సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 67వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 67వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 126

ఆత్మ స్వరూప దర్శనం 

ఆత్మస్వరూపం అంటే ఏమిటి? అని ఎవరినయినా అడిగితే, అది ఫలానా విధంగా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కారణం, ఆ ఆత్మ అనేది అనీర్వచనీయమైన వస్తువు. "ఆత్మ అనేది క్రింద ఉంటుంది, పైనుంటుంది, వెనుక ఉంటుంది, ముందర, కుడి వైపున, ఎడమ వైపున అన్ని చోట్ల ఉంటుంది” అని శ్రుతి యొక్క ఉపదేశం. ఆ విధంగా ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం గురించి చెప్పినప్పటికీ, తన స్వరూపం గురించి చెప్పలేనప్పటికీ, తన దృశ్యరూపం పై మనిషి ఆలోచన చేయాలి. ఆత్మప్రకాశంతో సూర్యచంద్రులు, నక్షత్రాలు, మెరుపు అన్నీ ప్రకాశిస్తాయి. అంటే తన ప్రకాశం వలనే ఇవన్నీ ప్రకాశిస్తాయి అని వేదాలు ఉపదేశిస్తున్నాయి. ఆ స్వరూపాన్ని దర్శించుకోలేక పోవటం వలన, దాని యొక్క నిజతత్వం అనుభవం కాలేదు. ఆత్మ యొక్క ప్రకాశమయ కిరణాలు శరీరం బయట కూడ ప్రకాశిస్తాయి. ఆ కిరణాలు అత్యంతపుణ్యవంతులైన పురుషుల దృష్టిలో పడతాయి లేదా మహాత్ములు అనుగ్రహిస్తే దృష్టిలో పడతాయి, కానీ మనకు అంతటి యోగ్యత లేకపోవడం వలన, ఆ ఆత్మ స్వరూప దర్శనానికి సంబంధించి నిరాశ కలిగింది. ఇక మిగిలింది ఏమిటి మహాత్ముల అనుగ్రహాన్ని పొందడం. కానీ, అంతటి మహాత్ముడు ఎవరు లభిస్తారు? ఆయన అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? అనే చింత నాకు రాత్రింబవళ్ళు కలుగసాగింది. “నహీ చాలత్ తాతడీ ప్రాప్తకాలి ఘుడీ అసల్యావిణా (ప్రాప్త కాలం కోసం ఎదురు చూడాలి, ఇప్పటికిప్పుడంటే కుదరదు)” అనే తుకారాం మహారాజ్ అభంగాన్ని స్మరించుకున్న తరువాత మనసుకు కొంచెం స్థిరత్వం కలిగింది. తరువాత శ్రీ సచ్చిదానంద కృపతో శిరిడీకి వెళ్ళడం జరిగి, శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్న తరువాత, ఎప్పుడయితే ఈయనే సచ్చిదానంద అనే భావన కలిగిందో, అప్పుడు మరలా ఆత్మస్వరూప దర్శనజిజ్ఞాస మరలా ఉవ్వెత్తున ఎగిసింది. ఆ విషయం గురించి బాబాను కొన్ని ప్రశ్నలు అడగాలనే భావన మనసులో కలిగింది. కానీ అనేక సార్లు బాబా “తేలి మంచివాడు కాదు. ఈ నూనె తినవద్దు, నెయ్యి తిను” అని అనేవారు. కానీ ఆ మాటలకర్థం నాకు బోధ పడేది కాదు. తరువాత కొన్ని రోజులకు నా ఆందోళన సద్దుమణిగింది. తరువాత “నూనె మాదిరి తరంగాలను ఉత్పత్తి చేసే మనసు చెడ్డది. కానీ శాంతరూపమైన నేతిని సేవించడం వలన లాభం కలుగుతుంది” అని నాకు అర్థమైంది. నిజంగా అలానే జరిగింది. ఒకరోజు బల్వంతరావు ఖపర్డే, నేను ఉదయం పూట వ్యాహ్యాళికి వెళ్ళాము. ఆరోజు మంచు విపరీతంగా పడింది. అప్పుడే సూర్యోదయం జరిగింది. వెళుతూ, వెళుతూ ఉండగా సహజంగానే నా దృష్టి పశ్చిమం వైపు వెళ్ళింది. అప్పుడు నాకు పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు సూర్యకిరణాలు వివిధ రంగులలో వ్యాప్తి చెందినట్లుగా కనిపించింది. నా నీడ భూమిపై చాల పొడవుగా పడి, ఆ నీడపై దీర్ఘ వర్తులాకారంలో ఇంద్రధనస్సు ఆవరించి ఉంది. నీడ యెక్క తల చుట్టూ సూర్యకిరణాల వెలుగు వర్తులాకారంలో కనిపించసాగింది. ఆ చమత్కారం చూసి ఆ వేళలో నేను ఎంత ఆనందించానో చెప్పడం అసాధ్యం. ఆ చమత్కారం చూస్తూ నిలబడి పోయాను. ఇంతలో బల్వంతరావు “ఏమిటి, ఎందుకు నిలబడిపోయారు?” అని అడిగారు. అప్పుడు నేను “మీరు ఎందుకు  నిలబడ్డారు?” అని అడిగాను (కారణం తాను నాలాగా  ఆశ్చర్య చకితుడై  పోయాడు). అప్పుడు తాను నాకు జరిగినట్లుగానే తనకు కూడా  అనుభవమైన సంగతి చెప్పాడు. నా నీడ నీకు కనపడుతుందా?” అని తనను అడిగాను. “లేదు” అని తాను సమాదానమిచ్చాడు. (ఎండకు పడిన నీడ ఎవరిది ఎవరికైనా కనిపిస్తుంది. కానీ మా ఇదరిలో ఒకరి నీడ ఒకరికి కనిపించని చమత్కారం జరిగింది). అప్పుడు “నాది నాకే తెలుస్తుంది” అనే మహాత్ముల వచనం జ్ఞప్తికి వచ్చింది. ఆ దారిన వెళ్ళే వాళ్ళను "మీకు ఏమయినా కనిపించిందా?” అని అడిగితే వారు “లేదు” అని సమాధానమిస్తూ వెళ్ళిపోయారు. ఆ చమత్కారాన్ని చాలా సేపు దర్శించిన తరువాత వాడాకు వచ్చాము. దాదాసాహెబ్ కు జరిగిన విషయం చెప్పగానే “బాబా కృప! మీకు ఆత్మస్వరూపాన్ని దర్శింప చేసారు” అని అన్నారు. ఆ తరువాత బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబా మా వైపు చూసి నవ్వారు. అప్పుడు దాదాసాహెబ్ మాటలు నిజమనిపించి ఆ లీల బాబా కృపయనే నిర్ధారణ కలిగింది. అయినప్పటికీ మంచులో అలా జరుగుతుందేమోననే అనుమానం కలిగింది. ప్రతి ఒక్కసారి మంచులో ఆ చమత్కారం జరుగుతుందేమో చూడమని బల్వంతరావుకి చెప్పి, నేనూ చూడసాగాను. నాకయితే ఆ చమత్కారం కనిపించలేదు. “మీ సంగతి ఏమిటి?” అని బల్వంతరావుని అడిగితే “నేను చాలాసార్లు మంచులో నిలబడి ఆ చమత్కారం కోసం చూసాను, కానీ ఒక్కసారి కూడా అలా జరుగలేదు” అని చెప్పాడు. సారాంశమేమిటంటే సచ్చిదానంద సాయిబాబా ఆత్మస్వరూపాన్ని దర్శింపచేసారు. “సత్సాంకల్పాచ దాత భగవాన్ సర్వు  కరో పూర్ణ మనోరథ్ (సత్సంకల్ప ప్రదాత అయిన భగవంతుడు అందరి మనోరథాన్ని ఈడేరుస్తారు) అనే మహాత్ముల వచనోక్తి సత్యం. బాబా తమ భక్తుల సర్వ కోరికలను తీరుస్తారు.

కె.జే. బీష్మ

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo