సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 242వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా
  2. దొరికిన ఉంగరం - పెరిగిన నమ్మకం

అందమైన శిరిడీయాత్రతో ఆశీర్వదించిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


నేనొక సాధారణ సాయిభక్తురాలిని. నేను ప్రాపంచిక విషయాల కోసం సాయిని చికాకు పరుస్తున్నా, పదేపదే తప్పులు చేస్తున్నా, ప్రతికూలమైన ఆలోచనలు చేస్తున్నా నా సాయి ఎంతో దయతో నన్ను తమ నీడలో ఉంచుకుని చల్లగా ఆశీర్వదిస్తున్నారు. సాయి చెప్పినట్లుగా నేను కూడా ఏదో ఒకరోజు ఈ ప్రాపంచిక వ్యవహారాల గురించి కాకుండా ఆయన ఇవ్వదలుచుకున్న దానిని కోరుకుంటానని ఆశిస్తున్నాను. నేనిప్పుడు ఇటీవల మా శిరిడీయాత్రకు సంబంధించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మార్చి(2019)లో నేను నా పిల్లల పరీక్షలు అయిపోయిన వెంటనే శిరిడీ వెళ్లాలని అనుకున్నాను. ఎందుకంటే అవి అనుకూలమైన రోజులని నేను భావించాను. వెంటనే ఆలస్యం చేయకుండా నేను ఫ్లైట్ టిక్కెట్ల కోసం వేట ప్రారంభించాను. అయితే ఫ్లైట్ టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక నెల తరువాత అయితే తక్కువ రేట్లు ఉన్నాయి. తేదీలన్నీ పరిశీలించి, చాలాసార్లు చీటీలు వేసి మరీ తేదీలు నిర్ణయించుకుని టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. సాయి దయతో టిక్కెట్ల బుకింగులో కొద్దిగా డిస్కౌంట్ వచ్చేలా చేశారు. ఆయన కృపతో ఆరతి కోసం కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలిగాను. తీరా అన్నీ నిశ్చయమయ్యాక హఠాత్తుగా ఒక వార్త తెలిసింది. మేము శిరిడీ పర్యటన పెట్టుకున్న తేదీలలో మా పిల్లల స్కూలు వాళ్ళు ఒక ముఖ్యమైన సమావేశం షెడ్యూలు చేశారు. దానికి పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఏమి చేయాలో తెలియక పలురకాల ఆలోచనలతో నేను బాగా కలతచెందాను. మా నాన్నగారు, నా పిల్లల్లో ఒకరు గొప్ప సాయిభక్తులు. వాళ్లిద్దరూ, "బాబా జాగ్రత్త తీసుకుంటార"ని నాకు ధైర్యం చెప్పారు. దానితో నేను బాబా మీద భారంవేసి, శిరిడీ ప్రయాణానికి అనుమతి అడిగేందుకు ప్రిన్సిపాల్‌ని కలిశాను. ఆమె నేను చెప్పింది విని, వేరేవాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేవలం మాకోసం అతి తేలికగా సమావేశాన్ని వాయిదా వేసింది. 'అంత తేలికగా సమస్యను బాబా ఎలా పరిష్కరించారు?' అని నేను ఆశ్చర్యపోయాను.

తరువాత మేము సంతోషంగా మా యాత్రను ప్రారంభించాము. ఒకటి తరువాత ఒకటిగా ద్వారకామాయి, సమాధిమందిరాలలో బాబా దర్శనాలతో రెండురోజులు సంతోషంగా గడిచాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఒక ఆరతి దర్శనం కూడా అయ్యింది. మహాపారాయణలో నాకు కేటాయించిన అధ్యాయాలను, స్తవనమంజరిని వేదిక మీద కూర్చుని పారాయణ చేసుకున్నాను. అయితే ఒకసారే ఆరతి అయినందున కాకడ ఆరతి టిక్కెట్ల కోసం ప్రయత్నించాము. తెలిసినవాళ్ళ ద్వారా ఆ టిక్కెట్లు దొరకడంతో నేను చాలా సంతోషించాను. కానీ అకస్మాత్తుగా మా పాప అనారోగ్యానికి గురైంది. ఆ కారణంగా మేము కాకడ ఆరతికి వెళ్లలేకపోయాము. నేను దురదృష్టంగా భావించి చాలా బాధపడ్డాను. అయితే బాబా ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. పాప పూర్తి విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రానికల్లా కోలుకుంది. అప్పుడు ఉచితంగా(నార్మల్ క్యూ లైన్ ద్వారా) ధూప్ ఆరతికి హాజరయ్యే అవకాశాన్ని మాకిచ్చారు బాబా. వాస్తవానికి అప్పటివరకు అలా ఉచితంగా ఆరతికి వెళ్లే అవకాశం ఉంటుందని మాకస్సలు తెలియదు. మూమూలుగా మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను దాని గురించి విన్నాను. అంత రద్దీలో కూడా బాబా ముఖాన్ని స్పష్టంగా చూడగలిగే చోట కూర్చునే అవకాశం మాకు దక్కింది. మేము ఆనందంతో పరవశించిపోయాము.

రాత్రి శేజారతి అనంతరం చాలా సమయం తరువాత(అర్థరాత్రి) ద్వారకామాయిలో ప్రశాంతమైన సమయాన్ని మేము ఆస్వాదించాము. మరుసటిరోజు గురువారం మేము తిరుగుప్రయాణం అవ్వాల్సిన రోజు. మా ప్రయాణాన్ని ప్రారంభించేముందు ఒకసారి బాబా దర్శనం చేసుకోవాలని నేను అనుకున్నాను. దర్శనానికి వెళ్తూ నా ప్రియమైన సాయికి సమర్పించడానికి కొన్ని ద్రాక్షపళ్ళను తీసుకున్నాను. గురువారం కావడంతో బాగా రద్దీగా ఉంది. అంత రద్దీలో నేను సమర్పించేది సాయి స్వీకరిస్తారని అస్సలు ఊహించనప్పటికీ, అక్కడ పూజారి నా కవరు నుండి ఒక ద్రాక్షగుత్తిని తీసుకుని సమాధిపై ఉంచారు. తరువాత నేనిచ్చిన కవరుతోపాటు ఒక గులాబీపువ్వును కూడా జతచేసి నాకు తిరిగిచ్చారు. నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు (ముఖ్యంగా గురువారాల్లో లక్షలాదిమంది ప్రజలు సాయి దర్శనానికి వస్తారు.) పూజారులుగాని, పరిచారకులుగాని వాళ్ళ హడావిడిలో మనమిచ్చే వాటిని అక్కడి సమాధికి తాకించి వెంటనే తిరిగి ఇచ్చేస్తుంటారు. (అది సర్వసాధారణమైన విషయం. దానికి మనం నొచ్చుకోవడంగాని, ఫిర్యాదు చేయడంగాని చేయలేము.) అలాంటిది నేను సమర్పించిన నైవేద్యాన్ని బాబా ఎంతో దయతో స్వీకరించడం నాకు చాలా గొప్ప అనుభవం. ఆవిధంగా మా శిరిడీయాత్రను అందంగా మలిచారు బాబా. మళ్లీ మళ్లీ శిరిడీ దర్శించే అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ మీ దివ్యపాదాల చెంత నన్ను కట్టిపడేయండి".

దొరికిన ఉంగరం - పెరిగిన నమ్మకం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

బాబా ప్రేమతో తన వద్దకు లాక్కున్న పిచ్చుకలలో (భక్తులలో) నేను కూడా ఒక చిన్న పిచ్చుకను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి సాయిరాం! ప్రతిరోజూ ఈ బ్లాగులో వస్తున్న భక్తుల అనుభవాలను చదివి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎల్లవేళలా అందరినీ ఇలాగే కాపాడుతూ ఉండమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటాను. అనుభవాలను చదువుతున్నంతసేపు నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇవన్నీ నా కళ్ళెదుటే జరిగినట్లు అనుభూతి చెందుతాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకున్నాను, బాబా కరుణించారు.

నేను ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. ఒక సంవత్సరం క్రితం నా వేలికి ఉన్న వజ్రపు ఉంగరం స్కూల్లో ఎక్కడో పడిపోయింది. ఆ విషయం నేను గమనించలేదు. ఇంటికి వచ్చాక చూసుకుంటే వేలికి ఉంగరం లేదు. నాకు చాలా భయమేసింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నేను బాబానే శరణువేడి, "నా ఉంగరం నాకు దొరికేలా చేయండి బాబా" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. మరుసటిరోజు స్కూలుకి వెళ్ళిన తర్వాత, "ఎవరికైనా నా ఉంగరం దొరికిందా?" అని నా కొలీగ్స్‌ని అడిగాను. కొందరు దొరకలేదని చెప్పారు. ఒకామె మాత్రం నవ్వుతూ వున్నారు. ఇంక నాకు ఏడుపు ఆగలేదు. ఆమెను పట్టుకొని పెద్దగా ఏడ్చేశాను. ఆమె నన్ను ఓదార్చి, ఉంగరం తనకు దొరికిందని చెప్పి ఉంగరాన్ని నా చేతికిచ్చింది. ఆ సమయంలో గట్టిగా అరవాలనిపించింది, కానీ నా భావాలను లోపలే అణుచుకున్నాను. అవధులులేని ఆనందంతో బాబాకు శతకోటి వందనాలు తెలుపుకున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో బాబా గుడికి వెళ్లి ఆయన పాదాలపై పడి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పటినుండి బాబాపై నమ్మకం ఇంకా బలపడింది. నా ఉంగరాన్ని జాగ్రత్తగా నాకు ఇచ్చిన నా కొలీగ్‌కి మంచి బహుమతి ఇచ్చాను. స్కూల్లో అందరికీ బాబా ప్రసాదంగా స్వీట్స్ పంచాను. ఈ విధంగా బాబా మా ఇంట్లో ఒకరయ్యారు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటాను. 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo