సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ - రెండవ భాగం



1912వ సంవత్సరంలో శ్రీరామచంద్ర బోర్కర్ పండరీపురంలో ఉన్నాడు. ఆ సమయంలో చంద్రాబాయి శిరిడీలో ఉంది. ఆ సంవత్సరం అధిక ఆషాఢమాసం వచ్చింది. ఉత్తర భారతదేశంలో అధిక ఆషాడంలో ‘కోకిల వ్రతం’ చేయటం ఆచారం. ఒకరోజు బాబా ఆమెతో, “కోకిల వ్రతం చేయి, శివుడు ప్రసన్నుడై మీ కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటాడు” అని చెప్పారు. బాబా ఆదేశానికి కట్టుబడి ఆమె ఆ వ్రతం కోసం కోపర్‌గాఁవ్ గ్రామంలోని స్వచ్ఛమైన, పవిత్రమైన గోదావరి నదీతీరాన్ని ఎంచుకొని వ్రతాన్ని ప్రారంభించింది. ఒక శుభదినాన ఆమె శివపూజ పూర్తిచేసి శివాలయంలో ప్రదక్షిణ చేస్తుండగా ఒక యువఫకీరు ఆమె వద్దకొచ్చి, “అమ్మా! నాకు బెల్లం చపాతీ, వెల్లుల్లి పచ్చడి కావాలి” (“మాయీ! మాలా గుడాచీ పోళీ ఆని లాసాన్చీ చట్నీ ద్యా!”) అని అడిగాడు. ఆమె, “నేను వ్రతాన్ని పాటిస్తున్నాను. ఈ సమయంలో నేను ఉల్లి, వెల్లుల్లి తినను. అంతేకాక, నాకంటూ ఇక్కడ ఇల్లు లేదు. వ్రతరీత్యా నేను ఇక్కడ ఉంటున్నాను” అని చెప్పింది. ఆ ఫకీరు ఏ మాత్రమూ నిరాశ చెందకుండా ముఖం మీద చిరునవ్వుతో, “ఇచ్చేవాళ్లకీ, ఇవ్వనివాళ్లకీ మంచి జరుగుతుంది” (“దేనార్ పాన్ చాంగ్లా, నాహి దేనార్ పాన్ చాంగ్లా”) అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫకీరు వెళ్లిపోయిన తరువాత చంద్రబాయి ఆ సంఘటనను గుర్తుచేసుకున్నప్పుడు, బాబా ముఖంలో ఏదైతే ప్రకాశం ఉంటుందో, అదే ప్రకాశం ఆ యువఫకీరు ముఖంలో ఉన్నట్లు గుర్తించింది. దాంతో ఆమె, “నేను నా వ్రతం పూర్తయ్యేవరకు శిరిడీ వెళ్ళలేను, బాబాకు ఏమీ సమర్పించలేను. కానీ నా దైవమే నా దగ్గరకు వస్తే, ఏమీ ఇవ్వక ఒట్టి చేతులతో ఆయనను పంపించాను. నాకన్నా దురదృష్టవతురాలు ఎవరూ ఉండరు” అని చాలా బాధపడింది. దుఃఖభారంతో ఆమెకు ఆ రాత్రి ఎంతకీ నడవలేదు. దాంతో ఆమె, “ఓ ప్రియమైన సాయినాథా! దయచేసి ఈ నల్లని సుదీర్ఘమైన రాత్రిని త్వరగా గడిచిపోనివ్వండి. అప్పుడే నేను మీ దర్శనానికి శిరిడీ రాగలను” అని ప్రార్థించింది. మొత్తానికి ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నిద్రలేచి ఆమె తన పనులను త్వరత్వరగా ముగించుకొని బాబా కోసం బెల్లం చపాతీలు, వెల్లుల్లి పచ్చడి తయారుచేసి శిరిడీకి బయలుదేరింది.

చంద్రాబాయి శిరిడీ చేరుకునేసరికి బాబా లెండీ నుండి తిరిగి వస్తూ కనిపించారు. ఆమె ఆలస్యం చేయక వెంటనే బాబా పాదాల మీద పడింది. వారి దర్శనంతో ఆమె మనసు సంతృప్తి చెందగా ప్రేమ కన్నీళ్ల రూపంలో ప్రవహించింది. తరువాత బాబాతోపాటు ఆమె మసీదుకు వెళ్ళింది. బాపూసాహెబ్ జోగ్ మధ్యాహ్నం ఆరతి చేసిన తరువాత భక్తులందరినీ వారి వారి బసలకు పంపారు బాబా. అప్పుడు చంద్రాబాయి ప్రేమతో బాబాకు బెల్లం చపాతీలు, వెల్లుల్లి పచ్చడి అందించింది. “నేను వీటిని కోరి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు. మరిప్పుడు వీటితో నా దగ్గరకు ఎందుకు వచ్చావు?” అని అన్నారు బాబా. అందుకామె, “బాబా! నేను అజ్ఞానురాలిని. మిమ్మల్ని గుర్తించలేకపోయాను. కానీ, ఇప్పుడు మీకిష్టమైనవి తీసుకొని వచ్చాను. దయతో వీటిని స్వీకరించండి” అని వేడుకుంది. అప్పుడు బాబా అక్కడున్న భక్తులతో, “ఈమె గత ఏడు జన్మలలో నా సోదరి. నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసుకొని నా దగ్గరకు వస్తుంది” అని చెప్పి ఆమె వైపు తిరిగి ప్రేమగా అవలోకిస్తూ, “వెళ్ళు, నీ వ్రతం ఫలవంతమవుతుంది” అని ఆశీర్వదించారు. శివుడే తన దైవమైన సాయిబాబా రూపంలో తన వ్రతానికి ఆశీస్సులిస్తున్నారన్న భావం కలుగగా చంద్రాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తిరిగి కోపర్‌గాఁవ్ వెళ్లి శ్రద్ధగా వ్రతాన్ని పూర్తిచేసి సంతృప్తి నిండిన మనస్సుతో సంతోషంగా పండరీపురంలో ఉన్న తన భర్త వద్దకు వెళ్ళింది.

చంద్రబాయి బోర్కర్ ఎంతో సమయస్ఫూర్తి, గుండెదిటవు కల మహిళ. బాబా ఒక గురుపూర్ణిమనాడు ఆమెను పూజాద్రవ్యాలు, నైవేద్యం తీసుకొని వెళ్లి ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీబాబాను పూజించమని ఆదేశించారు. ఉపాసనీబాబా ఆ రోజుల్లో ఎవ్వరినీ తన దగ్గరకు రానిచ్చేవారు కాదు. అతని దరిదాపులకు వెళ్లేందుకు అందరూ భయపడేవారు. అయితే చంద్రబాయి మాత్రం నిర్భయంగా పూజాద్రవ్యాలు తీసుకెళ్లి ఉపాసనీని పూజించబోయింది. హఠాత్తుగా ఆమె వచ్చి తన పాదాలకు పూజ చేయబోతుంటే, “ఏమిటిది, ఏం చేస్తున్నావు? నా కాళ్లు పట్టుకుంటావేం? పో ఇక్కడినుంచి!” అని కోపంగా గద్దించాడు ఉపాసనీ. “ఈరోజు మిమ్మల్ని పూజించమని నాకు బాబా చెప్పారు. బాబా ఆజ్ఞ నాకు శిరోధార్యం. మీరెంత కాదన్నా మిమ్మల్ని పూజించకుండా మాత్రం నేను వెళ్ళేది లేదు” అని, ఉపాసనీ ఎంత వారించబోయినా లక్ష్యపెట్టక చక్కగా పూజ పూర్తిచేసుకునే వెళ్ళిందామె. ఆమెకున్న చిత్తస్థైర్యం, బాబా మాటపై ఆమెకున్న భక్తి, గౌరవాలు అటువంటివి. ఆరోజు తరువాత ఆమె మళ్ళీ ఎప్పుడూ ఉపాసనీబాబాను పూజించలేదు. ఆమె ఉపాసనీబాబాని ఒక గురుబంధువుగా పరిగణించిందేగానీ చాలామంది శిరిడీవాసుల వలే ద్వేషించలేదు. బాబా, “ఎవరినీ ద్వేషించవద్దు. ఈర్ష్య, అసూయ, విరోధం, పోటీ మొదలైన భావాలకు చోటివ్వవద్దు. ఎవరైనా నిన్ను ద్వేషించి, విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండు” అని తరచూ చెబుతుండేవారు. అయితే ఉపాసనీ మహరాజ్‌పై ఆమెకున్న అభిప్రాయాన్ని ఇతరులేకాక, ఉపాసనీ మహరాజ్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 1934లో ఉపాసనీ పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడడానికి చంద్రాబాయి సాకోరి వెళ్ళింది. అప్పుడు కూడా మహరాజ్, ఆమెకు వారితో విరోధభావమున్నట్లు అపార్థం చేసుకొని విడిగా మాట్లాడేందుకు అవకాశమివ్వలేదు. ఆమె తిరిగి వచ్చేసింది.

తరువాయిభాగం రేపు..... 

source : ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 2016, ఏప్రిల్ నెల సంచిక
http://bonjanrao.blogspot.com/2012/09/c-h-n-d-r-b-i-b-o-r-k-e-r.html
http://saiamrithadhara.com/mahabhakthas/chandrabai_borkar.html

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo