సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 101వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • బాబానే స్వయంగా నన్ను మహాపారాయణలో భాగస్వామిని చేశారు

తాడిపత్రి నుండి శ్రీమతి జ్యోతిగారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నమస్కారములు. అమెరికా మహాపారాయణ గ్రూపులో బాబా నన్ను స్వయంగా చేర్చుకున్న లీలను ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను.

మా పక్కింటిలో ఉండే బిందు అనే అమ్మాయికి పెళ్లయ్యాక తన భర్త ఉద్యోగరీత్యా ఆరు సంవత్సరాలనుండి అమెరికాలో నివసిస్తూ ఉంది. జనవరిలో నేను తనతో ఫోనులో మాట్లాడుతూ ఉండగా ఆమె, "నేను ఇక్కడ బాబా మహాపారాయణ గ్రూపులో చేరాను. మీకు ఇష్టమైతే మిమ్మల్ని కూడా మా గ్రూపులో చేర్చుకుంటారేమో అడుగుతాను" అన్నది. నేను, "అంతకన్నా భాగ్యమా! సంతోషంగా చేరుతాను" అన్నాను. తరువాత ఆమె తన గ్రూపు లీడరుకు నా గురించి మెసేజ్ పెట్టింది. కానీ, వారినుండి నాలుగు రోజులైనా ఎటువంటి సమాధానమూ లేకపోయేసరికి తను నాకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. నేను, "బాబా నన్ను తన గ్రూపులో చేర్చుకోవాలంటే ఎంతసేపు? ఆయన ఆజ్ఞ ఉంటే నాకు అవకాశం వస్తుంది, నువ్వేమీ బాధపడకు" అని చెప్పాను. కానీ, 'నాకు అవకాశం రాలేదే' అని ఎంతో బాధపడుతుండేదాన్ని. ఆ సమయంలోనే మా బంధువులు శిరిడీ వెళ్తున్నారని తెలిసి బాబాకు సమర్పించమని దక్షిణ, ఒక లెటర్ వాళ్ళకు ఇచ్చి పంపాను. ఆరోజు జనవరి 7, 2019. తరువాత నేను ఫోన్లో బిందుతో మాట్లాడుతూ, "నాకు పారాయణ గ్రూపులో చేరే అవకాశం రాలేదు కదా! కానీ నాకు పారాయణ చేయాలని వుంది. గ్రూపులో సభ్యులకు గురువారం రోజు 2 అధ్యాయాలు పారాయణ చేయమని చెబుతారు కాబట్టి నేను కూడా ఈ గురువారంనుండి బాబా నాకు ఏ అధ్యాయాలు చూపిస్తే ఆ అధ్యాయాలను పారాయణ చేస్తాను" అని చెప్పాను. బిందు కూడా సరేనన్నది. నేను జనవరి 10వ తేదీ గురువారం బాబాతో, "సచ్చరిత్ర పుస్తకం తెరిచి, ఏ అధ్యాయమైతే వస్తుందో ఆ అధ్యాయాలు పారాయణ చేస్తాను" అని చెప్పుకొని సచ్చరిత్ర పుస్తకాన్ని తెరిచాను. అప్పుడు నాకు నాలుగవ అధ్యాయం వచ్చింది. నేను నాలుగు, అయిదు అధ్యాయాలు పారాయణ చేసి, వాటిని నేను పారాయణ చేసినట్లు అమెరికాలో వున్న బిందుకి మెసేజ్ పెట్టాను. బాబా ఇక్కడ చిన్న చమత్కారం చేశారు. నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చాలనుకున్న విషయం బిందు తన భర్తకు చెప్పింది. అతను ఆఫీసులో తన స్నేహితునికి ఈ విషయం చెప్పగా, అతను, "నాకు తెలిసిన మరో పారాయణ గ్రూప్ ఉంది. జ్యోతిగారికి దానిలో ఏమైనా అవకాశం వస్తుందేమో చూడు" అని చెప్పి, ఆ గ్రూపు లీడర్ ఫోన్ నెంబరు ఇచ్చారు. ఆ గ్రూపు లీడర్ స్వర్ణగారు. బిందు భర్త ఇంటికి వచ్చి బిందుకి స్వర్ణగారి నెంబర్ ఇచ్చి, నన్ను గ్రూపులో చేర్చుకుంటారేమో అడగమని చెప్పాడు. అప్పుడు బిందు నన్ను గ్రూపులో చేర్చుకునే అవకాశం వుందేమో అడుగుతూ, దాంతోపాటు  నేను ఆరోజు పారాయణ చేసిన అధ్యాయాలు కూడా స్వర్ణగారికి మెసేజ్ పెట్టింది. తను పెట్టిన మెసేజ్ చూసిన వెంటనే స్వర్ణగారు బిందుకి ఫోన్ చేసి, "ఆవిడ ఎవరు? ఆమె ఎందుకు ఆ అధ్యాయాలనే చదవాలనుకున్నారు? ఆవిడకి ఆ అధ్యాయాలు చదవమని ఎవరు చెప్పారు?" అని వెంటవెంటనే ప్రశ్నలు వేయసాగారు. బిందు జరిగినదంతా స్వర్ణగారికి చెప్పింది. వెంటనే స్వర్ణగారు ఏమీ మాట్లాడలేక ఏడ్చేశారు. తను ఎందుకేడుస్తున్నారో బిందుకి అర్థంకాక, తనను కారణం అడిగింది. అప్పుడు స్వర్ణగారు ఇలా చెప్పారు: "మేమంతా ఈరోజు చాలా బాధగా వున్నాము. ఎందుకంటే, మా టీములో ఉన్న ఒక మెంబర్ బుధవారం చనిపోయారు. గురువారం ఆమె చదవాల్సిన అధ్యాయాలు బాబా ఈమెతో చదివించారు. బాబా తనకు కావలసిన వ్యక్తిని తానే ఎన్నుకున్నారు" అని చెప్పారు. తరువాత నా పేరు అడిగి తెలుసుకుని, "జ్యోతిని మా టీములోకి వెలుగులాగా బాబా పంపారు. ఆయన చేసిన అద్భుతమైన లీల చూసి నాకు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి" అని చెప్పి, "నేను ఆమెతో మాట్లాడాలి" అన్నారు. దానికి బిందు, "మేడం, వారికిప్పుడు అర్థరాత్రి. నేను ఆమె ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు ఉదయం మాట్లాడండి" అని చెప్పింది.

కానీ బిందు మాత్రం ఈ విషయం నాకు ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఎదురుచూస్తూ, ఇక ఉండబట్టలేక తెల్లవారుజామున 4.00 కు ఫోన్ చేసి, "ఆంటీ, మీ విషయంలో బాబా ఒక మిరాకిల్ చేశారు. ఈ విషయం అమెరికాలో సాయిభక్తులందరికీ షేర్ చేశారు, కానీ మీకే ఆలస్యంగా తెలుస్తోంది" అని, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణంతా వివరంగా చెప్పి, "మామూలుగా పారాయణ గ్రూపు వాళ్ళు ఎవ్వరికీ ఫోన్ చెయ్యరు. కానీ, వారు ఇప్పుడు మీతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు, బాబానే మిమ్మల్ని ఎన్నుకున్నారు" అంటూ సంతోషంగా చెప్పింది. నాకిక ఆనందంతో మాటలు రాలేదు. ఆయనే స్వయంగా నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చుకున్నందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఈ మిరాకిల్ జరగడానికి 15 రోజుల ముందు బాబా పుస్తకం తెరిచినప్పుడు ఈక్రింది మెస్సేజ్ వచ్చింది:

"నువ్వు ఏడు సముద్రాలు దాటుతావు" అని.

ఈ మెస్సేజ్ బిందుకు పంపించి, "చూడు బిందూ! బాబా "ఏడు సముద్రాలు దాటుతావు" అంటున్నారు. ఏడు సముద్రాలు దాటడమంటే అమెరికాకు వెళ్తాననే కదా! ఇలా ఎందుకు చెప్తున్నారు?" అని అడిగితే, అప్పుడు బిందు, "ఏమో ఆంటీ, సాయి (అంటే మా అబ్బాయి) బి.టెక్ అయిపోయాక అమెరికా రావచ్చు కదా! అప్పుడు మీకు కూడా ఇక్కడకు వచ్చే అవకాశం బాబా ఇస్తారేమో!" అన్నది. నేను కూడా బాబా మా అబ్బాయిని ఇలా ఆశీర్వదిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఈ విధంగా ఏడు సముద్రాలు దాటించి అమెరికాలోని మహాపారాయణ గ్రూపులో భాగస్వామిగా చేసి నన్ను అనుగ్రహించారు బాబా. 

2 comments:

  1. Om Sai ram .
    Meru Chala adrushta vanthulu Andi.sai tatayya Krupa meku yella velala vundalani korukuntunnanu.

    "Akilandakoti brmhandanayaka rajadi raja Yogi raja parabramha Sri sachidanandha samardha sadguru Sai nath Maharaj ki Jai".

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo