సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 106వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. "నీవు ఎవరినైనా కోపగించుకుంటే నాకెంతో బాధ కలుగుతుంది".
  2. సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు

ఈరోజు అనుభవాలను సాయిబంధువు సుమ పంచుకుంటున్నారు:

"నీవు ఎవరినైనా కోపగించుకుంటే నాకెంతో బాధ కలుగుతుంది".

ఓం సాయిరామ్! నా పేరు సుమ. నేను నెల్లూరు నివాసిని. ముందుగా బ్లాగు నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్లాగులో నేను పంచుకుంటున్న మూడవ అనుభవమిది.

2019 జూన్ 16వ తేదీ, శనివారంనాడు మా చెల్లికి ఒక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, "మీ అక్క వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఆ విషయం మీ అక్కకి చెప్పు" అన్నారు. తను, "ఎందుకు బాబా?" అని అడిగితే, "మీ అక్కకి కోపం ఎక్కువ. అందరిమీదా అరుస్తుంది. అందువలన అవతలివాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతిజీవిలో నేనే ఉన్నాను. వాళ్ళని కోప్పడితే నాపై కోపగించుకున్నట్టే. మీ అక్కకి కోపంగాని, బాధగాని వస్తే నా పాదాలు పట్టుకుని శాంతంగా ఉండమను. అంతా నేను చూసుకుంటాను. ఇకపై ఎవరిమీదా కోప్పడవద్దని చెప్పు" అన్నారు. అక్కడితో కల ముగిసింది.

ఉదయాన నిద్రలేస్తూనే మా చెల్లి తనకి వచ్చిన కల గురించి నాతో చెప్పింది. అది వినగానే నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడైనా నేను ఏ కాస్త బాధలో ఉన్నా కూడా సాయిమహారాజ్ వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను సంతోషపెడతారు. 'అలాంటి బాబాని నేను ఇంతలా బాధపెడుతున్నానా?' అని తెలిసేసరికి నాకు దుఃఖం ఆగలేదు. నిజానికి నాకు కోపం చాలా ఎక్కువే. అయితే అది ఎక్కువసేపు ఉండదు. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం అవతలివాళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా కోపంలో నేను ఏదేదో మాట్లాడేస్తుంటాను. ప్రతిజీవిలో బాబా ఉంటారని తెలిసి కూడా నేను అలా ప్రవర్తించడం చాలా చాలా పెద్ద పొరపాటు. నిజంగా నా కోపం వల్ల బాధ కలిగిన వాళ్ళందరికీ పేరుపేరునా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. "బాబా! దయచేసి నన్ను క్షమించండి".

సాయికి తన బిడ్డలమైన మనమంటే ఎంత అమితమైన ప్రేమో! 'నా వల్ల బాధపడుతున్నాన'ని అన్నారేగాని, నాపై కోపంగా ఉందని అనలేదు. సాయి ప్రేమగల తల్లి. తల్లికి తన బిడ్డ మీద ఎప్పుడూ కోపం రాదు. కానీ 'నా బిడ్డ ఇలా చేస్తుందే' అని బాధపడతారు. ఈ బిడ్డ వలన సాయిమాత పడుతున్న బాధ నాకు ఆ కల ద్వారా అర్థమైంది. నా కోసం బాబా ఎన్నో చేశారు, ఎన్నో అసాధ్యాల్ని సుసాధ్యం చేశారు. 'అలాంటి బాబా కోసం నేను నా కోపాన్ని వదులుకోలేనా?' అనిపించింది. అందుకే ఆరోజే 'ఇకపై ఎవరిపైనా కోప్పడకూడద'ని ఒక నిర్ణయం తీసుకుని, "బాబా! ఇక నేను ఎవరిమీదా కోప్పడను, సహనంతో ఉంటాను. నా వంతుగా నేను నూటికి నూరుశాతం కోప్పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ సహాయం లేకుంటే నేనేమీ చేయలేను. అందువలన నా ఈ ప్రయత్నంలో మీ ఆశీస్సులు నాకెంతో అవసరం" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత కూడా 'బాబా నావల్ల ఎంత బాధ అనుభవించారో' అని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నాను.

నిద్రలేచాక మొబైల్‌లో చూస్తే, బాబాకు సంబంధించిన ఒక క్విజ్ పోటీలో నేను గెలిచినట్లు తెలియజేస్తూ ఒక మెసేజ్ ఉంది. అది చూడగానే నా సంతోషానికి అవధుల్లేవు. బాబా నన్ను ఇంత సంతోషపెడతారని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎప్పుడు బాధపడినా సాయిమహారాజ్ నన్ను వెంటనే సంతోషపెడతారని ముందే మీకు చెప్పాను కదా! 'నా వలన తాము బాధపడుతున్నామ'ని తెలియజేసిన బాబా, నేను బాధపడేసరికి వెన్నలా కరిగిపోయి నన్నెలా ఆనందపెట్టారో చూసారా! ఆయన చూపే ఆ అంతులేని ప్రేమ ఏ పదాలకు అందుతుంది? నా తప్పు తెలుసుకుని, "ఇకపై ఎవరిమీదా కోప్పడను, నన్ను క్షమించండ"ని చెప్పుకోగానే బాబా నన్ను క్షమించారు అనేదానికి సమయానికి వచ్చిన ఆ మెసేజే సంకేతం. "మీ బిడ్డలపై మీకెంత ప్రేమ సాయి! సదా మా అందరిపై మీ ప్రేమని ఇలాగే కురిపిస్తూ ఉండండి. నన్ను క్విజ్‌లో విజేతగా నిలబెట్టి సంతోషపెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! తెలిసీతెలియక నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించండి సాయీ! జీవితాంతం  మీ తోడు నాకు కావాలి బాబా. మీ పాదాల చెంత నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ కృప మా అందరిపై సదా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా!"

సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు

4 సంవత్సరాల క్రితం నాకు గొంతునొప్పి వచ్చింది. ఆ నొప్పితో మాట్లాడడం కూడా కష్టంగా ఉండేది. డాక్టర్ని సంప్రదిస్తే, "స్వరపేటిక బాగా దెబ్బతింది. మీరు చాల తక్కువగా మాట్లాడాలి. గొంతుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి" అని చెప్పి కొన్ని మందులు వ్రాసిచ్చారు. కొన్నిరోజులు మందులు వాడాక నొప్పి తగ్గిపోయింది. మరలా 4 సంవత్సరాల తరువాత మొన్న జూన్ నెలలో మళ్ళీ ఆ నొప్పి నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. రోజూ బాబా ఆరతి పాడే అలవాటున్న నేను ఆ నొప్పి కారణంగా ఆరతి కూడా పాడలేకపోయాను. ఆరతి పాడడం, మాట్లాడడం చాలా కష్టంగా అయిపోయింది. 'ఈసారి గొంతు సమస్య వస్తే కష్టం, ఆపరేషన్ దాక వెళ్లాల్సి ఉంటుంద'ని డాక్టరు 4 ఏళ్ళ క్రితమే చెప్పి ఉన్నందున నాకు హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే భయమేసింది. అందువలన బాబాకి నమస్కరించుకొని, "బాబా! నా గొంతునొప్పిని మీరే నయం చెయ్యాలి" అని ప్రార్థించాను. తరువాత బాబా ఊదీని గొంతుకి రాసుకొని, నీళ్లలో కొంత కలుపుకొని త్రాగాను. అలా రెండురోజులపాటు చేశాను. రెండవరోజుకి నాకు కొంత ఉపశమనం కనిపించింది. మూడవరోజు నుంచి క్రమంగా నొప్పి తగ్గుతూ అయిదవరోజుకల్లా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను హాయిగా మాట్లాడుతున్నాను, ఆరతి పాడుతున్నాను. అంతా బాబా దయ, ఆయన ఊదీ మహిమ. "తక్కువ సమయంలో నొప్పినుండి నాకు ఉపశమనం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

మరో అనుభవం :

జూన్ నెలలోనే మా నాన్నగారికి నడుము పట్టేసి చాలా బాధపడ్డారు. మాత్రలు వేసుకున్నా, ఇంజక్షన్ వేయించుకున్నా కూడా నొప్పి తగ్గలేదు. ఆయన పడుతున్న అవస్థ చూసి నాకు చాలా బాధేసింది. అప్పుడు నాన్నకి మాత్రలతో పాటు బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చాను. రెండవరోజుకి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ముందు మాత్రలకు, ఇంజక్షన్‌కు తగ్గని నొప్పి బాబా ఊదీతో పూర్తిగా తగ్గింది. "మరోసారి మీ ఊదీ మహిమ చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు, అనేకానేక నమస్కారాలు బాబా!" నిజంగా సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు. 

5 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo