ఈరోజు భాగంలో అనుభవం:
- సాయిబాబానే చీకటిలో మార్గాన్ని చూపుతారు
బెంగళూరునుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
30 సంవత్సరాలకు పైగా నేను సాయిభక్తుడిని. బ్లాగుల్లోని సాయి భక్తుల అనుభవాలు చదవడం ద్వారా బాబాపట్ల నా విశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది. "ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి దుఃఖానికి ఉపశమనం ఉంటుంది. సాయిబాబా ప్రతీ సమస్యను అద్భుతరీతిన పరిష్కరిస్తారు. మనం చేయాల్సింది కేవలం ఆయనపై నమ్మకాన్ని ఉంచడమే" అని ఎక్కడో చదివాను. నిజం! చాలా కరెక్టుగా చెప్పారు. ఇది నేను కష్టంలో ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది - సాయిబాబానే ఆ చీకటిలో మార్గాన్ని చూపుతారు(మనం గుర్తించినా, గుర్తించకపోయినా). నేనిప్పుడు చెప్పబోయే అనుభవం దానిని ఋజువు చేస్తుంది.
2017లో కంపెనీ ఉద్యోగస్తులను తగ్గించుకునే(downsizing) ప్రక్రియలో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అప్పటికి నేను సీనియర్ పొజిషన్లో మంచి జీతం సంపాదిస్తున్నాను. హఠాత్తుగా అలా జరిగేసరికి నేను చాలా కృంగిపోయాను. "త్వరగా ఉద్యోగం దొరికేలా చూడమ"ని బాబాను ప్రార్థించాను. తరువాత కూడా కుదురుగా ఉండలేక ఇద్దరు జ్యోతిష్యులను కలిసాను. వాళ్లలో ఒకరు '7-8 నెలల తరువాత నాకు ఉద్యోగం వస్తుంద'ని చెపితే, మరొకరు 'అసలు ఉద్యోగరేఖే కనిపించడంలేదు, అయినా కానీ ఆర్థికపరంగా సమస్యలు ఉండవు' అని చెప్పారు. కానీ బాబా కృపవలన అద్భుతంగా కేవలం ఒక నెలలోనే నాకు ఉద్యోగం వచ్చింది. అది కూడా మా ఇంటికి అతిసమీపంలో! ఇక్కడ ఒక్క విషయం గుర్తించండి. 'జ్యోతిష్యులిద్దరి అంచనాలు తప్పు అని తేలిపోయాయి. కేవలం బాబా యందు ఉన్న విశ్వాసమే పని చేసింది. మిగతా అంతా బాబా ముందు పక్కకు తప్పుకుంది'. అయితే కొత్త ఉద్యోగంలో నేను ముందు సంపాందించే దానికన్నా 25% తక్కువ జీతం నిర్ణయించారు. అయినా నేను దాని గురించి దిగులుపడకుండా అంతా బాబా చూసుకుంటారని సంతోషంగా ఆ అవకాశాన్ని స్వీకరించాను.
ఒక నెల గడిచేసరికి అనేక కారణాలరీత్యా నేను ఆ ఉద్యోగంలో సంతోషంగా ఉండలేకపోయాను. దానితో వేరే ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాను. అయితే ఆ సమయంలో మార్కెట్‌లో ఉద్యోగాలు లేవు. అదే సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీ పనితీరు దిగజారిపోవడం మొదలైంది. జీతాలు రావడం ఆలస్యం అవుతూ ఉండేది. 2018 జనవరి వచ్చేసరికి పరిస్థితి ఇంకా హీనం అయిపోయింది. జీతాలలో 40% తగ్గించేశారు. అందువలన నేను చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఉన్నపళాన వేరే ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేసినా నాకు సరైన అవకాశం దక్కలేదు. 'నాకెందుకీ పరిస్థితి? అసలు ఏమి జరగబోతుంది?' అని అన్నీ ప్రశ్నలే నా ముందు. ఏమి చేయాలో నాకేమీ అర్థం కాలేదు. అటువంటి సమయంలో సాయి దివ్యపూజ, సచ్చరిత్ర సప్తాహపారాయణ చేశాను. 'నాకెప్పుడు ఉద్యోగం వస్తుంద'ని నేనడిగిన ప్రతిసారీ సాయిబాబా ప్రశ్నలు&సమాధానాలు పుస్తకంలో సానుకూలమైన సమాధానాలు లభిస్తూ ఉండేవి.
2018 జనవరి చివరివారం, ఫిబ్రవరి మొదటివారం మధ్యలో దాదాపు నాకు క్రొత్త ఉద్యోగం వచ్చినట్లే అనుకున్నాను. కానీ చివరినిమిషంలో అది చేజారిపోయింది. అలా ఏదీ నాకు కలిసిరాక బాగా కృంగిపోయాను. ఆ సమయంలో ఎటువంటి చంచలత్వం లేకుండా దృఢమైన విశ్వాసం, నమ్మకం సాయిబాబాపై పెట్టాలని నిశ్చయించుకుని మళ్ళీ సచ్చరిత్ర పారాయణ చేశాను. శిరిడీ కూడా వెళ్లి వచ్చాను. కానీ ఆ తరువాత కూడా కంపెనీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అసలు మెరుగుపడే సూచనలు కూడా కనపడలేదు. నా జీతం కట్ చేసి ఇస్తున్నందువల్ల, ఇంకా వేరే ఇతర కారణాలవలన కంపెనీ నాకు దాదాపు 4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు వదులుకోలేను. అలాగని సౌకర్యంగా లేనిచోట ఉద్యోగం కొనసాగించలేక ఇరకాటంలో పడిపోయాను.
చివరికి 2018 నవంబరులో కంపెనీ వాళ్ళు, "మీకింక మేము జీతం చెల్లించలేము. మీరు వెళ్లిపోవచ్చ"ని నిర్మొహమాటంగా చెప్పేశారు. నేను నిర్ఘాంతపోయాను. అయితే ఆ సమయమంతా 'నేను నీకు సహాయం చేస్తాను' అని బాబా నుండి సంకేతాలు అందుతూనే ఉండేవి. ఒకవైపు బాబా సహాయం చేస్తారని తెలిసినా, ఆరోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఆందోళనపడకుండా ఉండలేకపోయేవాడిని. చాలా చాలా మానసిక సంఘర్షణను అనుభవించాను. చాలా బాధాకరమైన రోజులవి. అలా ఉండగా హఠాత్తుగా క్రొత్తగా మొదలుపెట్టిన మహాపారాయణ గ్రూపులో నాకు అవకాశం వచ్చింది. నేను ఆనందంతో పులకరించిపోయాను. చివరికి 2018 డిసెంబరు 24న బాబా నాకు దారి చూపించారు. దానితో నాకు ఉద్యోగం వచ్చింది. అదొక అద్భుతమైన లీల.
Linkedin లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక లింక్ నా దృష్టిలో పడింది. నిజానికి అది మూడువారాల ముందు షేర్ చేయబడింది. పైగా నా నైపుణ్యానికి సంబంధించినది కాదు. అయినా కూడా నేను దానికి దరఖాస్తు చేశాక నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నేను ఇంటర్వ్యూ గదిలో అడుగుపెడుతూనే సాయిబాబా ఫోటోని చూసాను. అద్భుతం! అంతకన్నా నాకు ఇంకేమి కావాలి? బాబా దగ్గరుండి నా ఇంటర్వ్యూ సక్రమంగా నడిపించారు. ఆయన కృపతో నా పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన ఒక్కరోజు ముందు నాకు ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ బాబా, మీ అపారమైన కృపకు, దయకు". నేను ఎక్కువగా ఆందోళనపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, నా జీవితం బాబా పాదాల చెంత ఉంది. బాబా నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. "ప్రణామాలు బాబా! అందరికీ శాంతి చేకూర్చండి".
🕉 sai Ram
ReplyDelete