సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 79వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 79వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 142

శ్రీ గణేశ్ బాలాజీ దేశ్ పాండే గారి అనుభవం.

నాసిక్ కు చెందిన శ్రీ భావుసాహెబ్ ధుమాళ్ గారు (అడ్వకేట్), బాబాకు ఎప్పటినుంచో ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన భక్తులు. ఆయన గుమస్తా శ్రీ గణేష్ బాలాజీ దేశపాండే గారికి శ్రీ భావుసాహెబ్ వలన బాబాపై పూర్ణశ్రద్ద కుదిరింది. 1921వ సంవత్సరం నుండి బాబా చిత్రపటానికి భక్తితో పూజ చేయసాగారు. దేశ్ పాండే శిరిడీకి ఎప్పుడూ వెళ్ళలేదు. గత సంవత్సరం నుండి శ్రీ దేశ్ పాండే భార్యకు కడుపునొప్పి బాగా బాధించసాగింది. ఎన్నో ఔషధాలు ఉపయోగించారు. కానీ, ఏ మాత్రం గుణం కనపడలేదు. ఆ విధంగా ఆమె తొమ్మిది నెలలు బాధపడింది. భావుసాహెబ్ కు ఈ విషయం తెలియగానే, శ్రీ భావుసాహెబ్ తన గుమస్తాకు అన్ని ఔషధాలను ఆపివేయమని చెప్పి, బాబా ఊదీని మాత్రమే తీసుకుంటూ కడుపునొప్పి తగ్గగానే, బాబా దర్శనానికి వస్తానని మొక్కుకోమని చెప్పారు. శ్రీ దేశ్ పాండే ఆ విధంగానే చేసారు. చమత్కార మేమిటంటే ఊదీ పెట్టినప్పటి నుండి ఆమె కడుపునొప్పి తగ్గిపోయింది. దేశ్ పాండే  ఈ మధ్యనే శిరిడీకి వచ్చి తమ మొక్కు తీర్చుకొని వెళ్ళారు.

శ్రీ మాధవరావు దేశ్ పాండే గారు శ్రీ హరి సీతారాం దీక్షిత్  కు 15-11-1910న వ్రాసిన ఉత్తరం.

చరణ సేవకుని యొక్క శిరఃసాష్టాంగ నమస్కారములు. శ్రీ సమర్థ కృప వలన ఇక్కడ చిన్నా, పెద్ద అందరూ కుశలము. శ్రీ సమర్థ ఆరోగ్యంగా ఉన్నారు. శ్రీ సమర్ధుని కాలిన చేయ్యి ఇప్పుడు బాగవుతూ రాసాగింది. ప్రస్తుతం కాలినచోట తడారిపోయింది. ప్రతిరోజు ఆనందంగా ఉంటున్నారు. మీ ఉత్తరం నిన్ననే చదివి వినిపించి, మీ నమస్కారం తెలియచేసాను. శ్రీ సదాశివరావు గారి శ్రీమతి గురించి తెలియచేసాను. కాని “ఇదంతా ఆ భగవంతుని కేళి. ఆయనే నివారణ చేస్తారు. మనం ఎందుకు ఆందోళన పడాలి” అని శ్రీ సమర్థ అన్నారు. ఇక్కడ పది, పన్నెండు రోజుల నుండి రాజదండం, చామరలు, నెమలి పింఛపు విసన కర్రలు మొదలగునవన్నీ శ్రీ సమర్థ చావడికి వెళ్ళేటప్పుడు, ఆరతి జరిగేటప్పుడు ఉపయోగించడం ప్రారంభమైంది. చోప్ దార్ లాల్కరి చేయడం (గౌరవపూర్వకంగా “రాజాధిరాజ...” అంటూ బిగ్గరగా ఉచ్చరించడం) ప్రారంభమైంది. ఈ విధంగా కొత్త సంగతులు చోటుచేసుకున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మీరు పంపించిన బాలాజీ ఆనందరావు ఈ రోజే శ్రీ సమర్థ దర్శనానికి వచ్చాడు. బాబా లెండీ నుండి వచ్చేటప్పుడు తాను బండి దిగి వచ్చి దర్శనం చేసుకున్నారు. తన కాలిలో ముల్లు గుచ్చుకుంది. ముల్లు లోతుగా దిగింది. వాడాకు వచ్చిన తరువాత ముల్లును తీసివేసాము. సద్గురు కృప వలన బాధ ఎక్కువ కాలేదు. శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ గారు శ్రీ సాఠె సాహెబ్ గారికి బాబా అనుమతితో వాడా కట్టే విషయమై ఉత్తరం వ్రాసారు. ఆయన కూడా అందుకు సమ్మతించారు. రేపు లేదా ఎల్లుండి వాడా కట్టే పని ప్రారంభిస్తారు. గాలి, నీరు అంతా సౌలభ్యంగా ఉంది.

శిరిడీ నుండి శ్రీ మాధవరావు దేశపాండే గారు శ్రీ హరి సీతారాం దీక్షిత్ కు వ్రాసిన ఉత్తరాలలోని సారాంశం 17-9-10 న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం :

శ్రీ సమర్థులు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మొన్నటి రోజు ఈ వృద్దుడు (బాబా) మంటలో (ధునిలో) చేయి పెట్టాడు. అందువలన చేతి చర్మం కాలిపోయి వాపు వచ్చింది. ప్రతిరోజు లేపనం పూస్తున్నాము. ఆయన లీలలు ఆయనకే ఎరుక. మిగతా అంతా మీరు ఉన్నప్పుడు ఎలా జరిగేదో, అలాగే అంతా ఆనందంగా జరుగుతోంది.

8-10-1910న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం:

నిన్నటిరోజు అంటే 7వ తారీఖున శ్రీ దాసగణు గారి భార్య 'తాయి' మన వాడాకు దగ్గరలోనున్న కాలువలోకి దూకింది. కాలువలో నీరు 3, 4 అడుగుల వరకు ఉంది. కాని తనకు ఏమీ దెబ్బలు తగల్లేదు. వెంటనే కొందరు మనుషులు కాలువలోకి దిగి తనను కాపాడారు. చాలామంది అక్కడకు వచ్చారు. తనకు ఏ మాత్రం దెబ్బలు తగల్లేదు.

30-10-1910 న వ్రాసిన ఉత్తరంలోని సారాంశం: 

ఇక్కడి విశేషమైన సంగతులు ఏమిటంటే, శ్రీ సమర్థ ఆరోగ్యం బాగుంది. చేతికి కాలిన గాయం అలాగే ఉంది. కొంచెం వాపు తగ్గింది. ఇంకెవరి చేత ఔషధం పూయించుకోవడం లేదు. నేను స్వయంగా ఔషధం పూస్తున్నాను. ఆయన లీలలు ఆయనకే ఎరుక.

9-11-1910 న తాసిన ఉత్తరంలోని సారాంశం: 

ప్రతిరోజు ఆరతి సమయంలో నెమలి పింఛాల చామరము, గొడుగు వగైరా ఎంతో వైభవంగా చోటుచేసుకోసాగాయి. అదేవిధంగా రాత్రి చావడికి వెళ్ళేటప్పుడు చోప్ దారు, ఛత్రి, చామరాలు వగైరా వంటి వాటి ప్రారంభం మొన్నటి నుండి జరిగింది. ఇక్కడ అంతా ఆనందమే!

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo