సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 290వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నరకయాతన నుండి విముక్తి కలిగించారు బాబా!
  2. మందిరానికి వెళ్లలేకపోయానని బాబా తన ఉనికిని చూపిన లీల

నరకయాతన నుండి విముక్తి కలిగించారు బాబా!

ధర్మవరం నుంచి సాయిభక్తురాలు సువర్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ సాయిరాం! ముందుగా 'సాయిమహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా పేరు సువర్ణ. మాది అనంతపురం జిల్లాలోని ధర్మవరం. బాబా నా జీవితంలో చాలా మహిమలు చూపారు. అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం అవుతుంది. సమయం ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడు వాటిలో నుంచి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

మా అమ్మానాన్నలది మేనరికం కావడం వల్ల నేను అంగవైకల్యంతో పుట్టాను. అందువల్ల కర్ర ఊతంతో నడిచేదాన్ని. అంతేకాదు, నా గుండె కూడా చాలా బలహీనంగా ఉంటుంది. కొంతకాలం క్రితం నాకు రొమ్ములో గడ్డ రావడం వల్ల ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. అయితే చాలా హాస్పిటల్స్‌లో సంప్రదించినప్పటికీ నా గుండె బలహీనంగా ఉన్నందువల్ల డాక్టర్స్ ఎవరూ ఆపరేషన్ చేయటానికి ముందుకు రాలేదు. చివరి ప్రయత్నంగా బెంగళూరు సెయింట్ జాన్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ, 90 శాతం ఆపరేషన్ విజయవంతమయ్యే అవకాశం లేదన్నారు. 2019, జులై 26వ తేదీన మేజర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేముందే డాక్టర్లు చెప్పారు, ఆపరేషన్ ఎఫెక్ట్ వల్ల మాట పోవచ్చు, లేదా ఇంకేదైనా జరగవచ్చు అని. బాబా దయవల్ల ఆపరేషన్ విజయవంతం అయింది. నేను క్షేమంగా ఇంటికి వచ్చాను. కానీ నాకు నడక పూర్తిగా పోయింది. అంతేకాదు, ఆపరేషన్ సమయంలో ఇచ్చిన యాంటీబయాటిక్స్ వల్ల నాకు మొలలు(పైల్స్) వచ్చాయి. ఆ నొప్పితో నరకం చూశాను. మంచం మీదే అన్నీ జరిగేవి. టాయిలెట్ వెళ్ళినప్పుడల్లా నరకం అనుభవిస్తూ 3 నెలల పాటు బాగా ఏడ్చేదాన్ని. బాధ భరించలేక ఒకరోజు, "స్వామీ! నా బాధ తగ్గించు లేదా నన్ను నీ దగ్గరకి తీసుకుపో. నా బాధ తగ్గిస్తే జీవితాంతం నాకు ఎంతో ఇష్టమైన జామకాయను మానేస్తాను. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత ఒక వారంరోజులకి మాకు తెలిసిన డాక్టర్ నా మొలలకి ఒక మందు చెప్పారు. బాబా అనుగ్రహంతో ఆ మందు వాడటం వల్ల ఇప్పుడు నా బాధ 90 శాతం తగ్గిపోయింది. "ఆ నరకాన్నించి నాకు విముక్తి కలిగించారు. థాంక్యూ సో మచ్ బాబా!" మిగిలివున్న కాస్త బాధని కూడా బాబా తగ్గిస్తారని నాకు నమ్మకం ఉంది. నాకు ఆపరేషన్ సమయంలో పోయిన నడక కూడా తిరిగి రావాలని బాబాని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.

మందిరానికి వెళ్లలేకపోయానని బాబా తన ఉనికిని చూపిన లీల

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను బెంగళూరులోని ఒక ప్రఖ్యాత ఎంఎన్‌సి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. 2015లో నేను ఉద్యోగ అన్వేషణకోసం బెంగళూరు వచ్చినప్పుడు సాయిబాబా ఎవరో, ఆయన ఏమి అద్భుతాలు చేశారో నాకు తెలియదు. కానీ నా స్నేహితులలో ఒకరు సాయిబాబా మందిరానికి వెళదామని అంటే తనతోపాటు నేను మొదటిసారి బాబా గుడికి వెళ్ళాను. అప్పటినుండి నేను తనతో క్రమంతప్పకుండా ప్రతి ఆదివారం బాబా మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పట్లో ఉద్యోగాన్వేషణ కోసం ఏమి చేయాలో, ఎలా ముందుకుపోవాలో నాకస్సలు తెలియదు. అలాంటిది 2015, సెప్టెంబరు 3  గురువారంనాడు నాకొక పెద్ద సంస్థ నుండి ఫోన్ కాల్ వచ్చింది. నేను, "నాకు ఉద్యోగం వస్తే, గురువార వ్రతం చేస్తాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ ఇంటర్వ్యూలో విజయం సాధించాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

2 సంవత్సరాల తరువాత నేను ఇంకొక కొత్త కంపెనీలో చేరాను. నాకు అక్కడ సంతృప్తిగా అనిపించలేదు. నేను సాయిసచ్చరిత్ర చదువుతూ, "నా కష్టాలకు ఏరోజు ముగింపు వస్తుంది?" అని బాబాను అడిగాను. త్వరలోనే ఆ కష్టం నుండి బయటపడటానికి బాబా నాకు సహాయం చేశారు.

ఒకసారి నేను గురువార వ్రతం చేస్తున్నాను. సాధారణంగా నేను వ్రతంచేసే గురువారంనాడు ఇంట్లో దీపాలు వెలిగించి, సాయంత్రం ఆరతి సమయానికి బాబా మందిరానికి వెళతాను. అయితే ఒక గురువారం నేను నెలసరి కారణంగా దీపాలు వెలిగించలేదు. మందిరానికి కూడా వెళ్ళలేకపోయాను. ఆ సమయంలో నేను ఇంట్లోనే సాయిచాలీసా వింటున్నాను. సాయంత్రం గం.6:30ని.లకి, అంటే మందిరంలో ఆరతి మొదలుపెట్టే సమయానికి అకస్మాత్తుగా నా మొబైల్‌లో దానంతట అదే ఆరతి మొదలైంది. అంతేకాదు, దీపాలు వెలిగిస్తే వచ్చే వాసనతో గదంతా నిండిపోయింది. ఆ అద్భుత సంఘటనకు నా శరీరమంతా రోమాంచితమైంది. నేను ఆరతికోసం మందిరానికి వెళ్లలేకపోయినందుకు బాబాయే నా ఇంటికి వచ్చి తన ఉనికిని తెలియజేసినట్లుగా నాకనిపించి ఆనందంతో నాకళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" సదా నా జీవితాన్ని నా బాబా తన మార్గదర్శకత్వంతో నడిపిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఉనికిని నేను చాలాసార్లు అనుభూతి చెందాను.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2517.html

4 comments:

  1. శ్రీవాణిJanuary 16, 2020 at 3:06 PM

    సాయిరాం.. సువర్ణ గారు అనుభవిస్తున్న కష్టాలు తెలిసాక నా బాధ ఏపాటిది అనిపిస్తోంది. సువర్ణ గారికి నడక రావాలని సాయి ని ప్రార్థిస్తున్నాను.
    సువర్ణ గారు,బాధ పడకండి.మన జీవన విధాత సాయి నాథుడు మన బాధ గమనించ కపోతడా? కొద్దిగానైనా తగ్గిస్తారు..సాయిరాం అంటూ నే వుందాము

    ReplyDelete
  2. Dear sai,
    This leela was posted 7 months back. Are you reading them now ?
    Coz your comments are published now only....🙂

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo