సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 868వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా పాదముద్రలు
2. మనస్సులో ఒక్క క్షణం మెదిలిన కోరికను తీర్చిన బాబా
3. మూడు సంవత్సరాల కాలునొప్పిని తగ్గించిన బాబా

బాబా పాదముద్రలు


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. మీరంతా ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో మీ మీ అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటూ ఇంకెందరో భక్తులకు స్ఫూర్తి కలిగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ బ్లాగును ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తూ, భక్తుల అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చి, మాలో భక్తిని వికసించేలా చేస్తూ, 'online సత్సంగం' జరిపిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధునికతకు అలవాటుపడిపోయి గ్రంథపఠనానికి దూరమైన జనావళికి ఈ కాలంలో ఇలాంటి బ్లాగ్ ఎంతో ఉపయోగకరంగానూ, ఆదర్శవంతంగానూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, మరో 'సాయిలీల పత్రిక'లా ఉంది.


నా పేరు సాయి గీత. మాది గజపతినగరం. సాయి పాదాలను ఆరాధించే భక్తకోటిలో నేనూ ఒకదాన్ని. మా అత్తవారింట్లో, పుట్టింట్లో కూడా ఇంచుమించు అందరికీ బాబాపట్ల ఎంతో భక్తి, విశ్వాసాలు. ఎందుకంటే, బాబా ఎన్నో రకాల సమస్యల నుంచి ఎన్నోసార్లు మా అందరినీ రక్షించారు. అలాగే ఎన్నో అనుభవాలు కూడా ప్రసాదించారు. మా అమ్మగారి పేరు లక్ష్మి. ఇటీవల ఆమెకు కలిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని బాబా ఆజ్ఞ. 2021, జూలై 1న గురువారమైనందున అమ్మ 108 ఒకే రకం పూలతో బాబాకు అష్టోత్తర పూజ చేసింది. మరుసటిరోజు జూలై 2 ఉదయం ఆమె రోజూలాగే పూజచేసుకోడానికి పూజగదిలోకి వెళ్ళింది. పూజ గట్టు శుభ్రం చేస్తుండగా అమ్మ దృష్టి ఒక 'ఆకృతి'పై పడింది. అమ్మ రోజూ ఒక ప్రమిదలో ధూప్ స్టిక్ వెలిగిస్తుంది. మామూలుగా అది కాలిన తర్వాత బూడిద అదే పాత్రలో పడుతుంది. కానీ ఆరోజు బూడిద ఆ పాత్రలోంచి బయట పడివుంది. అది కూడా రెండు చిన్న పాదాల ఆకృతిలో (ఎవరో వేలితో దిద్దినట్టు) ఉండడం విశేషం. అది ఎలా సంభవించిందో అమ్మకి అర్థం కాలేదు. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అదే తనకి బాబా ప్రసాదించిన మొదటి అనుభవం కావడం వల్ల ఆమె ఇంకా ఆ షాక్‌లోనే ఉంది. ఇకపోతే అప్పటిదాకా పూజగదిలోకి ఎవరూ వెళ్లనందువల్ల, 'బాబా స్వయంగా వచ్చారా?!' అని అమ్మకి అనుమానం వచ్చింది. వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను అది చూడటానికి ఆరోజు సాయంత్రం ఎంతో ఆత్రంగా వెళ్లి, వాటిని చూసి ఎంతో ఆనందాశ్చర్యాలకి లోనయ్యాను. నాకు సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయి. అయితే నాకున్న అలవాటు ప్రకారం, ఎందుకైనా మంచిదని ఈ విషయం బాబానే అడిగి తెలుసుకుందామని, చీటీలు వేశాను. (‘ఇది నా లీలే’ అని ఒకటి, ‘ఇది మీ భ్రమ’ అని మరొకటి). 'ఇది నా లీలే!' అని సమాధానం వచ్చింది. ఇంక నా ఆనందానికి అవధుల్లేవు. వెంటనే వాటిని ఫోటో తీశాను. బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా అమ్మమ్మ మా అమ్మ దగ్గరే ఉంటుంది. తనకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఏదో పెద్ద వ్యాధి లక్షణాలు ఉన్నాయి. వయసు కూడా ఎక్కువ కావడం వల్ల తనకు ఇది ఆఖరి సమయమని తను భావిస్తోంది. అలా ఆవిడ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటే నేను తనకు బాబా ఊదీ ఇచ్చి, నిత్యం సాయి నామస్మరణ చెయ్యమని చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆవిడ నిరంతరం నామస్మరణ చేస్తోంది. అమ్మ కూడా సాయిసచ్చరిత్ర చదివి అమ్మమ్మకి వినిపిస్తోంది. "పిలిస్తే పలుకుతాను" అన్న బాబా మాట గుర్తుకొచ్చి అమ్మమ్మ బాధను తీర్చడానికే, తన భయాన్ని పోగొట్టి, ధైర్యాన్నివ్వడానికే బాబా ఇలా అనుగ్రహించారని నాకు, అమ్మకి అనిపించింది. ఏది ఏమైనా బాబా వచ్చారన్నది నిజం. ఏం చెయ్యాలో అది ఆయనే చేస్తారు. భారం ఆయన మీదనే వేశాము. అయితే, అమ్మమ్మ పరిస్థితి బాగోక బాధపడుతున్న మాకు ఈ లీల ద్వారా కొంత ఉపశమనం కలిగింది. ఈ అనుభవాన్ని బలపరిచే ఫోటోను ఇక్కడ జతపరుస్తున్నాను. 

చివరిగా ఒక్కమాట. 'శారీరక, మానసిక బాధలనేవి మన కర్మల యొక్క ఫలాలు. వాటిని ఎవరైనా అనుభవించక తప్పదు. కానీ బాబాకు శరణాగతి చెందితే, ఆయన మనకు తోడుగా ఉంటూ బాధలను తట్టుకునే శక్తినిచ్చి, మునుముందు మనం ఎటువంటి దుష్కర్మలు చెయ్యకుండా కాపాడి, సరైన మార్గంలో నడిపిస్తారని నా నమ్మకం. మరొక్కసారి బాబాకు, బ్లాగు నిర్వహకులకు, ఓపికగా చదివిన తోటి భక్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.


మనస్సులో ఒక్క క్షణం మెదిలిన కోరికను తీర్చిన బాబా


ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు శిరీష. మేము నెల్లూరులో ఉంటాము. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోమని బాబా నన్ను ప్రేరేపించారు. కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నాకు శ్రీశైలం వెళ్ళే అవకాశాన్ని బాబా కల్పించారు. నేను గత కొన్ని నెలలుగా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక అధ్యాయం చొప్పున వరుసక్రమంలో శ్రీగురుచరిత్ర చదువుతున్నాను. 2021, జూన్ 28, సోమవారంనాడు నేను చదువుతున్న అధ్యాయంలో తంతకుడు అనే సాలెవానికి శ్రీగురుడు శ్రీశైల మహత్యం గురించి చెప్పి అతనికి శ్రీశైల దర్శనం చేయించిన లీల ఉన్నది. అక్కడ శ్రీమల్లికార్జునస్వామి దేవాలయంలోని శివలింగం స్థానంలో తంతకునికి శ్రీగురుని దర్శనం కలుగుతుంది. అది చదివాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘నాకు కూడా శ్రీశైలంలోని శివలింగంలో బాబా దర్శనమిస్తే బాగుండు’ అనుకుని, అంతలోనే ‘నాది అత్యాశ’ అనిపించి నవ్వుకున్నాను. మరుసటిరోజే నేను శ్రీశైలం వెళ్ళవలసి ఉండటంతో నా ప్రయాణానికి ఈ విధంగా బాబా ఆశీస్సులు ఇస్తున్నారు అనుకున్నాను. మంగళవారం ఇంటినుండి బయలుదేరి శ్రీశైలం చేరుకుని, బుధవారం ఉదయాన్నే మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్ళాము. కరోనా వల్ల ఆలయంలో అసలు రద్దీ లేదు. స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శన సమయంలో, గంధం మరియు కుంకుమ కలిపి శివలింగానికి పెట్టిన బొట్టు నాకు బాబా రూపంలా కనిపించింది. నిజానికి, సోమవారంనాడు శ్రీగురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు నా మదిలో మెదిలిన కోరిక సంగతి నేను మర్చిపోయాను. కానీ బాబా మాత్రం మర్చిపోలేదు. శివలింగానికి పెట్టిన బొట్టులో బాబాను చూడగానే నా కోరిక సంగతి గుర్తుకువచ్చి చాలా ఆనందంగా అనిపించింది. బాబా ప్రేమకు కళ్ళు చెమర్చాయి. ‘ఒక్కక్షణం మనస్సులో మెదిలిన కోరికను బాబా ఇలా తీర్చారా!’ అనిపించి ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పటినుండి ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటూనే, మళ్ళీ సిల్లీగా ఉంటుందేమోనని వెనుకాడాను. అయితే, జులై 9వ తేదీన ఈ బ్లాగులో ప్రచురించిన సాయిభక్తుల అనుభవాలలో ఒక భక్తురాలు ‘బాబాకు పెట్టిన బొట్టులో బాబా ముఖాన్ని స్పష్టంగా చూశాను’ అని పంచుకోవటం చదివాను. అది చదవగానే, ‘బాబా నన్ను కూడా నా అనుభవాన్ని పంచుకోమని చెప్తున్నారు’ అనిపించి వెంటనే మీతో పంచుకుంటున్నాను.


మూడు సంవత్సరాల కాలునొప్పిని తగ్గించిన బాబా


ముందుగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ స్వరూపం అయిన సమర్థ సద్గురు సాయినాథ మహరాజుకి మనస్ఫూర్తిగా శతసహస్రకోటి వందనాలు. సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు వేణి. మాది కొత్తపాలెం. ప్రతిరోజూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను మూడు సంవత్సరాలపాటు ఎడమకాలు నొప్పితో కనీసం నడవలేక ఎంతో బాధపడ్డాను. దానివలన ఇంటి పనులు చేసుకోలేక, కనీసం మావారికి, మా పిల్లలిద్దరికి వంటైనా చేసి పెట్టలేక మానసికంగా కుమిలిపోయేదాన్ని. చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మందులు వాడాను. కానీ నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నన్ను కాపాడండి. ఈ నొప్పినుండి నాకు ఉపశమనం కలిగించండి. మీ అనుగ్రహంతో నేను సురక్షితంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. సకల దేవతా స్వరూపం, పిలిచిన పలికే నా సాయి నా ప్రార్థన ఆలకించారు. ఒకరోజు నా భర్త పనిమీద విజయవాడ వెళ్లి, పని పూర్తయిన తరువాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నల్లకుంట శ్రీ శిరిడీ సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి, అక్కడ పూజారికి నా పరిస్థితి గురించి చెప్పారు. ఆ పూజారి మా పేరు మీద అర్చన చేసి 'సాయిరక్ష' ఇచ్చి నాకు కట్టమని చెప్పారు. మావారు ఇంటికొచ్చి ఆ సాయిరక్షను నాకు కట్టారు. అప్పటినుంచి నాకు ఎటువంటి కాలునొప్పిలేక నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అయిన సాయే నన్ను కాపాడారు. పూర్తిగా కోలుకున్న తర్వాత సాయిబాబాకి మనసారా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అయితే కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆ సాయిరక్ష ఊడిపోయింది. మళ్ళీ కాలునొప్పి వచ్చింది. దాంతో నేను మళ్ళీ, "బాబా! నాకు కాలునొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఈసారి ఎటువంటి రక్ష కట్టకుండానే వెంటనే నా కాలునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "బాబా! మీకు మనస్ఫూర్తిగా శతసహస్రకోటి వందనాలు తెలుపుకుంటున్నాను".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  3. Baba ee gadda ni tondarga karginchu thandri sainatha

    ReplyDelete
  4. Baba naku bayanga vundhi thandri naku tagginchu thandri

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼❤

    ReplyDelete
  6. How to write in this blog, can anyone please tell me procedure

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo