సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఉద్ధవేశ్ బువా - రెండవ భాగం


కొన్నాళ్లతరువాత ఉద్ధవేశ్ అలియాస్ శ్యామ్‌దాస్‌  శిరిడీకి ప్రయాణమయ్యాడు. అతనికి కోపర్గాఁవ్ వద్ద టాంగా దొరకడంలో ఇబ్బంది ఎదురైంది. అందువలన అతడు గోదావరిలో స్నానం చేసి, దత్తమందిరంలో జపం, పూజ చేసుకున్నాడు. అంతలో ఇద్దరు ప్రయాణీకులతో ఉన్న ఒక టాంగా వచ్చి మందిరం ముందు ఆగింది. ఆ ప్రయాణీకులు అతనితో, "మాతో శిరిడీ యాత్రకు రావలసిన మరో ప్రయాణీకుడు రానందున మీరు మాతోపాటు రావొచ్చు" అని అన్నారు.  ఉద్ధవేశ్  టాంగా ఎక్కి కూర్చున్నాడు. శిరిడీ చేరుకున్నాక టాంగా తోలేవాడు మాములుగా అయిదు రూపాయలు అడగటానికి బదులు ఉద్ధవేశ్ ఒక రూపాయి మాత్రమే అడిగాడు. తరువాత ఉద్ధవేశ్ 'ధూళి' దర్శనం చేసుకునేందుకు ద్వారకామాయికి వెళ్లాడు. బూటీ, బాలాసాహెబ్ భాటే, అణ్ణా చించణీకర్, మరికొందరు భక్తులతో బాబా కూర్చుని ఉన్నారు. అతడు చూసే సమయానికి బాబా తమ ఆసనంపై కూర్చుని, బడేబాబాకు చిలిం ఇస్తున్నారు. అతనిని చూసిన శ్యామా, "దేవా, శ్యామ్‌దాస్ మీ దర్శనం కోసం వచ్చాడు చూడండి" అని అన్నాడు. అప్పుడు బాబా, “నేను చాలాకాలంగా అతనిని కనిపెట్టుకుని ఉన్నాను, భవిష్యత్తులో కూడా అతనిని కనిపెట్టుకుని ఉంటాను” అని అన్నారు. బాబా ఇంకా ఇలా అన్నారు: “శ్యామ్‌దాస్! నువ్వు డబ్బును సముద్రంలో పడేసుకున్నావు. అల్లామాలిక్ నీకు డబ్బు ఇచ్చాడు, నీకు త్రాగేందుకు నీరు కూడా ఇచ్చాడు" అని. బాబా తనపై చూపుతున్న ప్రేమకు, శ్రద్ధకు అతడు ఆనందంతో బాబా దగ్గరకు వెళ్లి ఆయన పాదాలపై తన శిరస్సునుంచి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగాడు. అదే స్థితిలో అతడు పది, పదిహేను నిమిషాలపాటు ఉండిపోయాడు. అప్పుడు బాబా అతని తల నిమురుతూ, "శ్యామ్‌దాస్‌! లే, లేచి నాతో కొద్దిసేపు కూర్చో!" అని ఆశీర్వదించి, ఊదీ ఇచ్చారు. బాబా తనపై చూపుతున్న కరుణ అతనిని తన్మయత్వంలో ముంచేసింది. ఆ తన్మయత్వం ఆ తరువాత తన జీవితాంతం కొనసాగింది. (రిఫరెన్స్: సాయిలీలా, అంక్ 4-5, ఇయర్ 4, 1926)

శ్యామ్‌దాస్ ద్వారక తీర్థయాత్రలో ఉన్నప్పుడు అత్వాల జ్ఞానేశ్వరి చదువుతున్నాడు. టిక్కెట్లతోపాటు తన పర్సు సముద్రంలో పడిపోయినరోజు అతడు తను చదువుతున్న అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించలేకపోయాడు. అలాగని యాంత్రికంగా కూడా చదవలేకపోయాడు. ఆ స్థితిలో అతడు, 'బాబా తనని ఆదేశిస్తే తప్ప ఏ గ్రంథాన్నీ చదవకూడద'ని ఒక ప్రతికూల నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతడు తన యాత్ర ముగించుకుని శిరిడీ వచ్చినప్పుడు బాబా అతన్ని దక్షిణ అడగలేదు, అతనూ ఇవ్వలేదు. మతపరమైన గ్రంథాలను చదవడం గురించిన ప్రస్తావన కూడా రాలేదు. శ్యామ్‌దాస్ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత వచ్చిన ఏకాదశిరోజు అతడు బాబాకు లేఖ వ్రాసాడు. బాబా జవాబు కూడా పంపించారు. ఆ విధంగా రెండు, మూడు సంవత్సరాలు గడిచాయి.

ఒకరోజు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ శ్యామ్‌దాస్ వ్రాసిన లేఖను బాబాకు చదివి వినిపించాడు. అది విన్న బాబా, "అతన్ని ఇక్కడికి పిలవండి. త్వరగా రమ్మని చెప్పండి" అని అన్నారు. ఆ సమాధానాన్ని అందుకున్న నాలుగు రోజుల్లోనే ఉద్ధవేశ్ శిరిడీ వచ్చాడు. బాబా అతన్ని పదకొండు రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు. అతడు వెంటనే ఆ దక్షిణ సమర్పించాడు. అతను ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ద్వారకామాయికి వెళ్తుండేవాడు. ఆ సమయంలో మాత్రమే బాబా అతనిని పదకొండు రూపాయల దక్షిణ అడుగుతుండేవారు. అతడు ఇస్తూండేవాడు. ఇలా పదిరోజులు గడిచింది. పదకొండవ రోజు కూడా ఎప్పటిలాగే బాబా దక్షిణ అడిగారు. అప్పుడు తనవద్ద డబ్బులేని అతను, "బాబా! మీకు దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఇంకా డబ్బు మిగలలేదు. డబ్బు ఎక్కడినుండి తీసుకురావాలో మీరే నాకు చెప్పండి. డబ్బుకు బదులుగా నేను నా పది ఇంద్రియాలను, మనస్సును దక్షిణగా సమ్పరించుకుంటున్నాను" అని అన్నాడు. అందుకు బాబా, "అవి సమర్పించటానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి. బాపూసాహెబ్ బూటీ వద్దకు వెళ్లి 11 రూపాయలు అప్పుగా తీసుకుని నాకివ్వు" అన్నారు. ఆ మాటలు విన్న ఉద్ధవేశ్, బూటీ వద్దకు వెళ్లి డబ్బు తీసుకుని రావడానికి లేచాడు. అతనింకా సభామండపం ప్రవేశద్వారం వద్దకు చేరుకోకముందే బాబా అతనిని పిలిచి, "అరె శ్యామ్! ఇలా రా, పదకొండు రూపాయలు తరువాత తీసుకొని రా. కానీ వాటిని బాపూసాహెబ్ జోగ్ వద్ద నుండి తీసుకో. ఇప్పుడు కూర్చో" అని అన్నారు. తరువాత కొంతసేపటికి అతను బాబా వద్ద ఊదీ ప్రసాదం తీసుకుని వాడాకు వెళ్లి పదకొండు రూపాయల సంగతి పూర్తిగా మర్చిపోయాడు.

మరుసటిరోజు అతను తన అలవాటు ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు బాబా దర్శనం కోసం వెళ్లినప్పుడు బాబా పదకొండు రూపాయలు గురించి అస్సలు ప్రస్తావించలేదు. కానీ సాయంత్రం బాబా అతన్ని, "బాపూసాహెబ్ జోగ్ వద్దకు వెళ్లి పదకొండు రూపాయలు అడిగి తీసుకుని రా!" అన్నారు. వెంటనే బాబా ఆదేశానుసారం అతడు వాడాకు వెళ్ళాడు. అక్కడ బాపూసాహెబ్ జోగ్ కొంతమంది భక్తులకు ఏకనాథ భగవతం చదివి వినిపిస్తున్నాడు. బాబా చెప్పిన విషయాన్ని జోగ్‌తో చెప్పాడు ఉద్ధవేశ్. తరువాత ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్లారు. ఆ సమయంలో బాబా బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళని చూస్తూనే బాబా వారిని ఆశీర్వదించారుగానీ దక్షిణ అడగలేదు. తరువాత వాళ్ళు వాడాకు తిరిగి వచ్చారు. అక్కడున్న ఇతర భక్తులు పదకొండు రూపాయల దక్షిణలోని అర్థమేమిటని ఉద్దవేశ్‌ను అడిగారు. అతడు దానిపై ఏమీ ఆలోచన చేయక మౌనంగా ఉన్నాడు. ఆ తరువాత ప్రతిరోజూ జోగ్, ఉద్ధవేశ్ లిద్దరూ బాబా వద్దకు వెళ్తున్నా బాబా దక్షిణ గురించి అడగలేదు.


నాల్గవరోజు సాయంత్రం బాబా జోగ్‌ను, "ఈరోజు నువ్వు ఎన్ని రూపాయలు పంపిణీ చేశావు?" అని అడిగారు. అందుకు జోగ్, "అరవై ఒక్క రూపాయలు బాబా. బూటీకి యాభై రూపాయలు, శ్యామ్‌దాస్‌కు పదకొండు రూపాయలు" అని అన్నాడు. ఆ సమయమంతా ఉద్ధవేశ్ మౌనంగా ఉన్నాడు. బాబా అతనిని, "నీకు పదకొండు రూపాయలు లభించాయా?" అని అడిగారు. అతడు ఆ మాటల ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా, "అవును" అని సమాధానమిచ్చాడు. వెంటనే బాబా, "లేదు, నువ్వు పొందలేదు. సరే, రేపు చూద్దాం. ఈలోగా నీ దృష్టి గ్రంథంపై పెట్టు, సరేనా?" అని అన్నారు. తరువాత వాళ్ళు బాబా వద్ద సెలవు తీసుకుని వాడాకు తిరిగి వచ్చి, 'పదకొండు రూపాయలు అడగడంలో బాబా ఉద్దేశ్యం ఏమై ఉంటుందా?' అని చర్చించసాగారు. అకస్మాత్తుగా ఉద్ధవేశ్‌కు, బాబా ఆజ్ఞాపిస్తే తప్ప తను ఏ గ్రంథాన్నీ పారాయణ చేయకూడదని నిశ్చయించుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే అతను మసీదుకు వెళ్ళాడు.

ఉద్ధవేశ్‌, జోగ్‌లు బాబా వద్ద సెలవు తీసుకుని వాడాకు తిరిగి వచ్చి, 'పదకొండు రూపాయలు అడగడంలో బాబా ఉద్దేశ్యం ఏమై ఉంటుందా?' అని చర్చించసాగారు. అకస్మాత్తుగా ఉద్ధవేశ్‌కు, బాబా ఆజ్ఞాపిస్తే తప్ప తను ఏ గ్రంథాన్నీ పారాయణ చేయకూడదని నిశ్చయించుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే అతను మసీదుకు వెళ్ళాడు. 

అప్పుడు బాబా అక్కడున్న భక్తులతో ఇద్దరు సోదరులకు సంబంధించిన ఒక కథ ఇలా చెప్పారు:

"ఇద్దరు సోదరులం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాము. ఒక మార్గం గుండా పోతుండగా నా సోదరుడు ముందుగా వెళ్లి ఒక పాముకాటుకు గురై చనిపోయాడు. నేను మాత్రం స్థిరంగా వెనుక నడుస్తున్నాను. ఐదారుగురు వచ్చి 'నీ సోదరుడేడి?' అని అడిగారు. తను పాముకాటుకి గురై చనిపోయాడని, నేను అతనిని పాతిపెట్టానని చెప్పాను. వారు నా మాట నమ్మక, "మేము అతనిని వెతికి, తిరిగి తీసుకువస్తాము" అని చెప్పారు. నేను, "మీరెందుకు అక్కడికి వెళ్తారు? అక్కడ ఒక పెద్ద పాము ఉంది. అది మిమ్మల్ని కూడా కాటేస్తుంది" అని వారిని హెచ్చరించాను. కానీ వారు నా మాట లక్ష్య పెట్టక అక్కడికి వెళ్లి పాముకాటుకు గురై చనిపోయారు. వారిని కూడా నేను పాతిపెట్టి నా ప్రయాణాన్ని కొనసాగించాను. తరువాత ఒక స్థూలకాయురాలైన స్త్రీ వచ్చి 'నా సోదరుడు ఎక్కడ?' అని  అడిగింది. ఒక పెద్ద పాము కాటువేసినందున తను చనిపోయాడని, నేను తనని పాతిపెట్టానని చెప్పాను. అప్పుడు ఆమె మిగతా ఆరుగురి గురించి ఆరా తీసింది. వాళ్ళు నా సోదరుని వెతకబోయి పాముకాటుకు గురై చనిపోయారని చెప్పాను. ఆమె నా సోదరుడిని వెతకడానికి ఆత్రుతపడింది. నేను, "నువ్వెందుకు అనవసరంగా అక్కడకు వెళ్తున్నావు? నా సోదరుడిని కనిపెట్టలేవు" అని చెప్పాను. దానికి ఆమె, "నేను అక్కడికి వెళ్లి శ్రద్ధగా వెతుకుతాను. అతనిని కనిపెట్టి తిరిగి తీసుకువస్తాను" అని చెప్పి ముందుకు వెళ్ళింది. ఆమెకు కూడా అదే గతి పట్టింది. నేను ఆమెను కూడా పాతిపెట్టి నా ప్రయాణాన్ని కొనసాగించాను. చాలాదూరం వెళ్ళాక ఐదారుగురు ముస్లింలను కలుసుకున్నాను. వాళ్ళు నన్ను కొద్దిసేపు వేచి ఉండమని అన్నారు. నేను అలాగే వేచి ఉన్నాను. వారు ఒక మేకను తీసుకొచ్చి, దాన్ని చంపి ముక్కలు చేశారు. వాటిని నా దగ్గరకు తీసుకువచ్చి తినమని చెప్పారు. "నేను బ్రాహ్మణుడిని, నాకు మాంసాహారం నిషిద్ధం" అని నేను చెప్పాను. వారిలో ఒకరు ఒక ముక్క తీసుకుని, నా పెదవులకు తాకించి నాచేత తినిపించే ప్రయత్నం చేయబోగా నేను, "కొంచెం వేచి ఉండండి. నేను భగవంతుడిని ప్రార్థించి అప్పుడు తింటాను" అన్నాను. తరువాత నేను ఒక గుడ్డముక్క తీసుకుని ఆ మాంసంపై కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం ముక్కలు గులాబీపూలుగా మారాయి. అటువంటి అందమైన పెద్ద గులాబీలు మీకు ఎక్కడా దొరకవు, శిరిడీలో కూడా. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి వెళ్లిపోయారు. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. నేను వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ స్వచ్ఛమైన నీరు, ఒక చిన్న మార్గం ఉన్నాయి. నేను కొద్ది దూరం నడిచి వెళ్ళాను. అక్కడ ముందు, వెనుక, ఇరువైపులా నీళ్లు ఉండి, మార్గం అన్నదే లేదు. ఇదంతా అల్లామాలిక్ రచన. అల్లామాలిక్ పేదల రక్షకుడు".

బాబా మాటలు అత్యంత నిగూఢంగా ఉండేవి. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ మాటలు ఏ భక్తుని ఉద్దేశించి మాట్లాడారో వారు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలిగేవారు. అయినప్పటికీ బాబా పలికిన మాటలకు వివరణ ఈ క్రింది విధంగా ఉండి ఉండవచ్చు:

1. సుదీర్ఘ ప్రయాణంలోని ఇద్దరు సోదరులలో ఒకరు - 'నిజమైన నేను లేదా ఆత్మ’, ఇంకొకరు - శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి వీటన్నిటి కలయికతో భౌతికంగా కనిపించే ‘నేను’. ఇలా కనబడే 'నేను' సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. ఈ సుఖదుఃఖాల చక్రం నుండి ఈ 'నేను'ను విడుదల చేయాలంటే, దానిని కనికరం లేకుండా నాశనం చెయ్యాలి. యోగ సాధన ద్వారా దాన్ని నాశనం చెయ్యాలని బాబా సూచిస్తున్నారు.

పాముకాటు ద్వారా చనిపోవడం ఈ 'నేను'ను నాశనం చేసి కుండలిని మేల్కొలపడాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవాహమైన ‘కుండలిని’ని  క్రమంగా ఎలా మేల్కొల్పాలి అనే విషయాన్ని యోగమార్గం బోధిస్తుంది. ఈ కుండలిని మేల్కొనేటప్పుడు ప్రత్యేక శక్తులు కలిగిన ఆరు చక్రాలను (మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం) దాటుకుంటూ పైకి వెళ్ళి చివరకు మెదడులో ఉండే ‘సహస్రార (వేయిరెక్కల కలువ)’ను చేరుకొంటుంది. దాని తర్వాత సమాధి స్థితి సిద్ధిస్తుంది. కానీ వాసనలు(కోరికలు) పూర్తిగా నాశనం కానందువల్ల సమాధి స్థితి ఎక్కువ కాలం నిలవదు.

2. బాబా ప్రస్తావించిన ఐదారుగురు, కోరికలను నియత్రించే పంచేంద్రియాలు మరియు అరిషడ్వార్గాలకు ప్రతీకలు. ఒకవైపు ఈ దుష్టశక్తులు ఆశ చూపుతూ, ఆకర్షిస్తూ నిజమైన సాధకుడిపై దాడి చేస్తున్నా, అతడు వాటికి భయపడకుండా, ప్రభావితం కాకుండా వాటిని నాశనం చేస్తాడు. బాబా చెప్పిన, "ఒక పెద్దపాము ఉంది, నేను దానిని చంపి, ప్రయాణాన్ని కొనసాగించాను" అన్న మాటలు, “కోరికలను నాశనం చేయడా”న్ని సూచిస్తుంది.

3. బాబా ప్రస్తావించిన "శక్తివంతమైన మహిళ" మాయను సూచిస్తుంది.  ఈ అజ్ఞానం (మాయ) వలన,  నిజమైన ‘నేను (ఆత్మ)’ మరపులోకి నెట్టబడి, ఈ ‘శరీరంతో కనిపించే నేను’గా గుర్తించటం మొదలవుతుంది. దాంతో ఈ ప్రాపంచిక జీవితంలో చిక్కుకుని జనన-మరణాలు, సుఖ-దుఃఖాలు, మంచి-చెడు వంటివి అనుభవిస్తాడు. జాగ్రదావస్థ, స్వప్నావస్థ రెండూ ఎండమావుల వంటివే. కానీ ఇవన్నీ చాలా వాస్తవమైనవిగా అనిపిస్తాయి. పరిశుద్ధమైన ఆత్మను ఈ మాయ కప్పేస్తుంది. నిజమైన నేను(ఆత్మ)ను అర్థం చేసుకోవాలంటే, ఈ మాయను పూర్తిగా నాశనం చెయ్యాలి. “ఆ శక్తివంతమైన మహిళకు అదే గతి పట్టింది, ఆమెను పాతిపెట్టాను” అనటం ద్వారా, బాబా మాయను జయించారని, నాశనం చేశారని ఆయన ధ్రువీకరించారు. అయినప్పటికీ కోరికలు దాడి చేస్తూనే ఉన్నాయని అన్నదానికి సంకేతంగానే ఐదారుగురు "మేకను కోసి, దాని ముక్కలను బలవంతంగా నోట్లో పెట్టడం”గా అభివర్ణించారు. కోరికలు లేదా మాయ అంత బలమైనవి.

బ్రాహ్మణుడు అనేది కులాన్ని సూచించే పదం కాకుండా, "బ్రహ్మాన్ని" తెలుసుకున్నవాడు అని అర్థం. ఆ బ్రహ్మజ్ఞానం వల్ల అతను మాంసం ముక్కలను అందమైన గులాబీలుగా మార్చగలడు. ఇది కోరికలను జ్ఞానంగా మార్చడాన్ని సూచిస్తుంది.

'స్వచ్ఛమైన నీరు మరియు ఒక సన్నని మార్గం' అన్నది - సాధన అనే సన్నని మార్గం ద్వారా సాధకుడు, స్వచ్ఛమైన నీరు అనే "పరబ్రహ్మ"ను చేరుకోవటం అనే విషయం గురించి వచ్చే స్పష్టత గురించి తెలియచేస్తుంది. “అప్పుడు అతని చుట్టూ నీరు నిండి ఉంటుంది” అనే మాటలు “అత్యున్నత స్థితి”ని అంటే “శుద్ధ చైతన్య స్థితి”ని సూచిస్తుంది. ఆ విధంగా సాధకుడు పరబ్రహ్మలో ఐక్యమైపోతాడు.

మరుసటిరోజు తెల్లవారుఝాము నుండి మధ్యాహ్నం వరకు బాబా చాలా కోపంగా ఉన్నారు. ఆ ప్రభావాన్ని కొందరు భక్తులు తిట్లు, దెబ్బల రూపంలో అందుకున్నారు. అయినా బాబా దినచర్య యథావిధిగా సాగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు అలవాటు ప్రకారం ఉద్ధవేశ్ మసీదుకు వెళ్లి బాబా చరణసేవ చేసుకున్నాడు. ఆ సమయంలో బాబా, "శ్యామ్‌దాస్! పదకొండు రూపాయలు అందుకున్నావా, లేదా?" అని అడిగారు. అందుకతడు, "బాబా! పదకొండు రూపాయలు అనేది గ్రంథ పఠనానికి సంబంధించినదయితే అందుకున్నాను. కానీ నేను ఏ గ్రంథాన్ని చదవాలి?" అని అన్నాడు. అప్పుడు బాబా వారిరువురి మధ్య ఋణానుబంధానికి సంబంధించిన సంకేతం ఇస్తూ, "నీకు, నాకు మధ్య ఉన్న ఋణం లేదా కర్మ సంబంధిత సంభాషణ ఉన్న గ్రంథాన్ని చదువు" అన్నారు. బాబా యొక్క ఈ మాటలు అతనిని మరింత గందరగోళానికి గురిచేశాయి. భగవద్గీత చదవాలా లేక జ్ఞానేశ్వరి చదవాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అదే విషయాన్ని అతడు బాబాను అడిగాడు. అప్పుడు బాబా, "అరె శ్యామ్‌దాస్! బాపూసాహెబ్ జోగ్ వద్దకు వెళ్లి, అతను చదువుతున్న గ్రంథాన్ని తీసుకుని రా!" అని ఆదేశించారు. వెంటనే అతడు వెళ్లి బాపూసాహెబ్ జోగ్ చదువుతున్న ఏకనాథ భాగవతాన్ని తీసుకొచ్చి బాబా చేతిలో ఉంచాడు. బాబా యాదృచ్ఛికంగా ఆ గ్రంథంలోని పదకొండవ అధ్యాయం తెరిచి, దానివైపు చూపిస్తూ, "నీ జీవితంలో ప్రతిరోజూ ఇది చదువు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చదివి, నీ కోసమే అర్థం చేసుకో. దీన్ని ఇతరులకు వివరించవద్దు, విశదపరచవద్దు. నువ్వు మాత్రమే తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అల్లామాలిక్ మేలు చేస్తాడు" అని చెప్పారు.

ఉద్ధవేశ్ చివరిసారి శిరిడీ వెళ్ళినపుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతడు మసీదుకు వెళ్ళాడు. సభామండపంలో కూర్చుని ఉన్న కొంతమంది భక్తులు అతనిని లోపలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఆ సమయంలో బాబా కూర్చుని ధ్యాననిమగ్నులై ఉన్నారు. అంతలో ఒక భక్తుడు బాబా దర్శనం కోసం వెళ్లాడు. బాబా కోపంతో మండిపడుతూ తమ సట్కాతో ఆ భక్తుడిని కొట్టి తిట్లవర్షం కురిపించారు. అతడు మసీదు నుండి పారిపోయాడు. తరువాత ఉద్ధవేశ్ పైకి వెళ్ళాడు. ఏమీ జరగనట్లు బాబా అతన్ని స్వాగతించారు. ఉద్ధవేశ్ కొంతసేపు కూర్చున్నాక బాబా, "శ్యామ్‌దాస్! నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు?" అని అడిగారు. అందుకతడు త్వరలోనే వస్తానని బదులిచ్చి, బాబా వద్ద ఊదీ తీసుకుని బయలుదేరాడు. అతడు సభామండప ప్రవేశద్వారం వద్దకు చేరుకునేసరికి బాబా అతనిని పిలిచారు. దాంతో అతడు వెనక్కి తిరిగి బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా, "ఇకమీదట శిరిడీ రావద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా నేనెప్పుడూ నీతోనే ఉంటాను, సరేనా!? శిరిడీలోని ప్రజలు చాలా మారిపోయారు. వారు డబ్బుకోసం ఏడుస్తూ నన్ను నిరంతరం ఇబ్బంది పెడుతున్నారు. అందువలన నేను అలసిపోతున్నాను. నువ్వు యాత్రకు వెళ్తున్నా, నీ కుటుంబాన్ని కలవడానికి వెళుతున్నా నేను నీతో ఎల్లప్పుడూ, ఎప్పటికీ ఉంటాను" అని అన్నారు. ఇలా చెప్పిన తరువాత బాబా అతడు శిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆ తరువాత అతడు ఎంత ప్రయత్నించినా శిరిడీ యాత్ర చేయలేకపోయాడు. అంతేకాదు, అదివరకటిలా ఏకాదశి రోజున లేఖలు కూడా పంపలేకపోయాడు. తరువాత బాబా మహాసమాధి చెందినట్లు అతనికి భక్తుల నుండి లేఖలు వచ్చాయి.

చివరికి ఉద్ధవేశ్ 1951 ఆగస్టు 8న సాయిబాబా దివ్యచరణాలలో విలీనం అయ్యాడు.


సమాప్తం.

ఉద్ధవేశ్ సమాధి

Source http://www.saiamrithadhara.com/mahabhakthas/udavesh_buvaa.html
Baba's Runanubandh by vinny chitluri

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram, amma nannalani kshamam ga, arogyam ga chusukondi vaalla badyata meede tandri, amnamma ni kshamam ga chusukondi manchi arogyanni prasadinchandi, ofce lo anta bagunde la chayandi tandri WFH gurinchi emi anakunda unde la chayandi tandri pls, naaku manchi arogyanni prasadinchandi tandri pls.

    ReplyDelete
  3. Om sai ram, amma nannalani kshamam ga, arogyam ga chusukondi vaalla badyata meede tandri, ammamma ni kshamam ga chusukondi manchi arogyanni prasadinchandi, ofce lo anta bagunde la chayandi tandri WFH gurinchi emi anakunda unde la chayandi tandri pls, naaku manchi arogyanni prasadinchandi tandri pls

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo