సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 54వ భాగం


 కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 54వ భాగం.

శ్రీ హరి సీతారామ్  దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 100 

బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే పేరు కలిగిన బాబా యొక్క పరమ భక్తుడు ఒకరు ఉండేవారు. బాబా వచ్చివెళ్ళే దారిని మరియు లెండీని పరిశుభ్రపరిచే విధిని మొదట నెవాస్కర్ ప్రారంభించారు. ఆ తరువాత రాధాకృష్ణాఆయి ఆ విధిని కొనసాగిస్తే ఆమె తరువాత అబ్దుల్ భాయి ఆ పని చేసేవాడు. నెవాస్కర్ తన పొలంలో పండే పంటనంతా తీసుకు వచ్చి బాబా ముందర పెట్టేవారు. వాటిలో మహారాజ్ ఎంతిస్తే  అంత ఇంటికి తీసుకు వెళ్ళడం తన నిత్యనియమంగా ఉండేది. తాను నీరు కూడా బాబా త్రాగి వదిలేసిన నీరు లేదా కాళ్ళు చేతులు కడుక్కున్నాక లేదా స్నానం చేసిన తరువాత మిగిలిపోయిన నీళ్ళను లేదా కాళ్ళు చేతులు కడుక్కుంటున్నప్పుడు కాని, స్నానం చేసేటప్పుడు కాని తూములో నుండి బయటకు వచ్చే నీటిని మాత్రమే త్రాగి దాహం తీర్చుకునేవాడు. ఆ విధంగా తన నియమం ఉండేది. శ్రీ నెవాస్కర్ కొన్ని సంవత్సరాల పూర్వమే మరణించాడు. కానీ ఈరోజుకు కూడా ఆయన పిల్లల వద్ద నుండి ధాన్యం బాబా వద్దకు వస్తుంది. వారి వద్ద నుండి వచ్చిన ధాన్యం నుండి తయారుచేసిన సజ్జరొట్టెలు రోజులో నాలుగుసార్లు బాబా దేహత్యాగం చేసేవరకు వచ్చేవి. ఒకసారి నెవాస్కర్ యొక్క శ్రాద్ధ కర్మ వచ్చింది. ఆ రోజు ఊహించిన దానికంటే ఎక్కువమంది భోజనానికి వచ్చారు. పాటిల్ యొక్క భార్య ఎంతో ఆందోళన చెందింది. ఆమె తన అత్తగారి ముందు తన ఆందోళనను వ్యక్తపరచింది. ఆమె అత్తగారు ఏ మాత్రం ఆందోళన చెందకుండా పిడికిలి నిండా ఊదీని తీసుకొని ఆ అన్నం పాత్రలో వేసింది. ఆ తరువాత ఆ పాత్రపై ఒక గుడ్డ కప్పి, వడ్డించే వారితో “ఆ గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డించండి” అని చెప్పింది. వడించేవారు సరిగ్గా ఆమె చెప్పినట్లే చేశారు.. భోజనం అందరికీ సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలింది. ఈ లీలను బాలాజీ పాటిల్ నెవాస్కర్ యొక్క తల్లిగారు చెప్పారు.

అనుభవం -101

ఒకసారి నానాసాహెబ్ నిమోణ్కర్ గారి కుమారుడు పడ్డాడు. అందువలన తనను చూడడానికి నిమోణ్కర్ గారి అర్ధాంగి వెళ్ళవలసి వచ్చింది. అందుకు బాబా అనుమతి కూడా లభించింది. కానీ నానాసాహెబ్ తన భార్యతో “మరుసటి రోజు తిరిగి రమ్మని” చెప్పాడు. కానీ మరుసటి రోజు గోవులను పూజించే పండుగ ఉండటంతో, ఆ రోజు బయలుదేరడం ఎలా వీలవుతుందని తాను విచారంలో పడింది. అలా అని పతి ఆజ్ఞను ధిక్కరించడం కూడా తనకు యోగ్యమనిపించలేదు. అంతా సిద్దమై ఆమె బయలుదేరే సమయానికి సరిగ్గా బాబా కూడా లెండీకి బయలుదేరారు. ఆమె వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించగానే "వెళ్ళు, త్వరగా వెళ్ళు. అక్కడ నాలుగు రోజులు ఉండి రా” అని అన్నారు. దాంతో నానాసాహెబ్ ఏం మాట్లాడలేకపోయారు. ఆ విధంగా ఆమె విచారం తొలగిపోయింది.

అనుభవం -102

శంకర్రావు అనే పేరు కల్గిన గృహస్థు ఒకసారి శిరిడీకి వెళ్ళారు. బాబా తనను దక్షిణ ఇమ్మని అడిగారు. తాను జేబులోనున్న డబ్బునంతా తీసి బాబాకు ఇచ్చేసారు. తిరిగి వెళ్ళడానికి అవసరమయ్యే ఛార్జీలకు కూడా డబ్బులు ఉంచుకొనలేదు. తాను మరుసటి రోజు బయలుదేరి వెళ్ళాలి. బాబా ఏదో విధంగా తాను వెళ్ళడానికి అవసరమయ్యే ఏర్పాటును చేస్తారనే భరోసా తనకు ఉండటం వలన, తాను ఎవరినీ అప్పు అడుగలేదు. నిజంగానే బాబా తాను వెళ్ళడానికి అవసరమైన ఏర్పాటు చేసారు. ఆ రోజు రాత్రి తన స్నేహితుడు ఒకరు అనుకోకుండా వచ్చి కలిశారు. ఆ గృహస్థు రహతా పోస్టుమాస్టర్ వద్దకు వెళ్ళడంతో, తనకు శంకర్రావు శిరిడీకి వచ్చాడన్న విషయం తెలిసింది. శంకర్రావు ఆ గృహస్తుకు కొన్ని సంవత్సరాల క్రితం రూ. 20/- లు అప్పుగా - ఇచ్చాడు. ఆ గృహస్థు ఆ డబ్బులను శంకర్రావు అడగకుండానే తిరిగి ఇచ్చాడు.

తరువాయి భాగం రేపు.


సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo