సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 226వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తురాలి మదిలోని అహాన్ని తొలగించిన బాబా లీల
  2. 4 సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆశ బాబా కృపతో నెరవేరింది 

భక్తురాలి మదిలోని అహాన్ని తొలగించిన బాబా లీల

సాయిభక్తురాలు శిరీష ఇటీవలి తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిరామ్! గతంలో కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఈమధ్య, అంటే 2019, అక్టోబరు 29, మంగళవారంనాడు బాబా నాకొక చక్కని అనుభవాన్ని ఇచ్చారు. దాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అనుభవం ద్వారా నా అహాన్ని సరిదిద్దుకోవడానికి బాబా నాకు సహాయం చేశారు. ఆరోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నాను. అకస్మాత్తుగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటూ కనిపించాయి. నేను బహుశా భారీ వర్షం పడుతుందేమోనని అనుకున్నాను. వెంటనే నేను, "బాబా! నేను వర్షంలో తడిసిపోవాలనుకోవడం లేదు. దయచేసి ఏదైనా చేసి నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆ సమయంలో నేను బాబా తన ఆదేశంతో వర్షాన్ని ఆపివేసిన సచ్చరిత్రలోని సంఘటనను జ్ఞాపకం చేసుకున్నాను. కొంతసేపటికి ఆ లీల ఇప్పుడు జరిగినట్లయితే, బ్లాగ్ ద్వారా తోటిభక్తులతో ఈ అనుభవం పంచుకోవడం మంచిదని నాకనిపించింది. అంతలో అకస్మాత్తుగా నా ఆలోచనల్లో అహం చోటుచేసుకుంది. దాంతో నేను 'ఈ విషయాన్ని పంచుకోవద్దు' అని అనుకున్నాను. అంతలో బస్టాండ్ వచ్చింది. బస్టాండ్ నుండి మా ఇల్లు కేవలం 5 నిమిషాల నడక దూరంలోనే ఉంది. నేను బస్సు దిగిన మరునిమిషంలో వర్షం నెమ్మదిగా ప్రారంభమై భారీ వర్షంగా మారింది. నేను ఇల్లు చేరుకునేలోగా పూర్తిగా తడిసిపోయాను. నేను ఇంట్లోకి వెళ్లిన కొద్దినిమిషాల్లో వర్షం అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పుడు నా పొరపాటును నేను గ్రహించాను. నేను వెంటనే బాబా ముందుకు వెళ్లి నమస్కరించుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా అహాన్ని సరిచేసినందుకు బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా నుండి వచ్చిన ఈ శిక్షణ నాకు ఎంతో ఆనందాన్ని, శాంతిని ఇచ్చింది. "బాబా! మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు, మా ఆలోచనలను, నడవడికను సరిదిద్దుతున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".

4 సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆశ బాబా కృపతో నెరవేరింది 

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

2016 నుండి నేను సాయిభక్తుడిని. ఒకసారి నేను బాబా ఫోటో కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నప్పుడు ఒక బాబా ఫోటో నన్ను బాగా ఆకర్షించింది. అప్పటినుండి నేను ఆయన లీలలను చదవడం మొదలుపెట్టాను. క్రమంగా నేను సాయిబాబాకు భక్తుడినయ్యాను.

నేను ప్రభుత్వ ఉద్యోగిని. వేరే విభాగంలో అదే పని చేస్తున్న వారికంటే, మా విభాగంలో ఉన్నవాళ్ళం తక్కువ జీతాన్ని పొందుతున్నాం. వాళ్లతో సమానంగా మాకు జీతాలు వచ్చేలా 2014 నుండి మేము ప్రయత్నిస్తున్నాము. డిపార్ట్‌మెంటల్ అధికారుల ఆమోదంతో ఫైళ్లను 8 సార్లు ఉన్నత అధికారులకి పంపించాము. కానీ ప్రతిసారీ వాళ్ళు ఈ విషయాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. అలా ఎటువంటి సానుకూలత లేకుండా ఫైల్ పైకి, క్రిందికి తిరుగుతూనే ఉంది. 2016లో బాబా పరిచయమైనప్పటినుండి, "బాబా! దయచేసి మా ఫైల్ పై సంతకమై, మాకు సంతోషం కలిగేలా ఏదైనా చేయండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకసారి ఆ విషయమై నేను బాబాను అడిగాను. అప్పుడు ఆయననుండి, "మీకు తగినంత డబ్బు, కీర్తి లభిస్తుంది" అని సమాధానం వచ్చింది. తరువాత కూడా పైఅధికారులు ఫైలును తిరస్కరించారు. దానితో నేను నిరాశచెంది నా రోజువారీ పూజ సమయంలో బాబా ముందు ఏడ్చాను. మరుక్షణంలో అకస్మాత్తుగా బాబా పవిత్ర పాదాల వద్దనుండి ఒక పువ్వు క్రిందికి జారింది. బాబా ఆశీర్వదించారని నాకనిపించి సంతోషంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ పువ్వును తీసి నా పర్సులో పెట్టుకుని నేను ఉన్నత అధికారులను కలవడానికి వెళ్ళాను. అంతకుముందు ఎన్నోసార్లు మేము కలవడానికి వెళ్ళినప్పుడు నిరాకరించిన అధికారులు ఆశ్చర్యకరంగా మమ్మల్ని కలవడానికి అంగీకరించారు. ఆ సమావేశంలో వాళ్ళు మేము చెప్పేది విని, "మళ్ళీ(9వ సారి) ఫైల్ పంపండి. మీ వినతిని మేము ఆమోదిస్తామ"ని హామీ కూడా ఇచ్చారు. కొన్నిరోజులు గడిచిన తరువాత బాబా కృపతో 4 సంవత్సరాలుగా మేము ఆశిస్తున్న ఫలితాన్ని పొందాము. మా ఆనందానికి అవధుల్లేవు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నా అనుభవం ద్వారా నేను శ్రద్ధ, సబూరీ అర్థాన్ని గ్రహించాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo