సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి చంద్రాబాయి బోర్కర్



బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అంకితభక్తులలో విల్లేపార్లే(బొంబాయి) నివాసి శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఒకరు. బాబా ఆమెను ఆప్యాయంగా ‘బాయీ’ అని పిలిచేవారు. 1898వ సంవత్సరంలో ఆమె మొదటిసారి శిరిడీ దర్శించింది. తొలి దర్శనంలోనే బాబా దివ్యవర్ఛస్సుకు తనను తాను మైమరచి ఆనందపారవశ్యంలో మునిగిపోయింది. అప్పట్లో బాబా పాడుబడిన మసీదులోనో లేదా వేపచెట్టు క్రిందనో కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించడం, గుడ్డపీలికలతో ఉయ్యాలలా వ్రేలాడే చెక్కబల్లపై పడుకోవటం ప్రత్యక్షంగా చూసిన ఆమె, బాబా సిద్ధయోగీ౦ద్రులని, అవతారపురుషులని విశ్వసించి కొన్నిరోజులు శిరిడీలోనే గడిపి తిరిగి వెళ్ళింది. ఇక అప్పటినుండి ఆమె తరచూ శిరిడీ రాసాగింది. అప్పటికింకా సాఠేవాడా నిర్మాణం జరగలేదు. అందువలన ఆమె ఎప్పుడు శిరిడీ వెళ్లినా ఎవరైనా గ్రామస్తుల ఇంట్లో బసచేస్తుండేది. బాబా ప్రతిరోజూ తమ స్వహస్తాలతో కొద్ది పరిమాణంలో ఆమెకు ఊదీ ప్రసాదించేవారు. ఆమె ఆ ఊదీనెంతో పదిలంగా భద్రపరుచుకుంటూ ఉండేది. ఆమెకు ఆ ఊదీ యొక్క పవిత్రత, శక్తి బాగా తెలుసు గనుక దానిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండేది. ఎవరికైనా జబ్బు చేసినా, అపాయకర పరిస్థితి ఏర్పడినా ఆమె వారికి ఆ ఊదీని ఇస్తుండేది. బాబా ఆమెకు తమ పన్నునొకదానిని ప్రసాదించారు. దాన్ని ఆమె ఒక తాయెత్తులో ఉంచి శ్రద్ధగా పూజించుకొనేది. శ్యామారావు చిత్రించిన తన చిత్రపటం ఒకదాన్ని కూడా బాబా ఆమెకు ఇచ్చారు.

శ్రీమతి చంద్రాబాయి భర్త శ్రీరామచంద్ర బోర్కర్ ఒక మెకానికల్ ఇంజనీరు. విధి నిర్వహణలో భాగంగా అతను వంతెన నిర్మాణ పనులు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్లి, ఎక్కువరోజులు అక్కడే ఉండేవాడు. ఆ సమయాన్ని చంద్రాబాయి శిరిడీ వెళ్ళి బాబా సన్నిధిలో సద్వినియోగపరుచుకుంటుండేది. బాబా లీలలెన్నిటినో ప్రత్యక్షంగా చూసిన ఆమెకు బాబాపై మరింతగా భక్తిశ్రద్ధలు దృఢమయ్యాయి. ఆమె మనసు సదా సాయి సన్నిధిలో ఉ౦డాలని కోరుకునేది. అయితే ఆమె భర్త నాస్తికుడు, సదా ప్రాపంచిక విషయాలలో మునిగితేలుతుండేవాడు. తానొక స్త్రీ అయినందువల్ల తన ఇష్టానుసారం స్వేచ్ఛగా సాయిని సేవించి అవకాశం లేదు. అందువలన తన భక్తికి, సేవకు భర్త ఆటంకం కలిగించకూడదని సాయిని ప్రార్థించేది. తన భర్తను మార్చమని సాయిని మనసారా వేడుకునేది. బహుశా బాబా ఆమె మొర ఆలకించారేమో! ఆమె శిరిడీ వెళ్తుంటే ఆమె భర్త ఏనాడూ ఆగ్రహించేవాడు కాదు, ఆక్షేపించేవాడు కూడా కాదు. అది ఆమె సద్గురువైన సాయినాథుని కృపావిశేషం.

శ్రీరామచంద్ర ఎప్పుడూ శిరిడీ వెళ్ళలేదు. అయినప్పటికీ తమ భక్తురాలిపై ప్రేమతో బాబా అతని మీద తన అనుగ్రహాన్ని ప్రసరిస్తుండేవారు. అతనికి ఏదైనా ఉపద్రవం కలగవచ్చని చంద్రాబాయిని తరచూ బాబా హెచ్చరిస్తుండేవారు. 1909లో రామచంద్ర బోర్కర్ వృత్తిరీత్యా పండరీపురంలోని వంతెన నిర్మాణ పనుల్లో ఉన్నారు. అతనక్కడ ఉన్న సమయంలో చంద్రాబాయి శిరిడీ వెళ్లి బాబా సేవలో నిమగ్నమైంది. ఒకరోజు బాబా ఆమెతో, “అమ్మా, నువ్వు పండరి వెళ్ళు. నేనూ నీ వెనుకే వస్తాను. నాకు ఏ వాహనాలూ అక్కర్లేదు” అన్నారు. బాబా ఆజ్ఞను శిరసావహించి చంద్రాబాయి తనకు తోడుగా మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పండరిపురానికి ప్రయాణమైంది. తీరా అక్కడికి వెళ్ళాక, తన భర్త పండరిపురంలో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయాడని తెలిసి ఆమె నివ్వెరపోయింది. ఆమెకు దుఃఖమాగలేదు. బొంబాయి వెళ్లేందుకు ఆమె దగ్గర సరిపడా డబ్బులు లేవు. పైగా తనతోపాటు మరో ఇద్దరున్నారు. చేతిలోనున్న పైకం ‘కుర్ద్‌వాడి’ వరకు ఛార్జీలకు సరిపోగా అక్కడికి చేరుకుంది. ఆపై ఏంచేయాలో తోచక దిగులుపడుతుండగా, ఒక ఫకీరు ఆమె చెంతకు వచ్చి, “దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు?” అని అడిగాడు. చంద్రాబాయి సమాధానమేమీ ఇవ్వక మౌనంగా ఉండిపోయింది. “అమ్మా, నీ భర్త ధోండ్ రైల్వేస్టేషనులో ఉన్నాడు, వెంటనే వెళ్ళు” అన్నాడు ఆ ఫకీరు. “నా దగ్గర డబ్బులేదు” అని చెప్పిందామె. అంతట ఆ ఫకీరు ధోండ్‌‌కు మూడు టికెట్లు ఆమె చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయిన చంద్రాబాయి వివరాలు అడిగేలోపే ఆ ఫకీరు అక్కడనుండి వడివడిగా వెళ్ళిపోయాడు. ఆమె ధోండ్‌‌కు వెళ్లే రైలెక్కింది. సరిగా అదే సమయంలో ధోండ్ రైల్వేస్టేషనులో రామచంద్రబోర్కర్ టీ త్రాగి ఒక బెంచీపై కునికిపాట్లు పడుతున్నాడు. అంతలో ఒక ఫకీరు కనిపించి, “నా తల్లిని ఎందుకిలా నిర్లక్ష్యం చేస్తావు? ఆమె ఇప్పుడు రాబోయే రైల్లో ఇక్కడికి వస్తోంది. ఇంటికి తీసుకెళ్ళు” అని చెప్పి, ఆమె వస్తున్న రైలు బోగీ నెంబరు కూడా చెప్పాడు. రామచంద్ర బోర్కర్ ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. కొంతసేపటికి రైలు రావడం, అందులోనుంచి చంద్రాబాయి దిగటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆమెను కలుసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. అంతవరకూ తన భార్య పూజించే సాయిబాబా ఫోటోవంక కూడా ఎప్పుడూ చూడని అతను తనకొక ఫకీరు కనిపించారని భార్యతో చెప్పి, “ఏదీ, నువ్వు పూజించే సాయిబాబా పటం చూపించు” అని అడిగాడు. వెంటనే చంద్రాబాయి బాబా పటం చూపించింది. ఆశ్చర్యంతో అతను, “నాకు కనిపించింది బాబానే!” అని చెప్పాడు. కన్నతండ్రివలె తన గురించి శ్రద్ధ తీసుకుంటూ తనను భర్త చెంతకు చేర్చిన శ్రీసాయినాథుని కరుణకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందామె.

1912వ సంవత్సరంలో శ్రీరామచంద్ర బోర్కర్ పండరీపురంలో ఉన్నాడు. ఆ సమయంలో చంద్రాబాయి శిరిడీలో ఉంది. ఆ సంవత్సరం అధిక ఆషాఢమాసం వచ్చింది. ఉత్తర భారతదేశంలో అధిక ఆషాడంలో ‘కోకిల వ్రతం’ చేయటం ఆచారం. ఒకరోజు బాబా ఆమెతో, “కోకిల వ్రతం చేయి, శివుడు ప్రసన్నుడై మీ కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటాడు” అని చెప్పారు. బాబా ఆదేశానికి కట్టుబడి ఆమె ఆ వ్రతం కోసం కోపర్‌గాఁవ్ గ్రామంలోని స్వచ్ఛమైన, పవిత్రమైన గోదావరి నదీతీరాన్ని ఎంచుకొని వ్రతాన్ని ప్రారంభించింది. ఒక శుభదినాన ఆమె శివపూజ పూర్తిచేసి శివాలయంలో ప్రదక్షిణ చేస్తుండగా ఒక యువఫకీరు ఆమె వద్దకొచ్చి, “అమ్మా! నాకు బెల్లం చపాతీ, వెల్లుల్లి పచ్చడి కావాలి” (“మాయీ! మాలా గుడాచీ పోళీ ఆని లాసాన్చీ చట్నీ ద్యా!”) అని అడిగాడు. ఆమె, “నేను వ్రతాన్ని పాటిస్తున్నాను. ఈ సమయంలో నేను ఉల్లి, వెల్లుల్లి తినను. అంతేకాక, నాకంటూ ఇక్కడ ఇల్లు లేదు. వ్రతరీత్యా నేను ఇక్కడ ఉంటున్నాను” అని చెప్పింది. ఆ ఫకీరు ఏ మాత్రమూ నిరాశ చెందకుండా ముఖం మీద చిరునవ్వుతో, “ఇచ్చేవాళ్లకీ, ఇవ్వనివాళ్లకీ మంచి జరుగుతుంది” (“దేనార్ పాన్ చాంగ్లా, నాహి దేనార్ పాన్ చాంగ్లా”) అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫకీరు వెళ్లిపోయిన తరువాత చంద్రబాయి ఆ సంఘటనను గుర్తుచేసుకున్నప్పుడు, బాబా ముఖంలో ఏదైతే ప్రకాశం ఉంటుందో, అదే ప్రకాశం ఆ యువఫకీరు ముఖంలో ఉన్నట్లు గుర్తించింది. దాంతో ఆమె, “నేను నా వ్రతం పూర్తయ్యేవరకు శిరిడీ వెళ్ళలేను, బాబాకు ఏమీ సమర్పించలేను. కానీ నా దైవమే నా దగ్గరకు వస్తే, ఏమీ ఇవ్వక ఒట్టి చేతులతో ఆయనను పంపించాను. నాకన్నా దురదృష్టవతురాలు ఎవరూ ఉండరు” అని చాలా బాధపడింది. దుఃఖభారంతో ఆమెకు ఆ రాత్రి ఎంతకీ నడవలేదు. దాంతో ఆమె, “ఓ ప్రియమైన సాయినాథా! దయచేసి ఈ నల్లని సుదీర్ఘమైన రాత్రిని త్వరగా గడిచిపోనివ్వండి. అప్పుడే నేను మీ దర్శనానికి శిరిడీ రాగలను” అని ప్రార్థించింది. మొత్తానికి ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నిద్రలేచి ఆమె తన పనులను త్వరత్వరగా ముగించుకొని బాబా కోసం బెల్లం చపాతీలు, వెల్లుల్లి పచ్చడి తయారుచేసి శిరిడీకి బయలుదేరింది.

చంద్రాబాయి శిరిడీ చేరుకునేసరికి బాబా లెండీ నుండి తిరిగి వస్తూ కనిపించారు. ఆమె ఆలస్యం చేయక వెంటనే బాబా పాదాల మీద పడింది. వారి దర్శనంతో ఆమె మనసు సంతృప్తి చెందగా ప్రేమ కన్నీళ్ల రూపంలో ప్రవహించింది. తరువాత బాబాతోపాటు ఆమె మసీదుకు వెళ్ళింది. బాపూసాహెబ్ జోగ్ మధ్యాహ్నం ఆరతి చేసిన తరువాత భక్తులందరినీ వారి వారి బసలకు పంపారు బాబా. అప్పుడు చంద్రాబాయి ప్రేమతో బాబాకు బెల్లం చపాతీలు, వెల్లుల్లి పచ్చడి అందించింది. “నేను వీటిని కోరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు. మరిప్పుడు వీటితో నా దగ్గరకు ఎందుకు వచ్చావు?” అని అన్నారు బాబా. అందుకామె, “బాబా! నేను అజ్ఞానురాలిని. మిమ్మల్ని గుర్తించలేకపోయాను. కానీ, ఇప్పుడు మీకిష్టమైనవి తీసుకొని వచ్చాను. దయతో వీటిని స్వీకరించండి” అని వేడుకుంది. అప్పుడు బాబా అక్కడున్న భక్తులతో, “ఈమె గత ఏడు జన్మలలో నా సోదరి. నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసుకొని నా దగ్గరకు వస్తుంది” అని చెప్పి ఆమె వైపు తిరిగి ప్రేమగా అవలోకిస్తూ, “వెళ్ళు, నీ వ్రతం ఫలవంతమవుతుంది” అని ఆశీర్వదించారు. శివుడే తన దైవమైన సాయిబాబా రూపంలో తన వ్రతానికి ఆశీస్సులిస్తున్నారన్న భావం కలుగగా చంద్రాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తిరిగి కోపర్‌గాఁవ్ వెళ్లి శ్రద్ధగా వ్రతాన్ని పూర్తిచేసి సంతృప్తి నిండిన మనస్సుతో సంతోషంగా పండరీపురంలో ఉన్న తన భర్త వద్దకు వెళ్ళింది.

చంద్రబాయి బోర్కర్ ఎంతో సమయస్ఫూర్తి, గుండెదిటవు కల మహిళ. బాబా ఒక గురుపూర్ణిమనాడు ఆమెను పూజాద్రవ్యాలు, నైవేద్యం తీసుకొని వెళ్లి ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీబాబాను పూజించమని ఆదేశించారు. ఉపాసనీబాబా ఆ రోజుల్లో ఎవ్వరినీ తన దగ్గరకు రానిచ్చేవారు కాదు. అతని దరిదాపులకు వెళ్లేందుకు అందరూ భయపడేవారు. అయితే చంద్రబాయి మాత్రం నిర్భయంగా పూజాద్రవ్యాలు తీసుకెళ్లి ఉపాసనీని పూజించబోయింది. హఠాత్తుగా ఆమె వచ్చి తన పాదాలకు పూజ చేయబోతుంటే, “ఏమిటిది, ఏం చేస్తున్నావు? నా కాళ్లు పట్టుకుంటావేం? పో ఇక్కడినుంచి!” అని కోపంగా గద్దించాడు ఉపాసనీ. “ఈరోజు మిమ్మల్ని పూజించమని నాకు బాబా చెప్పారు. బాబా ఆజ్ఞ నాకు శిరోధార్యం. మీరెంత కాదన్నా మిమ్మల్ని పూజించకుండా మాత్రం నేను వెళ్ళేది లేదు” అని, ఉపాసనీ ఎంత వారించబోయినా లక్ష్యపెట్టక చక్కగా పూజ పూర్తిచేసుకునే వెళ్ళిందామె. ఆమెకున్న చిత్తస్థైర్యం, బాబా మాటపై ఆమెకున్న భక్తి, గౌరవాలు అటువంటివి. ఆరోజు తరువాత ఆమె మళ్ళీ ఎప్పుడూ ఉపాసనీబాబాను పూజించలేదు. ఆమె ఉపాసనీబాబాని ఒక గురుబంధువుగా పరిగణించిందేగానీ చాలామంది శిరిడీవాసుల వలే ద్వేషించలేదు. బాబా, “ఎవరినీ ద్వేషించవద్దు. ఈర్ష్య, అసూయ, విరోధం, పోటీ మొదలైన భావాలకు చోటివ్వవద్దు. ఎవరైనా నిన్ను ద్వేషించి, విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండు” అని తరచూ చెబుతుండేవారు. అయితే ఉపాసనీ మహరాజ్‌పై ఆమెకున్న అభిప్రాయాన్ని ఇతరులేకాక, ఉపాసనీ మహరాజ్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 1934లో ఉపాసనీ పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడడానికి చంద్రాబాయి సాకోరి వెళ్ళింది. అప్పుడు కూడా మహరాజ్, ఆమెకు వారితో విరోధభావమున్నట్లు అపార్థం చేసుకొని విడిగా మాట్లాడేందుకు అవకాశమివ్వలేదు. ఆమె తిరిగి వచ్చేసింది.

 1918లో తాము మహాసమాధి చెందడానికి ముందు, తరువాత కూడా చంద్రబాయిపై, ఆమె సంబంధీకులపై బాబా చూపిన దయ, కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తరువాత ఆమె శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో విజయదశమికి మూడునెలల ముందు జూలైలో బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళింది చంద్రాబాయి. అప్పుడు బాబా ఆమెతో, “బాయీ, ఇక మీదట నన్ను చూడటానికి నువ్విక్కడికి రానవసరం లేదు. నువ్వెక్కడున్నా నేను నీతోనే ఉంటాను!” అని అన్నారు. బాబా చూపిన ప్రేమాభిమానాలకు ఆమె కన్నుల నుండి ఆనందభాష్పాలు జాలువారాయి. తరువాత బాబా వద్ద నుండి ఊదీ తీసుకొని వెళ్ళిపోయింది. తరువాత కొద్దిరోజుల్లో విజయదశమి ఉందనగా శ్రీమతి చంద్రాబాయి బొంబాయి నుండి 159కి.మీ.ల దూరంలో ఉన్న పంచాగ్ని అనే ప్రాంతానికి వెళ్ళింది. పంచాగ్ని ఎంతో సుందర ప్రదేశమైనప్పటికీ ఆమె మనసులో ఏదో తెలియని అశాంతి, అలజడి చోటుచేసుకున్నాయి. దానివల్ల ఆ ప్రదేశంలో ఉన్న అందాలని ఆమె ఆస్వాదించలేకపోయింది. అక్కడ శిరిడీలో అస్వస్థతగా ఉన్న శ్రీసాయి తరచూ, “చ౦ద్రాబాయి వచ్చి౦దా?” అని అడుగుతున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఆ విషయాన్ని తెలియజేస్తూ, “బాబా పదేపదే మీ గురించే ఆలోచిస్తున్నారు. వారి ఆరోగ్యం చాలా వేగంగా దిగజారిపోతోంది. వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరు” అని ఆమెకు కబురు పంపాడు. ఆ కబురు అందిన వెంటనే ఆమె బయలుదేరి బాబా తుదిశ్వాస విడిచే సమయానికి శిరిడీ చేరుకుంది. బాబాను ఆ స్థితిలో చూసి ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లపర్యంతమైంది. అంతిమ సమయంలో ఆమె బాబా నోట్లో నీరు పోసింది. ఆ తరువాత 1919లో ఒకసారి, 1933లో ఒకసారి ఆమె శిరిడీ సందర్శించింది. బాబా ఆమెకు వాగ్దానం చేసినట్లు, ఎక్కడ ఉన్నా ఎప్పుడూ ఆమెతో ఉంటూ తమ సహాయాన్ని అందిస్తుండేవారు. ఆమె తన అనుభవాలను, కొన్ని పద్యాలను రచించి శ్రీసాయిలీల పత్రికకు ఇచ్చింది.

1921లో శ్రీమతి చంద్రాబాయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అది బాబా అనుగ్రహమే. వివరాలలోకి వెళితే... 1918 నాటికి ఆమెకు 48 ఏళ్ళ వయసు. అప్పటివరకు ఆమెకు సంతానం కలగలేదు. ఇక ఆ వయస్సులో సంతానం కలగటం అసంభవమన్న ఒకేఒక్క భావాన్ని ప్రజలు, వైద్యులు వ్యక్తపరుస్తున్నప్పటికీ సహజంగానే ఆమె సంతానం కోసం ఆరాటపడుతుండేది. బాబాకు ఆమె మనసు తెలుసు. 1918లో ఒకరోజు బాబా ఆమెను, “బాయీ! నీ మనోవాంఛ ఏమిటి?” అని అడిగారు. అందుకామె, “బాబా! మీకన్నీ తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేముంది?” అని బదులిచ్చింది. “సరే”నన్నారు బాబా. మూడు సంవత్సరాల తరువాత ఆమెకు నెలసరి ఆగిపోయింది. కొన్ని నెలలకి ఆమెను పరీక్షించిన డాక్టర్ పురందరే ఆమె కడుపున ఉన్నది బిడ్డ కాదు, ‘గడ్డ’ అనీ, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలనీ చెప్పాడు. బాబా మాటపై విశ్వాసంతో ఆమె వైద్యుని మాటను ఖాతరు చేయక “పది నెలల సమయంలో ఇదేమిటో నిర్ధారణ అవుతుంది” అని చెప్పింది. సుదీర్ఘకాలంగా గర్భం దాల్చనివారికి 51 సంవత్సరాల వయసులో సంతానం కలిగే అవకాశం ఏ మాత్రమూ లేదన్న అభిప్రాయాన్ని వైద్యుడు వ్యక్తపరిచాడు. కానీ సాయి కృపతో అసంభవం సంభవమైంది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత బాబా మహాసమాధి చెందిన మూడు సంవత్సరాల రెండు రోజులకు ధనత్రయోదశినాటి రాత్రి చెంబూరులో ఆమెకు సుఖప్రసవమై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో వైద్యుడుగానీ, నర్సుగానీ లేరు. ఆమె ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవ సమయానికి ముందువరకు ఆమె మామూలుగానే తన రోజువారీ పనులన్నీ చేసుకుంది. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలల కాలంలో కాళ్ళవాపులు తదితర ఎన్నో సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె నెలల తరబడి ఆహారం తీసుకొనేది కాదు. కేవలం ఊదీ, నీళ్లు మాత్రమే తరచూ తీసుకొనేది. అంతటి విశ్వాసం ఆమెకు సాయి పట్ల. ఇంకో విశేషమేమిటంటే, ఆమె తన సోదరునిగా భావించే తాత్యాకు కూడా బాబా ఆశీస్సులతో అదే సంవత్సరం, అదే యాభై ఏళ్ళ వయస్సులో కొడుకు పుట్టాడు.

1921వ సంవత్సరంలో రామచంద్ర బోర్కర్‌కి పండరిపురం నుండి నాసిక్, మన్మాడ్ మార్గంలో ఉన్న ఆసావలీకి బదిలీ అయింది. బోర్కర్ కుటుంబం రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఉన్న రైల్వేక్వార్టర్సులో నివాసముంటుండేవారు. ఒకనాటి సాయంత్రం బోర్కర్ తన విధులు ముగించుకొని ఇంటికి జ్వరంతో వచ్చాడు. మూడు, నాలుగు దుప్పట్లు కప్పుకున్నప్పటికీ అతను చలితో వణికిపోసాగాడు. అంతటి తీవ్రమైన జ్వరంతో అతను బాధపడుతున్నాడు. చిన్న గ్రామమైన ఆసావలీలో వైద్యుడు, వైద్య సదుపాయం అందుబాటులో లేవు. ఆ కారణంగా శ్రీమతి చంద్రాబాయి ఇంటిలోనే మందు తయారుచేసి భర్తకు ఇచ్చింది. అది తీసుకున్నాక వణుకుతున్నప్పటికీ అతనికి బాగా నిద్రపట్టింది. చంద్రాబాయి కూడా భర్త పాదాల చెంతే నిద్రలోకి జారుకుంది. కాసేపటికి కలలో ఆమెకు బాబా కన్పించి, “బాయీ! బాధపడకు. నీ భర్త శరీరానికి ఊదీ రాయి, అతనికి నయమవుతుంది. కానీ, రేపు ఉదయం 11 గంటల వరకు అతనిని బయటకి పోనివ్వవద్దు” అని చెప్పారు. ఆమె వెంటనే లేచి బాబా చెప్పినట్లు భర్త శరీరమంతా ఊదీ రాసింది. ఆశ్చర్యంగా క్షణాల్లో అతని శరీర ఉష్ణోగ్రత తగ్గింది. ఉదయం లేచేసరికి అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. 

చంద్రాబాయి తన భర్తతో, “బయటకెక్కడికీ వెళ్ళవద్దు. రోజంతా విశ్రాంతి తీసుకోమ”ని చెప్పింది. కానీ అతను ఆమె మాటను పట్టించుకోకుండా, ఆమె వారిస్తున్నా వినకుండా అల్పాహారం తీసుకొని ఇంటినుండి బయలుదేరి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళాడు. చంద్రాబాయి కిటికీలోనుండి భర్తనే గమనిస్తూ, “నా భర్తకి రక్షణనివ్వమ”ని బాబాను ప్రార్థిస్తూ ఉంది. ఇంతలో ట్రాక్‌పై ఉన్న బోర్కర్‌ని మరో రైల్వే ఉద్యోగి కలిశాడు. ఇద్దరూ ట్రాక్‌పై నిలుచొని మాటల్లో పడ్డారు. అదే సమయంలో స్టేషన్ వైపునుండి రైలు వారున్న ట్రాక్ మీదుగా వస్తోంది. దాన్ని ఏమాత్రమూ గమనించకుండా వాళ్లిద్దరూ మాటల్లో నిమగ్నమై ఉన్నారు. కొద్దిక్షణాల్లో నేరుగా వచ్చిన రైలు అకస్మాత్తుగా రామచంద్ర బోర్కర్‌ని గుద్దింది. రైలు వేగానికి అతను ఎగిరి ప్రక్క ట్రాక్ మీద పడ్డాడు. అదంతా చూస్తున్న చంద్రాబాయి ‘బాబా!’ అని అరుస్తూ స్పృహతప్పి పడిపోయింది. ప్రక్కింటివాళ్ళు ఆమె ముఖంపై నీళ్ళు చల్లాక ఆమెకు స్పృహ వచ్చింది. జరిగిన ఘోర ప్రమాదంలో బోర్కర్ కాలి ఎముక విరిగింది. కొంతమంది అతనిని మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఆయుర్వేద మూలికలతో ఔషధం తయారుచేసి, అందులో బాబా ఊదీని కలిపి ఆ మిశ్రమాన్ని తన భర్త కాలికి పూసి కట్టుకట్టింది. కొంతసేపటికి స్పృహలోకి వస్తూనే ఆమె భర్త, “ఇంట్లో ఎవరైనా ఫకీరు ఉన్నారా?” అని అడిగాడు. ఆమె, “నాకు ఎవరూ కనిపించట్లేదు. కానీ మీరు ఆ ఫకీరును చూడగలుగుతున్నట్లైతే ఆయన వేరెవరో కాదు, నేను నిత్యం పూజించే సాయిబాబా” అని చెప్పింది. 

మరునాడు మన్మాడు నుండి ఒక వైద్యుడు వచ్చి చంద్రాబాయి కట్టిన కట్టును, మిశ్రమాన్ని తొలగించి ప్లాస్టర్‌తో కట్టుకట్టాడు. ఆ కట్టు వలన రామచంద్రకు నొప్పి ఎక్కువైంది. రాత్రయ్యేసరికి నొప్పి రెండింతలై అతను చాలా బాధను అనుభవించసాగాడు. ఆ రాత్రి చంద్రాబాయికి సాయిబాబా దర్శనమిచ్చారు. ఆమె వెంటనే బాబా పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించింది. “నీవు అతని కాలుని తీసివేయాలని అనుకుంటున్నావా ఏమిటి? వెంటనే ఆ వైద్యుడు కట్టిన కట్టు విప్పేసి గోధుమపిండి, కొబ్బరినూనె, ఊదీ మిశ్రమాన్ని నీ భర్త కాలుకి పూయి” అని చెప్పి బాబా అదృశ్యమయ్యారు. ఆమె అలాగే చేసింది. సాయి వాక్కు, ఊదీల ప్రభావం వలన అతనికి మూడునెలల్లో పూర్తిగా నయమైంది. అది చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

1934లో రామచంద్ర బోర్కర్ మరణానికి రెండు నెలల ముందు చాతుర్మాస్యంలో ఒకరోజు శ్రీమతి చంద్రాబాయికి బాబా స్వప్నదర్శనమిచ్చి, “భయపడకు! నేను నీ రాముని తీసుకుపోతాను” అని అన్నారు. ఆమె, “నన్నే ముందు తీసుకెళ్ళండి బాబా” అని అడిగింది. అప్పుడు బాబా, “నీవు చేయాల్సిన పనులు మిగిలివున్నాయి. అందువల్ల నీ భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నీకు విధించిన కార్యాలు నేరవేర్చ”మని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. అతను దానిని కలే కదా అని తేలికగా తీసుకున్నాడు. కానీ కొద్దిరోజులకి అతను తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో మరియు వెక్కిళ్ళతో జబ్బునపడ్డాడు. అతనికి తన అంతిమ ఘడియలు సమీపించాయని స్పష్టమైంది. అయితే తనకు చాతుర్మాస్యం పరిసమాప్తమైన తరవాత చనిపోవాలని బలంగా ఉందని బోర్కర్ తన భార్యతో చెప్పాడు. మరుక్షణమే కాళ్ళు, చేతులు బిగుసుకుపోయి అతను స్పృహ కోల్పోయాడు. చంద్రాబాయి తన భర్త కోరిక ప్రకారం చాతుర్మాస్యం పూర్తయ్యేవరకు అతనిని ఉంచమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. బాబా దయవలన మరుసటిరోజు అతను స్పృహలోకి వచ్చాడు, కానీ అతని అవయవాలు పటుత్వాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ అతను చాలా ఉల్లాసంగా కనిపించాడు. అలా కొన్నిరోజులు గడిచాక చాతుర్మాస్యం పూర్తయింది. ఏడవరోజు రాత్రి అతను టీ త్రాగి భార్యతో బాబాకు హారతిచ్చి, విష్ణుసహస్రనామం పెద్దగా చదవమని చెప్పాడు. అతను చెప్పినట్లే ఆమె చేయసాగింది. మరుసటిరోజు తెల్లవారి వైద్యుడు వచ్చేవరకు ఆమె చదువుతుంటే అతను వింటూ ఉన్నాడు. వైద్యుడు అతనిని పరిశీలించి ప్రమాద౦ తప్పిందని ఆశాజనకంగా మాట్లాడినప్పటికీ ఆమెకు తెలుసు, ఆరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం అతను కన్నుమూస్తాడని. ఆమె బాబాను తలచుకొని గంగాజలాన్ని అతని నోటిలో పోసింది. తరువాత ఆమె అతని పక్కనే కూర్చొని బాబాని, శ్రీకృష్ణుణ్ణి తన భర్తను వారి పాదాల చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉండగా కొంతసేపటికి అతను “శ్రీరామ్, శ్రీరామ్” అని స్మరించసాగాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి అతనిని “బాబా!” అని పిలిచాడు. అతను, ‘ఓహ్’ అని పలికి, “శ్రీరామ్, శ్రీరామ్” అంటూ కన్నుమూశాడు. అతడేనాడూ శిరిడీ రాకపోయినా, తనను నమ్మి సేవించకపోయినా, చంద్రాబాయి భక్తి వలన, ఆమె భర్తకూ అలా సద్గతి ప్రసాదించారు బాబా.

భర్త మరణంతో బిడ్డ పోషణ, నివాసముంటున్న భవంతిని కాపాడుకోవలసిన బాధ్యత శ్రీమతి చంద్రాబాయిపై పడ్డాయి. కొంతమంది బంధువులు ఆమెకు ఎడతెగని చిక్కులు తెచ్చిపెడుతూ కోర్టులో వ్యాజ్యం వేస్తామని బెదిరిస్తుండేవారు. బాబా కృపతో అతి కష్టం మీద ఆమె 14,000 రూపాయలు సేకరించి వాళ్ళనుండి ఇంటిని కాపాడుకోవడమేకాక ఇతర సమస్యలను కూడా పరిష్కరించుకుంది. తరువాత దుష్టబుద్ధి గల కొందరు ఆమె ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోకుండా చేతబడి చేసి మంత్రించిన నిమ్మకాయను ఇంటిలోకి పడేశారు. ఆ విషయాన్ని బాబా ఆమెకు స్వప్నదర్శనమిచ్చి తెలియజేసి, “కులదేవతను ఆరాధించి కష్టం తొలగించుకో”మని చెప్పారు. దాంతో ఆమె తమ కులదేవత కొలువైయున్న గోవాకు ఒక వ్యక్తిని పంపి, గిట్టనివాళ్ళు చేసిన చెడు ప్రయోగాన్ని విచ్ఛిన్నం చేయించి కష్టంనుండి బయటపడింది.

బాబా పట్ల తనకు గల అపారమైన ప్రేమతో తన స్వగృహాన్నే సాయిమందిరంగా మలచిన సాయిభక్తురాలు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్. ముంబాయిలో విల్లేపార్లే, తిలక్‌రోడ్‌‌లోని 'శ్రీరామ్‌‌సాయినివాస్ మందిరం'గా పిలవబడే ఈ మందిర వివరాలను, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్‌‌కు బాబాతో గల అనుబంధాన్ని ఆమె కోడలు శ్రీమతి 'మంగళా బోర్కర్' మాటల్లో క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.


source : ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 2016, ఏప్రిల్ నెల సంచిక
http://bonjanrao.blogspot.com/2012/09/c-h-n-d-r-b-i-b-o-r-k-e-r.html
http://saiamrithadhara.com/mahabhakthas/chandrabai_borkar.html

6 comments:

  1. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete
  2. om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🌸😀🌼🤗🌹

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo