సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 611వ భాగం.....


ఈ భాగంలో అనుభవం:
కోవిడ్ నుండి మా ఇంటిల్లిపాదినీ కాపాడిన నా తండ్రి సాయి

సాయిబంధువులందరికీ నా నమస్కారము. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారములు. నా పేరు సుజాత. మాది చిలకలూరిపేట. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజూ మన సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో ప్రచురిస్తున్న “సాయిభక్తుల అనుభవమాలిక” మరియు సమకాలీన భక్తుల విభాగంలోని “సాయి అనుగ్రహసుమాలు” క్రమంతప్పకుండా చదువుతాను. ఈ బ్లాగులో ప్రచురింపబడిన “సాయిభక్తి సాధనరహస్యం” నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు, నా మనసులో ఉన్న చాలా సందేహాలకు అందులో సమాధానాలు లభించాయి. ఊదీ మహిమలు, సాయి సూక్తులు, వాట్సాప్ సత్సంగము, మాస్టరుగారు, ఆరతులు వంటి శీర్షికలలో ప్రచురితమవుతున్న సాయిలీలలను చదువుతూ ఉండటం వలన మనకు సద్గురువు సాయిపై నమ్మకం దృఢమై, ఆ గురుకృప మనపై నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. అందరినీ బాబా ప్రేమకు దగ్గర చేస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

కోవిడ్ నుండి మా ఇంటిల్లిపాదినీ కాపాడిన నా తండ్రి సాయి

కోవిడ్ పుణ్యమా అని చాలాకాలంగా మా తమ్ముడి కుటుంబం మా కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కోవిడ్ కాలమని అప్పుడప్పుడు కషాయం త్రాగుతూ మేము ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉండేవాళ్ళం. 2020, అక్టోబర్ 2న మా తమ్ముడి కుటుంబం పనిమీద హైదరాబాద్ వెళ్లారు. ఆరోజు, మరుసటిరోజు నాకు నీరసం, ఒళ్ళునొప్పులు, నోరంతా చేదుగా ఉండటంవలన నేను డోలో-650 టాబ్లెట్ సగం చొప్పున రెండురోజులు వేసుకున్నాను. దాంతో ఉపశమనం కలిగింది. అక్టోబర్ 7న మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ నుండి తిరిగి వచ్చారు. వాళ్ళు వేరే ఊరు వెళ్లి వచ్చారని వరుసగా రెండురోజులు అందరమూ కషాయం త్రాగాము. అక్టోబరు 10న స్కూలులో బ్యాగులు పంపిణి చేసే డ్యూటీ నాది కావడంతో, ఆరోజు నేను బయటకు వెళ్ళాను. బహుశా ఆరోజే నాకు కరోనా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఆరోజు రాత్రి నుండి నేను అనారోగ్యానికి గురయ్యాను. నోరంతా విపరీతమైన చేదు. ఈ ఒక్క లక్షణమే కనిపిస్తుండేది. మధ్యలో నాలుగురోజులు బాగా నీరసంగా కూడా అనిపించింది. నేను నా అలవాటు ప్రకారం ప్రతిరోజూ స్నానానంతరం బాబా ఊదీని నుదుటన ధరించి, కొంచెం నీళ్లలో వేసుకుని త్రాగుతూ మా తమ్ముడు టాబ్లెట్లు తెచ్చి ఇస్తుంటే వేసుకుంటూండేదాన్ని. కానీ నోటి చేదు, నీరసం తగ్గలేదు. ఆ వారంలో నేను రెండురోజులు మా అక్క ప్రక్కన, మూడవరోజు మా అమ్మ ప్రక్కన నిద్రపోయాను. కాళ్లనొప్పులతో బాధపడుతున్న మా నాన్నగారి కాళ్ళు రెండురోజులు ఒత్తాను. అక్టోబరు 15న మా తమ్ముడు ల్యాబ్ టెక్నీషియన్‌ని తీసుకొచ్చాడు. అతను నాకు బ్లడ్ టెస్ట్ చేసి, “వైట్ సెల్స్, ప్లేట్లెట్స్ తగ్గాయి. కొద్దిగా టైఫాయిడ్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలసించక తొందరగా హాస్పిటల్లో చేరమ”ని చెప్పాడు. నేను హాస్పిటల్‌కి బయలుదేరుతూ, ‘సాయిబాబా చాలీసా’, ‘శ్రీసాయి నవగురువారవ్రతము’ మరియు ‘శ్రీగురుచరిత్ర’ పుస్తకాలను నాకు రక్షగా తీసుకుని, బాబాకు నమస్కరించి, “బాబా! మీ పాదాలకు సర్వస్యశరణాగతి చేస్తున్నాను. మొత్తం నా కుటుంబ బాధ్యత మీదే తండ్రీ! ఎవరికీ ఏమీ కాకూడదు. నీవే మా రక్షకుడివి” అని చెప్పుకుని వెళ్ళాను. హాస్పిటల్లో ఒకటిన్నర రోజులు ఉన్న తర్వాత కోవిడ్ పరీక్ష చేయించుకోమని చెప్పారు. వెంటనే మా తమ్ముడు, మరదలు నన్ను తీసుకుని వెళ్లి బాడీ స్కాన్, కరోనా పరీక్షలు చేయించారు. రిపోర్టులలో ఉన్నది తెలిసి మేము నిర్ఘాంతపోయాము. అప్పటికే కరోనా నా ఉపిరితిత్తులపై ప్రభావం చూపిందని చెప్పి, అర్జంటుగా ఐ.సి.యు లో చేరమన్నారు వాళ్ళు. అయినా నాకు ఏమీ భయం వేయలేదు. ఎందుకంటే, బాబాకు మా బాధ్యతను అప్పజెప్పాను, కాబట్టి నా కుటుంబంలోని అందరి రక్షణా ఆయన చూసుకుంటారు అనే ధీమా!

నన్ను ఐ.సి.యు లోకి మార్చాక పల్స్ మెషీన్లో నా పల్స్ 80-100 అని చూపిస్తుంది. సమయం గడిచేకొద్దీ ఆ రీడింగ్ 50-70 అని చూపించసాగింది. క్రొత్త వాతావరణమైనందున నాకు నిద్రపట్టక రాత్రంతా ఆ రీడింగ్ గమనిస్తూ ఉన్నాను. ఆ రీడింగ్ తగ్గుతూ ఉండటంతో, “ఇవేమిటిలా తగ్గిపోతున్నాయి?” అని అనుకున్నాను. వేకువఝామున 5 గంటల సమయంలో స్టాఫ్ నర్సు వచ్చి చూసి, “మీకు ఆక్సిజన్ తగ్గిపోయింది. అర్జెంటుగా ఆక్సిజన్ పెట్టాల”ని ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పెట్టింది. అప్పుడు నాకు కాస్త ఆందోళనగా అనిపించింది. కారణం, అప్పటికే మా స్కూల్లో ఒక సహ అధ్యాపకునికి కరోనా వచ్చి ఆక్సిజన్ అందక చనిపోయాడు. అయితే నేను నాతో తీసుకుని వెళ్ళిన సాయిచాలీసా, గురుచరిత్ర నా తల దగ్గరే ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండగలిగాను. డాక్టర్లు, “రెండురోజులు గడిస్తేగానీ, ఏమీ చెప్పలేము” అని అన్నారు. ఇదిలా ఉండగా, మా తమ్ముడు ఇంట్లో అందరికీ కోవిడ్ పరీక్షలు చేయించాడు. నేను ఇంట్లో అందరితో సన్నిహితంగా ఉండటం వలన మా అమ్మకి, నాన్నకి, అక్కకి, మా చిన్నపాపకి కొద్దిగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. వాళ్లంతా ఇంట్లోనే ఉంటూ కోవిడ్ చికిత్సకి సంబంధించిన కోర్సు వాడటం మొదలుపెట్టారు. నేను బాధపడతానని ఆ విషయాలు నాకు చెప్పకుండా, నా గురించి ఇంట్లో తెలియనీయకుండా మా తమ్ముడు తనలో తానే చాలా బాధపడ్డాడు. బాబా ఎంతో కరుణతో నా ప్రాణానికి ఎలాంటి ముప్పూ రానివ్వలేదు. నాలుగురోజుల తర్వాత అక్టోబర్ 19న నన్ను ఐ.సి.యు నుండి రూముకి మార్చారు. రూములో ఉన్న రెండు రోజులూ బాబాను పెట్టుకుని, సాయి సచ్చరిత్ర ఆడియో వింటూ, మనసులో నిరంతరం సాయిబాబాను నమస్కరించుకుంటూ గడుపుతూ, “బాబా! సద్గురువు దైవం కన్నా ఎక్కువని చెప్తారు. కల్పవృక్షం అయినా కోరినవే ఇస్తుంది, కానీ సద్గురువు మనం అడగని వాటిని కూడా నెరవేరుస్తారని అంటారు. ‘దేవుడికైనా కోపం వస్తుందిగానీ, సద్గురువుకి కోపమనేదే రాదు’ అని సాయి స్తవనమంజరిలో చెప్పబడింది. రోడ్డుమీద నడిచి వెళుతూ షాపులో ఉన్న నీ ఫోటో చూసి నమస్కరించుకుని, నాలుగేళ్ళ తరువాత అతను నీ దర్శనానికి వస్తే, “వీడు నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు” అని మీరు చెప్పిన వివరం ‘సాయి సచ్చరిత్ర’లో ఉంది. మీ పటం ముందు అగరుబత్తి నుండి రాలిన బూడిదను ఊదీగా భావించి మీ నామస్మరణ చేస్తూ ఉపయోగిస్తే ఎంతోమందికి ఎన్నో వ్యాధులను నయం చేశావు” అని ఇలా గుర్తుకొచ్చే సాయి లీలలను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ రెండు రోజుల్లో నేను రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి లీలగా కనిపిస్తూ,రెండు రోజుల్లో నీవు ఇంటికి వెళ్తావు” అని పదేపదే నా చెవి దగ్గర అనడం నాకు స్పష్టంగా వినిపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి సాయిబాబానే! బాబా చెప్పిన విధంగానే నేను అక్టోబర్ 21న క్షేమంగా ఇంటికి వచ్చాను. నా తండ్రి, నా రక్షకుడు శ్రీసాయినాథుని దయవల్ల మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కోలుకున్నారు.

అయితే, కొన్నిరోజులపాటు మా నాన్నగారు ఒకప్రక్క నీరసంగా ఉందంటూ అన్నం సరిగా తినేవారు కాదు. కారణం అడిగితే, ‘నాకేమీ తినాలనిపించడం లేదు’ అని చెప్తుండేవారు. సరిగా అదే సమయంలో మా చెల్లికి కరోనా ఎటాక్ అయి హాస్పిటల్లో చేరింది. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో నాకు చాలా ఆందోళనగా అనిపించి బాబాను తీవ్రంగా వేడుకుని, “నాన్న సరిగ్గా అన్నం తిని, చెల్లితో పాటు మిగతా అందరూ పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉండేట్లైతే నేను నా అనుభవాన్ని ‘సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాను. మీ మందిరానికి వచ్చి 516 రూపాయలు సమర్పించుకుంటాను” అని బాబాతో చెప్పుకున్నాను. అలాగే మా చెల్లికి స్నేహితురాలైన పద్మావతిగారు కూడా మా చెల్లికి నయమైతే చిలకలూరిపేటలోని నాగ దత్త సాయి మందిరానికి మా చెల్లిని తీసుకుని వస్తానని మ్రొక్కుకుంది. మా మొర ఆలకించి నా సాయితండ్రి మా చెల్లిని, మా కుటుంబాన్ని కాపాడారు. బాబా దయవలన ఇప్పుడు అందరం క్షేమంగా ఉన్నాం. “బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. త్వరలో మొక్కులు తీర్చుకుంటాము తండ్రీ! మీ బిడ్డలందరి మీద మీ కృపాకటాక్షవీక్షణాలు ప్రసరించండి తండ్రీ!”

అక్టోబరు 10వ తేదీన నేను అనారోగ్యానికి గురయినప్పటి నుండి నేను బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలను చదవలేకపోయాను. నేను కరోనా నుండి పూర్తిగా కోలుకున్న తరువాత నవంబరు 1న అప్పటివరకు చదవని లీలలను, బాబా సూక్తులను చదవాలని బ్లాగ్ ఓపెన్ చేసి అక్టోబరు 10వ తేదీన ప్రచురితమైన అనుభవమాలిక భాగాన్ని తెరిచాను. ఆ భాగంలో సాయి సూక్తి ఇలా ఉంది: “నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను”. అంతేకాదు, ఆరోజు ప్రచురితమైన లీల కూడా కోవిడ్‌కు సంబంధించినదే. ఆ లీలలో ఒక సోదరి, వృద్ధులైన తన తల్లిదండ్రులను కోవిడ్ నుండి బాబా ఎలా కాపాడారో పంచుకున్నారు. ఆ సోదరి తన అనుభవంలో చెప్పినట్లే నాతోపాటు మా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఆఖరికి మా చిన్నపాప కూడా కోవిడ్ బారినపడ్డారు. “ఇలా జరుగుతుందని తెలిసే బాబా మా గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోయారా?” అని నాకు కన్నీళ్లు ఆగలేదు. “సాయినాథా! దయామయా! సర్వజనరక్షకా! భక్తుల బాధలన్నీ నీవే భరిస్తున్నావా తండ్రీ? మీ కృపాకటాక్షవీక్షణాల వల్లే ఈరోజు మా కుంటుంబమంతా కోవిడ్ నుండి బయటపడి క్షేమంగా ఉంది. తల్లి తాబేలు పిల్ల తాబేళ్లను దృష్టితోనే సంరక్షించే విధంగా ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడుతూ ఉండండి. కోవిడ్ వైరస్ త్వరగా అంతరించేలా చేసి సర్వజనులపై మీ కృపాకటాక్షవీక్షణాలు ప్రసరించండి బాబా!”

ఈ విధంగా కోవిడ్ బారిన పడినా, తమ అనుగ్రహం వల్లే మేము రక్షింపబడ్డామని నేను చదివిన ఆ భాగంలోని సూక్తి, లీల ద్వారా బాబా నాకు తెలియజేశారు. భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన బాబా మనలని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారనడానికి నిదర్శనం నా అనుభవం. ఓం సాయిరాం!

మరికొన్ని అనుభవాలు తరువాయి భాగాలలో పంచుకుంటాను.... 




9 comments:

  1. I c u lo unna, chala gunde dhairyam tho unnaru sai.baba manaki tappukunda tagina samayam lo help chestaru ani,tanani nammina vallani Eenadu vadili pettananu ani marokka sari niroopinchincharu Mana sai..

    Sai baba ki jai

    ReplyDelete
  2. ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba amma ki manchi arogyani prasadinchu thandri sainatha

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo