సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 60వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 60వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 119

శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే గారు శ్రీ సమర్థ సాయిబాబా గురించి తనకు వచ్చిన అనుభవాలను 18-2-1920 వ తారీఖున ఒక ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరంలో చాలా భాగం తప్పక చదవవలసినదిగా అనిపించడం జరిగింది. ఆ ఉత్తర సారాంశం క్రింది విధంగా ఉంది.

(1 ) రాత్రిళ్ళు స్వప్నం రాకుండా కనీసం ఒక వారం రోజులు కూడా గడచిన సందర్భం గత 35-36 సంవత్సరాలలో ఒక్కటి కూడా ఉన్నట్లు నాకు గుర్తులేదు. కానీ శిరిడీలో నెలలు నెలలు అలా గడచిపోయాయి. దానికి కారణం బాబా కృప కాకుండా ఇంకొకటి అనే ఆలోచన కూడా నాకు రాదు. కారణం శిరిడీలో నా ఆరోగ్యం అంత బాగుంది. అంతకంటే ఆరోగ్యంగా ఇంతకు మునుపు కూడా ఉన్నాను. కానీ స్వప్నం మాత్రం ఎప్పుడూ కలుగుతూ ఉండేది.  

(2) ఒకసారి మధ్యాహ్న ఆరతి సమయంలో ఒక గృహస్థు తీసుకువచ్చిన మిఠాయి ప్రసాదాన్ని బాబా అందరికీ పంచుతూ ఉండగా, నా వంతు వస్తుందా, రాదా అనే ఆలోచన నా మనసులోకి రాగానే “నీకు ఏమీలేదు” అంటూ బాబా సుస్మిత వదనులయ్యారు. తరువాత నాకు ప్రసాదం ఇచ్చారు. 

(3) ఒకసారి నా పేరుకు బదులు దాదాభట్ దేశ్ పాండే అనే పేరును ఉపయోగిస్తూ, నా యొక్క మొండిస్వభావాన్ని మరియు నా కుటుంబం యొక్క మరియు నా యొక్క పరిస్థితిని గురించి బాబా చేసిన యథార్థ వర్ణనను విని భావుసాహెబ్ దీక్షిత్ "ఈ దాదాసాహెబ్ దేశపాండే ఎవరు?” అని నన్ను ప్రశ్నించారు. కారణం ఆ పేరులోని గూఢార్థం నాలాగే తనకు కూడా అర్థమైంది. ఇతరులకు మాత్రం ఆ విషయం అర్థం కాలేదు. 

(4) ఒకరోజు నేను ద్వారకామాయికి వెళ్ళినప్పుడు “రావయ్యా రామయ్యా” అని అంటూ బాబా నన్ను పైకి పిలిచారు. తరువాత కొన్ని రోజులకు ఊదీ ప్రసాదాన్ని పంచేటప్పుడు, నేను నమస్కారం చేసుకొనే వంతు వచ్చింది. నేను నమస్కారం చేసుకోగానే బాబా నా చేతిలో ఊదీ పెట్టి, శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించేటప్పుడు “రామ్ రామయ్యా” అని అన్నారు. కారణం “శ్రీరామ్ సర్వ కర్మణి” అనే వాక్యంపై నాకు శ్రద్ధ ఉండేది. 

(5 )  ఒకసారి నా మనసులో మూడు రోజులుగా ఒకటే “ఆపన్ సారిఖ్ కరితీ తత్కాల్" (వెంటనే ఆయనలాగా మార్చేస్తారు) అనే మహాత్ముల వచనం మెదులుతుండగా, నేను తిరిగి వెళ్ళే విషయమై "ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారు?” అని మాధవరావ్ దేశపాండే అడుగుతుండగా, అప్పుడు బాబా “కూర్చోన్నచోటు నుండి నేను లేచి, అక్కడ తనని కూర్చోబెట్టాలి. నేను ఏం చేసేది? ఆ పని చాలా శ్రద్దతో కూడుకున్నది” అని స్పష్టంగా అన్నారు. ఆ మాటలు విని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఇతరులెవరికీ ఆ మాటలలోని అర్థం బోధ పడలేదు.

(6) శిరిడీకి మొదటిసారి వెళుతున్నప్పుడు నాకు ఏ యువకుడైతే రైలులో పరిచయం అయ్యాడో, అదే యువకుడు తరువాత 1-2 నెలలలో శిరిడీకి వచ్చాడు. అప్పటికి బాబా పట్ల నాకున్న సంశయాలు పూర్తిగా పటాపంచలైపోవడం వలన, ఆ గృహస్థ మరలా ఇదివరకటి ప్రశ్ననే అడిగాను. ఆశ్చర్యమేమిటంటే, “ఇంతకు మునుపు బాబాను అనేకసార్లు చూసి తాను ఏ అభిప్రాయమైతే ఏర్పరుచుకున్నాడో, అదంతా అరగంటలో  పూర్తిగా మారిపోయింది” అని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. కాని ఈ పరివర్తనకు కారణమేమిటో తాను నాకు చెప్పలేదు.

 (7 )  మొదటిసారి వెళ్ళినప్పుడు బాబా నా వద్ద నుండి మొదట రూ. 12/- అడిగారు. మరలా కొన్ని రోజులకు మళ్ళీ రూ.8/- తీసుకున్నారు. మరలా కొన్ని రోజులకు మా మిత్రుడు రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ భావుసాహెబ్ తర్ఖడ్ వద్ద నుండి బాబాకు దక్షిణగా సమర్పించడానికి తాత్యాసాహెబ్ కు రూ. 5/-లు మనియార్డర్ వచ్చింది. ఆ డబ్బులను తాత్యాసాహెబ్ నాకిచ్చి బాబాకు సమర్పించమన్నారు. ఆ డబ్బులను నేను బాబాకు సమర్పించబోతే “ఆ డబ్బులను నువ్వే ఉంచుకో, ఖర్చులకు అవసరం అవుతాయి” అని అన్నారు. కానీ ఆ డబ్బులను తీసుకోవడం ఇష్టం లేకపోవడం వలన మరియు ఖర్చులకు అవసరమైన డబ్బులు నా వద్ద చాలానే ఉండటం వలన, ఆ విషయాన్నే బాబాకు చెప్పి ఆ ఐదు రూపాయలను తిరిగి ఇవ్వబోయాను. అప్పుడు “ఈ డబ్బులు ఖర్చులకు ఉపయోగపడతాయని నేను నీకు చెపుతున్నాను. కాబట్టి ఆ డబ్బులను నీ వద్దనే ఉంచుకో” అని బాబా చెప్పడం వలన చేసేది లేక ఆ డబ్బులను నా వద్దే ఉంచుకున్నాను. తరువాత తిరిగి వెళ్ళడానికి అనుమతి లభించడం వలన నేను శిరిడీ నుండి ముంబాయికి లేదా పూనాకి వెళ్ళాలనుకున్నాను. కానీ ఊహించని కారణం వలన నేను శిరిడీ నుండి జల్ గావ్ కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నాకు నా దగ్గరనున్న డబ్బులతో పాటు, ఇంకొక ఐదు రూపాయల అవసరం వచ్చింది. ఆ లోటును భర్తీ చేయడం కోసం, బాబా ఇచ్చిన ఐదు రూపాయలను ఒక సీల్డ్ కవర్లో ఉంచి, ఆ కవర్ను నా స్నేహితుని వద్ద ఉంచి, తన వద్దే రూ. 5/- లను అప్పుగా తీసుకొని జల్గావ్ వెళ్ళాను. తరువాత ఆ అప్పును తీర్చి ఆ సీల్డ్ కవరును వెనుకకు తెప్పించుకున్నాను.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo