సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కేశవ్ భగవాన్ గవాంకర్ - రెండవభాగం


 బాబా ఇచ్చిన కఫ్నీ సంరక్షణ

బాబా గవాంకర్‌కి ఇచ్చిన కఫ్నీ వందసంవత్సరాల క్రితం నూలుబట్టతో కుట్టించినదైనందువల్ల అది ఇప్పుడు రంగు వెలిసిపోయి లేత పసుపురంగులోకి మారింది. 1993 వరకు దానిని జాగ్రత్తగా మడతపెట్టి ఒక చెక్కపెట్టెలో భద్రంగా ఉంచేవారు. ఆ తరువాత డా.కేశవ్ భగవాన్ గవాంకర్ కుమారుడు డా.సాయినాథ్ గవాంకర్ ఆ కఫ్నీని బయటకు తీసి ప్రతిరోజూ వచ్చే సాయిభక్తుల దర్శనానికి అనువుగా ఒక అద్దాల బీరువాలో హ్యాంగరుకి తగిలించాడు. ప్రతి సంవత్సరం దసరారోజున అతడు ఆ కఫ్నీని బయటకు తీసి రెండుగంటలపాటు మృదువుగా, చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉండేవాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ కఫ్నీ చీకిపోయినట్లుగా అయిపోవడంతో కఫ్నీని ముట్టుకోవడానికి ఎవరినీ అనుమతించడంలేదు ఆ కుటుంబీకులు. గవాంకర్‌కి బాబా బహుకరించిన కఫ్నీ అని తెలిసిన అతికొద్దిమంది అంటే సుమారు రెండువందలమంది భక్తులు మాత్రం ప్రతి సంవత్సరం ఈ కఫ్నీని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని డా.సాయినాథ్ గవాంకర్ చెప్పారు.
సమాధి చెందిన 36 సంవత్సరాల తరువాత శ్రీసాయిబాబా దర్శనం

గవాంకర్ కుటుంబీకులు వారి తాత ముత్తాతల రెండతస్తుల భవనం ‘ఇందిరానివాస్’లో నివాసముండేవారు. అది దాదాపు వంద సంవత్సరాల పూర్వకాలం నాటిది. ఇప్పుడది బొంబాయికి ఈశాన్యంగా ఉన్న కుర్లా శివారు ప్రాంతంలో ప్రధాన రహదారి ప్రక్కన ఉంది. ఆ కుటుంబంలోని వారంతా ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. బాబా మహాసమాధి చెందిన 36 సంవత్సరాల తరువాత, అంటే 1954, జనవరి 18, సోమవారంనాడు ‘ఇందిరానివాస్’లో శ్రీసాయిబాబా ఆ కుటుంబసభ్యులందరికీ దర్శనమిచ్చారు. 

ఆ వివరాలన్నీ డా.సాయినాథ్ గవాంకర్ బాబా సరిగ్గా ఎక్కడయితే కూర్చున్నారో ఆ ప్రదేశాన్ని చూపిస్తూ 59 సంవత్సరాల తరువాత ఇలా చెప్పారు: “నాకప్పుడు 5 సంవత్సరాలు. శిరిడీ సాయిబాబా కూర్చున్న చోటు, ఆ దృశ్యం మా కుటుంబంలోని వారందరికీ ఇప్పటికీ చాలా స్పష్టంగా గుర్తుంది. సాయిబాబా, మా నాన్నగారు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. మా ఇంటి వరండాలో రాత్రి 10.30 నుంచి మరునాడు ఉదయం 8.30 వరకూ వారిద్దరూ కూర్చుని ఉండటం నేను చూశాను”.

గవాంకర్ చేతులమీదుగా జరిగిన సాయిబాబా విగ్రహ ప్రాణప్రతిష్ఠ.

1954వ సంవత్సరంలో శ్రీసాయిబాబా సంస్థానానికి డా.కేశవ్ భగవాన్ గవాంకర్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆ సంవత్సరంలోనే సమాధిమందిరంలో శ్రీసాయిబాబా పాలరాతి విగ్రహం ప్రతిష్టింపబడింది. ఈ విగ్రహప్రతిష్ఠ గురించి మంచి ఆసక్తికరమయిన కథ ఒకటుంది. "విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలి?" అనే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ స్వామిశరణానంద చేత చేయించుదామనుకుంటే అతను సన్యాసి అయినందువలన అతనికా అర్హతలేదు. మరి ఎవరిచేత చేయించాలనే పెద్ద మీమాంస వచ్చింది. అప్పుడు బాబా ముందు చీటీలు వేశారు. చీటీలో డా.కేశవ్ గవాంకర్ పేరు వచ్చింది. కానీ ఆ సమయానికింకా డా.గవాంకర్ శిరిడీ చేరుకోలేదు. అతను, అతని కుటుంబం, 16 మంది బ్రాహ్మణ పురోహితులు బస్సులో శిరిడీ వస్తూ ఉన్నారు. అందుచేత దేవ్‌సాహెబ్ మరియు అతని భార్య చేత ప్రాణప్రతిష్ఠ చేయించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే డా.కేశవ్ గవాంకర్ బృందం వస్తున్న బస్సు అనుకోకుండా షాపూర్, కటారా మధ్య ఉన్న అట్‌గాఁవ్ గ్రామంలో టైర్ పంక్చరై ఆగిపోయింది. డ్రైవరు బస్సు దిగి, టైర్ ఊడదీసి పంక్చరు వేయించడానికి వెళ్ళాడు. ఈలోగా గవాంకర్ కుటుంబం, వారితోపాటు ప్రయాణిస్తున్న 16 మంది పురోహితులు దగ్గరలో ఉన్న నదీస్నానానికి వెళ్ళారు. కాసేపటికి డ్రైవరు పంక్చరు వేయించి తిరిగి వచ్చి టైర్ బిగించాడు. మరలా బస్సు శిరిడీకి బయలుదేరింది. అయితే ఒక పురోహితుడు బస్సు ఎక్కలేదన్న విషయం ఎవరూ గమనించలేదు. ఆ పురోహితుడు ఎలాగయితేనేం ఒక ట్రక్కు ఎక్కి ఒక గంట తరువాత వీళ్ళని కలుసుకున్నాడు. మొత్తానికి ఆలస్యంగా సాయంత్రానికి వాళ్ళు శిరిడీ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి దేవ్‌సాహెబ్, అతని భార్య బాబా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అంతలో కుటుంబంతో సహా గవాంకర్ రావడం చూసి, వాళ్ళు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చీటీ ద్వారా బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం డా.కేశవ్ గవాంకర్ దంపతులు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. స్వామిశరణానంద సన్యాసి కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసే యోగ్యత లేనందువల్ల బాబా విగ్రహానికి ముందు కట్టిన తెరను తెరిచే భాగ్యాన్ని అతనికిచ్చి, అతనిని గౌరవించారు.

బాబా అనుగ్రహంతో గవాంకర్ రచన

1964వ సంవత్సరంలో ఒకరోజు డా.గవాంకర్‌ తన పనులన్నీ పూర్తయిన తరువాత నిద్రపోయారు. అతను గాఢనిద్రలో ఉండగా, మధ్యరాత్రిలో అతనికి నిద్రాభంగమయింది. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు. ఆ సమయంలో అతనికి స్పష్టంగా సాయిబాబా మాటలు వినిపించాయి, “రా! లేచి నా కథలను వ్రాయడం ప్రారంభించు” అని. అతనికి ఆ మాటలు సాయిబాబావేనని స్పష్టంగా తెలుసు. వెంటనే అతను మంచం మీదనుంచి లేచి  హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి, సాయిబాబా చరిత్ర వ్రాయడానికి ఉపక్రమించారు. అప్పుడాయన సమయం చూశారు. అర్థరాత్రి దాటి 1.30 అయింది. ఆయన ఎంత పరవశంతో వ్రాశారంటే, రాత్రి 1.30కి మొదలుపెడితే ఆపకుండా మరునాడు ఉదయం 10 గంటల వరకూ వ్రాస్తూనే ఉన్నారు. అంత తక్కువ వ్యవధిలో అతను ‘శిరిడీ చే సాయిబాబా’ అనే పేరుతో 21 అధ్యాయాలు వ్రాశారు. బాబా అనుగ్రహం వల్లనే అతను అటువంటి సేవ చేయగలిగారు.

కొంతకాలానికి ఆ చరిత్ర వ్రాయడం పూర్తయింది. కానీ పుస్తక ప్రచురణకు కావలసినంత ధనం లేని కారణంగా 'పుస్తకాన్ని ఎలా ప్రచురించాలా?' అనే చింత పట్టుకుంది అతనికి. అయితే ఇప్పటికీ సాయిబాబా సజీవ సమాధిలో ఉన్నారు, ఆయన తన భక్తుల ఇబ్బందులను తొలగిస్తారు. ఒకరోజున రామన్ లాల్ పటేల్ అనే అతను గవాంకర్ వద్దకు వచ్చి పుస్తక ప్రచురణ కోసమని రూ.4,000/- ఇచ్చారు. ఆ తరువాత చాలా తక్కువ వ్యవధిలో పుస్తక ప్రచురణ పూర్తయి, పుస్తకాలన్నీ త్వరితగతిన అమ్ముడై ఎంతోమంది భక్తుల వద్దకు చేరాయి. ప్రథమముద్రణ మరాఠీభాషలో 1966లో జరిగింది. 40 సంవత్సరాల తరువాత డా.సాయినాథ్ కేశవ్ గవాంకర్ నిరంతర శ్రమవల్ల మరాఠీలో రెండవముద్రణ 2006లో జరిగింది. ఆ తరువాతి సంవత్సరాలలో గురజాతీ భాషలోకి కూడా అనువదింపబడింది. డా.కేశవ్ భగవాన్ గవాంకర్ మరాఠీలో రచించిన ఈ బాబా చరిత్ర హిందీ, తెలుగు, కన్నడ భాషలలోకి అనువదించి, ప్రచురించడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆ విధంగా డా.గవాంకర్ చేత సాయిబాబా గొప్ప సేవ చేయించుకున్నారు. అంతేకాదు, గవాంకర్ ‘సాయిలీల’ పత్రికకు ఎన్నో సంవత్సరాలు సంపాదకుడిగా పనిచేశారు. అతను మరాఠీభాషలో శిరిడీ సాయిబాబా గురించి “శిలధి’, 'శిరిడీ చే సాయిబాబా’, 'సాయిబాబా హాచ్ చమత్కార్’ అనే గ్రంథాలను రచించారు.

సాయికృపతో గవాంకర్ చివరి క్షణాలు.

డా.కేశవ్ భగవాన్ గవాంకర్ 79 సంవత్సరాల వయసులో పవిత్రమయిన ఆషాఢ శుద్ధ ఏకాదశి, 1985, జూన్ 29, శనివారమునాడు ప్రశాంతంగా మరణించారు. సాయిబాబా దర్శనమిచ్చిన ఆ పవిత్రగృహంలో ఆయన తుది శ్వాస తీసుకున్నారు. అన్నాసాహెబ్ తన ఆఖరి ఘడియలు లెక్కించుకుంటున్న సమయంలో డా.అర్గికర్ అతనిని పరీక్షించడానికి వచ్చారు. అప్పుడతనితో గవాంకర్ ఇలా అన్నారు: “డాక్టర్! నేను సప్తలోకాలను చూడగలుగుతున్నాను. సాయిబాబా నన్ను బీజమంత్రాన్ని జపించుకోమని, పురాణాలలోని కథలను జ్ఞప్తికి తెచ్చుకోమని చెపుతున్నారు. సాయిబాబా నాకోసం ఒక భవంతిని నిర్మిస్తున్నారు. అది నాకు కనపడుతోంది” అని. మళ్ళీ సాయంత్రం అతనిలా అన్నాడు: “చూడండి, పండరీపూర్ యాత్రికులందరూ అక్కడ నిరీక్షిస్తున్నారు. వారికి భోజన ఏర్పాట్లు చేయండి. మీ దగ్గర డబ్బు లేకపోతే నా వద్దనుంచి తీసుకోండి. వచ్చే గురుపౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండి. నా భవంతి తయారుగా ఉంది" అని. ఈవిధంగా మాట్లాడుతూ అన్నాసాహెబ్ సాయిబాబా పాదాల వద్ద మనస్సు నిలిపి ఆఖరిశ్వాస తీసుకున్నాడు. వందలాదిమంది భక్తులు అతనిని కడసారి దర్శించుకుని, తమ గురువుకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఆ తరువాతి సంవత్సరాలలో కీ.శే. గోవింద రఘునాథ్ దభోల్కర్ అలియాస్ హేమాడ్‌పంత్ మనుమడైన సాయిభక్తుడు దేవ్ బాబా అలియాస్ అనంత్ ప్రభు వలవాల్కర్, డా.సాయినాథ్ కేశవ్ గవాంకర్ కుటుంబానికి శిరిడీ సాయిబాబాయే వారి ఆధ్యాత్మిక గురువని చెప్పి, ఆ మార్గంలో వారు పయనించేలా వారికి మార్గదర్శకులయ్యారు.

ఒకానొక సందర్భంలో అన్నాసాహెబ్‌తో బాబా, “నేనెప్పుడూ నీవెంటే ఉంటాను. నువ్వు జీవితాంతం వరకు ఫకీరుగానే ఉన్నా, నీ కుమారులు తమ జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు” అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలై అతని కొడుకులు మంచి స్థితిలో ఉన్నారు.

 డా.అన్నాసాహెబ్ గవాంకర్ సాయిసేవా ట్రస్ట్

డా.సాయినాథ్ కేశవ్ గవాంకర్ తన పెద్దన్నగారైన ప్రమోద్ గవాంకర్ ఇచ్చిన సలహా ప్రకారం ఆ కుటుంబసభ్యులు మరికొంతమంది సేవాతత్పరులైన సాయిభక్తులతో కలిసి 1991లో “డా. అన్నాసాహెబ్ గవాంకర్ సాయిసేవా ట్రస్ట్, ముంబాయి” అనే పేరుతో ఒక పబ్లిక్ రిజిస్టర్డ్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈస్ట్ ముంబాయి, ములందిలో ఉన్న ఈ ట్రస్టు వ్యవహారాలన్నిటినీ మరొక అన్నగారు శ్రీ మోరేశ్వర్ గవాంకర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రస్టు కోజగిరి పూర్ణిమనాడు శిరిడీలో భజనలు, అన్నదానాలు, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వాస్తవానికి తొలినాళ్ళలో, అంటే 1931 వరకు కోజగిరి పూర్ణిమను కాకామహాజని, డా.యశ్వంత్ గవాంకర్ నిర్వహిస్తూ వచ్చారు. 1931లో కోజగిరి పూర్ణిమ నిర్వహించే బాధ్యతను శాశ్వతంగా డా.కేశవ్ భగవాన్ గవాంకర్‌కి అప్పగించారు. అప్పటినుండి శ్రీసాయిబాబా సంస్థాన్ వారి సహాయ సహకారాలతో ఆ ఉత్సవాన్ని గవాంకర్ కుటుంబీకులే నిర్వహిస్తున్నారు.

డా.సాయినాథ్ కె. గవాంకర్ సతీమణి శ్రీమతి అస్మితా సాయినాథ్ గవాంకర్. వారికి ఒకే ఒక కుమారుడు డా.ధ్యానేష్ గవాంకర్. అతను ముంబాయిలో జనరల్ సర్జనుగా పనిచేస్తూ కుర్లా(ముంబాయి)లో ఉన్న తమ ఇంటిలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.

డా.కేశవ్ భగవాన్ గవాంకర్ కుమారుడు డా.సాయినాథ్ గవాంకర్ చిరునామా:


డా.సాయినాథ్ కేశవ్ గవాంకర్,
402, సన్నీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ,
ఎల్.బి.ఎస్.మార్గ్, కుర్లా.
ముంబాయి-400070
ఫోన్ నెంబర్లు: 2226508830, 9819817587
మెయిల్ ఐడి: dnyaneshgawankar81@gmail.com

ఇందిరానివాస్ చిరునామా:

నెం.158, ఇందిరానివాస్,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర,
లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్,
కుర్లా వెస్ట్, ముంబాయి-400070.

సమాప్తం.

ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

3 comments:

  1. om sai baba today 2nd leela is nice.sai saved that boy.they trusted baba.they became his devotees.if we trust baba he looks after us.

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo