సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 103వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. వృద్ధురాలికి ఆయువు ప్రసాదించిన శ్రీసాయి
  2. నా కోరిక తీర్చిన బాబా

వృద్ధురాలికి ఆయువు ప్రసాదించిన శ్రీసాయి

ఇప్పుడు మీరు చదవబోయే అనుభవాన్ని ఒక సాయిబంధువు తన ప్రవచనంలో తెలియజేయగా, దాన్ని నాకు తెలిసిన సాయిబంధువు కృష్ణగారు వాట్సాప్ ద్వారా పంపించారు. అద్భుతమైన ఈ అనుభవం సాయిబంధువులందరికీ ఆనందాన్ని చేకూరుస్తుందని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. చదివి అంతులేని బాబా ప్రేమను ఆస్వాదించండి.

మచిలీపట్నంలో సుమారు 80 సంవత్సరాలు పైబడిన ఒక ఆవిడ ఉన్నారు. ఆమె మనుమల్లో ఒకరు ఇంగ్లాండులో, ఒకరు అమెరికాలో డాక్టర్లుగా ఉన్నారు. ఇటీవల రెండు, మూడు నెలల క్రిందట ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది. మచిలీపట్నంలోని ఇద్దరు, ముగ్గురు పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెను పరీక్షించి, "గుండెకు ఎక్కువగా నీరు పట్టింది, గుండె పరిమాణం పెరిగి ప్రక్కటెముకలను తాకుతూ ఉంది. ఏ చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ చివరిరోజులు ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోండి" అని చెప్పారు. అలా చెప్పి, మా ప్రయత్నం కూడా మేము చేస్తామంటూ వాళ్ళ చికిత్స వాళ్ళు చేస్తున్నారు.

విదేశాలలో ఉన్న ఆమె మనుమలిద్దరికీ ఆమె చివరిరోజుల్లో ఉందనే విషయం తెలిసి 2,3 నెలలు సెలవులు పెట్టుకుని వచ్చారు. స్థానిక డాక్టర్లతో కలిసి వాళ్ళు కూడా ఆమెకు చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ చికిత్సవల్ల ఉపయోగమేమీ ఉండదని వాళ్ళు కూడా అనుకున్నారు. రోజురోజుకీ ఆమె పరిస్థితి క్షీణిస్తున్నది. అటువంటి సమయంలో వేరే ఊరిలో వున్న ఆమె కూతురు తన తల్లిని చూడటానికి వచ్చింది. ఆమె శ్రీసాయిబాబా గురించి విని శ్రీసాయిలీలామృతం పారాయణ చేస్తూ, తన ఊరిలోని సత్సంగాలలో పాల్గొంటూ ఉంటుంది. తల్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె తన తల్లికి ప్రతిరోజూ శ్రీసాయిలీలామృతం చదివి వినిపించడం మొదలుపెట్టింది. దానితోపాటు రోజూ కొంచెం బాబా ఊదీ తల్లి నుదుటన పెడుతూ ఉండేది. అలా రెండు, మూడు రోజులు గడిచింది. నాలుగవరోజు రాత్రి బాబా రోగి కలలో కనిపించి, "నాకు మంచినీళ్ళు కావాలి" అని అడిగారు. ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఆమె త్రాగేందుకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ప్రక్కనే పెడతారు. కలలోనే ఆమె ఆ గ్లాసు నీళ్లు బాబాకు అందించింది. బాబా ఆ నీళ్లలో కొద్దిగా ఊదీ వేసి, త్రాగమని ఆమెకిచ్చారు. బాబా చెప్పినట్లు ఆమె త్రాగడం మొదలుపెట్టింది. కొద్దిగా నీళ్లు ఇంకా మిగిలివుండగానే ఆమె గ్లాసు ప్రక్కన పెట్టి బాబాకు నమస్కరించుకోవాలని వంగింది. అప్పుడు అనుకోకుండా ఆమె చేయి గ్లాసుకు తగిలి క్రిందపడిపోయింది. ఆ సంగతి పట్టించుకోకుండా బాబాకు నమస్కారం చేసుకుంటుండగా ఆమెకు మెలకువ వచ్చింది. అప్పుడు చూస్తే నిజంగానే గ్లాసు ప్రక్కన పడివుంది. తెల్లవారాక తనకు వచ్చిన స్వప్నం సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఆ గ్లాసు తీసి చూస్తే, దాని అడుగుభాగంలో కొద్దిగా ఊదీ ఉన్నది. అంటే బాబా స్వప్నంలో ఇచ్చిన ఊదీ మెలకువలో చూసినా అలానే ఉంది. ఎంత ఆశ్చర్యం! అప్పటినుండి ఆమెకు స్వస్థత చేకూరి ఇప్పుడు హాయిగా ఉన్నది. డాక్టర్లు ఆశ వదిలేసిన సందర్భంలో ఆమె జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఎంత గొప్ప అద్భుతమో కదా!

నా కోరిక తీర్చిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాధారణ సాయిభక్తురాలిని. ప్రతిరోజూ బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలు చదువుతుంటాను. తద్వారా బాబాపట్ల నా విశ్వాసం వృద్ధి చెందడంతోపాటు మానసిక బలం కూడా చేకూరుతుంది. నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అమ్మాయి చిన్నప్పటినుంచి చాలా చలాకీగా, ఉత్సాహంగా అన్నింట్లో ముందుండేది. కానీ తనకి 13 ఏళ్లు వచ్చాక తన మానసిక పరిస్థితి కాస్త మొండిగా, చంచలంగా మారింది. దాంతో తను చదువులో కాస్త వెనుకబడింది. ఆ సమయంలోనే మేము తనని వేరే స్కూలుకు మార్చాము. అక్కడికి చేరాక తన పెర్ఫార్మెన్స్ పూర్తిగా దిగజారిపోయింది.  చాలా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది కూడా. ఇంట్లో అందరం నిర్ఘాంతపోయాము. అసలు మేము నమ్మలేకపోయాం. నేను బాబా ముందు కూర్చుని చాలా ఏడ్చాను. ప్రతిరోజూ బాబా ముందు ఏడుస్తూ, తన పరిస్థితిలో మార్పు వచ్చేలా చేయమని, చదువులో మంచి మార్కులు తెచ్చుకునేలా తనని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉండేదాన్ని.

అలా ఉండగా ఒకరోజు నా ఆఫీసు స్టాఫ్ శిరిడీ ప్రయాణమవుతూ నాకు ఫోన్ చేసి, "బాబా కోసం ఏదైనా పంపాలని అనుకుంటున్నారా?" అని అడిగారు. నేను, "నా తరఫున బాబాకి గులాబీలు సమర్పించమ"ని వాళ్లతో చెప్పాను. అదేసమయంలో నా మనసులో ఇలా అనుకున్నాను: "బాబా శిరిడీ నుండి నాకేదైనా పంపితే నా బిడ్డ ప్రవర్తనలో మార్పు వచ్చేలా, చదువులో తన పెర్ఫార్మెన్స్ మెరుగుపడేలా బాబా ఆశీర్వదించినట్లు" అని. తర్వాత మా స్టాఫ్ శిరిడీనుండి తిరిగి వచ్చారని విని, వాళ్లు నా కోసం ఏదైనా తెచ్చి ఉంటారనే ఉద్దేశంతో నేను వాళ్లను కలవడానికి వెళ్లాను. కానీ నాకు నిరాశే ఎదురైంది. నేను చాలా చాలా కలవరపడ్డాను. కానీ బాబా అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉండేదాన్ని. 

తర్వాత సుమారు నెల, నెల 15 రోజులకి నేను మా అమ్మాయి కోసం సప్తాహపారాయణ మొదలుపెట్టాను. ఆ సమయంలో ఒకరోజు బేసన్‌లడ్డూలు తయారుచేసి బాబాకు నైవేద్యం పెట్టి, "బాబా! మీరు నేను తయారు చేసిన లడ్డూలు స్వీకరించినట్లు నాకు ఏదైనా సూచన ఇవ్వండి" అని ప్రార్థించాను. తర్వాత పూజ ముగించుకుని నా గదికి వెళ్లి భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం! నేను మొదట చదివిన హెడ్డింగ్ - "బాబా యాక్సెప్టెడ్ మై ఫుడ్(బాబా నేను పెట్టిన ఆహారాన్ని స్వీకరించారు)" అని. అది చదివిన నేను చాలా ఆనందాన్ని పొందాను. తర్వాత అనుకోకుండా మా మామగారు చూస్తున్న టీవీ సీరియల్‌లో బాబా దర్శనం కూడా లభించింది. 

గురువారం నా పారాయణ ముగిసిన తరువాత వచ్చిన సోమవారంనాడు నేను మా ఇంట్లో కొంతమంది  అతిథులతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాను. ఐదు సంవత్సరాల మా అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, "అమ్మా! బయటికి రా, సాయిబాబా వచ్చారు" అని అన్నాడు. తనేదో జోక్ చేస్తున్నాడని నేను తన మాట నమ్మలేదు. కానీ తను తనతోపాటు రమ్మని బలవంతపెట్టాడు. బయటకు వెళ్లి చూస్తే, మా ఇంటి గేట్ ముందు సాయిబాబా విగ్రహం ఉన్న ఒక వ్యాన్, సాయి వస్త్రాలు ధరించిన ఐదుగురు వ్యక్తులున్నారు. నన్ను చూస్తూనే వాళ్లలో ఒకరు నా వద్దకు వచ్చి, సాయిబాబా రూపం ముద్రించబడివున్న ఒక కాయిన్ నాకిచ్చి, "మేము శిరిడీనుండి రోడ్డు మార్గంగుండా వస్తున్నాము. ఇప్పటికి వారంరోజుల ప్రయాణమయ్యింది. మేము కలకత్తా వెళ్తున్నాము" అని చెప్పారు. ఆ మాటలు వింటూనే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. లవ్లీ గిఫ్ట్ పంపిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు పదాలు దొరకలేదు. తరువాత జరిగిన పరీక్షలలో మా అమ్మాయి 90% మార్కులు తెచ్చుకుంది. బాబా ఆశీస్సులతో తను ఇంకా వృద్ధి సాధిస్తుందని నా ఆశ. తన ప్రవర్తన కూడా నిదానంగా మెరుగుపడుతోంది. "అన్నింటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2380.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo