సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 62వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 62వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 121

శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే గారు శ్రీ సమర్థ సాయిబాబా గురించి తనకు వచ్చిన అనుభవాలను 18-2-1920 వ తారీఖున ఒక ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరంలో చాలా భాగం తప్పక చదవవలసినదిగా అనిపించడం జరిగింది. ఆ ఉత్తర సారాంశం క్రింది విధంగా ఉంది. 

(11) ఒక సంపన్న వృద్దగృహస్థు ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఆ గృహస్తు తన కుమారుడితో కలిసి శిరిడీకి బయలుదేరాడు. నేను కూడా బాంద్రా నుండి శిరిడీకి అదే బండిలో బయలుదేరాను. దారిలో కుమారుడు తప్పిపోవడం గురించి నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డాడు. ముంబాయి నుండి బయలుదేరేటప్పుడు పొగ త్రాగడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇంకొక డబ్బాలో కూర్చొన్నాడు. కానీ తండ్రితో పాటుగా కోపర్గాం స్టేషన్లో దిగకుండా పొరపాటున ఒకటి, రెండు స్టేషనుల ముందుకు వెళ్ళి, తరువాత నగర్ నుండి వచ్చే బండిలో తిరిగి వచ్చి తండ్రి వెనకాలే సుమారు రెండు గంటల వ్యవధిలో శిరిడీకి వచ్చాడు. కానీ మా వద్దకు రాకుండా దూరంగా వేరే చోట కూర్చొన్నాడు. తరువాత ఆరతి సమయంలో మధ్యాహ్నం పూట ఆ గృహస్థుని తీసుకొని నేను ద్వారకామాయికి వెళ్ళాను. మా వెనకాలే ఆ అబ్బాయి కూడా ద్వారకామాయికి వచ్చాడు. వచ్చి మరలా దూరంగా నిలబడ్డాడు. అంటే ఆ అబ్బాయి ఎవరు? అనే విషయం నాకు కూడా తెలియదు. కానీ అందరితో పాటుగా ఆ అబ్బాయి కూడా బాబాకు నమస్కారం చేసుకున్నాడు. అతను నమస్కారం చేసుకోగానే “పుత్రుని కర్తవ్యం " గురించి బాబా ఉపదేశం మొదలు పెట్టడం చూసి “ఇతనేనా మీ కుమారుడు”  అని ఆ గృహస్థుణ్ణి  అడిగాను. తాను "అవును” అని అన్నాడు. తరువాత మూడు, నాలుగు రోజులకు  ఆ అబ్బాయికి శిరిడీలో ఉండటం విసుగు అనిపించింది. అందువలన అక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆరతి తరువాత భక్తులు ద్వారకామాయి నుండి తిరిగి వెళ్ళకముందే బాబా “ఈరోజు నన్ను అడకకుండా శిరిడి నుండి ఎవరూ వెళ్ళరాదు” అని చెప్పారు. బాబా మాటలు వినిన ఆ అబ్బాయి భయంతో తాను శిరిడీ నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనను మానుకున్నాడు. తరువాత జరిగిన విషయమంతా తన తండ్రికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానుల యొక్క కర్మయోగం అనేక విధాలుగా ఉంటుంది. 
(12 ) ఒకరోజు ఉదయం సుమారు 8-9 గంటల ప్రాంతంలో సంధ్యావందనం కార్యక్రమాలు పూర్తి చేసుకుని భావుసాహెబ్ దీక్షిత్ ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. తనకు ధ్యానంలో విట్టలమూర్తి యొక్క దర్శనం లభించింది. కానీ ఆ మూర్తిని తాను ఇదివరకెన్నడూ చూసి ఉండకపోవడంతో ఆ మూర్తి స్వరూపమేమిటో తనకు అర్థం కాలేదు. అప్పుడు తాను “ఏ సద్గురు మూర్తి వలన అయితే ఆ దివ్య దర్శనం కలిగిందో, ఆయనే ఆ దివ్యమూర్తి గురించి తెలియచేస్తారు” అనే ఉద్దేశ్యంతో ప్రశాంతంగా ఉన్నారు. తరువాత మధ్యాహ్న ఆరతి వేళ బాబా కాకాసాహెబ్తో “ఏం కాకా ఈరోజు విఠోబా పాటిల్ నిన్ను కలవడానికి వచ్చాడు కదా” అని అడిగారు. ఆ మాటలు వినిన కాకాసాహెబ్ తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. “అవును బాబా” అని సమాధానమిచ్చారు. అప్పుడు బాబా “తాను మహా పలాయనగాడు. ఒకచోట కుదురుగా ఉండడు. అందువలన తనకు ఒక పక్కా నివాసాన్ని ఏర్పరుచు” అని అన్నారు. కాని ఆ మూర్తి రూపం గురించిన అవగాహన తనకు పూర్తిగా కలుగలేదు. ఆ నిగూఢమైన సంభాషణ యొక్క అర్థం బాబాకు మరియు దీక్షిత్తు తప్ప ఇంకెవరికీ తెలియకపోవడం వలన ఆరతి తరువాత వాడాకు తిరిగి వెళ్ళేటప్పుడు, నేను సహజంగానే భావుసాహెబ్ ను ఆ సంభాషణను గురించి అడిగాను. అప్పుడు తాను జరిగిన విషయమంతా నాకు చెప్పాడు. తరువాత సాయంకాలం పూట పండరీ క్షేత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు తీసుకొని ఒక వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఆ ఫోటోను చూడగానే శ్రీ దీక్షిత్ ఎంతో ఉద్విగ్నతకు లోనై “తానే ఈ మూర్తి” అని అన్నారు. దీనిని బట్టి శ్రద్ధావంతుడైన భక్తుని శరణాగతి పట్ల బాబా యొక్క వాత్సల్యం మరియు ఆయన యొక్క సర్వశ్రేష్ఠ అధికారం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది.

(13.) శిరిడీకి వెళ్ళే భక్తులందరికీ సకల సదుపాయాలను కలుగచేసే బాధ్యతను శ్రీ మాధవరావ్ దేశపాండే తీసుకునేవారు. కానీ ఒకరోజు తనను తీసుకొని శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ఉదయం బొంబాయికి బయలుదేరి వెళ్ళాక బాపూసాహెబ్ జోగ్ , బాలాసాహెబ్ భాటే మరియు నా వంటి విద్యావంతులం అందరం ఉన్నాము. దీక్షిత్ వెళ్ళిన కాసేపటికి మధ్య భాగం (సెంట్రల్  ఇండియా) యొక్క కమిషనర్ కర్టీస్ సాహెబ్, ఆయన భార్య నగర్ జిల్లా కలెక్టర్ మెకినీల్ సాహెబ్ మరియు కర్టీస్ సాహెబ్ గారి నేటివ్ అసిస్టెంట్ రావు బహదూర్ రామచంద్ర నారాయణ్ ఉరఫ్ భావుసాహెబ్ జోగ్లేకర్  వంటి పెద్ద, అదికారుల బృందం శిరిడీకి చేరడానికి అతి కొద్ది దూరంలో ఉన్నప్పుడు, బాబా ద్వారాకామాయిలో తన కఫ్నీని పైకెత్తి (కఫ్నీ లోపల ఎల్లప్పుడు కౌపీనం కట్టుకొని డేవారు) “నన్ను చూడటానికి వస్తున్నారు, నేనొక దిగంబర ఫకీరుని” అని అన్నారు. కాని అక్కడ ఉన్నవారికి బాబా మాటలలోని అర్థం బోధపడలేదు. కారణం ద్వారకామాయికి ముందర ఎవరూ క్రొత్తవారు కనపడలేదు. కానీ రెండు, మూడు నిమిషాలలో సదరు అధికారుల బృందం ద్వారకామాయి మీదుగా చావడికి వెళుతూ కనిపించింది. అప్పుడు అక్కడనున్న వారికి బాబా మాటలలోని మర్మం అర్థమైంది. ఆ బృందం చావడికి వెళ్ళి కూర్చొన్న తరువాత, విచారిస్తే అక్కడ బాబాసాహెబ్ భాటే తప్పితే ఇక్కడ మనకు పరియస్థులు ఎవరూ లేరు అని భావుసాహెబ్ జోగ్లేకర్కు  అర్థమైన తరువాత తాను ఒక బిళ్ళ జమానును బాలాసాహెబ్ ను పిలుచుకు రావడానికి పంపించారు. కానీ బాలాసాహెబ్ కు వెళ్ళాలని అనిపించలేదు. అందువలన ఆ జమానుకు అదే విషయం చెప్పి పంపించారు. అప్పుడు నేను భావుసాహెబ్ జోస్లేకర్ తో “మొదట బాలాసాహెబ్ భాటేను ఇక్కడకు పిలుచుకు వస్తాను. తరువాత తనతో కలిసి మనం చావడికి వెళదాము” అని చెప్పాను. తాను ఆ మాటలకు అంగీకరించాడు. “తరువాత మీ ప్రాతఃవిధి తొందరగా ముగించండి” అని బాబాకు చెప్పండి అని భావుసాహెబ్ నాకు సూచించారు. అటువంటి సాహసం ఇక్కడ ఎవరూ చేయరు అని చెప్పి, తనకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పాను. మేమిద్దరం అంత చనువుగా మాట్లాడుకోవడం కర్టిస్ సాహెబ్ కు విచిత్రంగా అనిపిస్తుందని మాకు అనిపించడంతో భావుసాహెబ్ నాకు మరియు తనకు మధ్య చిన్నప్పటినుండి ఉన్నటువంటి దృఢస్నేహాన్ని వివరించి చెప్పారు. తరువాత అందరూ చేసేదేమిలేక బాబా ద్వారకామాయినుండి బయటకు రావడానికి ఎదురుచూస్తూ కూర్చోసాగారు. చాలా సేపటి తరువాత బాబా ద్వారకామాయి నుండి బయటకు వచ్చి చావడి వద్దకు రాసాగారు. బాబా రావడం  చూసిన శ్రీమతి  కర్టిస్ చావడి ముందర నున్న దారిలోకి వెళ్ళి, వారి పద్దతిలో బాబాకు ప్రణామం చేసి "మీతో  నాలుగు మాటలు చెప్పుకోవాలి” అని అడిగింది. “అరగంట సేపు ఆగు "  అని బాబా చెప్పారు. తరువాత బాబా భిక్ష నుండి తిరిగి రావడం చూసి, బాబా చావడికి సమీపంలోకి రాగానే మరలా శ్రీమతి కర్టిస్ దారిలోకి వెళ్ళి ఇంతకు మునుపు చేసిన విధంగానే ప్రణామం చేసి తన మనసులోని కోరికను బాబాకు చెప్పింది.
“ఒక గంట సేపు ఆగు” అని చెప్పి బాబా ద్వారకామాయిలోకి వెళ్ళారు. కాని వెళ్ళాలనే తొందరలో ఉండటం వలన, తరువాత కొద్దిసేపటికి ఆ అధికారిబృందం కిక్కురు మనకుండా శిరిడీ నుండి వెళ్ళిపోయారు.

తరువాయి భాగం రేపు


సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo