కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 71వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 130
శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం.
గత సంవత్సరం బంధువులింటికి భోజనానికి వెళ్ళాను. అక్కడ ఒక అసిస్టెంట్ ఇంజనీర్ గారితో పరిచయం జరిగింది. తాను ఎంతో భక్తిభావంతో బాబా గురించి అడిగారు. అప్పుడు నా మనసుకు ఎలా స్పురిస్తే అలా తనకు బాబా లీలలను వివరించాను. దాని వలన తన మనసులో బాబా పట్ల ప్రేమ ఉత్పన్నమయింది. తరువాత తాను తొందరలోనే వేరే ఊరికి బదిలీ అయ్యాడు. ఆ తరువాత నాలుగు నెలలకు తాను మరలా రైలు ప్రయాణంలో కలిసాడు. తనతో మాట్లాడుతున్నప్పుడు “తనను మరలా వేరే క్రొత్త ప్రదేశానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వులు అందాయి. ఆ బదిలీ తనకు అత్యంత అయిష్టం కావడం వలన, తన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించుకునే ప్రయత్నం చేసి చూద్దాం” అనే కారణంతో తన పైఅధికారి వద్దకు వెళ్ళసాగాడు. కానీ ఆ బదిలీ ఉత్తర్వులు రద్దవుతాయనే ఆశ అతనికి ఏమాత్రం లేదు. తనకు బాబాపై ఉన్న శ్రద్ధాభక్తులు చూసి, తనకు బాబా ఊదీని మరియు బాబా యొక్క చిన్న ఫోటోను ఇచ్చాను. తరువాత నా స్టేషను రావడంతో నేను దిగిపోయాను. తాను ప్రయాణం కొనసాగించాడు. తరువాత సుమారు రెండు నెలలకు నేను ఒక స్టేషనులో ఏ రైలు నుండి అయితే దిగానో, అదే రైలు ఎక్కడానికి ఆ అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చాడు. నన్ను చూడగానే తాను వెంటనే నా వద్దకు వచ్చాడు. జేబులో నుండి ఐదు రూపాయల నోటును తీసి నాకు ఇచ్చి “బాబాకు దక్షిణగా సమర్పించండి. ఇదివరకు కలిసినపుడు మీరు నాకు ఫోటో మరియు ఊదీ ఇచ్చారు. వాటిని నేను తీసుకొని మాపై అధికారి వద్దకు వెళ్ళి ఈ బదిలీ వలన నాకు చాల ఇబ్బంది అవుతుంది” అని చెప్పాను. అప్పుడు పై అధికారి వెంటనే “సరే అయితే, ఆ బదిలీని రద్దు చేస్తాను. మీరు సంతోషంగా ఇక్కడే పనిచేసుకోండి” అని చెప్పారు. దాంతో నాకు చాలా ఆనందం వేసింది “ఇదంతా బాబా దయవలనే జరిగిందని నాకు అర్థమయింది” అని నాకు చెప్పాడు.
16-11–1920 వ తారీఖున లాలా లక్షీచంద్ ఢిల్లీ గారివద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం:
7వ తారీఖు రాత్రి నేను బాబాను శిరిడీలో దర్శించుకున్నట్లుగా స్వప్నం వచ్చింది. 8వ తారీఖు ఆఫీసుకు వెళుతున్నప్పుడు శిరిడీ నుండి నాకు ఏదైనా శుభవార్త కచ్చితంగా అందుతుందని నాకు అనిపించింది. అదేరోజు ఉదయం 11 గంటలకు నాకు శిరిడీ నుండి కవరు వచ్చింది. ఆ కవరులో బాబా ప్రసాదం ఉంది. బాబా దేహత్యాగం చేసినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండి, మనకు మార్గదర్శకత్వం చేస్తూ, మనకు అన్ని విధాల సహాయం చేస్తున్నారు. బాబా కృపవలన నా మనవళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు.
18-2-1920 వ తారీఖున శ్రీ వి.బి.జోషి (కలకత్త ) గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం
బాబా దయ వలన నా కూతురు కోలుకుంటోంది మరియు ఇక ప్రమాదమేమి లేదని డాక్టరు చెప్పారు. ఈ విషయాన్ని మీకు ఎంతో సంతోషంగా తెలియచేస్తున్నాను. నేను బాంబే నుండి బయలుదేరేటప్పుడు “ఇక లాభం లేదు” అని నాకు చెప్పారు. కాని నేను ఇక్కడకు వచ్చిన తరువాత తన పరిస్థితి మెరుగయ్యింది. సమయానికి బాబా ఊదీ అందచేసినందుకు మీకు ధన్యవాదాలు.
25-3-1918 వ తారీఖు శ్రీ జె.ఆర్.పటేల్ (పరేల్) గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం
నేను పంపించిన ఇరవై రూపాయిలను బాబాకు సమర్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటాను. నేను బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోలేదు, కానీ బాబాపై నాకు పూర్ణభక్తివిశ్వాసాలు ఉన్నాయి. నా స్నేహితుడొకరు నాకు బాబా ఫోటోను ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఎల్లప్పుడూ నా పాకెట్ పుస్తకంలో పెట్టుకుంటాను. నిజాయితీగా చెప్పాలంటే, నాకు ఇది వరకు వీటన్నింటి మీదా నమ్మకం ఉండేదికాదు. కానీ, నాస్నేహితుడు నాకు బాబా గురించి చెప్పి, బాబా ఫోటోను ఇచ్చి ఎల్లప్పుడూ నా వద్దే ఉంచుకోమని చెప్పారు. అప్పటి నుండి బాబా మహిమ నాపై ఎంతగా పని చేసిందంటే, ఇది వరకు నేను ఎప్పుడూ నా స్నేహితులతో గొడవపడుతూ, వారికి హాని చేయాలని భావించేవాడిని. ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు వచ్చేవి. ప్రస్తుతం నా మనఃస్థితి పూర్తిగా మారిపోయింది.
6-8-1923 వ తారీఖున శ్రీ నరహర్ లక్ష్మణ్ కులకర్ణి గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం
బాబా కృప వలన నాకు ఆనందకరమైన విషయం జరిగింది. నా మనసు ఎంతో సంతాపంలో ఉన్నప్పుడు, బాబా నా మనసును స్థిరీకరించారు. శ్రీ సాయిబాబాయే నా యొక్క తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా ఆయనే! ఆయనే నాకు ధైర్యం!
7-11-1917 వ తారీఖున శాంతప్ప నాగర్ కట్టే గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం
శ్రీ దత్తాత్రేయ దేవస్థానానికి సంబంధించి ముంబాయికి చెందిన శ్రీ తిరకమ్ దాస్ గారు రూ. 1000/-లను మరియు ఇతర గృహస్థులందరూ కలిసి రూ.200/- లను ఇచ్చారు. ఈ నగరంలో నేను అపరిచితుడను అయినప్పటికీ నాకు ఇంత డబ్బులు లభించాయి. అంతా కేవలం బాబా కృప. ఈ విషయాన్ని మీకు ఆనందంగా తెలియచేసుకుంటున్నాను.
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
No comments:
Post a Comment