సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 625వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా కరుణామయుడు
  2. బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకి జ్వరం మాయం


బాబా కరుణామయుడు

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనుక బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా మనతో ఉండి మన బాధ్యతలను ఎలా మోస్తున్నారో తెలియజేసే అనుభవాలను మీతో పంచుకుంటాను.

ఇటీవల మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. 2020, అక్టోబరు 31వ తారీఖున నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించాము. ఈ కరోనా సమయంలో నిశ్చితార్థం ఎలా జరుగుతుందోనని నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ ఆందోళన వల్ల నిశ్చితార్థానికి నెలరోజుల ముందునుండి నా ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బందిపడ్డాను. బాబా మీద భారం వేసి, బాబాకు పూజ చేసుకుంటూ, నా అనారోగ్యాన్ని తగ్గించమని బాబాను కన్నీటితో ప్రార్థిస్తుండేదాన్ని. కొద్ది రోజుల తరువాత బాబా కరుణతో నాకు ఆరోగ్యం చేకూరింది.

ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా అమ్మ అనారోగ్యానికి గురైంది. ఆ అనారోగ్యంతో ఒక వారంరోజుల్లోనే అమ్మ మరణించింది. అమ్మ ఇక లేదనే బాధతో నేను చాలా కృంగిపోయాను. ఒకప్రక్క అమ్మ లేదనే బాధ, ఇంకోప్రక్కన అమ్మాయి నిశ్చితార్థం. ఏమి చేయాలో తెలియక నా భారాన్నంతా బాబాపైనే వేశాను. బాబా తన బిడ్డల్ని వదలరు కదా! ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి మా అమ్మాయి నిశ్చితార్థాన్ని అనుకున్న దానికన్నా వైభవంగా జరిపించారు బాబా. బాబాను నమ్ముకున్నాక అన్నీ ఆయనే చూసుకుంటారు కదా!

ఈలోపు ఇంకొక సమస్య ఎదురైంది. నేను ఒక సెమినార్ చెప్పవలసి వచ్చింది. అమ్మ పోయిన బాధలో ఉన్న నేను దేనిమీదా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోయాను. అయినప్పటికీ బాబాపై నమ్మకంతో సెమినార్ ఇవ్వడానికి అంగీకరించాను. తరువాత నేను బాబాను ప్రార్థించి, “బాబా, నాకు ఏదీ గుర్తుండటం లేదు. నువ్వే దగ్గరుండి నాతో సెమినార్ చెప్పించాలి” అని బాబాకు చెప్పుకుని, “అంతా సవ్యంగా జరిగితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. బాబా కరుణామయుడు కదా! ఆయనే దగ్గరుండి నా చేత సెమినార్ బాగా చెప్పించారు. ఇన్ని విధాలుగా నన్ను దగ్గరుండి చూసుకుంటున్న నా సాయితండ్రికి శతకోటి వందనాలు.


బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకి జ్వరం మాయం

సాయిభక్తురాలు రూప తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాటి సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. నా పేరు రూప. నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈమధ్య మా దగ్గరి బంధువులు వాళ్ళింట్లో జరగబోయే ఫంక్షన్‌కి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ కరోనా సమయంలో ఫంక్షన్లకు వెళ్లాలంటే భయం. కానీ, వాళ్ళు మాకు ముఖ్యమైనవాళ్ళు. కనుక మా కుటుంబసభ్యులందరం ఆ ఫంక్షన్‌కి వెళ్ళాము. ఫంక్షన్ నించి ఇంటికి వచ్చిన మరుసటిరోజునించి మా అమ్మ తనకు కొద్దిగా జ్వరంగా ఉందనీ, గొంతునొప్పి కూడా ఉందనీ అన్నది. నాకు చాలా భయం వేసింది. అనవసరంగా ఫంక్షన్‌కి వెళ్ళామనిపించింది. ఒకప్పుడు మేము అవసరంలో ఉన్నప్పుడు వాళ్లు మాకు సహాయం చేశారు. అందుకే మేము వెళ్ళక తప్పలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా అమ్మకి జ్వరం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోవాలి” అని ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన మరుసటిరోజుకల్లా తనకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని, గొంతునొప్పి మాత్రం కొద్దిగా ఉందని అమ్మ చెప్పింది. బాబా దయవల్ల అది కూడా త్వరగానే తగ్గిపోతుంది.

“బాబా! మీకు శతకోటి వందనాలు. మా అందరి ఆరోగ్య పరిస్థితి బాగుండేలా అనుగ్రహించండి తండ్రీ! అమ్మకి వేరే ఆరోగ్య సమస్య కూడా వుంది. అది నీకు తెలుసు. అమ్మ మిమ్మల్నే నమ్ముకుని హోమియోపతి మందులు వేసుకుంటోంది. అమ్మకు త్వరగా నయం చేయి తండ్రీ! మీ అనుగ్రహంతో అమ్మ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆ అనుభవాన్ని కూడా నా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను. ‘సాయీ’ అని పిలిస్తే పలికే తండ్రివి నువ్వు. సదా మమ్మల్ని రక్షించు తండ్రీ! మాకు తోడు నీడగా ఉండు తండ్రీ! మేమేమైనా తప్పులు చేస్తే అమ్మలా క్షమించు తండ్రీ! సదా నీ భక్తులను కాపాడు తండ్రీ!”

బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై సాయిరామ్!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!



6 comments:

  1. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai ram baba santosh ki cough tondarga taggipovali thandri

    ReplyDelete
  4. Baba ma intlo ela undhi neeku telusu Baba plz Baba andhari arogyam bagundali ani aasheervadinchu Baba.... hospital lo unna pinni,Amma ni kapadu Baba plz...naaku aedi aina nuvve Baba...andhari ki Manchi jaragali ani aasheervadinchu Baba...!!!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo