సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 115వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా
  2. గురుపూర్ణిమనాడు బాబా దర్శనం - ఆయనిచ్చిన ఆనందం.

గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా

సాయిభక్తురాలు సగుణ్ లంబా గురుపూర్ణిమనాటి తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా సాయి కుటుంబసభ్యులకు సాయిరామ్! గురుపూర్ణిమనాడు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

సాయిసోదరి సజల్ ఏప్రిల్‌ నెలలో శిరిడీ సందర్శించినప్పుడు ఒక బాబా విగ్రహాన్ని తీసుకుని నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. కానీ మా ఇంటినుండి 20 గంటల ప్రయాణం చేసేంత దూరంలో ఆమె ఉంటున్నందున నేరుగా ఆ బహుమతిని నాకివ్వడానికి తనకి కుదరలేదు. కాబట్టి తన బంధువులు, స్నేహితులలో ఎవరైనా ఢిల్లీ సందర్శించినట్లైతే వారి ద్వారా ఆ బహుమతిని నాకు పంపే విధంగా మేము అనుకున్నాము. కానీ అలా కూడా జరగలేదు. బాబా ప్రణాళికలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన నాకెంతో ఆనందాన్నిచ్చే ప్రణాళిక సిద్ధం చేసి పెట్టారు. మూడు నెలలు గడిచాక సజల్ ఆ బహుమతిని ఇండియన్ పోస్టల్ ద్వారా నాకు పంపాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే 2019, జూలై 12న ఆమె పోస్టల్ సర్వీసెస్‌లో ఆ బహుమతిని ఇచ్చింది. మేమిద్దరం ఆ బహుమతి జూలై 16, గురుపూర్ణిమనాడు  ఢిల్లీ చేరుకోవచ్చని అనుకున్నాము. అయితే పార్సెల్ జూలై 15నే ఢిల్లీ చేరుకుంది. ఆరోజే వాళ్ళు డెలివరీ చేయడానికి మా ఇంటికి వస్తే, మా ఇంటి డోర్ లాక్ చేయబడి ఉండటంతో వెనుదిరిగి వెళ్లిపోయారని నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరూ ఇంటికి రాలేదు. నాకంతా గందరగోళంగా అనిపించి మరుసటిరోజు స్వయంగా పోస్టాఫీసుకు వెళ్లి పార్సెల్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను. మరుసటిరోజు గురుపూర్ణిమ వచ్చింది. ఆరోజు నేను పోస్టాఫీసుకు వెళ్తే, పార్సెల్ డెలివరీ చేయడానికి పంపబడిందని చెప్పారు. బాబా ఇంటికి వస్తున్నారని నాకు సంతోషంగా అనిపించింది. కానీ ఆరోజు గ్రహణం ఉండటంతో ఆందోళనపడ్డాను. ఎందుకంటే సాయంత్రం 4:31 నుండి గ్రహణ సూతక సమయం ఉంది. "ఆ సమయంలో పార్సెల్ నాకు డెలివరీ అవుతుందేమో! ఒకవేళ అలా అయితే ఆ సమయంలో నేను నా బాబాను చూడలేను" అని అనుకున్నాను.

నేను బాబా కోసం వంటచేసి, ఆ ఆహారపదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి బాబా రాకకోసం ఎదురుచూస్తున్నాను. నిమిషానికోసారి డోరు వైపు చూస్తూ ఎంతో ఆత్రంగా ఉన్నాను. కాసేపటికి లంచ్ టైం అవుతుండటంతో ఇంట్లోని బాబా విగ్రహాలను టేబుల్ మీద పెట్టి, ప్లేట్ కూడా పెట్టాను. కానీ పార్సెల్ కూడా వస్తే, ఆ బాబాకి కూడా తినిపించవచ్చని నేను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ప్రతిక్షణం నా హృదయంలో బాబాని ప్రార్థిస్తున్నాను. కాని నేను అనుకున్నట్లు జరగలేదు. ఆలస్యమైపోతుందని ఇక నేను భజన పాటలు ఆన్ చేసి, చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను. అద్భుతం! "థోడా ధ్యాన్ లగా, సాయి దౌడే దౌడే ఆయేంగే" అనే భజన పాట మొదలైంది. అంతలో ఎవరో తలుపు తట్టారు. అది మరెవరో కాదు... నా బాబా! నా ఎదురుగా పార్సెల్‌లో ఉన్నారు. పార్సెల్‌ను నా చేతిలోకి తీసుకుంటూనే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంట్లో బాబాలకు తినిపించడానికి డైనింగ్ టేబుల్ మీద ఆహారం సిద్ధంగా ఉంది. అంతలో నా బాబా వచ్చారు. రెప్పపాటుకాలంలో జరిగిన పరిణామాలకు నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. వెంటనే ఆ బాబా మూర్తిని మా ఇంటి పూజగదిలో పెట్టి, కొన్ని పువ్వులు అర్పించాను. తరువాత ఆహారాన్ని పళ్లెంలో వడ్డించి నా సాయిబాబాకు, ఇతర దేవతలకు సమర్పించాను. బాబాకి ఆహారాన్ని తినిపిస్తూ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను.

జరిగినదంతా సచ్చరిత్ర 40వ అధ్యాయంలోని హేమాడ్‌పంత్‌కి జరిగిన సంఘటనని గుర్తుకు తెచ్చింది. హోలీ పండుగనాడు హేమాడ్‌పంత్ ఇంటికి భోజన సమయానికి బాబా వెళ్లినట్లుగా గురుపూర్ణిమనాడు మా ఇంటికి బాబా వచ్చి మర్చిపోలేని అద్భుతమైన అనుభవాన్నిచ్చారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

గురుపూర్ణిమనాడు బాబా దర్శనం - ఆయనిచ్చిన ఆనందం.

ఓం శ్రీ సాయిరాం! నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు నా ప్రణామాలు. నేను 9 గురువారాలు సాయిబాబా గుడికి వెళ్లి సచ్చరిత్ర పారాయణ చేస్తానని అనుకున్నాను. అందులో భాగంగా మొదటి గురువారం బాబా తన మెడలోని పూలమాలను నాకు ప్రసాదించి పారాయణకు సమ్మతి తెలియచేసిన లీలను ఇంతకుముందు నేను మీతో పంచుకున్నాను. రెండవవారం నేను పారాయణ మొదలుపెట్టే ముందు, “బాబా! ఈ వారం కూడా మీ అనుగ్రహాన్ని నాపై కురిపించండి" అని బాబాని ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ ముగించిన తరువాత పల్లకీ మోసే అవకాశాన్ని నాకిచ్చి రెండవవారం కూడా ఆయన అనుగ్రహాన్ని నాపై కురిపించారు. ఇలాగే 9 గురువారాలూ ఆయన లీలలు మాపై కురిపించాలని బాబాను మనసారా కోరుకుంటున్నాను. శ్రీ సాయినాథుడు చాలా విషయాలలో నాకు ఆయన సహాయాన్ని అందించారు. ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న కోరికను తీరుస్తారని ఆశిస్తున్నాను. ఇకపొతే నేను పరమపవిత్రమైన గురుపూర్ణిమరోజున సాయిబాబా దర్శన భాగ్యాన్ని కోల్పోయానని బాధపడితే అనూహ్యరీతిన ఆయన నాకు తమ దర్శనంతోపాటు అమితమైన ఆనందాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

గురుపూర్ణిమరోజు ఉదయాన నేను ఎలాగైనా బాబా గుడికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే, నేను నవగురువార వ్రతం చేస్తున్న సమయంలో గురుపూర్ణిమ కలసిరావడం నేనెంతో అదృష్టంగా భావించాను. కానీ ఆరోజు మా ఇంట్లో పనిచేసే ఆమె రానందున ఇంట్లో పనులన్నీ చేసుకుని గుడికి వెళ్దామనుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. సరే సాయంత్రం వెళ్లి బాబా దర్శనం చేసుకుందామనుకున్నాను. అయితే గ్రహణం కారణంగా గుడులన్నీ సాయంత్రం నాలుగు గంటలకే మూసివేస్తున్నారని టీవీలో చెప్పారు. అది విని నేను, "బాబా! నాకెందుకు ఇలా జరిగింది" అని చాలా బాధపడ్డాను. సాయంత్రం మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాటల సందర్భంలో నేనీరోజు బాబా దర్శనం చేసుకోలేకపోయానని వాళ్లతో చెప్పాను. అప్పుడు వాళ్లు, "గుడి 7 గంటల వరకు తెరచి ఉంటుంది" అని చెప్పారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా అటునుంచి అటే మా పాపని తీసుకుని గుడికి వెళ్ళాను. గురుపూర్ణిమ అలంకారాలతో అద్భుతమైన రూపంలో బాబా మాకు దర్శనమిచ్చారు. బాబా చాలా చాలా అందంగా ఉన్నారు. బాబాను చూస్తూనే నా మనసు ఆనందంతో నిండిపోయిందనుకుంటే, అక్కడున్న ఒకామె బాబా మెడలోని ఒక పూలమాలను తీసి నాకు, మా పాపకు ఇచ్చింది. నాకెంతో ఆశీర్వాదపూర్వకంగా అనిపించింది. తరువాత ఆరతిలో కూడా పాల్గొన్నాము. సంతోషాన్ని పట్టలేకపోయాను. ఆయన దర్శనాన్ని కోల్పోయానన్న నా బాధను తొలగించి అమితమైన ఆనందాన్నిచ్చారు బాబా. అలా ఎప్పటికీ ఆరోజు గుర్తుండిపోయేలా మలచారు బాబా. బాబా ఆశీస్సులు మాకు, తోటి సాయిబంధువులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo