సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 216వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా ప్రార్థనలు మన్నించి నా బిడ్డను ఆశీర్వదించారు బాబా

USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చాలాకాలంనుండి బాబా భక్తురాలిని. కానీ గత 15 సంవత్సరాలనుండి ఆయనకు అంకిత భక్తురాలిగా మారాను. నా బిడ్డ విషయంలో చాలాకాలం బాబా ఆశీస్సులకోసం నేను ఎదురుచూసాను. నా ప్రార్థనలకు సమాధానం లభించిన తరువాత నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. చివరికి మూడేళ్ళ తరువాత ఈ సంవత్సరం జనవరి నెలలో ఆయన ఆశీస్సులు లభించాయి. అందుకు మాటలకందని కృతజ్ఞతాభావాన్ని ఆయనపట్ల నేను కలిగివున్నాను. ఇక నా అనుభవానికి వస్తే...

USAలో నివసిస్తున్న నాకు 15 ఏళ్లుగా అన్నీ బాబానే. కానీ 2016లో బాబా నా విశ్వాసాన్ని పరీక్షించదలిచారేమో! అకస్మాత్తుగా 2016 నవంబర్ 18న నా జీవితం కుప్పకూలింది. నా బిడ్డ చదివే స్కూల్ నుండి "అత్యవసరంగా స్కూలుకి రమ్మ"ని ఫోన్ వచ్చింది. విద్య, క్రమశిక్షణ, ప్రవర్తన వంటి విషయాలలో చక్కగా వుండే నా బిడ్డ గురించి అలా ఫోన్ రావడంతో నా మతిపోయింది. వెంటనే సాయిని ప్రార్థించి స్కూలుకి వెళ్ళాను. నా బిడ్డకు ఏదో మానసికరోగం ఉందని, వెంటనే తనని హాస్పిటల్లో చేర్చాల్సిన అవసరం ఉందని స్కూలు అధికారులు భావిస్తున్నట్లు తెలిసి నేను నిర్ఘాంతపోయాను. తరువాత నా బిడ్డని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే, డాక్టర్ నా బిడ్డ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని నిర్ధారణ చేసి, మందులు వాడుతూ చికిత్స కొనసాగించాలని సలహా ఇచ్చారు. అది విన్న నా గుండె పగిలిపోయింది. వెంటనే బాబా గుడికి పరుగుతీసి, "నా బిడ్డకు నయం చేయండి బాబా" అని హృదయవిదారకంగా ప్రార్థించాను.

"బాబా మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? ఆయన ఎల్లప్పుడూ మాతో ఉన్నప్పుడు ఇది ఎలా జరిగింది?" అని చాలా ఏడ్చాను. చివరికి ఆయన నా విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షించదలిచారని గ్రహించాను. దాంతో ఆయనపై భారాన్ని వేసి, "ఈ పరిస్థితినుండి బయటపడేందుకు మాకు సహాయం చేయమ"ని ప్రార్థించాను. రోగనిర్ధారణ జరిగిన తర్వాత నా బిడ్డ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నా బిడ్డ మొండిగా, పొగరుగా, క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తిసుండేవాడు. మేము ఏమీ చేయలేని పరిస్థితి. ఆ కాలంలో మేము పడిన బాధలు మాటలకు అందనివి. బాబా ఉన్నారని అనుకుంటూ, నేను చింతించకూడదని, అలా చేస్తే నాకు ఆయనపై నమ్మకం లేకపోవటానికి సంకేతమని అనిపిస్తూ ఉండేది. అయినా నేను సహనంతో ఉండలేక నన్ను క్షమించమని బాబాని ప్రార్థిస్తూ, అంత బాధలోనూ సాధారణంగా ఉండటానికి నావంతు నేను ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా మందుల అధిక మోతాదు వల్ల నా బిడ్డ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో అత్యవసర పరిస్థితిలో మేము తనని తీసుకుని హాస్పిటల్ కి పరుగుతీసాము. డాక్టర్లు, "చాలా క్లిష్టమైన పరిస్థితి. 24 గంటల వరకు ఏమీ చెప్పలేం. బిడ్డ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. తన లివర్ చెడిపోయేందుకు ఎక్కువ అవకాశముంది. అదే జరిగితే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి" అని చెప్పారు. దాంతో మేము పడిన బాధ వర్ణనాతీతం. నేను హాస్పిటల్లోనే కూర్చుని ప్రతిక్షణం బాబాను ప్రార్థిస్తూ, 'సాయి కష్ట నివారణ' మంత్రాన్ని పదే పదే జపించాను. తరువాత డాక్టర్లు పరిశీలన నిమిత్తం నా బిడ్డని ఐ.సి.యు. లో ఉంచడంతో మేము హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతూ బాబా ఫోటోని నా బిడ్డ తలక్రింద పెట్టి, "బాబా! నా బిడ్డకు తోడుగా ఉండండి" అని ప్రార్థించాను.

మేము ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుఝామున 2 గంటలయింది. కట్టలు తెంచుకొస్తున్న దుఃఖంతో నేను నిద్రపోలేకపోయాను. ఏడుస్తూ, "బాబా! మీరు నన్ను పరీక్షిస్తున్నట్లే, నేను కూడా మిమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నాను. నాపై మీకు దయ ఉంటే, అవసరమైన సమయాల్లో మీరు మీ భక్తుల పిలుపుకు ప్రతిస్పందించేటట్లయితే ఇప్పుడు నా బిడ్డను ఈ సమస్యనుండి కాపాడాలి. లేకపోతే మీరు మీ భక్తుల జాబితాలో నన్ను కోల్పోతారు" అని బాబాతో అన్నాను. తరువాత నేను నిద్రించడానికి ప్రయత్నించాను, కానీ నిద్రరాలేదు. మంచంమీదే కూర్చుని నేను చాలా చాలా ఏడ్చాను. కొద్దిసేపటికి బాబాను ధ్యానించడం మొదలుపెట్టాను. అకస్మాత్తుగా బాబా నాతో, “నేను అక్కడ ఉండగా నువ్వెందుకు భయపడతావు? అస్సలు చింతించకు" అన్నారు. తరువాత నేను నిద్రలోకి జారుకున్నాను. మరుసటిరోజు ఉదయాన మేము హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్, "మీ బిడ్డ ప్రమాదం నుండి బయటపడ్డాడు. తన లివర్ పనితీరు ఇప్పుడు సాధారణంగా ఉంద"ని చెప్పారు. నిజంగా ఇది మా జీవితాలలో ఒక అద్భుతం! నేను కన్నీళ్లతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, 'నేను ఎంత అజ్ఞానంగా ఉన్నానో!' అనిపిస్తుంది. ఒక స్వార్థపరురాలిలా బాబాతో ఒప్పందం మాట్లాడి ఆయనతో సవాలు చేసాను. కానీ ఆ సమయంలో ఒక తల్లి హృదయం బాధలో ఉంది. ఏమి చేయాలో, ఎటు పోవాలో తెలియని స్థితి. నాకున్నది బాబా ఒక్కరే. ఆయనే నాకెప్పుడూ తోడుగా ఉన్నారు. నా భర్త నాపట్ల శ్రద్ధ వహించరు, నాకు మద్దతు ఇవ్వరు. బాధను పంచుకోగలిగే సన్నిహితులు నాకు లేరు. దేశంగాని దేశంలో బంధువులు లేరు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకుని వాళ్లకున్న బాధలకి తోడు ఈ ఒత్తిడిని వాళ్లపై వేయలేను. ఇవన్నీ నేను ఎవరితో మాట్లాడేది? ఎవరినుండి మద్దతు కోసం చూసేది? అలాంటి నా చేయి పట్టుకుని బాబా నా జీవితంలోని తుఫానులన్నిటినీ దాటిస్తున్నారు. నేను బాబాను చూసినప్పుడల్లా చిరునవ్వుతో నాకు హామీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. 

ఇక అసలు విషయానికి వస్తే, మా బిడ్డ సమస్య అక్కడితో తీరిపోలేదు. ఇంకా కొనసాగుతూ వచ్చింది. డాక్టర్లు మందుల మోతాదు తగ్గించారు. కానీ పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు. ఆ సమయమంతా నేను బాబాను, "నా జీవితంలోని ఈ  క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడంలో నాకు సహాయం చేయమ"ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నన్ను విచ్ఛిన్నం చేసే సందర్భాలు కూడా ఎదురవుతూ ఉండేవి. తట్టుకోలేక ఏడుస్తూ, "బాబా! నాపై ఎప్పుడు దయ చూపిస్తార"ని అడుగుతూ ఉండేదాన్ని. ఆయన ఆశీస్సులు కోరుతూ నవగురువారవ్రతం కూడా చేసాను. శిరిడీ వెళ్లి, "నా బిడ్డను ఆశీర్వదించి తనకి నయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. కానీ సమస్యలో ఏ మార్పూ లేదు. నిజానికి కొన్నిసార్లు పరిస్థితి మరీ అధ్వాన్నమవుతున్నట్లు కూడా అనిపించింది. కానీ నేను నా ఆశను కోల్పోలేదు. నేను బాబాపై పూర్తి నమ్మకం ఉంచి, ఆయన ఆశీస్సుల కోసం ఓపికగా ఎదురుచూశాను. చివరికి నేను 2019, జనవరి 3న సాయి దివ్యపూజను ప్రారంభించాను. వ్రతంలో నాల్గవరోజు మేము డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. ఆరోజు డాక్టర్ మా ముందు రెండు ఆప్షన్స్ పెట్టారు. ఒకటి - మందులు ఆపుచేసి ఎలా ఉంటుందో చూడటం, రెండోది - మందులు మార్పు చేయడం. బాబా ఆశీర్వాదం తీసుకుని మందులు ఆపాలని నేను అనుకున్నాను. కానీ నా భర్త గత సంవత్సరంలో తక్కువ మోతాదు మందులు ఇచ్చిన తరువాత ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా భయంతో మందులు ఆపడానికి అనుకూలంగా లేరు. నేను బాబాను 'ఏమి చేయాలో నాకేదైనా సూచన ఇవ్వమ'ని అడిగాను. ఆ విషయమై నేను బాబాతో, "మందులు ఆపడం మీకు సమ్మతమైతే, శిరిడీలో మీరు ఒక నిర్దిష్ట రంగు వస్త్రాన్ని ధరించి ఉండటం నేను చూడాలి" అని అనుకున్నాను. తరువాత నేను శిరిడీ ప్రత్యక్ష దర్శనం చూస్తే, బాబా నేను అనుకున్న రంగు వస్త్రాలు ధరించి నన్ను ఆశీర్వదించారు. బాబా ఆశీర్వాదాలు లభించాక నేను నా బిడ్డకు మందులు ఇవ్వకూడదని గట్టిగా నిశ్చయించుకుని మందులు ఇవ్వడం మానేశాను. బాబా అద్భుతం చూపించారు, నా బిడ్డను ఆశీర్వదించారు. నా బిడ్డకు ఇకపై మందులు అవసరం లేదు. నా బిడ్డకు మందులివ్వడం మానేసి నెల కన్నా ఎక్కువ సమయం గడించింది. తను ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది మాకు గొప్ప ఉపశమనం. "ధన్యవాదాలు బాబా! లవ్ యూ బాబా! మీ భక్తులందరినీ సదా ఆశీర్వదించండి".

నా ఈ అనుభవంతో బాబా తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టరని, మనం మాత్రం విశ్వాసాన్ని, సహనాన్ని ఎప్పటికీ కోల్పోకూడదని నేను గ్రహించాను. ఆయనెప్పుడూ మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తుంది. పూర్వజన్మ కర్మ యొక్క పరిణామాలకు మనం అలా బాధపడాల్సి ఉంటుంది. వాటిని ఆసరాగా చేసుకుని ఆయన మనల్ని పరీక్షిస్తారు. కానీ, బాబా మనతో ఉంటే మన జీవితంలోని అన్ని తుఫానులనుండి, సమస్యలనుండి మనల్ని బయటపడేస్తారు. ఆయన బోధలను పాటించడం, ఆయనను హృదయపూర్వకంగా ప్రార్థించడమే మనం చేయాల్సింది. 

5 comments:

  1. Baba always blessed devotees omsainathaya namaha omsai ram

    ReplyDelete
  2. ఓం సాయిరాం.,.🌹🙏🌹

    ReplyDelete
  3. సర్వం సాయి మహిమ ��

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree SAI Nadhaya Namaha 🕉🙏❤😊

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo