంత్రం వెళ్లి బాబా దర్శనం చేసుకుందామనుకున్నాను. అయితే గ్రహణం కారణంగా గుడులన్నీ సాయంత్రం నాలుగు గంటలకే మూసివేస్తున్నారని టీవీలో చెప్పారు. అది విని నేను, "బాబా! నాకెందుకు ఇలా జరిగింది" అని చాలా బాధపడ్డాను. సాయంత్రం మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాటల సందర్భంలో నేనీరోజు బాబా దర్శనం చేసుకోలేకపోయానని వాళ్లతో చెప్పాను. అప్పుడు వాళ్లు, "గుడి 7 గంటల వరకు తెరచి ఉంటుంది" అని చెప్పారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా అటునుంచి అటే మా పాపని తీసుకుని గుడికి వెళ్ళాను. గురుపూర్ణిమ అలంకారాలతో అద్భుతమైన రూపంలో బాబా మాకు దర్శనమిచ్చారు. బాబా చాలా చాలా అందంగా ఉన్నారు. బాబాను చూస్తూనే నా మనసు ఆనందంతో నిండిపోయిందనుకుంటే, అక్కడున్న ఒకామె బాబా మెడలోని ఒక పూలమాలను తీసి నాకు, మా పాపకు ఇచ్చింది. నాకెంతో ఆశీర్వాదపూర్వకంగా అనిపించింది. తరువాత ఆరతిలో కూడా పాల్గొన్నాము. సంతోషాన్ని పట్టలేకపోయాను. ఆయన దర్శనాన్ని కోల్పోయానన్న నా బాధను తొలగించి అమితమైన ఆనందాన్నిచ్చారు బాబా. అలా ఎప్పటికీ ఆరోజు గుర్తుండిపోయేలా మలచారు బాబా. బాబా ఆశీస్సులు మాకు, తోటి సాయిబంధువులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

సాయి అనుగ్రహసుమాలు - 74వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 74వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 135

శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు  ఒక మిత్రుని వద్ద నుండి వచ్చిన లేఖలోని సారాంశం.

మీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం మరియు శ్రీ సాయిబాబా గారి ఊదీ చేరింది. ప్రతిరోజు నిత్యనియమంగా ఆ ఊదీని తీసుకుంటున్నాను. నా చిన్న కుమారుడు టైఫాయిడ్తో జబ్బున పడ్డాడు. నా శ్రీమతి శ్రీ సాయిబాబా ఫోటో ముందర దీపాలు వెలిగించి, పిల్లవాడు బాగయితే బాబా వద్దకు దీపాలు వెలిగించడానికి రూ. 5/- లను పంపుతానని మొక్కుకుంది. శ్రీసాయిబాబా కృప వలన పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు. అందువలన దీంతో పాటుగా ఐదు రూపాయల నోటును పంపుతున్నాను. కావున ఆ ఏర్పాటు ఈ డబ్బులతో చేయవలసిందిగా మనవి.

అనుభవం - 136 

16-1-1925 వ రోజు ఒక స్నేహితుని వద్ద నుండి శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు వచ్చిన ఉత్తరం లోని సారాంశం.

డియర్ సార్,
బహుశః మీరు నన్ను మరచిపోలేదనే అనుకుంటాను. పోయినసారి మనం కలసినప్పుడు మీరు సంతోషంగా నాకు శ్రీ సాయిబాబా ఫోటోను మరియు ఊదీ ఇచ్చారు. ఆ ఫోటోను మరియు ఊదీని నేను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం వలన, నేను ఎన్నో సమస్యలనుండి బయటపడ్డాను. శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందగలిగాను. ఈ రోజు అనుకోకుండా ఊదీ మహిమల గురించి ఇక్కడే నివసిస్తున్న నా ఆప్తమిత్రునితో చెప్పాను. తన యొక్క అల్లుడు ఊపిరితిత్తులు మరియు కడుపుకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. ఎంతో మంది వైద్యుల వద్ద నుండి వైద్యం పొందాడు. ప్రస్తుతం కలకత్తాలోని ఒక ప్రముఖ హోమియో వైద్యుని వద్ద నుండి చికిత్స పొందుతున్నాడు. నాకు కూడ ఆ అబ్బాయి అంటే ఎంతో ప్రేమ. ఒక విధంగా చెప్పాలంటే నేను కూడ అతనిని నా సొంత అల్లుని మాదిరిగానే భావిస్తాను. ఒక సంవత్సరం నుండి అతను చాల బాధపడుతున్నాడు. అతనికి మీరిచ్చిన బాబా ఫోటో, ఊదీ పంపించాలనే ఆలోచన నాకు వచ్చింది. అందువలన ఇప్పుడే అతనికి ఫోటో మరియు ఊదీ పంపించాను. అందువలన మీరు నాకు ఇంకొక నాలుగు ఫోటోలు (3 చిన్నవి ఎప్పుడూ మీ వద్ద ఉండేటటువంటివి, ఒకటి పెద్దది ఇంట్లో పెట్టుకోవడానికి) పంపించవలసినదిగా మనవి. వాటితో పాటుగా ఊదీ కూడ పంపించమని మనవి. అలాగే, రోగికి ఆ ఊదీని ఉపయోగించవలసిన తీరు కూడ తెలియపరచండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో తాను పూర్తిగా స్వస్థుడవుతాడనే సంపూర్ణవిశ్వాసం నాకుంది. అదే జరిగితే నేను మీకు ఎంతో ఋణపడి ఉంటాను.

అనుభవం - 137

ఒక నర్సు యొక్క అనుభవం.

శ్రీ సాయిబాబా పేరు కూడ నాకు తెలియదు. 1912వ సంవత్సరంలో నేను మా తండ్రి గారి ఇంట్లో పూజగదిలో పూజ చేసుకుంటున్నాను. పూజగది పైన ఉండేది. నా ఉపాసనాదైవం శ్రీరాముడు కావడంతో, హనుమంతుని విగ్రహం పూజలో ఉంది. పూజ పూర్తయ్యాక ముందు వరండాలో పడుకున్నాను. ముందరనున్న నేరేడుచెట్టు మీద ఒక తేజోమయమైన కోతి కనిపించింది. అది ఉన్నట్టుండి కిటికీ మీదకు దూకి, తరువాత మాయమైంది. రాత్రికి ఒక స్వప్నం వచ్చి అందులో శ్రీ సాయిబాబా కనిపించి “శిరిడీలో నీ రాముడు ఉన్నాడు, అక్కడకు వెళ్ళు” అని చెప్పారు. తరువాత మా గురువు దగ్గర నుండి నాకు శిరిడీ గురించి తెలిసింది. 1913వ సంవత్సరంలో నేను శిరిడీకి వెళ్ళాను. అక్కడ బాబాను చూసి స్వప్నంలో చూసింది ఈయననే అని నిర్ధారణకు వచ్చాను. అప్పటి నుండి బాబా సమాధి చెందేవరకు ప్రతిసంవత్సరం శిరిడీకి వెళ్ళేదానిని.

1917వ సంవత్సరంలో శిరిడీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్న ఆరతి పూర్తయి, భోజనం అయిపోయిన తరువాత నా పొలం గురించి బాబాను అడగాలి అనే ఆలోచన మనసులోకి వచ్చింది. కానీ స్వయంగా అడగడానికి ధైర్యం సరిపోదు. అందువలన, శ్రీ మాధవరావు దేశపాండేను నా పొలం గురించి నా తరపున అడగమని చెప్పాను. కానీ, ఆయన మీ విషయం మీరే అడగండి అని చెప్పాడు. నేను ద్వారకామాయిలోకి వచ్చేటప్పటికి బాబా ముందరనున్న గోడను పట్టుకుని వ్యాపారులను తిడుతున్నారు. ఆ తిట్లు భయంకరంగా ఉన్నాయి. బాబా కోపంతో ఎరుపెక్కిపోయి ఉన్నారు. నేను దూరంగా నిల్చొని ఉన్నాను. పదినిమిషాల తరువాత ద్వారకామాయిలోకి వెళ్ళి బాబాకు దగ్గరగా కూర్చొన్నాను. అన్నా  చింఛణీకర్ కూడా దగ్గరలో కూర్చొన్నారు. ఆయన బాబా పాదాలను పడుతున్నారు. శ్రీ జోగ్ కూడా వచ్చారు. అప్పుడు బాబా “అన్నా, పిన్నిని ముంచాడు. పూర్తిగా నాశనం చేసాడు. నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టాడు” అని అన్నారు.  చింఛణీకర్, శ్రీ జోగ్ తో “నేను ఎవరిదీ తీసుకోలేదు, ఎవరినీ ముంచలేదు. బాబా నేనెప్పుడైనా ఇబ్బంది పెట్టానా?” అని అన్నారు. ఇంతలో బాబా నావైపు చూచి నన్ను పైకి పిలిచారు. కాళ్ళు పట్టమని చెప్పారు. వీపుపై ప్రేమగా నిమిరారు. “పిన్నిని తిననివ్వు, మన అన్నా కూడా తింటున్నాడు కదా. ఫిర్యాదు చేయవద్దు. అల్లా మనకు ఇస్తాడు. మనకు ఏమీ తక్కువ చేయడు. నీవు, నేను మరియు అన్నా నాసిక్ లో ఉందాము” అని అన్నారు. నా తండ్రి పేరు అన్నా. నా సవతి తల్లికి, నాకు అసలు ఏ మాత్రం పడేది కాదు. నా ఉదర నిర్వాహణ కోసం అత్తగారు వాళ్ళు పొలం ఇచ్చారు. దానిని నా తండ్రి నాకు ఇవ్వడు మరియు నన్ను ఇంట్లో ఉండనివ్వడు. అందువలన ఫిర్యాదు చేయి అని కొందరు సలహా ఇచ్చారు. నాకు మొదట కష్టంగా అనిపించింది. తరువాత నర్సు పరీక్ష ఉత్తీర్ణురాలిని అయ్యాను. బాబా చెప్పినట్లు అల్లా ఇస్తున్నాడు, ఏమీ తక్కువ చేయడం లేదు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 114వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • అడుగడుగునా అందిన బాబా ఆశీస్సులు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను యు.ఎస్ లో నివసిస్తున్న సాయిభక్తుడిని. చిన్నప్పటినుంచి బాబాను ఒక సాధుసత్పురుషుడుగానే చూసేవాడిని. కానీ 2015లో నన్ను తన పాదాల చెంతకు లాక్కున్నప్పటినుండి బాబా భగవంతుని అవతారమని తెలుసుకున్నాను. అప్పటినుండి బాబా నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది.

ప్రియమైన సాయిభక్తులందరికీ బాబా తన భక్తులను ఎలా రక్షిస్తారో తెలుసు. నేను ఒక విషయంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ బాబా యందు పూర్తి విశ్వాసంతో, ఆయన స్మరణ చేస్తూ సమస్యను ఆయనకే విడిచిపెట్టాను. ఆయన తనదైన ప్రత్యేకశైలిలో ఆ సమస్యనుండి నన్ను బయటపడేశారు.  ఇటువంటి అనుభవాలు నాకు చాలానే జరిగాయి. వాటివల్ల బాబాపట్ల నా విశ్వాసం అధికమైంది. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

యు.ఎస్ లో నాకు ఒక స్వంత కంపెనీ ఉంది. 2018లో ఇండియాలో నాకున్న ఒక అపార్ట్‌మెంటుని అమ్మేసి, ఆ డబ్బుతో నా కంపెనీ లోన్  క్లియర్ చేయాలనుకున్నాను. అప్పటికే ఆ అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి ఒకతను సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు త్వరగా ఇండియా వెళ్లే అవకాశం లేకపోవడంతో, అతనిని వెయిట్ చేయించడం ఇష్టంలేక వేరే అపార్ట్‌మెంట్ ఏదైనా చూసుకోమని చెప్పాను. కానీ అతను మా అపార్ట్‌మెంట్ తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తూ, "డిసెంబర్ వరకు వేచి ఉంటాను. మీకు వీలైనప్పుడు రండి" అని చెప్పాడు. ఇలా ఉండగా అక్టోబర్ నెలలో అత్యవసరంగా నాకు డబ్బు అవసరమైంది. కానీ అపార్ట్‌మెంట్ అమ్మే పని త్వరగా అయ్యేది కాదు. ఎందుకంటే, ముందుగా అతను బ్యాంకు లోన్ పొందాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా ప్రయాస, సమయంతో కూడుకున్నది. అదీకాక వచ్చిన డబ్బును యు.ఎస్ తరలించడం చార్టెడ్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు, బ్యాంకు వీటన్నిటితో ముడిపడివుంది. దాంతో నేను నా అపార్ట్‌మెంట్ తీసుకుంటానన్న వ్యక్తికి ఫోన్ చేసి, "పనంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందా?" అని అడిగాను. "నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. మీరు రండి" అని అన్నాడు. సరేనని నేను ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకుని మంగళవారం ఉదయానికి ఇండియా చేరుకున్నాను. తీరా ఇండియా చేరాక ఒక నెల నుంచి లాయర్లు సమ్మె చేస్తున్నారని, అందువలన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్స్ జరగట్లేదని తెలిసింది. ఆ పనులన్నీ పూర్తి చేసుకోడానికి నావద్ద కేవలం ఎనిమిది పనిదినాలు మాత్రమే ఉండటంతో నాకేమి చేయాలో అర్థం కాలేదు. నా సమయం, డబ్బు వృధా అయిపోతున్నాయని ఆందోళనపడ్డాను. ఇక బాబాయే శరణం అనుకున్నాను. ఆయనయందు పూర్తి విశ్వాసముంచి, ఆయన స్మరణ చేస్తూ, "నా పని పూర్తయ్యేలా చూడమ"ని ప్రార్థించాను. ప్రతిరోజూ ఉదయం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్తుండేవాడిని. అక్కడ ప్రశాంతంగా, అందంగా ఉన్న బాబా మూర్తిని చూస్తుంటే నాకు మనశ్శాంతి లభిస్తుండేది. 

ఇలా రెండురోజులు గడిచాక గురువారం మధ్యాహ్నానికి నా అపార్ట్‌మెంట్ తీసుకుంటున్న అతని బ్యాంకు లోనుకి సంబంధించిన పేపర్ వర్క్ ఎటువంటి ఆటంకాలు లేకుండా  పూర్తయింది. ఆ సమయంలో అతను లాయర్ల సమ్మె శుక్రవారం ఉదయానికి ముగుస్తుందని, కాబట్టి రిజిస్ట్రేషన్ పని కూడా ఆరోజు పూర్తయ్యేలా చూస్తానని చెప్పాడు. దాంతో మిగిలినరోజుల్లో డబ్బు యు.ఎస్ కి ట్రాన్స్‌ఫర్ చేసే పని కూడా అయిపోతుందని అనుకున్నాను. అయితే శుక్రవారం ఉదయం అతను మళ్ళీ ఫోన్ చేసి, "అనుకున్నట్టుగా సమ్మెను ఆరోజు కాకుండా శనివారంరోజు లాయర్లు విరమించుకుంటార"ని చెప్పాడు. దాంతో నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అలవాటు ప్రకారం శనివారం ఉదయం బాబా దర్శనానికి వెళ్లి, "మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి" అని ప్రార్థించి, అక్కడ ఉన్నంతసేపు ఆయన స్మరణ చేస్తూ గడిపాను. తర్వాత పనిమీద బ్యాంకుకి వెళ్ళాను. మనసులో మాత్రం రిజిస్ట్రేషన్ గురించి ఆందోళనపడుతూ ఉన్నాను. ఒంటిగంట సమయంలో బ్యాంకు ముందున్న నా కారు తీస్తుండగా నా ఫోను రింగ్ అయింది. చూస్తే మా సిస్టర్. తను, "చాలాసేపటి నుంచి అపార్ట్‌మెంట్ తీసుకునే అతను ఫోన్ చేస్తున్నారు, కానీ మీ ఫోన్ కలవడం లేదు, వెంటనే బయలుదేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రమ్మ"ని చెప్పింది. నాకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. వెంటనే నేను ఇంటికి వెళ్లి, కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి బయలుదేరాను. దారిలో ఈ మొత్తం ప్రక్రియలో మాకు సహాయం చేస్తున్న ఒకతనిని కూడా కారులో ఎక్కించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్నాను. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఆ చోటు ఎడారిని తలపించేలా ఖాళీగా ఉండటంతో ఆశ్చర్యపోయాను. ముందుగా లాయర్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ నా దృష్టిని ఆకర్షించిన మొదటి వస్తువు - ఆయన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకం. దానిపై బాబా ఫోటో ఉంది. వెంటనే లాయర్ని, "అది సచ్చరిత్రనా?" అని అడిగాను. అందుకాయన, అది "శిరిడీ డైరీ" అని చెప్పారు. బాబా నాకు తోడుగా ఉన్నారని చాలా ఆనందించాను. తర్వాత  లాయరు అవసరమైన డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అడిగారు. అయితే డాక్యుమెంట్స్, ఐడీప్రూఫ్స్ మాత్రమే కావాలని ముందుగా చెప్పి ఉండటంతో వాటినే నేను తీసుకెళ్లాను. దాంతో ఫోటోల కోసం ఏం చేయాలా అని టెన్షన్ పడ్డాను. వెంటనే బాబా నాకో ఆలోచన స్ఫురింపజేశారు. నాతోపాటు ఎప్పుడూ ఉండే బ్యాగులో 2 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ కోసం తీసుకున్న ఫోటోలున్నాయి. బ్యాగులో చూస్తే సరిగ్గా రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. 'బాబా ఎంత కరుణామయుడు!' అని నా హృదయం ఆనందంతో పులకించిపోయింది.

ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటూనే లాయరు, 'సాక్షిగా ఎవరు ఉన్నారు?' అని అడిగారు. కారులో నాతోపాటు తీసుకొచ్చిన వ్యక్తి సాక్షిగా ఉంటానని అన్నారు. అప్పుడు లాయరు అతని ఐడీ ప్రూఫ్స్ అడిగారు. అవి అతని వద్దలేవు. లాయరు కనీసం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందని అతనితో అన్నారు. కానీ అతను అది కూడా లేదని చెప్పారు. సరే ఇంటికి వెళ్లి వస్తామనుకుంటున్న సమయంలో మరో అద్భుతం జరిగింది. ఎందుకో అనుకోకుండా అతను తన జేబులో ఉన్న కాగితాలన్నీ చూస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ కనిపించింది. తరువాత డాక్యుమెంట్స్ టైపు చేసే వ్యక్తి భోజనానికి వెళ్లి గంటవరకు కనపడలేదు. మరో వ్యక్తి 3 గంటలకే తన గ్రామానికి వెళ్లిపోవాలని అంటాడు. చివరిగా సంతకం పెట్టాల్సిన వ్యక్తి లాయర్ల సమ్మె సాకుగా చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు. ఇలా ఎన్నో అవాంతరాలు, ఇబ్బందుల నడుమ సుమారు 4 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరికి బాబా దయతో రాత్రి 7.30 కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా రావిచెట్టు కింద నడిచింది. అది నాకు బాబా వేపచెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న వృత్తాంతాన్ని గుర్తు చేసింది. దానితో జరుగుతున్నదంతా బాబా ఆశీస్సులతోనే జరుగుతుందని, ఇకపైన కూడా ఆయన కృపతో ఉన్న తక్కువ సమయంలో అంతా సజావుగా సాగిపోతుందని అనిపించింది.

మరుసటిరోజు నేను బ్యాంకు మేనేజరుని కలిసాను. బ్యాంకు మేనేజర్ చేతివేళ్ళకి అందమైన బాబా ఉంగరం ఉంది. అలా ప్రతి మలుపులో 'నేను నీకు తోడుగా ఉన్నాన'ని బాబా సూచించారు. ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కరలేదు, పనంతా సజావుగా సాగిపోయింది. అప్పటికి గత కొన్ని నెలలుగా రూపాయి విలువ పడిపోతుండటంతో నాకు చాలా ఎక్కువ డాలర్స్ వచ్చాయి. అంతా బాబా కృప.

నా అనుభవాన్ని చాలా ఎక్కువగా వ్రాసానని నాకు తెలుసు. కానీ నా తోటి భక్తులకు బాబా ఎట్టి పరిస్థితిలోనూ మన చేయి వదిలిపెట్టరని తెలియజేయడానికి ప్రతి విషయాన్నీ వ్రాసాను. ఆయన మన 'శ్రద్ధ' 'సబూరి'లను పరీక్షిస్తారు. కాబట్టి ప్రియమైన భక్తులారా! సహనాన్ని కోల్పోకుండా విశ్వాసంతో బాబాను ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. "బాబా! మీ దివ్య పాదాల చెంత చోటివ్వండి. నాతోటి సోదర సోదరీమణులకు మీ సహాయాన్ని అందించి మీ చల్లని నీడలో ఆశ్రయాన్ని ఇవ్వండి".   

ఓం శ్రీసాయినాథాయ నమః!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2356.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo