సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 853వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరోనా కబంధహస్తాల నుండి కుటుంబాన్ని కాపాడిన బాబా
2. తోడుగా ఉండి కాపాడిన బాబా

కరోనా కబంధహస్తాల నుండి కుటుంబాన్ని కాపాడిన బాబా


నా పేరు మానస. ముందుగా, సాటి సాయిబంధువులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. అందులోనుండి కొన్నిటిని ఇప్పుడు పంచుకుంటాను.


మొదటి అనుభవం:


ఒకసారి మావారి ల్యాప్‌టాప్ హఠాత్తుగా పనిచేయడం మానేసింది. చాలా ముఖ్యమైన పని నడుస్తుండగా అలా జరిగేసరికి మావారు చాలా టెన్షన్ పడ్డారు. అప్పుడు నేను, "బాబా! ల్యాప్‌టాప్ తొందరగా పనిచేయడం మొదలుపెడితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, కొద్దిగా బాబా ఊదీ తీసుకుని ల్యాప్‌టాప్‌కి పెట్టాను. అద్భుతం! వెంటనే ల్యాప్‌టాప్ పని చేయసాగింది. గంటసేపటినుండి పనిచేయని ల్యాప్‌టాప్ బాబాకు మ్రొక్కుకోగానే పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా బాబా మీద మాకున్న నమ్మకం వల్ల మరియు బాబా చల్లని చూపు వల్ల జరిగింది.


రెండవ అనుభవం:


మా చిన్న చెల్లి వయస్సు 18 ఏళ్ళు. తనకి 2020, డిసెంబరులో ఒకరోజు వాసన తెలియలేదు. దాంతో తనకి రాపిడ్ టెస్ట్ చేయిస్తే, నెగిటివ్ వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ చేయించాం. అందులో కూడా నెగిటివ్ వచ్చింది. కానీ తనకు వాసన తెలియడం లేదు. కొన్నిరోజులకు జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు కూడా మొదలయ్యాయి. కానీ ఎన్నిసార్లు కరోనా టెస్ట్ చేయించినా నెగిటివ్ వస్తుండేది. దాంతో మాకు చాలా భయం వేసింది. చిన్న చెల్లి అంటే నాకు ప్రాణం. అటువంటి తనకు ఏమవుతుందో తెలియక నేను మానసికంగా చాలా కృంగిపోయాను. చివరికి, "బాబా! సచ్చరిత్ర పారాయణ చేస్తాను. ఏడురోజుల్లో చెల్లి సమస్య ఏమిటో తెలియాలి. ఇంకా వాసన కూడా తిరిగి తనకు తెలిసి తన ఆరోగ్యం కుదుటపడాలి" అని బాబాతో చెప్పుకుని పారాయణ మొదలుపెట్టాను. తరువాత వేరే డాక్టరు దగ్గరికి చెల్లిని తీసుకెళ్తే, కోవిడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేయించి, "తనకు కోవిడ్ తీవ్రంగా వచ్చి వెళ్లిపోయిందనీ, అందుకే తనకు వాసన తెలియకుండా పోయింద"నీ చెప్పారు. తరువాత వీక్నెస్‌కి సంబంధించి అన్ని టెస్టులూ చేసి, "విటమిన్-డి, బి12 చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే నీరసం, ఒళ్లునొప్పులు వస్తున్నాయ"ని చెప్పారు. అది విన్నాక నాకు కాస్త ఉపశమనంగా అనిపించింది. అంతకుముందు అసలు సమస్య ఏమిటో తెలిసేదికాదు. దానికి తోడు కొందరు 'బ్రెయిన్‌లో ట్యూమర్స్ ఉన్నా వాసన తెలియదు' అంటుండేవారు. అందువల్ల మేము చాలా భయపడేవాళ్ళం. నేను, "బాబా! సమస్య ఏదైనా సరే, అది చిన్నదై ఉండాలి. ఇంకా చెల్లికి వాసన తెలియాలి" అని బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని. చెల్లి బాబాను ప్రార్థించి ఊదీని తన ముక్కుకి పెట్టుకునేది. చివరికి బాబా దయవల్ల సప్తాహపారాయణ ముగిశాక చెల్లికి 60% వాసన తిరిగి వచ్చింది. తన వీక్నెస్ కూడా తగ్గింది. అలా నా మానసిక వ్యధను బాబా తీర్చారు. అండగా బాబా ఉండగా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సాయితండ్రికి శతకోటి వందనాలు. అంతా మంచి జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నట్లు ఇలా మీ అందరితో పంచుకున్నాను. చెల్లికి పూర్తిగా వాసన తెలియాలని బాబాను వేడుకుంటున్నాను.


మూడవ అనుభవం:


నా పెద్ద చెల్లెలు ఒక డాక్టరు. తను పిజీ గైనకాలజీ స్టూడెంట్‌గా చాలా దూరాన వైజాగ్‌లో ఉంటుంది. మేము వరంగల్‌లో ఉంటున్నాము. తను అక్కడ కోవిడ్ విధులలో ఉంటుంది. తనకు వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ హఠాత్తుగా ఒకరోజు జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. దాంతో తను ఆర్‌టిపిసిఅర్ టెస్టుకి శాంపిల్స్ ఇచ్చి, 'రిపోర్టు ఏమి వచ్చిందో తెలుసుకుని తనకు చెప్పమ'ని తన ఫ్రెండుకి చెప్పింది. ఆమె ఆ రిపోర్టు తెలుసుకుని పాజిటివ్ అని మా చెల్లితో చెప్పింది. మా చెల్లి నాకు ఫోన్ చేసి, "అక్కా, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది" అని చెప్పింది. అది మే నెల. కరోనా ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఎంతోమంది ఆ మహమ్మారి బారినపడి చనిపోతున్నారు. అందువలన మాకు చాలా భయం వేసింది. నేను నా పెద్ద దిక్కైన బాబాను, "బాబా! చెల్లికి తొందరగా కరోనా నెగిటివ్ రావాలి. అలా వస్తే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నట్లు ఉన్నారు. గంట తరువాత చెల్లి ఫోన్ చేసి, "అక్కా, నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. నా కొలీగ్ మోనికారెడ్డికి పాజిటివ్ వచ్చింది. నా ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయి నాకు పాజిటివ్ వచ్చినట్లు చెప్పింది. మళ్లీ చెక్ చేస్తే నాకు నెగిటివ్ అని తెలిసింది. అయినా కోవిడ్ లక్షణాలు ఉన్నందున గృహనిర్బంధంలో ఉంటాన"ని చెప్పింది. దాంతో నా మనసు తేలికపడింది. బాబా అంత త్వరగా నా బాధను అర్థం చేసుకుంటారని, వెంటనే కరోనా నెగిటివ్ అన్న వార్త వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. బాబా మహిమలు అలాగే ఉంటాయి, ఆయన ప్రేమ, ప్రణాళికలు మన ఊహకి అందవు. ఏదేమైనా బాబా కరుణామయుడు.


నాలుగవ అనుభవం:


2021, మే 3వ వారంలో మా అత్తమ్మకి కరోనా పాజిటివ్ వచ్చింది. చాలా ఇన్ఫెక్షన్ అయిందని తెలిసి మేము ఆమెను హాస్పిటల్లో చేర్చాము. ఆమెకు ఏమవుతుందోనని నేను, మావారు, మా వదిన చాలా భయపడ్డాము. అప్పుడు నేను, "ఆమె పరిస్థితి ఎలా ఉంటుంద"ని బాబాను అడిగి 'సాయి మహరాజ్ సన్నిధి'లోని భక్తుల అనుభవాలు తీశాను. అక్కడ "భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది" అన్న సాయి సందేశం కనిపించింది. దాంతో అత్తమ్మకి ఏమీ కాదని నాకు నమ్మకం వచ్చింది. బాబా చెప్పినట్లే అత్తమ్మకి ఏమీ కాలేదు. తను కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు.


అంతలో మా నాన్నకి, తమ్ముడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో అమ్మ, నానమ్మ, చిన్న చెల్లెలు ఉన్నారు. పైగా చెల్లి కోవిడ్ నుండి బయటపడి చాలా నీరసంగా ఉంది. అందువల్ల నాకు చాలా భయమేసి, మానసికంగా చాలా కృంగిపోయాను. అయినా బాబాను గట్టిగా పట్టుకున్నాను. నాన్నకు పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టరైన మా పెద్ద చెల్లెలు వైజాగ్ నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వచ్చి, తనే దగ్గరుండి నాన్నని బాగా చూసుకుంది. అయితే ఐదవరోజు నుండి రోజూ సాయంత్రం నాన్నకు 102 డిగ్రీల జ్వరం వస్తుండేది. ఆయనకి ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉండేది. ఇంకా నాలుగు రోజులైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మాకు చాలా భయమేసి, "బాబా! జ్వరం, ఇన్ఫెక్షన్ తగ్గించి నాన్నను ఎలాగైనా కాపాడండి" అని బాబాను వేడుకున్నాను. అంతలో మా డాక్టర్ చెల్లికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు నెలలుగా కోవిడ్ విధులలో ఉన్నా రాని కరోనా నాన్నకు సేవచేసిన కొద్దిరోజుల్లో తనకు వచ్చింది. దాంతో నేను ఇంకా కృంగిపోయాను. మళ్లీ బాబాను ఆశ్రయించాను. "బాబా! నాన్న, చెల్లి, తమ్ముడు, ఇంకా డ్రైవర్ అందరినీ కరోనా నుండి క్షేమంగా బయటపడేయండి. మీ దయవల్ల అందరూ క్షేమంగా ఉంటే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. తరువాత వాళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి బాబాను అడిగి ఈ బ్లాగులో చూస్తే, అక్కడ అన్నీ బాబా కరోనా నుండి కాపాడిన భక్తుల అనుభవాలు ఉన్నాయి. దాంతో బాబా చూసుకుంటారని నా మనసు ప్రశాంతించింది. బాబా ఆశీస్సులతో నాన్నకి, చెల్లికి, తమ్ముడికి, ఇంకా డ్రైవరుకి ఇప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది. బాబా దయవల్ల ఇంట్లో అందరూ పోస్ట్ కోవిడ్ లక్షణాల నుండి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. బాబా ఆశీస్సులతో అన్నీ జరుగుతాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, కోవిడ్ వచ్చినప్పుడు మా ఇంట్లో అందరూ ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టుకుని, ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగారు. అది అద్భుతమైన ఔషధంలా పనిచేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా కరుణామయుడు. నాపై ఎల్లవేళలా కృప ఉంచి నన్ను ప్రశాంతంగా ఉంచుతున్నారు. అంతటి ప్రేమమూర్తికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను, నిర్మలమైన నా మనసును, భక్తిని తప్ప? ప్రస్తుతానికి మీ అందరితో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్న అనుభవాలు పంచుకున్నాను. బాబా నాకు వెలకట్టలేని అనుభవాలు ఇంకా ఎన్నో ప్రసాదించారు. వాటిని ఇవి ప్రచురితమయ్యాక పంచుకుంటాను.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


తోడుగా ఉండి కాపాడిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


సాయి గురుబంధువులందరికీ నా నమస్కారాలు. నేను చిన్నప్పటినుండి సాయిబాబా భక్తురాలిని. ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తుంటాను. బాబా ఊదీని శ్రద్ధాభక్తులతో నీళ్ళలో కలుపుకుని త్రాగుతాను. ఇటీవల శ్రీసాయిబాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ నెలలో ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులు హోమియోపతి మందులు వాడగా కాస్త తగ్గింది. అయితే, ఆ వెంటనే మావారికి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన మాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! మాకు జ్వరాలు పూర్తిగా తగ్గించి, ఆరోగ్యం ప్రసాదించినట్లైతే ఈ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వెంటనే మా మరిది ఫోన్ చేసి, "మా బంధువులకు కరోనా వస్తే, వాళ్లకు తెలిసిన డాక్టర్ మందులతో నయంచేశార"ని చెప్పి, వెంటనే మమ్మల్ని కూడా ఆ డాక్టర్ని ఆన్లైన్లో సంప్రదించమన్నారు. మేము ఆ డాక్టర్ని ఆన్లైన్లో సంప్రదించినప్పుడు ఆ డాక్టరుగారు మాతో, "కరోనా పాజిటివ్ వస్తే తర్వాత చూద్దాం. ముందు ఈ మందులు వాడండి" అని కొన్ని మందులు వ్రాసిచ్చారు. అప్పుడు నేను, "బాబా! కరోనా నెగిటివ్ వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కానీ బాబా మమ్మల్ని పరీక్షించదలచారేమో, కరోనా టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దాంతో, డాక్టరుగారిచ్చిన మందుల ప్రిస్క్రిప్షన్ పేపరును మా అక్కకు వాట్సాప్‌లో పంపించాను. మా అక్క ఆ పేపరుని చూసి, "దీనిమీద 'ఓం సాయి పాలీక్లినిక్' అని ఉంది కదా! బాబా మీకు తోడుగా ఉన్నారు. ఏమీ భయపడవద్దు. ధైర్యంగా ఆ మందులు వాడండి" అని చెప్పింది. నాలుగురోజులు మందులు వాడిన తర్వాత బాబా దయవల్ల మా ఇరువురికీ జ్వరం తగ్గింది. ఇదంతా మందులతో పాటు మేము వాడిన బాబా ఊదీ మహిమ. మాకు తోడుగా ఉండి కేవలం మందులతో మమ్మల్ని కాపాడినందుకు బాబాకి, గురువుగారికి సదా మా ధన్యవాదాలు. "బాబా! ఇదేవిధంగా ఎల్లప్పుడూ తోడుగా ఉండి మమ్మల్ని మరియు సర్వజనులను కరోనా బారినుండి కాపాడండి. ఇంకా, మావారికి ఉన్న రెండు అనారోగ్య సమస్యలను దయతో నయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను".


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి.


7 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundela chudu sai thandri

    ReplyDelete
  4. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  5. Baba santosh Carrier bagundali thandri

    ReplyDelete
  6. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo