సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 99వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ప్రత్యక్షమయ్యారు
  2. బాబా గురించి తెలియని వ్యక్తి ఆయనకు భక్తునిగా మారిన వైనం

ఇప్పుడు మీరు చదవబోయే రెండు లీలలు సాయిభక్తుడు మనోహర్ తన పాదయాత్రలో భాగంగా అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు తాను తెలుసుకున్న సాయి లీలలు. 

సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ప్రత్యక్షమయ్యారు:

ఒకసారి మనోహర్(పూర్తిపేరు పేర్కొనలేదు) జునాగఢ్ నుంచి శిరిడీకి పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తూ పోరుబందర్ పట్టణానికి కొంచెం ముందర మెయిన్ రోడ్డు నుండి కాస్త దూరంలో ఉన్న రామమందిరంలో బస చేశాడు. అక్కడ మధ్యయుగానికి చెందిన యోగి రామానంద్ గారి అనుచరుడైన రామానంది గారిని కలుసుకున్నాడు. అతనా గుడిలో పూజారి. అతడు ఆచారపూర్వకంగా పూజలు చేస్తూ మందిరాన్ని చూసుకుంటుండేవాడు. ఆ పూజారి మనోహర్‌ని, "మీ ఈ పవిత్రయాత్ర ఎక్కడివరకు?" అని అడిగాడు. అందుకు మనోహర్, "శిరిడీ వరకు పాదయాత్ర చేస్తున్నాను" అని చెప్పాడు. శిరిడీ అన్నమాట వినగానే పూజారి కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. పూజారి మనోహర్‌ని, "ఈ రాత్రి ఇక్కడే ఉండి, రేపు ఉదయం మీ యాత్రను కొనసాగించండ"ని అభ్యర్థించాడు. మనోహర్ సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే, తను కూడా అక్కడ ఉండాలని అనుకున్నాడు. తరువాత పూజారి అతనికి భోజనం వడ్డించాడు. ఆ తరువాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పూజారి మనసులో శిరిడీ గురించి ఎన్నో ప్రశ్నలున్నాయి. అతను, "శిరిడీ మహారాష్ట్రలో ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి శిరిడీ ఎలా వెళ్ళాలి? అక్కడ నేను బస చెయ్యడానికి ఏదైనా ధర్మశాల ఉందా?" అని అడిగాడు. మనోహర్ అవసరమైన సమాచారమంతా అతనికి తెలియజేసాడు.

అప్పుడు పూజారి తన అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా చెప్పాడు: "కొన్ని రోజుల క్రితం ఒక ఫకీరు ఇక్కడకు వచ్చాడు. నేను అతనిని స్వాగతించి, "భోజనం చేయాలని అనుకుంటున్నారా?" అని అడిగాను. అందుకాయన తనకు భోజనం వద్దన్నారు. కానీ నేనిచ్చిన పాలు స్వీకరించారు. మేము కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన మాట్లాడిన హిందీ అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆయన మాట్లాడిన దానిలో ఒక వాక్యాన్ని బట్టి 'ఆయనకు నా గురువు గురించి తెలుసు' అని నాకు అర్థమైంది. కొంతసేపటికి ఆయన వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన్ని ఉండమని ప్రాధేయపడ్డాను. కానీ ఆయన నిరాకరించారు. అంతకు కొద్దిసేపు ముందు ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. ఆ పుస్తకమొక ఆధ్యాత్మిక గ్రంథం, అది ఒక కాషాయరంగు వస్త్రంలో చుట్టివుంది. నేను ఆ పుస్తకాన్ని తీసుకుని, తెరవకుండా ప్రక్కన పెట్టాను. తరువాత ఆయన వెళ్తుంటే నేను ద్వారం వద్ద నిలుచుని గమనిస్తూ ఉన్నాను. ఆయన మూడడుగులు వేసిన తరువాత అంతర్థానమయ్యారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వెనక్కి తిరిగి అతనిచ్చిన పుస్తకం తెరిచి చూసాను. ఆ పుస్తకం 'సాయి సచ్చరిత్ర'. నేను ఆ పుస్తకం తెరిచి అందులో ఉన్న ఫోటోను చూసి నిశ్చేష్టుడనయ్యాను. కాసేపటిక్రితం నా ముందు కూర్చుని వున్న ఫకీరు వేరెవరో కాదు, స్వయంగా ఆ సాయిబాబానే! ఆ గ్రంథం మరాఠీలో ఉండటం వల్ల నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను. చాలామందికి ఆ ఫోటోను చూపించి వివరాలు అడిగాను. ఒకతను మాత్రం, "బాబా మహారాష్ట్రలో జీవించిన ఒక గొప్ప సత్పురుషులు, 1918లో ఆయన సమాధి చెందారు" అని చెప్పాడు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడారు. నేను ఉత్తరప్రదేశ్‌కి చెందినవాడిని, ఆయన మహారాష్ట్రకు చెందినవారు. అయినప్పటికీ ఆయనకు నా గురువు గురించి తెలుసు. ఆయన అంతర్థానమవడం నేను నా కళ్ళతో చూసాను. ఇవన్నీ నన్ను అబ్బురపరచాయి. నేను ఒక్కసారైనా శిరిడీ దర్శించాలని అనుకున్నాను".

బాబా గురించి తెలియని వ్యక్తి ఆయనకు భక్తునిగా మారిన వైనం:

ఇంకోసారి మనోహర్ పాదయాత్రలో భాగంగా ఋషీకేశ్ తీర్థయాత్రకు వెళ్లాడు. అప్పుడు శంకరాచార్యనగర్ వద్ద స్వర్గ ఆశ్రమముగా పిలవబడే మహేష్ యోగి ఆశ్రమంలో బసచేసాడు. ఈ ఆశ్రమం గంగానది తీరాన ఉంది. అక్కడ మనోహర్ కొన్నిరోజులు ఉండాలని అనుకున్నాడు. ఆ ఆశ్రమ సంరక్షకునిగా ఉన్న రమణేష్ గద్వాల్ ప్రాంతానికి చెందిన బ్రహ్మచారి. అతడు మనోహర్‌ని స్వాగతించి బస చేయటానికి గది ఇచ్చాడు. గదిలోకి వెళ్తూనే మనోహర్‌ని ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే, అక్కడ గోడకు బాబా చిత్రపటం తగలించబడి ఉంది. దాని గురించి రమణేష్‌ను విచారించాడు మనోహర్. ఆ చిత్రపటానికి సంబంధించిన కథనం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రకు చెందిన ఒక బ్రహ్మచారి ఆ ఆశ్రమంలో కొన్ని రోజుల పాటు బస చేసాడు. ఆ బ్రహ్మచారి అక్కడనుండి వెళ్లిపోయే సమయంలో ఆ చిత్రపటాన్ని రమణేష్‌కు ఇచ్చాడు. ఆ సమయంలో రమణేష్‌కు బాబా గురించి ఏమీ తెలియనప్పటికీ ఆ చిత్రపటాన్ని ఆనందంగా స్వీకరించి, గది అందాన్ని పెంచుతుందన్న ఆలోచనతో అతడా చిత్రపటాన్ని గోడకు తగిలించాడు.

తరువాత ఒకసారి రమణేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడు ప్రయత్నించిన వైద్యాలన్నీ నిష్ఫలమయ్యాయి. త్వరలోనే అతను పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. నిరాశా నిస్పృహలతో మంచంమీద పడుకుని వున్న సమయంలో అతని దృష్టి బాబా చిత్రపటం వైపు మళ్ళింది. అతను తన మనసులో, "నేను ఈ అనారోగ్యం నుండి త్వరగా కోలుకున్నట్లైతే మిమ్మల్ని పూజించడం మొదలుపెడతాను" అని అనుకున్నాడు. తానే ఆశ్చర్యపోయే విధంగా ఆరోజు సాయంత్రానికే తాను కోలుకుంటున్న అనుభూతి మొదలైంది. త్వరలోనే కోల్పోయిన బరువును తిరిగి సంతరించుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పటినుండి తనకు తోచిన విధంగా బాబా చిత్రపటాన్ని పూజించడం మొదలుపెట్టాడు.

మరో అనుభవాన్ని  కూడా రమణేష్ జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా చెప్పాడు: "నేను చాలా రోజుల నుండి యోగా చేస్తున్నాను. ఒకసారి నేను ఒక క్లిష్టమైన ఆసనం వెయ్యడానికి చాలా ప్రయత్నించాను కానీ, నేనందులో విఫలమయ్యాను. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా సాధించలేకపోయాను. అందువలన ఇక దానిగురించి మర్చిపోదామని అనుకున్నాను. చాలాకాలం తరువాత మళ్ళీ ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు సహాయం కోసం బాబా వైపు తిరిగి, "మీరు నిజంగా సత్పురుషులైతే, మొదట మీ నామం చెప్పి ఆసనం ప్రయత్నిస్తాను. నేను గనుక విజయం సాధించగలిగితే, మీరు సద్గురువని ఖచ్చితంగా నమ్ముతాను" అని చెప్పుకున్నాను. తరువాత మరోసారి ఆసనం వేసే ప్రయత్నం చేశాను. ఆశ్చర్యం! ఎటువంటి ప్రయాస లేకుండా ఆసనం వేయగలిగాను. దాదాపు ఒక గురువు మార్గదర్శనంలో చేయగలిగినట్లు పరిపూర్ణంగా చేయగలిగాను". 

అలా రమణేష్ హృదయంలో బాబాపట్ల భక్తివిశ్వాసాలు  లోతుగా నాటుకున్నాయి. అతడు ఆశ్రమంలోని మిగతా బ్రహ్మచారులందరికీ తన అనుభవాలు చెప్పడంతో అందరూ బాబాను ఆచారపూర్వకంగా పూజించడం మొదలుపెట్టారు. తరువాత నెమ్మదిగా అతను బాబా ఆరతులు నేర్చుకుని, ప్రతిరోజూ బాబాకి ఆరతులు కూడా ఇస్తున్నాడు. ఆయనకి మరాఠీ రాకపోయినా ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్ర ఒక అధ్యాయము చదువుతుండేవాడు. 1979లో శిరిడీ తీర్థయాత్రకు వెళ్ళాడు.

Ref: ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo