సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి ఇచ్చిన మధుర స్మృతులు - మొదటి భాగం


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు "ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను" అన్న నా మొదటి అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు నేను మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను.

నా చిన్నప్పటినుండి అమ్మ, నాన్న ఇద్దరూ బాబాను ఆరాధిస్తూ ఉన్నా, నాకెందుకో బాబాపట్ల అంతటి భక్తిశ్రద్ధలు ఏర్పడలేదు. కానీ క్రిందటి సంవత్సరం ద్వారకామాయిలో అడుగుపెట్టినప్పటి నుండి నాకు ఆయనపట్ల భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి. తరువాత ఈ "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా నేను బాబాకి మరింత దగ్గరయ్యాను. "బాబా! బ్లాగుకోసం మీ వర్క్‌లో నన్ను భాగస్వామిని చేసినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా తెలియదు. ఈబ్లాగు కోసం మీ వర్క్ చేస్తుంటే చాలా సంతోషంగా, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతి ముందెన్నడూ లేదు. థాంక్యూ బాబా! నాకు ఎప్పుడూ మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి". థాంక్స్ అన్నయ్యా! మీ వల్లే నాకు బాబా అనుగ్రహం లభించింది.

అన్నయ్యని కూడా బాబాయే ఇచ్చారు. నేను నా చిన్నప్పటినుండి భగవంతుడిని "నాకొక అన్నయ్యని ఇవ్వండి" అని అడుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే, నేను మా అమ్మానాన్నలకి ఒక్కతే అమ్మాయిని. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నాకంటే ముందు అమ్మకి ముగ్గురు పిల్లలు పుట్టి పురిటిలోనే పోయారు. నేను 'సాయి నవ గురువారవ్రతం' మొదలుపెట్టిన వారం రోజులకే బాబా నాకు బంగారంలాంటి అన్నయ్యని ఇచ్చేసారు. నా ప్రార్థన మన్నించి బాబా నాకు అన్నయ్యనివ్వడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది.

నా మొదటి అనుభవం :

మావారు సత్యసాయి ట్రస్ట్ తరఫున ప్రతి వారం స్నాక్స్, టిఫిన్ డిస్ట్రిబ్యూట్ చేయిస్తూ ఉంటారు. అయితే అందుకు కావాల్సిన డబ్బులు ముందు మావారు పెట్టుకుంటే, ట్రస్ట్ వాళ్ళు తరువాత ఇస్తూ ఉంటారు. ఒకసారి అందుకు అవసరమైన డబ్బులు మావారి దగ్గర లేకపోవడంతో నన్ను అడిగారు. ఎలాగూ రెండు రోజుల్లో వాళ్ళు డబ్బులు వేసేస్తారు కదా అని మా నాన్నకి చెప్పకుండా ఆయన అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసి మా వారికి ఇచ్చాను. ట్రస్ట్ వాళ్ళు త్వరగానే అమౌంట్ క్రెడిట్ చేస్తారు, ఈలోగా నాన్నకి చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని మేము చెప్పలేదు. కానీ మరునాడు నాన్న బ్యాంకుకి వెళ్ళాలని అంటుంటే, అది విని నాకు కొంచెం భయంగా అనిపించింది. ఆరోజు గురువారం. పూజ ప్రారంభించే ముందు బాబాతో, "ఏమి చేయాలి బాబా? నాకు మీరే దిక్కు" అని చెప్పుకొని, ఆ క్షణంలో వచ్చిన ఆలోచనతో వెంటనే పాస్ బుక్ దాచేసాను. తరువాత వారం రోజులకి ట్రస్ట్‌వాళ్ళు ఆ మొత్తం మా అకౌంటులో వేసారు. దానితో ఆ డబ్బులు నాన్న అకౌంటులో వేసేసి పాస్ బుక్ తీసి యథాస్థానంలో పెట్టేసాను. కానీ నాన్న బ్యాంకుకి బయల్దేరుతుంటే నాకు మళ్ళీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే, ఇప్పుడు నాన్న వెళ్లి పాస్ బుక్‌లో ట్రాన్సాక్షన్స్ వివరాలు ఎంట్రీ చేయించారంటే ఆ డబ్బు తీసి మళ్ళీ వేసినట్లు తేదీలతో సహా దొరికిపోతుంది. ఏమి చేయాలో అర్ధంకాక మళ్ళీ బాబాతో, "బాబా! నేను చేసింది తప్పని నాకు తెలుస్తోంది. దాన్ని కవర్ చేయడానికి ఇన్ని టెన్షన్స్ పడాల్సివస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంకులో ప్రింటర్ వర్క్ కాకుండా చూడండి. అలా జరిగితే నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వచ్చే నెల నాకు రానున్న RD డబ్బులు నాన్నకే ఇచ్చేస్తాను" అని వేడుకున్నాను. నిజంగా ఇక్కడ సాయి చేసిన చమత్కారం చూడండి. నాన్న బ్యాంకుకి వెళ్లి వచ్చారు, బుక్‌లో ప్రింటింగ్ కూడా అయ్యింది, అయినా నాన్న చాలా కూల్‌గా ఉన్నారు. "ఇదేమిటి, అసలు ఏమి జరిగింది?" అని సందేహంతో వెంటనే నేను పాస్ బుక్ తీసి చూస్తే ప్రింట్ చాలా లైట్‌గా పడివుంది. మూడు, నాలుగుసార్లు నేను ఎంతగా చూసినా కూడా అసలు ఏమీ కనిపించలేదు. బాబా చేసిన చమత్కారానికి, ఆయన సహాయానికి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకొని ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కొన్నిరోజుల తర్వాత ఒకసారి బ్యాంకుకి వెళ్తూ నాన్న పాస్ బుక్ చూసి షాక్ అయ్యాను. ఆరోజు ఎన్నిసార్లు చూసినా ప్రింటింగ్ లైట్‌గా పడి స్పష్టంగా కనపడనిది, ఈరోజు ప్రింటింగ్ బాగా క్లారిటీగా ఉండి వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను తప్పు చేసినా అది ఒక మంచిపని కోసమే అని బాబా నన్ను కాపాడటానికి ఎంత అద్భుతం చేసారో చూశారా?

నా రెండవ అనుభవం - బాబా ఇచ్చిన "సాయిబాబా" నామం:


నాకెప్పుడూ బాబా స్వప్నదర్శనం ఇవ్వట్లేదని బాధపడేదాన్ని. అయితే ఇటీవల ఒకరోజు మంచి నిద్రలో ఉండగా నాకు ఒక కల వచ్చింది. నేను నా ఫ్రెండ్స్‌తోపాటు ఎత్తుగా ఇసుక ఉన్న ప్రదేశంలో కూర్చొని ఉన్నాను. ఎందుకో తెలియదుగాని నా ఫ్రెండ్స్ నన్ను ఆ ఇసుకలో తోసేసి వెళ్ళిపోతున్నారు. అలా వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్లకు ఎదురుగా వస్తున్న ఒక ఆవును బెదిరించారు. దానితో అది చాలా కోపంగా నా మీదకి దూసుకు వస్తోంది. అదలా నా మీదకి వస్తుంటే నా ఫ్రెండ్స్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా నన్ను అక్కడే వదిలేసి పరుగెత్తారు. నేను మాత్రం షాక్‌లో ఉండి పరిగెత్తలేక భయంతో అక్కడే కూర్చొని ఉండగా, బాబా నా ఎదుట కనిపించి, "నీకు ఏ ఆపద వచ్చినా 'సాయిబాబా' అని నా నామం తలచుకో!" అని చెప్పారు. వెంటనే నేను “సాయిబాబా..సాయిబాబా" అని గట్టిగా అన్నాను. అప్పుడు ఆవు ప్రక్కనే ఒక వెలుగు వచ్చి ఆవు అదృశ్యమయింది. అక్కడ సాయి మాత్రం నిలుచొని ఉన్నారు.

ఇది జరిగిన కొద్దిరోజులకి, ఒక రోజంతా మా బాబుకి వాంతులు అయ్యాయి. సాయంత్రానికి వాంతులు తగ్గాయి కానీ, వాడి ఒళ్ళు చాలా వేడిగా ఉంది. మేము హోమియో మెడిసిన్ వాడుతుంటాం. ఆ సమయంలో నాకు చాలా ఆందోళనగా అనిపించి వైద్యుడికి ఫోన్ చేస్తే అతను లిఫ్ట్ చేయలేదు. ఆ రాత్రివేళ వాడికి ఏ మందు ఇవ్వాలో అర్థంకాక అలానే వాడిని పడుకోబెట్టాను. మధ్యరాత్రిలో మెలకువ వచ్చేటప్పటికి వాడి కాళ్ళు, చేతులు బాగా వేడిగా నాకు తగిలాయి. వాడికి జ్వరం ముందు అలానే వస్తుంది. నాకు ఆ రాత్రివేళ ఏమి చేయాలో అర్థం కాలేదు. కాసేపటికి బాబా నాకు కలలో చెప్పిన నామం సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే నేను మా వాడి నుదుటిపై నా చేయిపెట్టి, “సాయిబాబా, సాయిబాబా” అని సాయి ఇచ్చిన నామాన్ని స్మరిస్తూ అలానే కాసేపు ఉన్నాను. అంతే! వేరే ఏ మందూ వాడకుండానే 5 నిమిషాలలో వాడి జ్వరం తగ్గిపోయింది. బాబా నాకు ప్రసాదించిన “సాయిబాబా” నామం యొక్క గొప్పదనమేమిటో ఈ అనుభవం ద్వారా నాకు తెలియజేసారు.

రేపు షిరిడీయాత్రకు సంబంధించిన మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను.

అమ్మ చావుచీటీని తీసేసిన -- మాతృసాయి


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 20  సంవత్సరాల క్రితం హఠాత్తుగా మా అమ్మ కాన్సర్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులతో బాధపడుతుందని మాకు తెలిసింది. అలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని కూడా మాకు అప్పటికి తెలియదు. మా అమ్మ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ తను చావుతో పోరాడుతుందని మాకు అర్థం అవుతుంది. కానీ తన పరిస్థితిని చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాము. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అమ్మ బాధను చూస్తూ ఊరికే ఉండలేక బాబాను ఒక్కటే కోరిక కోరుకున్నాను, "బాబా! ఎవరైనా ఇంత భయంకరమైన వ్యాధితో పోరాడుతూ, బాధని అనుభవిస్తూ ఆ వ్యాధిని జయిస్తున్నారా? ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి భయంకరమైన వ్యాధి బారిన పడకుండా చూడు తండ్రీ! బాబా, మా ఇంటి ఇలవేల్పువి నీవే. నిన్ను మ్రొక్కడం తప్ప మాకు ఇంకేమీ తెలియదు. అక్కడ డాక్టర్లు ఏవో ఆపరేషన్స్ అంటున్నారు. మా అమ్మ వ్యాధి గురించి తెలిసినప్పటి నుండి నిన్ను క్షణమైనా మరువకుండా స్మరిస్తున్నాను. 'నా భక్తులను అన్నివిధాలా ఆదుకోవడానికే నేను ఉన్నది' అన్నావు కదా! మరి మా అమ్మని రక్షించు. ఒకటి కాదు, రెండు వ్యాధులతో బాధపడుతోంది. నీవు కరుణాసాగరుడవు, కాస్త కరుణ ఈ భక్తురాలి మీద చూపించి ఆదుకో బాబా!" అని కన్నీళ్లు పెట్టుకున్నాను.

అమ్మను ICU లోపలకి తీసుకొని వెళ్తున్నప్పుడు మా అమ్మకు నేను చెప్పిన ఓదార్పు మాటలు, ధైర్యం చెప్పిన తీరు ఒక బిడ్డ తల్లికి చెప్పినట్టుగా లేదు. నేనే మా అమ్మకు తల్లినయ్యాను ఆ క్షణాన. తనలో ధైర్యం నింపిన ఆ మాటలు, అవి చెప్పిన తీరు అంతా బాబానే చేయించారేమో అనిపిస్తుంది నాకు. తలచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. తరువాత అమ్మను ఆపరేషన్ కోసం లోపలకి తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత తనను ICU లోనికి మార్చారు. కానీ లోపలికి వస్తే రోగికి ఇన్ఫెక్షన్ అవుతుందని ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు. మా తమ్ముడే ICU బయట చాలా రోజులు ఉండి మా అమ్మని చూసుకున్నాడు. ఆపరేషన్ జరిగాక కూడా డాక్టర్స్, "ఆమె ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం మాత్రం లేదు" అని చెప్పారు. "తను మందుల మీద బ్రతికుంది అంతే. చాలా జాగ్రత్తగా చూసుకోవాల"ని కూడా చెప్పారు. బాబా దయవలన మా అమ్మగారిని ఆపరేషన్ తరువాత మా ఇంటికి తీసుకొని వచ్చాము.

ఈ లీల జరిగి 20 సంవత్సరాలు అయిందని ముందుగా మీకు చెప్పాను కదా! బాబా ఆశీర్వాదం, ఆయన మా కుటుంబంపైన చూపిన ప్రేమలే అమ్మ ఇప్పటికీ బ్రతికి ఉండటానికి కారణం. డాక్టర్స్ కొన్నిరోజులు బ్రతుకుతుందన్న మాటలను కూడా తారుమారు చేసి మా అమ్మ చావుచీటీని బాబా చింపేసి ఇంత ఆయుష్షునిచ్చారు. కాన్సర్ వ్యాధి ఒక్కటి ఉంటేనే బ్రతకడం కష్టం, అలాంటిది మా అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ కూడా... బాబా కృప వలన మాత్రమే మా అమ్మ ఈ భయంకరమైన రెండు వ్యాధులను జయించగలిగింది. "బాబా! 'మీరు చేసిన సహాయానికి ధన్యవాదములు' అని చెప్పే మాట చాలా చిన్నది. మాతృసాయి(తల్లి)లాగ  మమ్ములను ఆదుకున్నావు. ప్రతి కుటుంబంలో ఒక తల్లి పోషించే పాత్రకు సరిపోయేది ఈ లోకంలో ఏది లేదు. నా తల్లిని కాపాడి మా కుటుంబాన్ని రక్షించావు తండ్రీ!".


సమయం రాగానే చిన్న లీలతో చిటికెలో కష్టం నుండి విముక్తిని ప్రసాదించేస్తారు బాబా


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

"కష్టంలో ఉన్నప్పుడు కొందరు భక్తులు పిలవగానే బాబా నుండి సహాయం అందుతుంది. మరికొంతమంది విషయంలో కొంత జాప్యం కనపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?" అని చాలామంది సాయి భక్తుల మదిలో మెదిలే ప్రశ్న. కానీ దానికి సమాధానం తెలుసుకోవడం మిడిమిడి జ్ఞానం ఉన్న మనకెలా సాధ్యం? స్వయంగా బాబానే చెప్పారు కదా, "నా చర్యలు అగాధాల"ని. మనకొచ్చే కష్టసుఖాలన్నీ మన పూర్వ కర్మల ఫలితాలే. మనకు ప్రస్తుత పరిస్థితి మాత్రమే తెలుసు, దాని పూర్వాపరాలు ఏమీ తెలియవు. మరి ఆయనకు మన భూత, భవిష్యత్ , వర్తమానాలన్నీ తెలుసు. వాటన్నింటి దృష్ట్యా తన భక్తులకేది శ్రేయస్కరమో అదే చేస్తారు బాబా. అది మనకు అర్ధంకాక మనం అయన మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంటూ బాధపడతాం. కానీ సమయం రాగానే చిన్న లీలతో చిటికెలో కష్టం నుండి విముక్తిని ప్రసాదించేస్తారు బాబా. అటువంటిదే ఈమధ్య మాకు తెలిసిన ఒక అంకుల్ కి జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను.

అంకుల్ సబ్ ఇన్స్పెక్టర్ గా చేసి 2010లో ఉద్యోగ విరమణ చేసారు. ఆ తరువాత నుండి ఆంటీ, అంకుల్ ఇద్దరూ కూడా పెద్ద బాబా మూర్తిని  ఇంట్లో పెట్టుకొని బాబాకి అభిషేకాలు, సచ్చరిత్ర పారాయణలతో నిత్యం బాబాని ఆరాధించుకుంటున్నారు. రెండు, మూడు నెలల క్రిందట అంకుల్ కి జ్వరం వచ్చింది. జ్వరమే కదా అని మెడికల్ షాపుకి వెళ్లి ఏవో మందులు తెచ్చి వేసుకున్నారు. మందులు వేయడం, అది కాసేపు తగ్గి మళ్ళీ రావడం ఇలా పది రోజులు గడిచిపోయాయి. పది రోజులుగా సరైన ఆహారం లేక బాగా నీరసించిపోయారు. పదకొండవ రోజు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే కంగారుపడి అంకుల్ ని వైజాగ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అక్కడ టెస్టులు అన్నీ చేసారు కానీ ఏదీ తెలిసేదికాదు. హాస్పిటల్లో ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సెలైన్ ఎక్కించారు. 8 రోజులలో దాదాపు 70, 80 సెలైన్ బాటిళ్లు ఎక్కించారట. ఏడు రోజుల వరకు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సడన్ గా 8వ రోజు ఎవరో ఒక స్పెషల్ డాక్టర్ వచ్చి అంకుల్ ని చూసారు. అప్పటివరకు ఏమి చేసినా తగ్గని జ్వరం ఆ డాక్టర్ చూసాక తగ్గడం మొదలు పెట్టింది. మరో రెండు రోజులు ఉన్న తరువాత పూర్తిగా జ్వరం తగ్గడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి అంకుల్ ఇంటికి వచ్చారు. జ్వరం అయితే తగ్గింది కానీ ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉండేది. ఏ మందులు వాడినా తగ్గేది కాదు. అసలు వాళ్ళు పడ్డ బాధ వర్ణనాతీతం. ఇలా తొమ్మిది రోజులు గడిచిన తరువాత పదవరోజు రాత్రి అంకుల్ బాధ తట్టుకోలేక, "బాబా! ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాను, మరి నాకేమిటి ఇంత కష్టం? ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాను. నన్నెందుకు పట్టించుకోవడం లేదు? ఏదో ఒకటి చేసి నాకు ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి బాబా" అని బాబాను ప్రార్ధించి పది గంటల సమయంలో పడుకున్నారు. సుమారు 2 లేక 2.30 గంటల సమయంలో అంకుల్ కి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక వృద్ధుడు అంకుల్ ని విమానం ఎక్కించారు. తరువాత అంకుల్ ని నోరు తెరవమని, అంకుల్ తెరవగానే నోటిలో ఏవో రెండు మాత్రలు వేసి, "ఇక నీ బాధ తీరిపోయింది" అన్నారు. అంతటితో స్వప్నం ముగిసింది. అంతే! అంతటితో నెలరోజుల నుండి అంకుల్ పడుతున్న బాధంతా తీరిపోయింది. ఆ తెల్లవారి నుండి అంకుల్ ఏవి తిన్నా వాంతులు కావడం ఆగిపోయాయి. నిదానంగా రెండు నెలల్లో అంకుల్ పూర్తిగా కోలుకున్నారు. తనపై ఆధారపడిన భక్తులను బాబా ఎప్పుడూ నిరాధారం చేయరు. సహనంతో ఉంటే సమయానికి ఆయన తన సహాయాన్ని అందించి కష్టం నుండి మనల్ని బయటపడేస్తారు.

ఎవరి కోరికలు తీర్చడానికి బాబా ఎవరిని ఉపకరణంగా చేసుకుంటారో?


సాయిబంధువులందరికీ నమస్కారం నేను భువనేశ్వర్ నుంచి మాధవిని. ఒక బాబా లీల మీతో పంచుకుందామని వ్రాస్తున్నాను. అసలు ఈ లీలలు ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో, ఎవరి కోరికలు తీర్చడానికి బాబా ఎవరిని ఉపకరణంగా చేసుకుంటారో, ఈ ఋణానుబంధం ఇద్దరు వ్యక్తులను ఎలా, ఎందుకు కలుపుతుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పబోయే లీల అలాంటిదే. చదివి మీరూ ఆనందించండి.


నేను 2018, ఏప్రిల్ నెలలో షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన అనుభవమిది. గురువారం ఉదయాన కాకడ ఆరతి తరువాత ద్వారకామాయిలో బాబా దర్శనం చేసుకుందామని  క్యూలో నిలుచున్నాను. ఒక చిన్న అబ్బాయి బాబా విగ్రహాలు అమ్ముతూ నా దగ్గరికి వచ్చి రెండు విగ్రహాలు తీసుకోమని ఒకటే గొడవపెట్టాడు. నేను, "వద్దు, నా దగ్గర ఉన్నాయి" అని చెప్పి తీసుకోలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. మళ్ళీ సాయంత్రం గురుస్థాన్ దగ్గర అదే అబ్బాయి కనపడ్డాడు. మళ్ళీ అదే గోల. "వద్దురా బాబూ!" అని చెప్పి వెళ్ళిపోయాను. మరునాడు శుక్రవారం మధ్యాహ్నం ఆరతికి వెళ్తుంటే మళ్ళీ అదే అబ్బాయి కనపడి, "రెండు విగ్రహాలు తీసుకో దీదీ" అంటూ మళ్ళీ అదే గోల. నాకు కోపం వచ్చి, "వద్దు, నా దగ్గర ఉన్నాయంటే నీకు అర్థం కాదా?" అని కొంచెం గట్టిగానే చెప్పాను. దానికి వాడు, "నీ దగ్గర ఉన్నాయిలే దీదీ, కానీ ఇంకెవరన్నా బాబాను 'మా ఇంటికి రా' అని వేడుకుంటున్నారేమో, నీ ద్వారా నీకు తెలిసిన వాళ్లకు బాబా ఇప్పిస్తున్నారేమో" అన్నాడు. అంతే! "ఇంత చిన్న పిల్లాడు, ఎంత సత్యాన్ని చెప్పాడు!" అనుకొని మారుమాట్లాడలేక ఆగిపోయాను. వెంటనే ఆ అబ్బాయి దగ్గర బాబా విగ్రహాలు కొనేసాను. ఎలాగూ దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి సమాధి మందిరంలో బాబా సమాధికి, బాబాకు తాకించుకొని ఆ విగ్రహాలను తెచ్చుకున్నాను. "ఏ భక్తుల ఇంటికి ఈ బాబా వెళతారో చూద్దామ"ని అనుకున్నాను. 

తరువాత ఆదివారానికి నేను ఉద్యోగం చేస్తున్న సంబల్పూర్ కి వచ్చేసి సోమవారంనాడు యథావిధిగా డ్యూటీకి వెళ్ళాను. మా ఆఫీసులో నాతోపాటు పనిచేసే ఒక అబ్బాయి వచ్చి, "మేడమ్, మీరు మా ఇంటికి ఒకసారి రావాలి, నా భార్య మిమ్మల్ని కలవాలని అనుకుంటుంది" అని ఆహ్వానించాడు. వాళ్ళు కూడా తెలుగువాళ్ళే. "సరే, గురువారం టైమ్ ఉంటుంది, వస్తాన"ని చెప్పాను. మొదటిసారి వెళ్తున్నాము కదా, ఏమైనా తీసుకెళ్దామని షిరిడీ నుండి తెచ్చిన బాబా విగ్రహం పట్టుకొని గురువారం సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతని భార్య సౌజన్య చేతికి విగ్రహం ఉన్న బాక్స్ అందిస్తూ, "చిన్న గిఫ్ట్, తీసుకోండి" అన్నాను. తను "ఏమిటి మేడమ్?" అని తెరచి చూసి, ఆశ్చర్యపోయి, (ఆనందం పట్టలేక) కన్నీళ్లు పెట్టుకుంది. నేను, "ఎందుకు? ఏమైంది?" అని అడిగాను. దానికి తను చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను. ఇంతకీ విషయం ఏమిటంటే, తను కూడా మంచి బాబా భక్తురాలు. తన దగ్గర ఒక చిన్న బాబా విగ్రహం ఉంది. ఆ విగ్రహం చాలా పాతది. కాళ్ళ దగ్గర విరిగిపోయింది పాపం. ఆరోజే ఆమె బాబా ముందు కూర్చొని, "బాబా, ఇలా విరిగిన విగ్రహానికి పూజ చేయడానికి మనసు రావటం లేదు. నేనిది చాలాకాలం క్రిందట షిరిడీలో కొన్నాను, మళ్ళీ నాకు షిరిడీ నుంచి తెచ్చిన విగ్రహమే కావాలి. మరి నువ్వు ఎలా వస్తావో, ఏమో నీకే తెలియాలి, తొందరగా రా బాబా!" అని బాబా ముందర కూర్చొని బాబాను ప్రార్థించిందట. ఆరోజు గురువారం కావడం, నేను షిరిడీ నుంచి తెచ్చిన విగ్రహం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లడం అంతా బాబా లీల.

ఆమె గుండెలోతుల్లో నుంచి వచ్చే ధర్మసమ్మతమైన కోరిక బాబాకు వారం ముందే తెలుసు. నన్ను ఒక ఉపకరణంగా చేసుకొని ఆమె కోరిక ఎలా తీర్చారో చూడండి. ఆ చిన్న అబ్బాయి షిరిడీలో మూడుసార్లు నా వెంటపడి మరీ విగ్రహాలు కొనేలా చేయడమేమిటి? ఈమె, 'షిరిడీ నుంచే బాబా విగ్రహం కావాలి' అని వేదన పడటం ఏమిటి? నేను వీళ్ళ మధ్యలో ఒక ఉపకరణంగా మారడం ఏమిటి? అంతా విచిత్రం. అందుకే నేనెప్పుడూ మనం చేసే ప్రతి పని వెనకాల అంతరార్థం ఉంటుందని, బాబా హస్తం ఉంటుందని అనుకుంటాను.

పారాయణ


పూజ్య శ్రీ మాస్టరుగారు ఒకసారి మాటల సందర్భములో పారాయణ గూర్చి యిలా చెప్పారు :

"పారాయణకు ప్రధానమైన అంశం పరాయణత చెందడమే. పారాయణాలు చేస్తున్నకొద్దీ యింకా యింకా బాబా లీలలో మనస్సు లగ్నమవ్వాలి. అలా జరిగితేనే పారాయణ సరిగ్గా చేస్తున్నట్లు గుర్తు. కొంత మంది తాము ఎన్నో సంవత్సరాలుగా విడవకుండా పారాయణ చేస్తున్నామని, అయినా మనస్సు ఏకాగ్రమవడం లేదని చెబుతుంటారు. ఏకాగ్రమవకపోవడానికి కారణం లీలలను చింతన చేయకపోవడమే. లీలలను చింతన చేస్తుంటే ప్రీతి కలిగి మనస్సు నిలుస్తుంది. అంతేగాక కొంతమంది చాలా పారాయణాలు చేశామని, 108 పారాయణాలు పూర్తి చేశామని చెబుతారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనేక చోట్లకు పరిగెత్తుతారు. ఎవరో ఏదో చేయమన్నారు అని ఉపాసనలు, పూజలుశాంతులు చేస్తుంటారు. అదెందుకంటే పుట్టలో పాముందో అని అంటారు. అంటే బాబా చరిత్ర ఎన్ని పారాయణాలు చేసినా ఆయన తత్వాన్ని వారు అవగాహన చేసుకోలేదన్నమాట. ఆయనే సకల దేవత స్వరూపి అని నిరూపించారు. దేవతలందరికీ అధినాధుడైన సాయినాథుడు ఆయన భక్తుల కోరికలు తీర్చలేడా? ఆయన తీర్చలేని వాటిని దేవతలు తీర్చగలరా?' దేవతలందరూ ఆయనే అయినప్పుడు ఆయా దేవతలను ఆరాధిస్తేనేమి?' అని అంటారు వారు.

ఇక్కడ విషయమది కాదు. దేవతలు కొన్ని పరిమిత శక్తులు కలవారని చెబుతారు. ఉదాహరణకు విద్య రావాలంటే సరస్వతీ దేవిని ఉపాసించాలి. ధనం రావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతగా పెద్దలు చెప్పారు. అంటే వారు పరిమిత శక్తులు గలవారన్నమాట. ఉదాహరణకు మన శరీరంలో మాట నోటి ద్వారానే వస్తుంది. వినడం చెవుల ద్వారానే చేయగలము. చూడడం కళ్ళ ద్వారానే చేస్తాము. అలాగే ఒక ఇంద్రియం పని మరొకటి చేయలేదు, కానీ వీటన్నిటిని నడిపించే శక్తి ఒకటి వున్నది. అది పని చేయకపోతే మొత్తం ఆగిపోతాయి. దాని ఆజ్ఞ లేకపోతే యివేవి ఏమి చేయలేవు. అలానే దేవతలందరు ఆయా శక్తులు కలిగి వుండడానికి మహత్తర చైతన్యశక్తి కారణమో అదే తానే అయిన సాయినాధుని ఆశ్రయిస్తే మనకు ఇతర దేవతలనారాధించవలసిన అవసరమేమున్నది? ఉదాహరణకు వర్షాలు పడాలంటే వరుణ దేవుని ప్రార్థనలు చేస్తాము. కానీ బాబా ఆజ్ఞాపిస్తే వర్షం రావడంగానిఆగి పోవడం గాని జరిగిపోతాయి. అందుకని ఆయన చరిత్ర పారాయణ వలన ఆయన చేసిన లీలలలో ఆయన ఎంతటి శక్తివంతుడో మనకు తెలుస్తుంది. అందుకని ఆయనను ప్రార్థన చేస్తే చాలు, సకల దేవతలను ప్రార్థించినట్లే!

అంతేకాదు, ఇతర దేవతలను శ్రద్ధగా ఆరాధించినా మరొక దేవతను ఆరాధించవలసిన అవసరం లేదని తెలుస్తుంది. వసరమైతే దేవతే మరొకరిని ఆశ్రయించమని చెబుతుంది. సప్తశృంగీ దేవి పూజారి దీనికి ఒక ఉదాహరణఇవన్నీ చదివి గూడా మనకు కష్టాలు తీర్చేందుకు మరొకరు అవసరమైనప్పుడు మనం ఆయన చరిత్ర చదివినందువలన మనకు వచ్చే లాభమేమున్నది? అలాగాక ఆయన లీల చింతనతో చదివితే మనకు ఆయన తప్ప అన్యమేమీ అవసరం లేదు అన్న విశ్వాసం కలుగుతుంది. అట్టి విశ్వాసం కలగడమే మనం చరిత్ర పారాయణ సరిగ్గా చేస్తున్నట్లు గుర్తు.


కొందరు, "బాబా నాకు కన్పించి, నీ కష్టాలు తీరడానికి ఫలానా దేవతను ఆరాధించమనో, మరేదో చేయమనో చెప్పారు" అని  చెబుతుంటారు. వాళ్లకు చెప్పిన బాబా మనకు కూడా చెప్పినట్లయితేనే వారు చెప్పినది సరియైనది అని మనం భావించాలి.

source : భగవాన్ శ్రీ భరద్వాజ(రచన: శ్రీమతి శ్రీదేవి)

పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ గారు పారాయణ గురించి చెప్పిన వివరాలను కూడా క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. అప్పుడే మనకు సరైన అవగాహనా ఏర్పడుతుంది.



సాయిబాబా నామమే నన్ను కాపాడింది


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నేను సదాశివ. ముందుగా సాయిబాబా దివ్య చరణకమలాలకు కోటి కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను. తప్పులుంటే మన్నించమని బాబాను ప్రార్థిస్తున్నాను. నమ్మిన వాళ్లకు ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు ఆయన. బాబా ఎలా నన్ను రక్షించారో చెప్పబోతున్నాను.

కలియుగంలో 'నామ సంకీర్తన'కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. "ఒక్క నామం చాలు భవసాగరాన్ని దాటడానికి" అన్నారు పెద్దలు. భగవంతుని నామస్మరణతోనే ఎంతోమంది తరించారని మనం రోజూ వింటూ వుంటాము. నేను, "ఇది ఎలా సంభవం?" అనుకునేవాడిని. అందుకేనేమో, నాలాంటి వాడికి తెలియచేయాలని బాబా వేసిన ప్రణాళికేమో నాకు జరిగిన ఈ సంఘటన.

2018 జులై 20వ తారీఖున నేను నా డ్యూటీ అయిపోయిన తరువాత మధ్యాహ్నం 2గంటల సమయంలో మోటార్ సైకిల్ పై సాయిబాబా నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాను. బాగా ఎండగా ఉండటంవల్ల రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో నా వెనకాల నుండి ఒక పెద్ద ట్రక్ వచ్చి(ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ తెలీదు) నా మోటార్ సైకిల్ని గుద్దేసింది. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామంతో నాకు ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు. కానీ, ఓ నా సాయి బంధువులారా! నన్ను నమ్మండి. చావు, బ్రతుకుల మధ్య వున్న నన్ను సాయిబాబా ఎలా రక్షించారో చెప్పనలవి కాదు నాకు. అంతపెద్ద యాక్సిడెంట్ నుంచి నన్ను గట్టున పడేసారు బాబా. నాకు ఏమీ కాలేదు. ఒక్క చిన్న మచ్చ కూడా పడలేదు. నా మోటార్ సైకిల్ వెనకాల లైట్స్ విరిగిపోయినాయి, అంతే.

అప్పుడు అర్థం అయ్యింది - నామస్మరణ మహిమ.సాయిబాబా నామమే నన్ను కాపాడింది. అప్పుడు నేను ఇంటికి పోకుండా, కళ్ళలో నీళ్లతో ముందు బాబా గుడికి వెళ్ళాను. "బాబా! ఈరోజు నువ్వు నన్ను కాపాడకపోతే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది? నన్నే కాదు, నీ స్మరణలో వుండే ప్రతి భక్తుడికి నీవే రక్ష ప్రభూ!" అని నమస్కరించుకొని, ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి వెళ్ళాను. ఏదో పూర్వజన్మలో చేసిన కర్మను బాబా కొంచెంలో తీసేశారు. నన్ను కాపాడి బాబా "ఆపదలో ఆపద్బాంధవుడు" (ఆపద్బాంధవాయ నమః) అని నిరూపించుకున్నారు.

ఓం సాయిరాం.

నా బాబాయే నాకు తల్లి, తండ్రై జాగ్రత్తగా తిరుపతి యాత్ర పూర్తీ చేయించారు


నా పేరు అర్చన. మాది హైదరాబాద్. సాయినాథుని కరుణ అందరి మీద ప్రసరిస్తుంది కానీ, మనం అనుభవించే ఆనందం మన పరిస్తితిని బట్టి ఉంటుంది. శరత్ బాబూజీ గారు చెప్పినట్లు ఆకలితో ఉన్న వారికి అన్నం విలువ తెలుస్తుంది అది ఒక చిన్న ముద్ద అయినా చాలు. మనం కష్టాల్లో ఉన్నపుడు జరిగిన చిన్న లీల అయినా మన మనసుపై పెద్ద ముద్ర వేస్తుంది. మేము రీసెంట్ గా 2018 ఆగష్టు 20న వెళ్లిన తిరుపతి ప్రయాణం గురించి నేను మీకిప్పుడు చెప్తాను. అడుగడుగునా బాబా ఉనికితో నిండిపోయిన చక్కటి అనుభవాలను చదివి ఆనందించండి.

నాకు చిన్నతనం నుంచి ప్రయాణాలు పడవు. వాంతులుతో సతమతం అవుతాను. చిన్నపుడు మా అమ్మ నాన్నలు జాగ్రత్తగా తీసుకెళ్లేవారు. ఇపుడు నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నన్ను ఎవరు చూస్తారు? నాకు తల్లితండ్రి అయిన సాయి తప్ప. 19వ తేదీన మా అత్తామామలు, ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, నేను, మావారు, మా ఇద్దరు పిల్లలు అందరం కలిసి హైదరాబాదు నుంచి బయలుదేరాము. వెళ్లే ముందు నేను ఇంట్లో బాబా పూజ చేశాను కానీ, గుడికి వెళ్లి ఊదీ తీసుకుని బయలుదేరాలని నా ఆశ. ఏ ఊరు వెళ్ళినా అలా ఊదీ తీసుకొని వెళ్ళడం నాకలవాటు. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం కురవడంతో గుడికి వెళ్ళటం కుదరక నిరాశగా బస్సు స్టాపుకి వెళ్ళాను. పక్కనే శివాలయం ఉంది. సరే అన్ని రూపాలు బాబావే కదా! ఇక్కడైనా దేవుడికి నమస్కరించుకుందామని లోపలికి వెళితే అక్కడ పెద్ద ద్వారకమాయి బాబా ఫోటో దర్శనమిచ్చింది. చాలా సంతోషంగా అనిపించి బాబాకి నమస్కరించుకున్నాను. పక్కనే ఆంజనేయస్వామి గుడి ఉంటే వెళ్ళాను. అక్కడ కూడా బాబా దర్శనమిచ్చారు. బయటకి రాగానే ఒక బస్సు మీద పెద్ద సమాధి మందిరంలోని బాబా పటం కనిపించింది. నా ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషంలో బస్సు ఎక్కి ప్రశాంతంగా పడుకున్నాను. ఉదయాన తిరుపతిలో బస్సు దిగగానే దూరంగా లైటింగ్ తో ఉండే బాబా ఫోటో కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తిరుపతిలో కూడా నా బాబానే నాకు మొదట దర్శనం ఇచ్చారు. "ఓం సాయిరామ్" అనుకుని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి వెళ్ళడానికి బయలుదేరాము. ఇక నాకు ఒకటే భయం మొదలైంది. ఎందుకంటే కొండపైకి బస్సులో వెళితే ఆ కుదుపులకి నాకు ఒంటిలో తిప్పుతుంది, ఆ వికారానికి వాంతులు అయిపోతాయి. అందుకే నేనెప్పుడూ తిరుపతి వెళ్లినా కొండపైకి నడిచే వెళ్తాను. అయితే ఇప్పుడు పిల్లలు ఉండడంతో ఆ అవకాశం లేదు. "బాబా ఎలా నన్ను కొండపైకి తీసుకెళతావో ఏమో, నాకు చాలా భయంగా ఉంది" అనుకుని వెహికల్ లో బయలుదేరాము. ఆశ్చర్యం ఎవరో చెప్పినట్లుగా ఆ డ్రైవర్ మలుపుల దగ్గర ఎంతో జాగ్రత్తగా, చాలా నిదానంగా నడుపుతూ కొండపైకి తీసుకెళ్ళాడు. మెలుకువగా ఉన్న కూడా నాకు కాస్త కూడా ఇబ్బంది అనిపించలేదు. కొండపైకి వెళ్లిన తరువాత మేము ఇంకో  వెహికల్ ఎక్కాము, అందులో కూడా సచ్చరిత్ర చేతిలో పట్టుకొని ఉన్న బాబా ఫొటో దర్శనమిచ్చింది. బాబా దయతో స్వామి దర్శనం బాగా జరిగింది. ప్రయాణంలో నాకెప్పుడూ ఉండే ఇబ్బందులు కలగకపోయినా గాని ప్రయాణ సమయమంతా మా పాప నా ఒడిలో ఉండటం వలన నడుమునొప్పి, బాడీ పెయిన్స్, వీటికి తోడు తలనొప్పి కూడా రావడంతో కొంచం ఇబ్బందిగా ఉంది. సరే ఇంకా విశ్రాంతి తీసుకుందామనుకొనే సరికి మావారు కాణిపాకం వెళదామన్నారు. సరే అని వెహికల్ లో కొండ దిగుతున్నాము. ఈ డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా కిందకి తీసుకువచ్చాడు. చిత్తూరులో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి అలసటగా ఉండటంతో కాస్త పడుకున్నాను. నేను ఈ పెయిన్స్ తో బాధపడుతూ పిల్లలితో ఇంకా ఈ జర్నీ అంతా ఎలా పూర్తి చేయాలి అనుకుంటూ ఉన్నాను. అసలు నేను పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు, మా వాళ్ళు ఆడే మాటలన్నీ వినబడుతున్నాయి కూడా అంతలో ఒక కల. అందులో మావారు బాబా గుడి ఉంది చూడు అంటుంటే చూసాను. ఎవరో ఒకరు చేతుల నిండుగా ఊదీ ఇచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. కాని లేచిన తరువాత కూడా అలసటగానే ఉంది. తరువాత కాణిపాకం వెళ్ళాము, అక్కడ దిగగానే నేను చూసిన మొదటి ఫోటో బాబాదే. అక్కడ కూడా బాబా దయవలన చక్కగా దర్సనం జరిగింది. తరువాత తిరుపతి వచ్చి హైదరాబాదు బస్సు ఎక్కి అలసటతో ఓపిక లేక ఎవరి గురించి పట్టించుకోకుండా పడుకున్నాను. ఉదయాన హైదరాబాదులో దిగగానే వెంకటేశ్వరస్వామి మరియు బాబా ఫోటో కనిపించాయి. చాలా సంతోషం వేసింది. 

ఇంటికి వచ్చి రాగానే మొబైల్ లో చూడగానే ఊది గురించి మన "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" లో వచ్చిన  "బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్టంలో ఉంటే ఊదీ అందిస్తున్నారు" అన్న టైటిల్ తో ఉన్న అనుభవాన్ని చూసాను. అది చూసాక నాకు ముందురోజు కలలో ఊదీ ఇవ్వడం గుర్తుకు వచ్చింది. బ్లాగులోని అనుభవం ద్వారా "ఊదీ కలలో ఇచ్చినా లేక మెలకువలో ఎవరి ద్వారా ఇచ్చినా ఎటువంటి తేడా లేదని, అది అయన ఊదీ, అద్భుతమైనది, అమోఘమైనదని, నా బాధను చెప్పుకున్న మరుక్షణమే కలలో నాకు ఆయన ఊదీ ఇచ్చి ఆయన నాపై కృప చూపారని, తిరుపతి వెళ్లేముందు ఊదీ తీసుకోలేకపోయిన కలలో బాబా నాకు ఊదీ ఇచ్చారని" అర్దమై పట్టరానంత ఆనందం కలిగింది. ఇంకో ముఖ్య విషయం ఎప్పుడూ విపరీతమైన అల్లరి చేసే మా పిల్లలు ఈ ప్రయాణంలో అసలు అల్లరే చేయలేదు. అంత బాబా దయ. నా బాబాయే నాకు తల్లి, తండ్రై జాగ్రత్తగా తిరుపతి యాత్ర పూర్తీ చేయించారు. ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి క్షణం అయన ఉనికిని తెలియజేస్తూ నాకే కష్టం లేకుండా చూసుకున్నారు. అయన ప్రేమ అద్భుతం. ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా.


బాబా లీల ...... ఇంత మహత్తరంగా ఉంటుందా?


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక సాయి బంధువు తనకు బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. 

నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఏ బాధ కలిగినా నేను బాబాకే చెప్పుకుంటాను. ప్రతి విషయాన్నీ ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయిబాబానే. నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉండి నా చదువును కొనసాగిస్తున్నాను. బాబా చేసిన ఒక నమ్మశక్యం కాని మిరకిల్ ను "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలని నా ఆశ.

మనం బాబా ప్రేమను పొందడానికి ఇళ్ళు వదిలి అరణ్యాలలోకి వెళ్లి ముక్కు మూసుకొని తపస్సులు చేయవలిసిన అవసరం అస్సలు లేదు. బాబా మీద నమ్మకము, ఆయన మాటల యందు శ్రద్ధ, ఎల్లప్పుడూ ఆయనను స్మరించుకుంటూ ఉంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటారు.

ఇక బాబా చేసిన అద్భుతమైన లీలను చదవండి. నేనొక విద్యార్థినిని. నా ఖర్చుల నిమిత్తం నా తల్లిదండ్రులు నెలనెలా డబ్బులు పంపుతూ ఉంటారు. ఆ డబ్బులతో నా రూమ్ రెంట్, తిండి, ఇతర ఖర్చులు పోను, కొంచెం డబ్బు మాత్రమే మిగులుతుంది. నా దగ్గర ఉంటే ఖర్చయిపోతుందని ఆ డబ్బుని నా మనీ బ్యాంకులో వేసుకుంటాను. అవసరమైనపుడల్లా ATM  నుండి తీసుకుంటాను. చదువు మీద నాకున్న ఆసక్తి వలన బాగా చదువుతాను. కానీ సరిపడా డబ్బులు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. ఒకసారి హఠాత్తుగా పరీక్ష ఫీజు కట్టాలని మా ప్రిన్సిపాల్  చెప్పారు. అది కూడా 1,20,000 రూపాయలు. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ అంత మొత్తం కట్టాలనేసరికి నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివిస్తూ ఉన్నారని మనకి తెలుసు కాబట్టి వాళ్ళని అడగాలంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. తెలిసీతెలిసి వాళ్ళని డబ్బులు అడగలేము, అలాగని చదవకుండా ఊరుకోలేము. ఫీజు ఎలా కట్టాలని నా మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంది.

చెప్పాను కదా! నాకు ఎలాంటి బాధ కలిగినా బాబాకే చెప్పుకుంటానని. అందువలన ఇప్పుడు కూడా, "బాబా! రూమ్ రెంట్ కట్టడానికి సరిపడినంత డబ్బులు మాత్రమే నా ఎటిఎం లో ఉన్నాయి, ఫీజు ఎలా కట్టాలో అర్ధం కావడం లేద"ని బాబాకు చెప్పుకున్నాను. నేను బాధపడుతున్న ప్రతిసారీ బాబా నుండి నాకు "నీవు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా!" అని సమాధానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా బాబా నుండి అదే సమాధానం వచ్చింది. ఆ మాటలు నాకు కాస్త ఓదార్పునిచ్చాయి. బాబా ఎలా నన్ను కాపాడుతారో చూద్దామనుకొని ఆయన మీద నమ్మకంతో ఉన్నాను.

రూమ్ రెంట్ కట్టాల్సిన తేదీ రావడంతో  ఎటిఎం కు వెళ్లి వెయ్యి రూపాయలు డ్రా చేశాను. బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఆశ్చర్యం! నా అకౌంట్లో ఒక లక్షా ఇరవైవేలు ఉన్నట్లు చూపిస్తుంది. ఏమిటి ఇలా చూపిస్తుంది, ఇదెలా సాధ్యం? మెషిన్ లో ఏదైనా సమస్య ఉందేమోననునుకొని బయటకు వచ్చాను. కానీ నా మనస్సు దాని గురించే ఇంకా ఆలోచిస్తోంది. మెషిన్ ఎందుకు తప్పుగా చూపిస్తుంది? కానీ నాకు బాగా గుర్తు ఉంది. వెయ్యి రూపాయలు తీసేస్తే ఉంటే ఇంకా 500 రూపాయలు ఉండొచ్చు. మరి అంత డబ్బు ఎలా వస్తుంది? సరే, ఇంకొక ఎటిఎం కు వెళ్లి చెక్ చేసి చూద్దామని వెళ్ళాను. అక్కడ కూడా లక్షా ఇరవై వేల రూపాయలే చూపిస్తుంది. నా కళ్ళను నేనే నమ్మలేక కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసాను. మరల అంతే అమౌంట్ చూపిస్తుంది. అయినా నాకు నమ్మకం కలగడం లేదు. సరే కొంత అమౌంట్ డ్రా చేద్దామని డ్రా చేస్తే అమౌంట్ బయటకు వచ్చింది. ఆశ్చర్యం!  అద్భుతం!  బాబా లీల ఇంత మహత్తరంగా ఉంటుందా? నా కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతున్నాయి. డబ్బులు పట్టుకొని రూంకి వెళ్ళిపోయాను. రెండు రోజులు నాకు అసలు నిద్ర పట్టలేదు. బాబా నా కాలేజీ ఫీజుకు ఎంత కావాలో అంతే ఇచ్చారు. నా ఫీజు ఎంత అనేది నా తల్లిదండ్రులకి కూడా తెలియదు. నా తండ్రి స్థానంలో నా సాయిబాబా ఉండి నా ఫీజు కట్టారు. నా సమస్యని ఎంతో బాధ్యతగా ఆయన నెరవేర్చారు. "థాంక్యూ బాబా! లవ్ యూ! నన్ను వదలకు బాబా! నా వెంటనే ఎప్పుడూ ఉండండి బాబా! నాకు నీ స్నేహం, ప్రేమ కావాలి బాబా! నీవు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను".

బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్టంలో ఉంటే ఊదీ అందిస్తున్నారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

శ్రద్ధ  -  సబూరి
జామ్నేర్ లో నానా చాందోర్కర్ కుమార్తై మైనతాయి ప్రసవ వేదన పడుతున్న సందర్భంలో బాబా రామ్ గీర్  బువా ద్వారా సరైన సమయానికి ఊదీ పంపిన లీల సాయి భక్తులందరికీ విదితమే. బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఊదీ అందించే ఏర్పాటు చేస్తున్నారు. అటువంటిదే మీరు ఇప్పుడు చదవబోయి ఈ సాయి బంధువు అనుభవం.

గతవారం "ఒక సాయిబంధువు షిరిడీ పర్యటనకు సంబంధించిన వాట్సాప్ సత్సంగం" గురించి మీరంతా చదివి వున్నారు కదా! అదే సాయిబంధువుకి నిన్న, అనగా 2018, ఆగష్టు 20 సాయంత్రం 5.30 సమయంలో జరిగిన ఒక అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు..

అందరికీ సాయిరామ్

నేను ఊదీకి సంబంధించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో ఒక సహోద్యోగిని ఉన్నారు. తనతో నాకు కేవలం ముఖపరిచయం మాత్రమే ఉంది. నిజానికి తను నా స్నేహితురాలికి స్నేహితురాలు. రెండు మూడు వారాల క్రిందట తను వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదని నా స్నేహితురాలితో చెబుతుండగా నేను విన్నాను. ఇది విన్నాక నేను షిర్డీ నుండి తెచ్చిన బాబా ప్రసాదం, ఊదీ తనకి ఇవ్వాలని అనిపించింది. కానీ మళ్ళీ తను ఎలా తీసుకుంటుందో ఏమో అని ఆలోచించాను. చివరిగా తనకి ఎలాగైనా ప్రసాదాన్ని అందజేయాలని సంకల్పించాను. కానీ గతవారమంతా తను నాకు ఆఫీసులో కనిపించలేదు.

ఈరోజు సాయంత్రం తను కనిపిస్తే,  "మీ అమ్మగారు ఎలా ఉన్నారు?" అని అడిగాను. "ఆవిడ రొమ్ముక్యాన్సర్ తో బాధపడుతున్నారు. దానివలన ఆవిడ చాలా వీక్ గా అయిపోయారు. గతవారమంతా ఆవిడకు కీమోథెరపీ చేయించాము. అందుకే నేను గతవారమంతా సెలవులో ఉన్నాను" అని చెప్పి, "పైగా గతవారంలో మా మేనత్త కూడా మరణించారు. కుటుంబమంతా చాలా కష్టంలో ఉన్నామ"ని చెప్పింది. అప్పుడు నేను, "నేను ఈమధ్యనే షిర్డీకి వెళ్లి వచ్చాను. అక్కణ్ణించి తెచ్చుకున్న ఊదీ నా దగ్గర ఉంది. ఈ ఊదీ తీసుకొని రోజూ అమ్మకు ఇవ్వండి" అని చెప్పాను. తను సైలెంట్ గా ఊదీ తీసుకుంది. నేను తనతో, "ఊదీ తీసుకోవడం వలన ఎన్నో సందర్భాలలో ఎందరో భక్తులకు మేలు జరిగింది. ఊదీ వలన వాళ్లు తమ బాధల నుండి ఉపశమనం పొందారు. అందువలన దయచేసి అమ్మకు రోజూ ఊదీ ఇవ్వండి, ఆమెకు మేలు జరుగుతుంది" అని చెప్పాను. అప్పుడు తను ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. తను కూడా బాబా భక్తురాలినని చెప్పి, "నిన్న రాత్రి నేను చాలా ఏడ్చాను. ఆ బాధలో బాబాతో మాట్లాడుతూ, "బాబా! నాకు ఇంక ధైర్యం లేదు. రేపు మీరు ఉన్నట్లు నాకు నిరూపణ ఇవ్వండి, లేకపోతే నేను మీయందు నమ్మకాన్ని కోల్పోతాను. ఇకపై నేను మిమ్మల్ని నమ్మలేను" అని చెప్పుకున్నాను" అని చెప్పింది. నేడు అనుకోకుండా ఈ విధంగా ఊదీ ఇవ్వడంతో ఆయన తన ఉనికిని చాటుకున్నారు. పరమాద్భుతం కదా!

బాబా అదృశ్యంగా తీగలను కదుపుతూ ఎక్కడెక్కడి భక్తులను ఎలా కలుపుతారో! ఆయన లీలలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు బాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదంతా ఈరోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో జరిగింది. అనుకోకుండా "సాయిమహరాజ్ సన్నిధి బ్లాగు" లో ఈరోజు పోస్టింగ్ చూస్తే ఆ అనుభవం కూడా బాబా యొక్క ఊదీ మహిమ గురించే. బాబా! మీ లీలలు అనూహ్యములు. ఆమె తల్లిని బాబా జాగ్రత్తగా చూసుకుంటారని, త్వరలోనే ఆమె కోలుకుంటారని ఆశిస్తున్నాను.

సాయిరామ్ !!

గురువుగారు(శరత్ బాబూజీ గారు) ఊదీ గురించి చాలా అద్భుతంగా  చెప్పారు. ఆ వీడియో క్రింద ఇస్తున్నాను చూసి ఆనందించి, మీ అవగాహన పెంచుకోండి.




ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి. ఊదీ దివ్యమైన ఔషధం, సర్వరోగ నివారిణి. అది ఆధ్యాత్మికపరమైన లేదా భౌతికపరమైన విషయాలలో ఒక చక్కటి పరిష్కారం. ఊదీ సాయిబాబా యొక్క మరో రూపం. లవ్ యు సాయి. జయ జయహో సాయి ...!

సాయి భక్తురాలు కమల తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. అందరికీ సాయిరాం.
దాదాపు 15 రోజుల క్రితం నేను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. ఆ నొప్పి వలన శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. అందువలన ఇంటి పనులు చేసుకోలేక, సరిగా నిద్రపట్టక, నా రెండేళ్ళ బిడ్డకి తిండి కూడా పెట్టలేక చాలా బాధపడ్డాను. మందులు తీసుకుంటున్నా కూడా ప్రయోజనం కనపడలేదు. అల్లం, పసుపుతో కట్టు కట్టుకోమని కొందరు, వేడినీటితో కాపడం పెట్టమని కొందరు సూచించారు. నేను ప్రతిదీ చేసాను, కానీ వేటివలనా ఉపయోగం లేకుండా పోయింది.

నేను దాదాపు మూడురోజులు ఇలా బాధపడ్డాను. తరువాత నాల్గవ రోజున బాబా పూజ చేయడానికి బాబా ముందు కూర్చొని, "బాబా! ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఒక తల్లిగా నా బిడ్డకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను. చాలా నొప్పిగా ఉంది బాబా. నా చేతిని పైకి ఎత్తలేకపోతున్నాను. బాబా నాకు సహాయం చేయండి. ఈ నొప్పిని తొలగించండి" అని బాబాతో చెప్పుకున్నాను. హఠాత్తుగా నేను బాబా ముందు వెలిగించిన అగరుబత్తి నుండి రాలిన ఊదీ చిటికెడు తీసుకున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే బాబాను ప్రార్థించి, నొప్పి ఉన్న చోట ఆ ఊదీ వ్రాసుకొని, "ఇప్పుడు ఇక ఈ నొప్పి తొలగించడం నీ చేతుల్లో ఉంది బాబా!" అని చెప్పుకున్నాను. అలా నేను బాబాను ప్రార్థించి ఊదీ వ్రాసుకున్న కొంతసేపటికి నొప్పి అదృశ్యమయిపోయింది. ఇది ఒక అద్భుతం! మూడు రోజులనుండి నన్ను బాధపెట్టిన నొప్పిని అరగంటలో బాబా తీసేసారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఇది బాబా ఊదీ మహిమ.

"బాబా మన ప్రతి చిన్న, పెద్ద ప్రార్థనలను విని, తప్పనిసరిగా సమాధానాలు ఇస్తారు."

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!

సాయి బంధువు వర్ష గారు చెప్తున్నా అనుభవం:- 

ప్రియమైన సాయిభక్తులందరికీ సాయిరాం. మీతో ఇప్పుడు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. కొన్నిరోజుల క్రిందట మా పిన్నిగారి గర్భాశయంలో కణితి(ట్యూమర్) ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించారు. దానితోపాటు వైద్యులు క్యాన్సర్ అని కూడా అనుమానం వ్యక్తం చేసారు. ఆమె గర్భాశయాన్ని తొలగించవలసి ఉంటుందని చెప్పారు. ఈ కారణంగా ఆమె మానసికంగా చాలా కృంగిపోయింది. ఆమె ఆప్పటికే బీపీ, ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర వ్యాధులతో బాధపడుతూ ఉంది. "దేవుడికి నామీద కనికరం లేదు. నేను ఇన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నా కూడా నన్ను వదలకుండా క్రొత్త రోగాలను అంటగడుతున్నాడు" అని మా పిన్ని వేదన పడసాగింది. అప్పుడు మా అమ్మ ఆమెతో, "ఆశ వదులుకోకు. నీకు తోడుగా బాబా ఉన్నారు. నీ వ్యాధిని బాబా నయం చేస్తారు" అని చెప్పింది. ఇంకా బాబా ఊదీని తన కడుపుపై వ్రాసుకోమని, కొంచెం ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగమని చెప్పింది. ఆమె ప్రతిరోజూ అమ్మ చెప్పినట్లుగా చేయడం మొదలు పెట్టింది. అంతిమంగా బాబా తన అద్భుతాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించారు. ఆమె రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి. క్యాన్సర్ ఏమీ లేదని చెప్పారు. గర్భాశయాన్ని తొలగించవలసిన అవసరం లేదని కూడా చెప్పారు. కణితి(ట్యూమర్)ని నయం చేసేందుకు కొన్ని మందులు ఇచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆనందంగా ఉంది కదా! భక్తుల కష్టకాలంలో బాబా తన భక్తులకు ఎల్లప్పుడూ తన సహాయాన్ని అందిస్తారు. అందువల్ల మనం ఆయన పట్ల చెదరిపోని విశ్వాసంతో ఉండాలి.

జై సాయిరామ్.
వర్ష పట్నాయక్

హస్తస్పర్శతో ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

శ్రద్ధ  -  సబూరి

బెంగళూరు నుండి పబ్లిష్ అయ్యే సాయిపాదానంద పత్రికని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ సంఘటన ద్వారా సాయిబాబా ఇప్పటికీ సజీవంగా ఉంటూ, తన భక్తులు ఎంత కష్టాలలో, బాధలలో ఉన్నా వారు తలచుకోగానే వాళ్ళ ముందు ప్రత్యక్షమై, వాళ్ళకు ఉపశమనం కలిగిస్తారు అని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పబోయే సాయి లీల మా నాన్నగారు శ్రీ కాసాయి శ్రీనివాసశెట్టి గారిని బాబా స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఆయనని అనారోగ్యం నుండి ఎలా కాపాడారో తెలియజేస్తుంది.

మా నాన్నగారు బెంగళూరులో ఉండగా  ఒకరోజు సాయంత్రం బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు. మా బావగారు శ్రీ సూర్యప్రసాద్ గారు(బెంగళూరు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా పని చేస్తారు) హై గ్రౌండ్ లో ఉన్న డాక్టర్ నారాయణ్ హాస్పిటల్ లో మా నాన్నగారిని అడ్మిట్ చేసారు. డాక్టర్ లివర్ హేమరేజ్ అయిందని నిర్ధారించి, మరుసటి రోజే ఆపరేషన్ చేయాలని చెప్పారు.

తరువాత మా నాన్నగారు హాస్పిటల్ గదిలో మంచం పైన పడుకుని ఉన్నారు. ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సజీవంగా సాయిబాబా ప్రత్యక్షమై, "నీకు ఎక్కడ నొప్పిగా ఉంది?" అని అడిగారు. మా నాన్నగారు తన పొట్టపై ఒక భాగం చూపించగా, బాబా మంచంపై కూర్చొని నాన్న పొట్టని తన చేతులతో స్పృశించి, “అల్లా అచ్ఛా కరేగా” అని అదృశ్యమైపోయారు. డాక్టర్ నారాయణ్ గారు ఆ రాత్రి నాన్నగారు ఉండే వార్డ్ కి రౌండ్స్ కి వచ్చినప్పుడు, ఆయన సంతోషంగా జరిగినదంతా డాక్టర్ కి వివరించారు. డాక్టర్ మళ్ళీ నాన్నకి పరీక్షించి, ఆపరేషన్ అత్యవసరంగా చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు సమస్య ఏమీ లేదు, అంతా బాగుందని చెప్పారు. అపరేషన్ లేకుండా మా నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు మేము సదా సాయికి కృతజ్ఞులై ఉంటాము.         

ఓం సాయిరాం!!!

సాయి మా జీవితాన్నే మార్చేసారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

శ్రద్ధ  -  సబూరి

సాయి సోదరి పల్లవి గారు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు.

నా పేరు పల్లవి, నేను బెంగళూరులో ఉంటాను. మొదటగా, ఇంతటి సాయికార్యాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ఎంతోమందికి సాయిపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది సాయి నాకు ప్రసాదించిన మొదటి అనుభవం. సాయి నాకు తల్లి, తండ్రి, స్నేహితుడు. సాయే నాకు అన్నీ. సాయి నన్ను, మా సిస్టర్ ని తన చేతులలోకి తీసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన సాయి లీల. దానిని ఇప్పుడు మీకు వివరిస్తాను.

2014 డిసెంబర్ లో మా సిస్టర్ పెళ్లి ఆగిపోయిన సమయంలో బాబా మా జీవితంలోకి ప్రవేశించారు. మా సిస్టర్ IT జాబ్ చేస్తూ ఉండేది. తనకి మేము 4 సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా, చివరికి ఒక మంచి కుటుంబంలోని అబ్బాయితో ఆగష్టులో తన పెళ్లి కుదిరింది. ఇన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్న సమయం  రావడంతో అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అదే సమయానికి మా బ్రదర్ కి కూడా ఒక బాబా భక్తురాలితో పెళ్లి కుదిరింది. ఇద్దరి వివాహం మార్చి 9వ తేదీనాడు జరపాలని నిర్ణయించారు. నేను కూడా IT జాబ్  చేస్తూ ఉన్నాను. సిస్టర్, బ్రదర్ ఇద్దరికీ ఒకేసారి సంబంధాలు కుదిరి జీవితంలో స్థిరపడుతున్నందుకు నేను చాలా సంతోషించాను. నాకు కూడా పెళ్లి చేయాలని మా నాన్నగారు అనుకొని, ఆ పనులలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఒకసారి మా సిస్టర్ బాధపడతుండడం నేను గమనించాను. అప్పుడే తెలిసింది మా సిస్టర్ అతనితో సంతోషంగా లేదని, వారిద్దరివీ భిన్నమైన స్వభావాలు అని. ఇదే ఆలోచిస్తూ తను ప్రతిరోజూ ఏడ్చేది, చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యేది. కొద్ది రోజులకి పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. 2నెలల వ్యవధిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఫోన్ చేసేవాడు, ఒక్కసారి కూడా మా సిస్టర్ ని కలవడానికి రాలేదు. చివరికి పెళ్లి ఆగిపోయింది.

దానితో మా ఇంట్లో అందరి సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే మన బాబా మా జీవితంలోకి ప్రవేశించారు. ముందు ఎన్నడూ సాయిని ఎరుగని మాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ఇక మేము గుడ్డిగా బాబాని విశ్వసించటం మొదలుపెట్టాము. అలా మా జీవితాలలోకి బాబా ప్రవేశించిన తరువాత బాబా మాకు ఎన్నో లీలలు చూపించారు. మా సిస్టర్ పెళ్లిని సాయి సరైన సమయంలో కుదిరేలా చేసి మమల్ని అందరినీ సంతోషంలో ముంచారు. ఆ సాయి లీలనే నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నేను, మా సిస్టర్ 'సాయి గురువార వ్రతం' మొదలుపెట్టాము. ప్రతి గురువారం సాయి మందిరానికి వెళ్లేవాళ్ళం. ఆఖరి గురువారం వచ్చేసరికి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా అనిపించింది. ఇంట్లో కూడా అందరూ బాబా దయవల్ల ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. సాయి ఊదీ, సాయి సచ్చరిత్ర పుస్తకం ఆ సమయంలోనే మాకు లభించాయి. నేను ఒక సప్తాహం, మా సిస్టర్ రెండు సప్తాహాలు పారాయణ పూర్తి చేసాం. మా జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు వచ్చాయి. మా సిస్టర్ కి స్వప్నంలో సాయి తన మెహంది ఫంక్షన్ లో ఉన్నట్లుగా దర్శనం ఇచ్చి, తన పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని అభయం ఇచ్చారు. తరువాత కొన్ని మంచి సంబంధాలు వచ్చినా ఏదీ ముందుకి పోవడంలేదు. ఇలా కొన్ని నెలలు గడచిపోయాయి. మా సిస్టర్, 'సాయి question & answer వెబ్సైటు' లో చూడగా, 'తన పెళ్లి శ్రీరామనవమి సమయానికి కుదురుతుంది' అని వచ్చింది.

ఆరోజు రానే వచ్చింది. ఒక మంచి కుటుంబం వాళ్ళు మా సిస్టర్ ని చూడడానికి వచ్చారు. అబ్బాయి కూడా చాలా మంచిగా అనిపించాడు. వాళ్ళు మాతో సంబంధానికి అంగీకరించారు కూడా. సాయి ముందుగా చెప్పినట్టే నిశ్చితార్ధానికి సంబంధించిన చర్చ రామనవమి రోజున జరిగింది. మా సిస్టర్  పెళ్లి సాయి దగ్గరుండి చూసుకుంటారని మాకు సాయిపై 100% నమ్మకం ఉంది. మా సిస్టర్ పెళ్లిని మే25వ తేదీ నాటికి నిశ్చయమయ్యేలా చూడమని సాయిని ప్రార్ధించాను. ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు. అందువలన ఆ సంతోష వార్త సాయి నాకు ఇచ్చే పుట్టినరోజు కానుకగా భావించాను. సాయి నా ప్రార్థనని మన్నించి మా సిస్టర్ పెళ్లి తేదీని నా పుట్టినరోజునాడు నిశ్చయం చేసారు. మా బ్రదర్, సిస్టర్ ఇద్దరి పెళ్లిళ్ళు జూన్15వ తేదీనాడు జరిగేలా నిశ్చయించారు. మా సిస్టర్ మాత్రం పెళ్లికి చాలా తక్కువ సమయం ఉన్నందున హ్యాపీగా ఫీల్ కాలేకపోయింది. పెళ్లికి కేవలం మూడు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ఆ అబ్బాయిని అర్ధం చేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంది. పైగా పెళ్ళికి కావాల్సిన షాపింగ్ ఏమీ చేసుకోలేదు. పెళ్ళికి ముందు వాళ్ళిద్దరూ రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారు. ఒక్కసారి కూడా బయటకి పోలేదు, అంతా హడావిడిగా సాగింది. తను పెళ్లికి ముందు దిగులుగానే ఉండేది.

ఆ సమయంలోనే తన ఉద్యోగంలో కూడా ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యాయి. తనని ఉద్యోగానికి రాజీనామా చేయమని వార్నింగ్ మెయిల్ కూడా పంపారు. పరిస్థితులు చాలా దారుణంగా అనిపిస్తున్నా బాబా స్వప్న దర్శనాలు, స్వప్నంలో బాబా చెప్పిన పలుకులు ఎప్పుడూ అసత్యం కావు కనుక బాబా ఏమి చేస్తారా అని నేను సాయిపై నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఆ క్రమంలోనే సాయి మాకు విష్ణు సహస్ర నామాలు చదవమని సూచించారు. నేను ప్రతి రోజు శ్రీనివాసుని టెంపుల్ కి, సాయి మందిరానికి వెళ్ళి మా సిస్టర్ జీవితం సంతోషంగా సాగాలని వేడుకునేదాన్ని. చివరికి మా సిస్టర్ పెళ్లి జూన్15వ తేదీ నాడు చాలా వైభవంగా, సంతోషకరంగా జరిగింది. కానీ నాకు మాత్రం తన వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అని చాలా దిగులుగా ఉండేది. కాని సాయి ఎప్పుడూ మమ్మల్ని విడిచి పెట్టలేదు. మా సిస్టర్ పెళ్ళైనరోజే తన భర్త ఇంటికి వెళ్ళిపోయింది. రెండు రోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసి తన భర్త తనని చాలా బాగా చుసుకుంటున్నారని, అతను చాలా మంచి వాడని, అత్తమామలు కూడా చాలా మంచివారు అని, తనని అందరూ రాణిలా చుసుకుంటున్నారని చాలా సంతోషంగా మాట్లాడింది. ఈ మాటలు తన నుండి వినాలని నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము. సాయి నా కోరిక నెరవేర్చి, మా కుటుంబంలో సంతోషాన్ని మరల తీసుకొచ్చారు. సాయి లేని మా జీవితాల్ని అసలు ఉహించుకోలేము. సాయి సదా మాతోనే ఉండాలని ఎప్పటికీ ప్రార్థిస్తాను.

ఓం సాయిరాం.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo