కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 63వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 122
శ్రీ వాసుదేవ్ సదాశివ్ జోషి గారి అనుభవము.
ఏదయినా జీవునికి దర్శనభాగ్యం కలిగించాలంటే బాబా ఆ యోగాన్ని ఏవిధంగా కలుగజేస్తారో మరియు వారిని తమవద్దకు ఏవిధంగా పిలిపించమంటారోననే విషయానికి సంబంధించిన ఉదాహరణను చూడాలంటే షోలాపూర్ కు చెందిన శ్రీ వాసుదేవ్ సదానంద్ జోషి గారి క్రింది ఉత్తరం ద్వారా తెలుసుకొనే అవకాశం శ్రీ సాయిలీల పాఠకులకు లభిస్తుంది.
శ్రీ సద్గురు ప్రసన్న (సత్యనారాయణ కంపెనీ, షోలాపూర్, వాసుదేవ్ సదానంద్ జోషి) భక్తిపరాయణుడు శ్రీ గోవింద్ గొండో పన్సారేగారు సిద్ధపురుషులు. “సాయినాథ్ ఉరఫ్ శ్రీ సాయిబాబా గారి దర్శనయోగం ఎలా వచ్చింది? ఆ దర్శనానుభవం ఏమిటి?” అని ప్రశ్నించడంతో సిద్ధపురుషులను మరియు గత స్మృతులు మరలా స్మరించుకునే అవకాశం ఆయన కల్పిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, శ్రీ నారాయణ కృప వలన మరియు సద్గురు కృపాప్రసాదంతో లభించిన అనుభవాన్ని తెలియపరుస్తున్నాను. ఆ అనుభవంలోని స్వానందాన్ని స్వీకరించి, ఏమయినా సవరణలు ఉంటే చేసి మీ సాయిలీలలో ఈ ఉత్తరానికి కొంచెం చోటు కల్పిస్తారని ఆశిస్తున్నాను.
ఈ శరీరాన్ని గురించి కొంత పరిచయం ఇవ్వాలి అని అంటే జీవుని యొక్క పూర్వకర్మానుసారం పదహారు ఏళ్ళ వయస్సులో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, వారి ఇప్పటికి ముప్పైఏడు సంవత్సరాలు అయింది. ఈ గడచినకాలంలో సాధుసంతులను, మహాత్ములను దర్శించుకోవడం జరిగింది. కానీ పరిపూర్ణులైన మహాత్ములలో మొదట శ్రీ సాయిబాబా గారినే దర్శించుకోవడం జరిగింది.
దర్శనయోగం: ముముక్షావస్థలో ఉన్న పెన్షనర్ అయిన మామ్లేదార్ శ్రీ చిదంబర్ కేశవ్ ఉరఫ్ అన్నా సాహెబ్ గాడ్గిల్ గారు గానుగపూర్ క్షేత్రంలో నడుపుతుండటం వలన, దానికి సంబంధించిన అన్నదాన సత్రం పని మీద షోలాపూర్ వచ్చినపుడు మేము కలవడం జరిగింది. తరువాత భగవంతునితో ఏకరూపం కావడం వలన పరమానందం ప్రాప్తమవుతుందన్న చందంగా సదరు గృహస్థు 1913వ సంవత్సరంలో "నేను ప్రస్తుతం శిరిడీలో ఉన్నాను. ఇక్కడ నామ సప్తాహం ప్రారంభమైంది. అయినప్పటికీ బాబా దర్శనం కోసం రండి. వచ్చిపోవడానికి రూ.10/- లు ఖర్చు అవుతాయి. విచారించవద్దు. శ్రీ నారాయణుడు మనకు ఎక్కడ నుండి అయినా ఇస్తారు. కనుక అవకాశాన్ని వృధా కానివ్వవద్దు” అని ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరం చదివిన తరువాత కలిగిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడంలేదు. తరువాత వ్యవహారపద్దతిని అనుసరించి సహచరిణి యొక్క అనుమతిని తీసుకొని, డబ్బులకు ఇబ్బంది ఉన్నప్పటికీ, వెళ్ళడానికి సిద్దమై బాబా కృప వలన శిరిడీకి క్షేమంగా చేరుకొని, గాడ్గిల్ గారి పరమ స్నేహితుడైన రావ్ బహదూర్ సాటే గారి వాడాలో బస చేసాను. తరువాత స్నానం సంధ్య వంటి కర్మవిధి పూర్తి చేసుకుని శ్రీ గాడ్గిల్ గారితో కలిసి బాబా దర్శనం కోసం పూజా సామానుతో సహా వెళ్ళాను. బాబా ద్వారకామాయిలో ఉన్నారు. అక్కడ పూజ వగైరా పూర్తి చేసుకుని, అక్కడ జరిగేదంతా చూసి జీవితం ధన్యమైనదనే భావన కలిగింది. తరువాత సాయంకాలం ఆరతి వగైరా పూర్తి చేసుకున్నాను. రావ్ బహదూర్ సాటే గారి వాడాలో సుమారు 40-50 అంగుళాల బాబా ఫోటో ఉండేది. ఖచ్చితంగా తెలియదు కాని పెద్ద ఫోటోను వాడాలో ఒక అరుగుపై ఉంచి, ఆ ఫోటోకు రెండు పూటలా పూజా, ఆరతి వంటివి జరిపే క్రమం ఉండేదని అనిపిస్తుంది. కారణం ఉదయం 11-12 గంటల ప్రాంతంలో రావడం వలన మొదట సాయంకాలం కార్యక్రమం చూడటం జరిగింది. అప్పట్లో ఏదైనా తత్వంలో ఏకాగ్రత కలిగియుండే అలవాటు ఉండటం వలన ఆరతి ప్రారంభమైనప్పటి నుండి అది పూర్తయ్యేవరకు శ్రీ సాయిబాబా ముఖకమలంపై దృష్టి ఏకాగ్రమైంది. ఆ వేళలో ముఖకమలం కనిపించకుండా వస్త్రం ధరించిన శిరోభాగం బదులు శ్రీ నరసింహరూపం కనిపించ సాగింది. ఆ తన్మయత్వంలో తాదాత్మ్యం చెంది ఉండటం వలన ఆరతి పూర్తయి పోయినప్పటికీ స్పృహలోకి రాలేదు. అప్పుడు గాడ్గిల్ గారు నన్ను కదిలించి జోషిబువా, ఆరతి పూర్తయింది. పద వెళదాం” అని అన్నారు. అప్పుడు స్పృహలోకి వచ్చి ఆయనతో పాటుగా బయలుదేరాను. కానీ నాకు కలిగిన దివ్యానుభవం నుండి పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఆ దివ్యానుభవం యొక్క అర్థమేమిటో తెలుసుకోవాలని మనసుకు చాలా ఆతురతగా అనిపించసాగింది. అటువంటి అనుభవమే వరుసగా మూడు రోజులు ఉదయం, సాయంకాలం కలుగడంతో శ్రీ గాడ్గిల్ కు ఆ అనుభవంని చెప్పాను. అప్పుడు ఆయన “బాబా అటువంటి గమ్మత్తే చేస్తూ ఉంటారు, కేవలం మనం ఊరకనే చూస్తూ ఉండాలి” అని చెప్పారు. ఈ చరాచర జగత్తులో నిరపేక్ష బుద్ది మరియు నిర్వ్యాజమైన ప్రేమను కలిగియుండి ప్రతియొక్క చరాచర వస్తువులో నిర్మాణకర్తయైన శ్రీ నారాయణుడు ఎలా నిండి యున్నాడు మరియు ఆ అంతఃబ్రహ్మ మనచేత ఎలా కర్మ చేయిస్తాడో అనే అవలోకనలో ఈ జీవి సదా నిమగ్నమై ఉండటం వలన పేరు ప్రఖ్యాతులు మరియు అపేక్ష అనే పదాలనుండి విముక్తి లభించింది. జీవితంలో వచ్చే కష్టసుఖాల గురించి వివేచన చేయకుండా శ్రీ నారాయణుని చరణాలకు సర్వకృత్యాలు మరియు ఫలశ్రుతి అర్పించి, ఈ దేహాన్ని పరమేశ్వరునికి శాశ్వతంగా అర్పించే సాధనలో ఈ జీవునికి ఆనందం కలుగుతుంది. శ్రీ సాఠె గారిని నాకు శిరిడీ నుండి బయలుదేరడానికి అనుమతి కోరాను. “బాబా అనుమతి తీసుకోకుండా వెళ్ళడం కుదరదు” అని ఆయన చెప్పారు. ఇంకొకరు “బాబాను ఇంకేదయినా కోరుకో” అని చెప్పారు. కానీ ఈ జీవునికి బాబా దర్శనం మినహా ఇక ఏమీ కోరిక లేకపోవడం వలన “నేను అడిగేదేమిలేదు. బాబా దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండేది. ఆ కోరిక నేటితో తీరిపోవడంతో పరమానందం కలిగింది. జన్మ సార్థకమైంది” అని చెప్పాను. కానీ వారు చాలా బలవంతం చేయడంతో “శ్రీ సత్యనారాయణ కంపెనీ దుకాణంపై ఈ జీవి యొక్క ఉదర నిర్వాహణ ఆధారపడి ఉంది” అని చెప్పి ఆశీర్వాదం అడగండి అని నన్ను బలవంతం చేసిన భక్తునికే చెప్పాను. అపుడు ఆ భక్తుడు ఆ రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో అందరి సమక్షంలో బాబాతో “బాబా, ఇతను శ్రీ గాడ్గిల్ గారి అతిథి” అని చెప్పి పరిచయం చేస్తూ కంపెనీ పేరు చెప్పకుండా “ఇతని వ్యాపారానికి ఆశీర్వాదం ఇవ్వండి” అని అడిగాడు. అప్పుడు బాబా “ఆ నారాయణుడు తనకు తినడానికి ఏమైనా చేసాడామో (రోటీ, పచ్చడి ఎమైనా తక్కువ చేసాడా?) అతనిని అడగండి అడగడానికి ఏమీ లేనప్పుడు మీరెందుకు బలవంతం చేస్తారు?” అని అడగడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete