1. సాయి చరణం – భవభయ హరణం
2. నమ్ముకున్న సాయి అన్యాయం చేయలేదు3. టెన్షన్ తీర్చిన బాబా
సాయి చరణం – భవభయ హరణం
ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా, శ్రీసాయినాథుని దివ్యపాదాలను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా పేరు సంధ్య. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
మొదటి అనుభవం: ఇటీవల మావారు, నేను, మా అబ్బాయి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నాము. వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్ళేముందు బాబాకు నమస్కరించుకుని, “సాయితండ్రీ! కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరంగానీ, ఒళ్ళునొప్పులుగానీ, ఏ బాధా రాకుండా చూసుకునే బాధ్యత మీదే తండ్రీ!” అని ప్రార్థించి వ్యాక్సిన్ సెంటరుకి వెళ్ళాము. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కూడా “మాకు తోడుగా ఉండి వ్యాక్సిన్ వేయించి, మాకు ఏ బాధా రాకుండా రక్షించు తండ్రీ! మీరు మాపై చూపిన అపార ప్రేమని, కరుణని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక అందరం బాబా ఊదీని, ఊదీతీర్థాన్ని తీసుకున్నాము. సాయినాథుని దయవల్ల మాకు ఎలాంటి జ్వరంగానీ, ఒళ్ళునొప్పులుగానీ లేవు. అంతా బాబా దయ. “అనుభవాన్ని పంచుకోవటం కాస్త ఆలస్యం అయింది, నన్ను క్షమించండి బాబా. లవ్ యు బాబా”.
రెండవ అనుభవం: మావారు, మా బావగారు కలిసి ఒకేచోట, ఒకే స్థలంలో ప్రక్కప్రక్కనే ఇళ్ళు కట్టుకున్నారు. చాలా రోజుల నుండి అన్నాతమ్ముళ్లిద్దరి మధ్య మాటలు లేవు. ఇద్దరి ఇళ్ళకు వాటర్ పైప్ కనెక్షన్ మరియు డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ఒకటే అయినందువలన కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటర్ లీక్ అవటం, డ్రైనేజీ సమస్య మొదలైంది. ఆ విషయాన్ని మేము వేరొకరి ద్వారా మా బావగారికి తెలియజేశాము. కానీ, మా బావగారు పట్టించుకోలేదు. మళ్ళీ అడుగుదామంటే ఆయన ఎక్కడ గొడవకు దిగుతారో అని భయమేసి ఆ సమస్యను బాబాకు చెప్పుకుని, “బాబా, మీ దయవలన ఎలాంటి గొడవలు లేకుండా వాటర్ లీకేజీ ప్రాబ్లమ్, డ్రైనేజీ ప్రాబ్లమ్ తీరిపోతే మీరు చూపిన ప్రేమని (నా అనుభవాన్ని) 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబా కరుణించారు. అన్నాతమ్ముళ్ళ మధ్యలో మాటలు లేనందున వేరొక వ్యక్తి (వరుసకు బావ అవుతారు) ద్వారా ప్లంబరుని మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా బాబా దారి చూపారు. ప్లంబింగ్ వర్క్‌కు అయిన ఖర్చును అన్నాతమ్ముళ్ళు ఇద్దరూ భరించారు. నిజానికి ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. బాబాకు సమస్యను విన్నవించుకోగానే సమస్య పరిష్కారమైంది. ఇది కేవలం బాబా కృప. ఏమి చేయాలో తోచని స్థితిలో బాబాను ప్రార్థించాను. ‘సమస్య పరిష్కారమైతే మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాను ప్రార్థించాను. బాబాకు మాటిచ్చిన ప్రకారం నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకున్నాను. “ధన్యవాదాలు సాయితండ్రీ!”. సద్గురు చరణం – భవభయ హరణం
మూడవ అనుభవం: ఒకసారి మేము ఒక ఇంటిస్థలాన్ని కొనాలని అనుకున్నాము. ఒక వెంచర్‌లో ఒక ప్లాట్ మాకు చాలా నచ్చడంతో దానిని కొందామని నిర్ణయించుకున్నాము. అయితే, ఆ ప్లాట్‌ను కొనాలనుకునే సమయంలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. మేము, ‘ఆ ప్లాట్ కొనాలా, వద్దా’ అని బాబాను చీటీల ద్వారా అడిగాము. బాబా ‘వద్దు’ అని సమాధానమిచ్చారు. అయితే, ఆ స్థలం బాగా నచ్చినందువలన మావారు అప్పటికే ఆ స్థలాన్ని కొంటానని దళారీలకు మాట ఇచ్చారు. ఇప్పుడు బాబా ‘ఆ స్థలాన్ని కొనవద్దు’ అని చెప్పేసరికి ‘బాబా ఎందుకు వద్దంటున్నారా’ అని అనుకున్నాను. మావారు మాత్రం ‘స్థలం చాలా బాగుంది, నేనా స్థలాన్ని కొంటాను’ అని పట్టుబట్టారు. ‘బాబా వద్దన్నారంటే ఆ స్థలం సరైనది కాదేమో’నని నాకు భయమేసి మావారితో, “ఆ స్థలం మనకు వద్దు” అని చెప్పాను. కానీ మావారు మాత్రం ఎంతగా చెప్పినప్పటికీ బాబా సూచనను పట్టించుకోకుండా ఆ స్థలాన్ని కొంటానని పట్టుబట్టారు. దాంతో నాకు భయమేసి, “బాబా, సాయితండ్రీ, మావారితో నేను వాదించలేను. మావారి మనస్సు మార్చి తను ఆ స్థలం కొనకుండా చూసే బాధ్యత మీదే తండ్రీ” అని బాబాను ఆర్తిగా ప్రార్థించి, ఇక ఆ సమస్యను బాబాకు వదిలేసి నిద్రపోయాను. ఉదయాన్నే మావారు నాతో, “బాబా వద్దన్నారు అంటే ఏదో సమస్య ఉండే ఉంటుంది. మనకు ఆ స్థలం వద్దులే” అన్నారు. మావారి మాటలు వినగానే, తన మనసు మార్చి సరైన నిర్ణయం తీసుకునేలా (అంటే, బాబా మాట వినేలా) చేసినందుకు ఎంతో ఆనందంతో మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
అయితే, ఆ వెంచర్ మాకు నచ్చినందువలన బాబా అదే వెంచర్‌లో మరో స్థలాన్ని దళారీల ద్వారా మాకు చూపించారు. ‘ఆ స్థలం కొనాలా, వద్దా’ అని మళ్ళీ బాబాను చీటీల ద్వారా అడిగాము. ఈసారి ఆ స్థలాన్ని కొనమని బాబా సమాధానం వచ్చింది. ముందు చూసిన ప్లాట్ కంటే ఈ ప్లాట్ చాలా బాగుంది. ఈ విధంగా బాబా మాకు నచ్చిన వెంచర్‌లో మరో స్థలాన్ని చూపించి దానిని కొనేలా చేశారు. నాలుగు రోజుల తరువాత మాకు తెలిసింది, ముందు కొనాలనుకున్న ప్లాట్‌కి సంబంధించిన పత్రాలు సరిగా లేవని. చూశారా, బాబా తమ భక్తులను (బిడ్డలను) ఎన్నటికీ మోసపోనివ్వరు. “ధన్యవాదాలు సాయితండ్రీ! మీ పాదాలే శరణం”. మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుంటాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నమ్ముకున్న సాయి అన్యాయం చేయలేదు
సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నేనొక చిన్న సాయిభక్తురాలిని. 2021, జూలై 8న ఉన్నట్టుండి మావారికి నడుము పట్టేసింది. అస్సలు మంచం మీద నుండి కదలలేకపోయారు. మధ్యాహ్నం ఆర్.ఎం.పి డాక్టరు చేత ఒక ఇంజెక్షన్ ఇప్పించాము. కానీ అది ఏ మాత్రం పనిచేయలేదు. ఏం చేయాలో తోచలేదు. సాయంత్రం నేను, మా అబ్బాయి కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మావారికి వీడియో కాల్ చేసి సమస్యను డాక్టరుగారికి వివరించాము. ఆయన, "అది కండరాల నొప్పి. అది వారంరోజుల వరకు ఉండొచ్చు" అని అన్నారు. అది విని నాకు చాలా భయం వేసింది. తరువాత డాక్టరు కొన్ని మందులిచ్చి, "మంచం మీద నుండి అస్సలు కదలవద్దు" అని చెప్పారు. నేను సాయిని నమ్ముకుని, "ఈరోజు రాత్రి మా వారికి కొంచెమైనా నొప్పి తగ్గి, తన పని తాను చేసుకోగలిగితే గనక ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. నమ్ముకున్న సాయి నాకు అన్యాయం చేయలేదు. మందులు వేసుకున్నప్పటినుండి కొద్దిగా నొప్పి తగ్గి, మావారు కొంచెం లేవడం మొదలుపెట్టారు. నేను కోరుకున్నట్లే మరుసటిరోజు మావారు నిద్రలేచాక తన పనులు తానే చేసుకున్నారు. కానీ నొప్పి కొద్దిగా ఉంది. అది కాస్తా తొందరలోనే పూర్తిగా తగ్గిపోవాలని సాయిని ప్రార్థిస్తున్నాను. మన సాయి ఎవరికి ఏ కష్టమొచ్చినా దయతో కరుణిస్తారు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼❤
ReplyDelete