సాయి వచనం:-
'మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి.'

'బాబా నిరసించిన వ్యర్థ ఆచారాల్లో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే - మనస్సును, వ్యర్థమైన విషయాలతో నింపక, ఖాళీగా ఉంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్ఠించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడం అన్నమాట. ఉపవాసం అనే పదానికి అర్థం: 'ఉప' అంటే దగ్గరగా లేదా సమీపంలో, 'వాసము' అంటే ఉండటం. ఇష్టదైవానికి దగ్గరగా ఉండటం. కానీ ఆ అసలైన అర్థం పోయి ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 622వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  • బాబాను నమ్ముకుంటే చాలు

గుంటూరు నుండి సాయిభక్తురాలు శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిభక్తులందరికీ సాయిరాం. ఈ బ్లాగ్ నిర్వహిస్తూ, తోటి భక్తుల అనుభవాలను అందరికీ చేరవేయడంలో ఎంతో సహాయం చేస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారములు. నా పేరు శిరీష. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మావారు దీపావళి నుండి ఐదురోజులపాటు జలుబు, జ్వరంతో బాధపడ్డారు. మొదట మేము భయపడలేదు. కానీ, మా పాపకి కూడా జలుబు, జ్వరం వచ్చేసరికి ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా భయం వేసింది. ఎందుకంటే, మావారు ఉద్యోగరీత్యా ఎంతోమంది వ్యక్తులను కలుస్తుంటారు, తరచూ మీటింగులు, కాన్ఫరెన్సులలో పాల్గొంటుంటారు. అందువల్ల మావారు కూడా భయపడి ఆలస్యం చేయకుండా బుధవారంనాడు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. నేను మావారికి కరోనా నెగెటివ్ రావాలని, జ్వరం కూడా తగ్గిపోవాలని బాబాని ప్రార్థిస్తూ, త్రాగేనీటిలో బాబా ఊదీ కలిపి మావారికి ఇవ్వడం మొదలుపెట్టాను. మరుసటిరోజు కార్తీకమాసంలో వచ్చే మొదటి గురువారం. బాబా గుడిలోని పంతులుగారు మేము బాబా కోసం ఇచ్చిన వస్త్రాలను ఆరోజు బాబాకు వేస్తామని చెప్పారు. ఆ విషయం నేను బాబాతో చెప్పుకుని, “బాబా! మేము మీ దర్శనానికి గుడికి వచ్చేటప్పటికి కరోనా టెస్ట్ రిపోర్ట్ నెగెటివ్ అని రావాలి, మేము ఆనందంతో మీకు కోవా సమర్పించుకోవాలి” అని వేడుకున్నాను. బాబా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతుంటారు. ఆయన మాపై ఎంతో దయ చూపారు. గురువారం ఉదయం ఆరుగంటలకు మేము నిద్రలేస్తూనే మావారి ఫోనుకి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే, మావారికి కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ ఉంది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా అనుకున్న ప్రకారం మావారిని గుడికి రమ్మంటే, “కలెక్టరేట్‌లో మీటింగ్ ఉంది, అయినా నేను రావడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నాకు కుదరకపోతే గనక మీరు ఆరతికి వెళ్లిరండి. నేను సాయంత్రం బాబా దర్శనానికి వెళ్తాను” అన్నారు. నాకు మాత్రం అందరమూ కలిసి మధ్యాహ్న ఆరతికి వెళ్ళాలని ఉంది. కానీ చేసేదిలేక నేను మా పాపను తీసుకుని గుడికి వెళ్ళాను. మేము వెళ్లే సమయానికి ఆశ్చర్యంగా మావారు బాబాకు సమర్పించటానికి కోవా తీసుకుని వచ్చారు. మేము ఇచ్చిన వస్త్రాలలో బాబాను దర్శించుకుని ఎంతో ఆనందంగా ఆరతిలో పాల్గొన్నాము. తరువాత నవగురువారవ్రతం పూర్తిచేసుకున్న ఒకావిడ నాకు తాంబూలం, పుస్తకం ఇచ్చింది. ఇంకో విషయమేమిటంటే, బాబా తమ సన్నిధిలోనే మాకు శివుని దర్శనాన్ని ప్రసాదించారు. ఆ గుడిలో మట్టితో పెద్ద శివలింగం ఏర్పాటు చేసి, పూజలు నిర్వహిస్తున్నారు. మేము గుంటూరు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది. కానీ, ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. నిజానికి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నేను రోజూ శివాలయానికి వెళ్తుంటాను. కానీ ఈ సంవత్సరం గుడికి వెళ్ళడానికి వీలుకాలేదు. ఆ వెలితిని బాబా ఈ విధంగా తీర్చేశారు. నేను, మావారు ఎంతో సంతోషించాము. తమ భక్తులకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది మంచిదో బాబాకు తెలుసు. ఆ సమయం రాగానే వారు అన్నీ అనుగ్రహిస్తారు. మనం చేయవలసిందల్లా శ్రద్ధ-సబూరిలతో బాబాను ప్రార్థిస్తూ ఉండటమే. బాబా ఎల్లప్పుడూ తన భక్తుల చెంత ఉంటూ ఆపదల నుండి రక్షిస్తుంటారు. “బాబా! నా ప్రార్థనను మన్నించి కరోనా బారినుండి నా కుటుంబాన్ని కాపాడారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

మరొక అనుభవం :

2020, ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం మా పాప మెచ్యూర్ అయ్యింది. అది సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయం. ఉదయం 9 గంటల తరువాత ఒక్క వస్తువు కూడా దొరికే పరిస్థితి లేదు. అందువలన నాకేం చేయాలో పాలుపోక చాలా ఆందోళనపడ్డాను. బాబా ముందు నిలబడి, “బాబా! నాకున్నది ఒక్కతే కూతురు. ఇటువంటి కఠిన సమయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని మీరే దగ్గరుండి సజావుగా జరిపించాలి” అని బాబాను ప్రార్థించి, భారమంతా ఆయన మీద వేశాను. తరువాత ఆ కార్యక్రమానికి కావాల్సిన వస్తువులు కొనడానికి నేను, మావారు చెరోవైపు వెళ్ళాము. మా అపార్టుమెంట్ దగ్గరలో ఒకరి ఇంటిలోనే షాప్ ఉంటుంది. నేను ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కొబ్బరికాయ దొరికింది. కానీ, తాంబూలానికి తమలపాకులు, ఇంకా వడ్లు(ధాన్యం) కావాలి. వాటికోసం ఏమి చేయాలని ఆంటీని అడిగాను. ఆవిడ, “మా స్నేహితురాలి ఇంట్లో తమలపాకుల మొక్క ఉంది, నీకు కావాల్సినన్ని తమలపాకులు తీసుకోవచ్చ”ని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్లింది. తరువాత ఆవిడ, “నేను మా పొలంలో పండిన ధాన్యం కొంత మాకోసమని దాచుకున్నాను” అని చెప్పి కొంచెం ధాన్యం ఇచ్చారు. ఇక తాంబూలానికి అరటిపళ్ళు కావాలి కదా! ఎలా అని ఆలోచనలో పడ్డాను. ఆరోజు ఉదయమే బత్తాయి పళ్ళు తీసుకున్నాను. వాటితో  తాంబూలం ఇద్దామనుకున్నాను. కానీ, పాపను కూర్చోబెట్టడానికి చాప కావాలి, అది కూడా తాటాకులతో తయారుచేసింది. దానికోసం ఏమి చేయాలో మాకు అర్థం కాలేదు. కాసేపటికి మా వాచ్‌మాన్‌ని అడిగితే, ‘దూరంగా ఒక తాటిచెట్టు ఉంది. ఆ తాటిచెట్టు ఎక్కే అబ్బాయి నాకు తెలుసు, అతను కనిపిస్తే అవి దొరుకుతాయి’ అని అన్నాడు. బాబా దయవలన ఆ అబ్బాయి తాటాకులు తెచ్చిచ్చాడు. ఈ విధంగా మాకు కావలసినవన్నీ బాబా మాకు సమకూర్చి మొదటిరోజు కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయించారు

మాకు ఒక్కతే అమ్మాయి కాబట్టి ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలని ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ వలన కనీసం చిన్నగా అయినా ఫంక్షన్ చేయాలని అనిపించింది. కానీ మేము రాజమండ్రి నుండి ట్రాన్స్ఫర్ మీద గుంటూరు వచ్చి ఉంటున్నాము. మా బంధువులంతా రాజమండ్రిలోనే ఉన్నారు. కరోనా కారణంగా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. కనీసం మా అమ్మావాళ్ళైనా రాలేని పరిస్థితి. పాపకు అమ్మమ్మావాళ్ళు పట్టుబట్టలు పెట్టాలి. అందువలన మేము నిరాశ చెందాము. కానీ బాబా మాపై చాలా కృప చూపించి ఆ లోటు తీర్చేశారు. మా ప్రక్క ఫ్లాట్‌లో ఉండే ఆంటీగారు మా పాపకి పట్టుబట్టలు పెట్టారు. అంతేకాదు, అపార్టుమెంట్లో ఉండేవాళ్లంతా బంధువులు లేరన్న లోటు తెలియనీయకుండా దగ్గరుండి ఎంతో సహాయం చేశారు. ముఖ్యంగా టీచర్‌గారు, పద్మ ఆంటీ కుటుంబాలు చాలా సహాయం అందించారు. 50 మందికి మేము ఇంట్లోనే వంట చేసి, భోజనాలు పెట్టాము. ఈ విషయం మా బంధువులకు తెలిసి, ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఫంక్షన్ అంత బాగా ఎలా చేశార’ని ఆశ్చర్యపోయారు. ఇదంతా బాబా మాపై చూపిన అనుగ్రహం. ఆయన దయవుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా భక్తులకు కావలసినవన్నీ సమకూరుతాయి. అది తమ భక్తులపట్ల వారికున్న బాధ్యత. దాన్ని ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.  “మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను” అని అభయమిచ్చిన బాబా, మన బాధ్యతలను తమపై వేసుకుని మనకి కావాల్సినవి ప్రసాదిస్తారు. ఒక్కసారి బాబాను నమ్ముకుంటే చాలు, అన్ని కష్టాల నుండి మనల్ని బయటకు లాగేస్తారు. ఈ అనుభవాన్ని ఎలా వ్రాయాలో తెలియక చాలాకాలం వ్రాయకుండా ఆలస్యం చేశాను. కానీ బాబా మాకు ఏ విధంగా సహాయం చేశారో తోటి సాయిబంధువులతో పంచుకోవాలన్న కోరికతో నేను ఈ  అనుభవాన్ని మీ ముందుంచాను. “చాలా చాలా ధన్యవాదములు బాబా!”

ఓం సాయిరామ్!


6 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Baba naku chala bada ga vundhi thandri na samsayani teerchu thandri enduku late chestunavu thandri tondarga ra thandri

    ReplyDelete
  3. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. ఓం సాయిరామ్!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo