సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 854వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రార్థన సరైనదై ఉండాలని తెలియజేసిన బాబా
2. సయాటికా సమస్య నుండి రక్షణనిచ్చిన బాబా
3. బాబా అనుకుంటే అనుగ్రహిస్తారు!

ప్రార్థన సరైనదై ఉండాలని తెలియజేసిన బాబా


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః.


ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. బాబా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, ప్రేమను, శ్రేయస్సును అనుగ్రహించుగాక! నా పేరు సాహిత్య. గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నాకున్న ఏకైక కోరిక – ‘క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాకు ఉద్యోగం రావాలి’ అని. అది నాకున్న పెద్ద కల. దానికోసం నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ, బాబా మందిరంలో 108 ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాను. కొన్నిరోజులకు మా కాలేజీలో చాలామందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ నాకు మాత్రం రాలేదు. అప్పుడు నేను అత్యుత్సాహంతో, "బాబా! దయచేసి నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి. కనీసం నా పేరు కరపత్రాలలో వచ్చేందుకు, నా బంధువులకు చూపించుకోవడం కోసమైనా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించండి. నేను ఆ ఉద్యోగంలో చేరాల్సిన అవసరంగానీ లేదా కొనసాగాల్సిన అవసరంగానీ లేదు. కానీ నా బంధువుల నుండి ప్రశంసలు అందుకునేందుకు నాకు ఉద్యోగం ఇవ్వండి" అని బాబాను తప్పుగా ప్రార్థించాను. ఎంత అజ్ఞానమైన ప్రార్థన! అసలు నేను కోరుకున్నది బాబా అనుగ్రహిస్తారో లేదో కూడా నాకు ఆ సమయంలో తెలియదు. కానీ ప్రేమమూర్తి అయిన బాబా కృపవలన నాకు ఉద్యోగం వచ్చింది. నేను కోరుకున్నట్లు మా బంధువులు నన్ను మెచ్చుకున్నారు, నా ఫోటో, జాబ్ పేరుతో సహా పేపర్లో వచ్చాయి. అయితే 11 నెలల తర్వాత ఆ ఉద్యోగం పోయింది. మొదట్లో ఉద్యోగం ఎందుకు పోయిందో గ్రహించలేక నేను బాబాను తిట్టుకున్నాను. "అందుకు నన్ను క్షమించండి బాబా".


తరువాత నేను సాయిచరిత్ర తెరచినప్పుడు, 'ఒక అంధుడు ‘నాకు దృష్టిని ప్రసాదించి, మిమ్మల్ని దర్శించే భాగ్యాన్నివ్వండి’ అని బాబాను అర్థిస్తే, బాబా అతనికి దృష్టిని ప్రసాదించారు. అతను తృప్తిగా బాబాను దర్శించుకున్నాక తిరిగి తన దృష్టిని కోల్పోయాడు. ఎందుకంటే, అతను తనకు చూపును ప్రసాదించమని కాక బాబాను దర్శించడానికే దృష్టిని ప్రసాదించమని కోరుకున్నాడు' అనే కథనం వచ్చింది. అది చదివాక నేను నా ఉద్యోగం విషయంలో బాబాను సరైన విధంగా ప్రార్థించలేదని గ్రహించాను. కానీ నేను ఏదైతే కోరుకున్నానో దానిని బాబా నాకు అనుగ్రహించారు.


మరో అనుభవం:


నాకు వివాహమైన తరువాత ఒకరోజు నేను నా నిశ్చితార్థ ఉంగరాన్ని పోగొట్టుకున్నాను. అది నాకు ఎంతో ముఖ్యమైనది. అంతేకాదు, నా కుటుంబసభ్యులకు అది సెంటిమెంటుతో కూడుకున్నది. అందువలన నేను ఆ విషయం ఎవరితోనూ చెప్పకుండా నేనే వెతకసాగాను. కొన్ని గంటలపాటు వెతికాక బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. బాబాను ప్రార్థించిన పది నిమిషాల తర్వాత హఠాత్తుగా ఆ ఉంగరం నా మంచం మీద దొరికింది. ‘ఈ ఉంగరాన్ని ఇక్కడ ఎవరు పెట్టార’ని అందరినీ అడిగాను. తామెవ్వరం ఆ ఉంగరాన్ని అక్కడ పెట్టలేదని అందరూ చెప్పారు. అప్పుడు నాకది ఎంతో ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించింది. ఆ అనుభవంతో బాబా ఎల్లప్పుడూ నాతో ఉన్నారని నమ్మాను. నా జీవితంలో నాకు చాలా అనుభవాలున్నాయి. బాబా ఆశీస్సులతో వాటిని ఈ బ్లాగులో తరువాత పంచుకుంటాను.


ఓం శ్రీ సాయినాథాయ నమః

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః.


సయాటికా సమస్య నుండి రక్షణనిచ్చిన బాబా


శ్రీసాయి పాదపద్మములకు నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. "బాబా! నా అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి". నా పేరు అర్చన. 2018వ సంవత్సరం ఆగస్టు నెలలో నాకు సయాటికా సమస్య వచ్చి డాక్టరుని సంప్రదిస్తే, "సర్జరీ చేయాలి" అని చెప్పారు. అది విని మేమంతా చాలా బాధపడ్డాము. నేను బాబాను, "నాకు ఆపరేషన్ లేకుండా చేయమ"ని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన ఆలకించారు. రెండవ అభిప్రాయం కోసం మేము మరో డాక్టరుని సంప్రదించాము. ఆయన ఆపరేషన్ వద్దని చెప్పి, కొన్ని మందులిచ్చి వాడమని చెప్పారు. బాబా దయవల్ల పదిరోజుల్లో నాకు అంతా నార్మల్ అయిపోయింది. అయితే 2021, మే 1న తేదీ సాయంత్రం మళ్ళీ అదే సమస్య వచ్చింది. దాంతో నేను చాలా బాధపడ్డాను. మా పాప బాబాకు నమస్కరించి, "మా అమ్మకు తగ్గిపోవాల"ని చెప్పుకుని నా నుదుటన ఊదీపెట్టి, కొద్దిగా ఊదీని నా నోట్లో వేసింది. నాకు బాబా మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఆయన మీద భారం వేసి కొన్ని మందులు వేసుకున్నాను. నాలుగురోజుల్లో నా సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా దయ. "బాబా! ఇలాగే మీ కృప మా మీద ఎప్పుడూ ఉండాలి. నాకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా చూడు స్వామీ. నేను అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడండి. ఇంకా భర్త చనిపోయిన నన్ను, నా బిడ్డని మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న నేను ఇష్టపడే వ్యక్తితో నాకు వివాహం జరిపించండి బాబా. అతన్ని తప్ప ఇంకెవర్నీ నేను వివాహం చేసుకోలేను. దయచేసి నా ఈ కోరికను తీర్చండి బాబా. మీ అనుగ్రహంతో అది జరిగితే ఆ అనుభవాన్ని కూడా ఇక్కడ పంచుకుంటాను బాబా".


బాబా అనుకుంటే అనుగ్రహిస్తారు!


ఓం శ్రీ సాయినాథాయ నమః


నా పేరు అపర్ణ. నేను సాయిభక్తురాలిని. మనం 'బాబా' అని పిలిచి, ఏడ్చి, గోల చేస్తాము. అది ఎలా ఉంటుందీ అంటే, ఒక బిడ్డ తన తల్లి దగ్గర మారాం, గారం చేసినట్టు. బాబా చూపే ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఈ బ్లాగులో బాబా లీలలు చదువుతూ ఉంటాను. నాకు కూడా బాబా ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. వాటిని బ్లాగులో పంచుకోవాలని అనుకోలేదు. కానీ ఈమధ్య జరిగిన ఈ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనిపించింది. 2021, జూన్ 22వ తేదీ రాత్రి 10 గంటలకు నేను నిద్రపోదామని మంచం మీద కూర్చుంటున్నాను. హఠాత్తుగా కుడివైపు నడుము దగ్గర నొప్పి ప్రారంభమైంది. భుజం వెనుక మరియు కుడివైపు మెడ వరకు లాగేస్తోంది. కండరాలు పట్టేశాయేమోనని వోలినీ పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశాను. నొప్పి తగ్గలేదు సరికదా, ఇంకా ఎక్కువ అయింది. ఎందుకో నొప్పి ఎక్కువయ్యేకొద్దీ భయం వేసింది. టైం చూస్తే గం.10.15ని. 'ఈ సమయంలో ఏ హాస్పిటల్‌కి పరిగెత్తాలి? అసలే కోవిడ్ వలన హాస్పిటల్స్ అంటేనే భయం వేస్తోంది' అనుకుని, బాబాను తలచుకుంటూ ఊదీ తీసుకుని నోట్లో వేసుకున్నాను. అయినా నొప్పి తగ్గలేదు. నొప్పి విపరీతంగా ఉంది. మళ్ళీ కొంచెం ఊదీ తీసుకుని నా భుజానికి, నడుముకి రాసుకుంటూ, "బాబా! ఈ నొప్పి హాస్పిటల్‌కి వెళ్లకుండా తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకుని శ్రీపాదులవారి సిద్ధమంగళ స్తోత్రం చదివాను. 10 నిమిషాలలో నొప్పి తగ్గి అంతా నార్మల్ అయ్యింది. హాస్పిటల్‌కి వెళ్లకుండా ప్రశాంతంగా నిద్రపోయాను. నొప్పికి కారణం ఏమైనా కానివ్వండి, బాబా కన్నా గొప్ప వైద్యుడు ఎవరూ ఉండరు. ఒకవేళ నేను నా కర్మానుసారం ఆరోజు రాత్రి హాస్పిటల్‌కి వెళ్లేది ఉంటే, ఆ నొప్పి కంటిన్యూ అయ్యి, బాబా ఊదీకి పని చెప్పకుండా నన్ను హాస్పిటల్‌కి పంపేవారు. ఒకవేళ కష్టం తప్పదు అనుకున్నప్పుడు కూడా ఆయన మన ప్రక్కనే ఉండి మనల్ని నడిపిస్తారు. మనకు బాబాపై నిజమైన ప్రేమ, విశ్వాసం ఉంటే మనం దేనికీ భయపడకూడదు. ముళ్ళకంచె మీద చీర చిక్కుకున్నప్పుడు దానిని బయటికి తీయడానికి మనం ప్రయత్నిస్తే మన చేతిలో అది చిరగవచ్చు. కానీ బాబా చేతికి ఆ పని అప్పజెపితే చక్కగా జాగ్రత్తగా తీసి ఇస్తారు. "బాబా! ఏమైనా తప్పులు వ్రాసి ఉంటే క్షమించండి".


10 comments:

  1. Om sai ram baba after long time i am writing here.baba bless us. After seeing my mom i felt very pain. She is bedridden. Suffering very much.be with her. Reduce her suffering.this is my request. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om sai sri sai jaya jaya sai..

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤😊🕉🙏🌼

    ReplyDelete
  4. Om Sri Sainathaya Namaha!!! Om Sai Sri Sai Jaya Jaya Sai

    ReplyDelete
  5. 🌺🌺🙏🙏🙏Om Sri Sai Ram🙏🙏🌺🌺

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri nenne namukuna thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo