కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 58వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -115
ఒకసారి మాధవరావు దేశపాండే కోపర్గావ్ మమల్లాదార్ ముందర సాక్ష్యం చెప్పాల్సివచ్చింది. సాక్ష్యం చెప్పేరోజు కోపర్గామ్ బయలుదేరాడు. వెళ్ళే ముందర బాబా దర్శనం చేసుకోడానికై ద్వారకామాయికి వచ్చి “బాబా, కోపర్గాం వెళ్ళి వస్తాను” అని చెప్పాడు. అప్పుడు బాబా “ఎందుకు వెళుతున్నావు? వెళ్ళవద్దు” అని అన్నారు. “లేదు బాబా వెళ్ళాలి” అంటూ కోపర్గాం బయలుదేరాడు. నీమ్ గాం వరకు అంటే సుమారు ఒకటిన్నర మైలు వెళ్ళి ఉంటాడు. అక్కడ కోపర్గాం మామ్లేదార్ కొంతమంది జనాలతో కలిసివస్తూ ఎదురు పడ్డాడు. ఆయన శిరిడీకే వస్తున్నాడు. దాంతో మాధవరావు కూడా ఆయనతో కలిసి తిరిగి శిరిడీ వచ్చాడు.
అనుభవం -116
శిరిడీలో వెనుకటికి మార్తాండ్ అనే పేరు కలిగిన దర్జీ ఉండేవాడు. తాను విపరీతంగా జబ్బున పడ్డాడు. ఆయనకు శుశ్రూష చేసేవారు ఎవరూ లేరు. అందువలన తను ఎన్నో అవస్థలు పడసాగాడు. ఒకరోజు దారిలో తాను పడిపోయి ఉంటే బాబా అక్కడకు వెళ్ళారు. అప్పుడు బాబా తనతో “నీవు నీంగావ్ లోని నానా సాహెబ్ డేంగళే వద్దకు వెళ్ళు. నీకు అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి” అని చెప్పారు. అప్పుడు మార్తాండ్ దర్జీ నీమ్గావ్ లోని డేంగళే ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్ డేంగళే తనను సాదరంగా ఆహ్వానించి, సత్కరించి “నీవు ఇక్కడ నీ సొంత ఇంటిలా భావించి ఉండవచ్చు. నీకు ఇక్కడ సకల సదుపాయాలు సమకూరుస్తాను. నిన్ను సాదరంగా చూసుకోమని బాబా, రాత్రి నాకు స్వప్నదర్శనం ప్రసాదించి ఆజ్ఞాపించారు" అని చెప్పాడు. బాబా ఆజ్ఞానుసారం శ్రీ డేంగళే మార్తాండ్ దర్జీని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ దర్జీ త్వరలోనే స్వస్థుడై తిరిగి శిరిడీలోని తన ఇంటికి చేరుకున్నాడు.
అనుభవం -117
ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబ సమేతంగా శిరిడీ వచ్చిన సందర్భంలో సూర్యగ్రహణ పర్వదినం వచ్చింది. ఆ పండుగ సందర్భంగా తనకు గోదావరీనదిలో స్నానం చేయాలనే కోరిక కలిగింది. అందుకు బాబా అనుమతిని అర్థించగా, బాబా అనుమతిని ప్రసాదించారు. అక్కడికి వెళ్ళిన తరువాత గ్రహణం ఘడియలు ప్రారంభం అయ్యాక నానాసాహెబ్ గోదావరిలో స్నానం కోసమై దిగారు. అప్పుడు ఒక సన్యాసి “దానం చేయి భవబంధాలు తొలిగిపోతాయి” అని అరుస్తూ నానా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నానా అతనికి రెండు పావలాలు ఇచ్చారు. అక్కడ అదే సమయంలో బాబా నందూరామ్ మార్వాడితో “చూడు, నానా నాకు రెండు పావలాలు ఇచ్చాడు” అని చెపుతూ, ఆ పావలాలను తమ జేబులో వేసుకున్నారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
No comments:
Post a Comment