సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బప్పాజీ రత్నపార్ఖీ


బాబా దేహధారిగా ఉన్నప్పుడు ఆయనతో పన్నెండు సంవత్సరాల అనుబంధాన్ని కలిగివున్న అదృష్టశాలి బప్పాజీ. ఇతడు లక్ష్మణరావు(లక్ష్మణ్‌మామా), యమున దంపతుల ఏకైక సంతానం. తనకి చిన్ననాటినుండి బాబాతో మంచి అనుబంధం ఉండేది. తరచూ ద్వారకమాయికి వెళ్లి బాబాతో ఎక్కువ సమయం గడిపేవాడు. బాబా కూడా తనని ఎంతగానో ప్రేమిస్తూ, తనతో కలిసి ఆటలాడేవారు. బప్పాజీ మరాఠీ పాఠశాలకు వెళ్లి ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. అతను 1910 నుండి బాబా సేవను ప్రారంభించాడు.

తాత్యాసాహెబ్ నూల్కర్ దేహంపై మొత్తం పదకొండు రాచకురుపులు లేచి తీవ్రమైన అనారోగ్యానికి గురై పడకపైనుండి కదలలేని పరిస్థితి ఏర్పడడంతో బాబా దర్శనం కోసం తపించిపోతుండేవాడు. ఒకరోజు తన పెద్దకుమారుడైన వామనరావును పిలిచి, బాబాకు తన కోరిక విన్నవించమని చెప్పాడు. వామనరావు మశీదుకు బయలుదేరాడు. అతడు మశీదుకెళ్ళేటప్పటికి ఏడెనిమిదేళ్ళ బప్పాజీతో బాబా ఆడుకుంటున్నారు. వామనరావు బాబాకు నమస్కరించి తన తండ్రి కోరికను విన్నవించాడు. బాబా, “అలాగే, అతనికి దర్శనం లభిస్తుంది, అల్లా అచ్ఛాకరేగా!” అని చెప్పి తిరిగి బప్పాజీతో ఆడుకోసాగారు. వాడికేవేవో కబుర్లు చెప్పి నవ్విస్తున్నారు. ప్రేమతో వాడి బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకుంటున్నారు. అప్పుడు నెత్తిమీద మూటపెట్టుకొని బట్టలమ్ముతూ ఒకతను ఆ దారిన వెళుతున్నాడు. అతని చేతిలో పూలు అల్లిన అందమైన రుమాళ్ళున్నాయి. వాటిలో ఎర్రటి రుమాలొకటి బప్పాజీని ఆకర్షించింది. “బాబా! ఆ ఎర్రరుమాలు నేను తీసుకోనా?” అని అడిగాడు. బాబా "తీసుకో!” అన్నారు. బప్పాజీ ఆ ఎర్రరుమాలును తీసుకొని మడత పెట్టి తన తలకు చుట్టుకొని బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా ప్రేమతో వాడి బుగ్గ గిల్లారు. వాడు తర్వాత ఆ రుమాలును తన తలమీదనుండి తీసి బాబా తలమీద పెట్టి పకపకా నవ్వాడు. బాబా అభ్యంతరమేమీ చెప్పలేదు. ఆ రుమాలు కిరీటమైనట్లు, తాము రాజైనట్లు నటిస్తూ ఆ ఠీవి, దర్పం ప్రదర్శిస్తూ చిరునవ్వు నవ్వారు. బప్పాజీ చప్పట్లు చరుస్తూ పకపకా నవ్వాడు. బాబా తర్వాత ఆ రుమాలును తీసి బప్పాజీ తలపై పెట్టారు. బప్పాజీ దానిని తిరిగి బాబా తలపై పెట్టాడు. బాబా తిరిగి దానిని బప్పాజీ తలపై పెట్టి ఇక ఆ ఆట చాలన్నట్లు వాడి బుగ్గ చిదిమి అనునయించారు. చమత్కారమేమిటంటే, ఈ సన్నివేశాన్నంతా సాఠేవాడాలో ఉన్న నూల్కర్ దర్శించగలిగాడు. అలా బాబా అతని కోరిక తీర్చారు.

యుక్తవయస్సు వచ్చాక బప్పాజీ ద్వారకామాయి గోడకు ఎదురుగా కూర్చుంటుండేవాడు. బాబా అన్నదానం చేసే సందర్భాలలో అతడు ప్రసాదం కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చునేవాడు. బాబా పరమాన్నం వండేటప్పుడు తమ చేతులను పాత్రలో పెట్టి కలియబెట్టడం అతడు చూశాడు. ఆ సమయంలో ఆయనకు బాధ కలగడంగానీ, కాలిన జాడగానీ కనిపించేది కాదని అతడు చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా చపాతీలు చేసి నేరుగా ధునిపై కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క చపాతీలో పదిహేను, పదహారు పొరలుండేవని కూడా అతడు చెప్పాడు.

బాబా స్నానం చేయదలచినప్పుడు కుండలతో వేన్నీళ్లు, చన్నీళ్ళు తెమ్మని బప్పాజీతో చెప్పేవారు. అతడు తీసుకొచ్చిన తరువాత బాబా సరిపడా వేడివుండేలా ఆ నీటిని కలుపుకొని స్నానం చేసేవారు. బప్పాజీ, బయాజీ స్నానపురాయి(బాతింగ్ స్టోన్)తో బాబా వీపు రుద్దేవారు. "స్నానమయ్యాక అయన ఒక పీతాంబరాన్ని ధరించి, తలకు ఒక గుడ్డ కట్టుకునేవారు. ఆ పని ఎంత వేగంగా చేసేవారంటే అక్కడే ఉన్న మేము అసలు గమనించలేకపోయేవాళ్ళం. తరువాత ఆయన కఫ్నీ ధరించేవారు" అని బప్పాజీ చెప్పాడు.

అతడింకా ఇలా చెప్పాడు: "బాబా రోజుకు ఐదు వందల రూపాయల దాకా భక్తులకు పంపిణీ చేసేవారు. బయ్యాజీకి పది రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులతో అతడు ధునికోసం కట్టెలు కొనుగోలు చేసేవాడు. రామచంద్ర దాదాకు పదిహేను రూపాయలు లభించేది. అతడు దాన్ని చెఱకు కొరకు ఉపయోగించేవాడు. తరచూ బాబా, “అందరూ డబ్బు మనుషులే, నా వాళ్లంటూ ఎవరూ లేరు (సబ్ పైసే కే భాయ్, అప్నా కోయీ నహీ)" అని అంటుండేవారు. బాబా పునర్జన్మలను విశ్వసించేవారు".

1917, మే 19న లోకమాన్య బాలగంగాధర తిలక్ శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్న సమయంలో ద్వారకామాయిలోనే ఉన్న బప్పాజీ ఇలా చెప్పాడు: "తిలక్ బాబా దర్శనం చేసుకుని, ఒక కొబ్బరికాయ, పూలదండ ఆయనకు సమర్పించారు. బాబా ఆ కొబ్బరికాయను తిరిగి ప్రసాదంగా అతనికే ఇచ్చేశారు".

1918, అక్టోబర్ 15, విజయదశమిరోజున బాబా మహాసమాధి చెందే సమయంలో, తమ గురించి ఆత్రుతపడుతూ, ఆందోళన చెందుతున్న భక్తులను ఆయన ఇంటికి పంపివేశారు. తరువాత కూడా కొంతమంది భక్తులు అక్కడే ఉన్నారు. వాళ్లలో బప్పాజీ కూడా ఒకరు.

బప్పాజీకి గీతాబాయితో వివాహం జరిగింది. బాబా అనుగ్రహంతో ఆ దంపతులకు పిల్లలు పుట్టారు. బప్పాజీ మంచి కీర్తనకారుడు. అతడు అనేక మతగ్రంథాలను అభ్యసించాడు. అతనికి నాటువైద్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అతను చిన్న చిన్న రోగాల బారినపడిన గ్రామస్తులకు చికిత్స చేస్తుండేవాడు. తండ్రి లక్ష్మణ్ మరణాంతరం, అతడు విఠల్ మందిర పూజారి, వతన్‌దార్ కులకర్ణి, శిరిడీ గ్రామ జోషీ అయ్యాడు. అతను మే 1987లో తుదిశ్వాస విడిచాడు.

లక్ష్మణ్‌మామా మునిమనవళ్ళు శ్రీజగదీష్, శ్రీవినాయక్ రత్నపార్ఖీలను "జోషీ" అని పిలుస్తారు. వారి కుటుంబం ఇప్పటికీ శిరిడీలోని పాత విఠల మందిరం వెనుకభాగంలో ఉన్న ఇంటిలో నివాసముంటూ ఫలవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

సాయిభక్తుల ప్రయోజనార్థం లక్ష్మణ్‌మామా జోషీ మనవళ్ల సంప్రదింపు వివరాలు:

Shri.Jagadish Ratna Parkhe & Shri.Vinayak Ratna Parkhe,
Old Vittal Rukmini Mandir,
At & Post:Shirdi-423 109,
Rahata Taluk, Ahmednagar District, Maharashtra, India.
Contact Number: +91 96896 80848


 Source : సాయిలీల పత్రిక మార్చి - ఏప్రిల్ 2007, సాయిపథం ప్రథమ సంపుటము, Baba’s Anurag & Baba’s Runanaubandh by Vinny Chitluri. 

2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼😀❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo