సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 110వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా శిరిడీనుండి నాతోపాటు మా ఇంటికి వచ్చేసారు
  2. ఊదీ లీలలు

బాబా శిరిడీనుండి నాతోపాటు మా ఇంటికి వచ్చేసారు

ఓమ్ సాయిరామ్! నా నివాసం మహారాష్ట్రలోని అమరావతి. గత 9 ఏళ్ళనుండి నేను బాబా భక్తురాలిని. ఆయన దాదాపు నా కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. నేనిప్పుడు 2010లో నాకు జరిగిన ఒక అద్భుత అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నేను మొట్టమొదటిసారి 2010లో శిరిడీ వెళ్ళాను. అప్పటికి నేను సాయిభక్తురాలిని కాను. నా భర్త మాత్రం బాబా భక్తులు. నేనేదో మావారితో ఒక సాధారణ సందర్శకురాలిగా శిరిడీ వెళ్ళాను. దర్శనానంతరం మేము ఆలయ పరిసరాలలో షాపింగ్ చేయడానికి వెళ్ళాము. నేను కొన్ని బాబా ఫోటోలు, మరికొన్ని చిన్న చిన్న ఇతర వస్తువులు తీసుకున్నాను. తరువాత ఒక చిన్న బాబా విగ్రహాన్ని చూసాను. అది చాలా చాలా అందంగా ఉండటంతో దాన్ని కూడా తీసుకుందామని అనుకున్నాను. కానీ విగ్రహపూజలో నమ్మకంలేని నా భర్త, "బాబా ఫోటోలు తీసుకున్నావు కదా, ఇంకా అది నీకెందుకు?" అన్నారు. అయినప్పటికీ నాకు ఆ విగ్రహాన్ని తీసుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ నా భర్త అంగీకరించకపోవడంతో మేము అక్కడినుండి వచ్చేశాము. తరువాత మేము శిరిడీనుండి బయలుదేరి శని శింగణాపూర్, ఔరంగాబాద్, మరికొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్ళాము. 3 రోజుల తరువాత మా పర్యటన ముగించుకుని మేము ఇంటికి చేరుకున్నాము. నేను మా బ్యాగులు ఖాళీ చేస్తుండగా లోపల ఏదో ఒక ప్యాకెట్ ఉన్నట్లు గమనించాను. అందులో ప్రసాదంతోపాటు ఒక చిన్న పెట్టె ఉంది. ఆ పెట్టెను తెరిచిన నేను ఆశ్చర్యపోయాను. అందులో ఏముందో తెలుసా!? నేను ఏ విగ్రహమైతే కొనాలని ముచ్చటపడ్డానో అదే బాబా విగ్రహం ఆ పెట్టెలో ఉంది. నేను దాన్ని మావారికి చూపిస్తే ఆయన ఆశ్చర్యపోతూ, "ఇదెలా సాధ్యం?" అన్నారు. కానీ బాబా చేసిన అద్భుతం వలన ఏ విగ్రహమైతే మేము కొనుగోలు చేయలేదో అదే విగ్రహం మా కళ్ళముందు ఉంది. అంతా బాబా లీల. ఆ విగ్రహం తీసుకోవాలని నేనెంతగా ఆశపడ్డానో, తీసుకోలేకపోయినందుకు ఎంత నిరాశపడ్డానో బాబాకు తెలుసు కాబట్టి ఆయన శిరిడీనుండి నాతోపాటు వచ్చేశారు. ఇప్పటికీ ఆ విగ్రహాన్ని మేము పూజించుకుంటున్నాము.


ఊదీ లీలలు

యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! నేను అమెరికాలో ఉంటాను. ఇటీవల జరిగిన రెండు ఊదీ సంబంధిత అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

ఈమధ్య నేనొకసారి వాంతులు, వికారంతో చాలా బాధపడ్డాను. ఏమి తీసుకున్నా ప్రతిదీ వాంతి అయిపోతూ ఉండేది. దానితో పూర్తిగా బలహీనంగా అయిపోయాను. కనీసం కూర్చున్న చోటునుండి లేవలేని స్థితికి వచ్చేసాను. మరుసటిరోజు జరుపుకోవలసిన మా అమ్మాయి పుట్టినరోజు జరుపుకోగలనో, లేదో నాకు అర్థం కాలేదు. ఆ రాత్రివేళ ఏ మందులూ అందుబాటులో లేవు. ఆ స్థితిలో, "బాబా! నాకు నయం అయ్యేలా చేసి, ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి" అని ప్రార్థించి, కొంచెం ఊదీ నా నుదుటిపైన పెట్టుకుని, మరికొంత నీళ్లలో కలుపుకుని త్రాగాను. కొద్దిసేపట్లో నేను నిద్రలోకి జారుకున్నాను. ఉదయానికి కాస్త ఉపశమనంగా అనిపించింది. సాయంత్రానికి పూర్తిగా కోలుకుని ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా అమ్మాయి పుట్టినరోజు జరుపుకోగలిగాము. అంతా బాబా ఊదీ ప్రభావం.

రెండవ అనుభవం:

తరువాత ఒకసారి నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. సాధారణంగా తలనొప్పికి నేను మందులు వేసుకుంటాను. కానీ అప్పుడు నేను గర్భవతిగా ఉన్నందున ఆ మందు తీసుకోలేను. ఎంతకీ నొప్పి తగ్గడం లేదు. చివరికి నేను బాబాను ప్రార్థించి, జ్యూస్‌లో ఊదీ కలుపుకుని త్రాగాను. అద్భుతం! 30 నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోయింది. "బాబా! ఇదేవిధంగా నాకు సహాయం చెయ్యండి. ఈ ప్రెగ్నెన్సీ కాలమంతా నేను మీమీదే ఆధారపడతాను. దయచేసి శారీరక, మానసిక సమస్యలనుండి నన్ను దూరంగా ఉంచండి. కడుపులోని బిడ్డపై ప్రభావం చూపే ఏ ఒత్తిడినీ స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను. దయచేసి నన్ను ఆశీర్వదించి నాకు తోడుగా ఉండండి. దయచేసి నా సమస్యలన్నింటినీ పరిష్కరించి నా జీవితానికి మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు బాబా! చాలా చాలా ధన్యవాదాలు! అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo