సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 859వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కుటుంబమంతటినీ ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్న బాబా
2. బాబా ప్రసాదించిన ఆనందం
3. నమ్ముకున్న బాబా దయచూపారు

కుటుంబమంతటినీ ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్న బాబా


అందరికీ నమస్తే! ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు రఘు. నేను హైదరాబాద్ నివాసిని.  ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను, నా ఆలోచనలను, అభిప్రాయాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నాకొక కూతురు ఉంది. తన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు, ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. చిన్నపిల్లలకి పళ్ళు ఊడి క్రొత్తవి వస్తుంటాయి కదా! అలా నా కూతురుకి వచ్చిన పళ్ళు ఎగుడు దిగుడుగా వచ్చాయి. దానివల్ల పెదవుల వెనుక లోపలి వైపు ఒక చిన్న గడ్డ ఏర్పడింది. మొదట్లో మేము దాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే అది రానురానూ పెద్దది అయింది. దాంతో మేము డాక్టరుని సంప్రదిస్తే, మందులు వ్రాసి, రెండురోజుల తరువాత రమ్మన్నారు. ఆ మందులు వాడినా గడ్డ తగ్గలేదు. మేము మళ్ళీ డాక్టరు దగ్గరకి వెళ్ళితే, వేరే మందులిచ్చి, "వీటితో తగ్గలేదంటే సర్జరీ చేయాలి" అని అన్నారు. దాంతో నాకు చాలా భయం వేసి వేరే డాక్టరుని సంప్రదించాను. అయితే ఆ డాక్టర్ కూడా అలాగే చెప్పారు. అప్పుడు నేను, "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించి, 'మీ అనుగ్రహంతో గడ్డ తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని బాబాకు మాటిచ్చాను. బాబా దయవలన రెండు నెలల్లో ఆ గడ్డ తగ్గింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ధన్యవాదాలు బాబా! మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను".


రెండవ అనుభవం: ఒకరోజు మా ఆవిడ లాప్టాప్ ఛార్జింగ్ అవ్వలేదు. తను వాళ్ళ ఆఫీసువాళ్ళకి ఫోన్ చేస్తే, ‘ఆఫీసుకి వస్తే లాప్టాప్ మార్చి వేరేది ఇస్తామ’ని చెప్పారు. అసలే కరోనా ఉధృతంగా ఉన్న సమయం. పైగా మా ఆవిడకి డ్రైవింగ్ కూడా రాదు. అందువలన నేనే బైక్ మీద వెళ్లి లాప్టాప్ తీసుకుని వస్తానని మా ఆవిడతో చెప్పాను. కానీ వాళ్ళ ఆఫీసువాళ్ళు తననే రమ్మన్నారు. దాంతో తను ఆటోలో వెళ్ళొస్తానని వెళ్ళింది. ఆ లోపల బిగ్ బాస్కెట్ వాళ్ళు సరుకులు డెలివరీ చేయటానికి ఇంటికి వచ్చారు. నేను మాస్క్ పెట్టుకుని, అతన్నే సరుకులను బెడ్‌రూమ్‌లో పెట్టమన్నాను. అతను వాటిని బెడ్‌రూమ్‌లో పెట్టి వెళ్ళిపోయాడు. అరగంట తరువాత నా భార్య కొత్త లాప్టాప్ తీసుకుని ఇంటికి వచ్చింది. తను వచ్చిన వెంటనే ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకుని బెడ్‌రూమ్‌కి వెళ్లి, సరుకులన్నీ తనిఖీ చేసింది. మరుసటిరోజు ఉదయం నుంచి తనకి గొంతునొప్పి మొదలైంది. తనకి అనుమానమొచ్చి వేరే బెడ్‌రూమ్‌లో ఐసోలేషన్ ఉండసాగింది. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, గతేడాది మాకు కరోనా వచ్చి మేము చాలా బాధపడ్డాము. బాబా దయవలనే తగ్గింది. నేను, మా పాప హాల్లో ఉంటూ నా భార్యకు మందులు, ఆహారం అందిస్తూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆ రాత్రి నా భార్యకి జ్వరం కూడా వచ్చింది. దాంతో ఇక నేను అది కరోనా అని నిర్ధారణకొచ్చి, "సహాయం చేయమ"ని బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. తరువాత ఆర్‌టిపిసిఆర్ పరీక్ష చేయించాము. ఆ రిజల్ట్స్ కోసం వేచి చేస్తూ నా భార్య బాబా సహాయం కోసం 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని పఠిస్తూ, బాబా ఊదీని ధరిస్తూ, కొద్దిగా ఊదీని నీటిలో కలుపుకుని త్రాగుతుండేది. ఆ రెండురోజులు భయంభయంగా గడిపాము. ఎందుకంటే, ఈ సమయంలో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. నేను బాబాకు నమస్కరించుకుని, "నా భార్య ఆరోగ్యం బాగుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అది తెలిశాక పెద్ద భారం దిగినట్లు అనిపించి బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలా నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను బాబాతో చెప్పుకుంటాను. సమస్యను బాబాకు అప్పగించి, ప్రశాంతంగా పారాయణ గ్రూపులో సభ్యునిగా వీక్లీ పారాయణ చేస్తాను. బాబా మా కుటుంబమంతటినీ ఏ ఆపదా లేకుండా చూసుకుంటున్నారు. ఎల్లప్పుడూ మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నారు.


మూడవ అనుభవం: నేను మూడు సంవత్సరాల క్రితం హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు నా లివర్ ఫ్యాటీగా ఉందని చెప్పారు. అయితే మళ్ళీ టెస్టు చేయించుకోవాలని నాకు ఉన్నప్పటికీ కరోనా భయంతో చేయించుకోలేదు. అయితే, ఇటీవల ఆన్లైన్లో బ్లడ్ టెస్ట్ కోసం రిజిస్టర్ చేసుకుని, "రిపోర్ట్ నార్మల్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించి టెస్ట్ చేయించుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్ నార్మల్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో కొన్న ఇంటి గ్రౌండ్ ఫ్లోరులో ఇల్లు ఖాళీ అయింది. కృపతో మంచివాళ్ళని అద్దెకి ఇంటిలో దించి  EMI కట్టడానికి ఇబ్బంది లేకుండా చూడండి బాబా. మా ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండేలా దీవించండి. సదా మేము మీతోనే ఉండేలా మమ్మల్ని అనుగ్రహించి మీ దారిలో నడిపించండి. అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి బాబా"


సాయి సర్వాంతర్యామి! సర్వజీవ హృదయవాసి! మనం అడిగేవాటికి, అడగనివాటికి కూడా సమాధానమిచ్చే ప్రేమమూర్తి!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!


బాబా ప్రసాదించిన ఆనందం


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నడిపిస్తూ, అందరికీ ఆనందాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగిస్తున్నవారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు లలిత. మాది కర్నూలు. మన తండ్రి సాయినాథుని గురించి చెప్పడానికి మాటలు చాలవు. బాబా నాపై చూపిన దయ, కరుణ ఏమని చెప్పను? నేను ఇంతకుముందు ఈ బ్లాగులో ఒక ఊదీ లీలను పంచుకున్నాను. ఇప్పుడు మరొక అద్భుతమైన లీలను పంచుకుంటున్నాను.


దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా నేను, మావారు కలిసి సాయంత్రంపూట గుడికి వెళ్ళింది లేదు. మాకున్న వ్యాపారం వల్ల అస్సలు సమయం దొరికేది కాదు. ప్రస్తుతం లాక్‌డౌన్ ఉన్నందున 2021, జూన్ 24న నేను, మావారు గుడికి వెళ్లి ప్రశాంతంగా కూర్చుని వీలైనంత ఎక్కువ సమయం అక్కడ గడిపి వద్దామని అనుకున్నాము. అనుకున్నట్లే, సాయంత్రం 7 గంటలకి బాబా గుడికి వెళ్ళాము. ఆరోజు గురువారమైనప్పటికీ లాక్‌డౌన్ వల్ల భక్తులు ఎక్కువగా లేరు. కరోనా కారణంగా భక్తులు పెట్టుకోవడానికి విభూతి గుడిలో పెట్టడం లేదు. అయితే, గుడిలోని పూజారిగారు మమ్మల్ని చూస్తూనే, "విభూతి కావాలా?" అని అడిగారు. అంతకుముందు నేను గుడికి వెళ్ళినప్పుడు నా అంతట నేను, "విభూతి కావాలి" అని పూజారిగారిని అడిగితే, ఆయన ‘లేద’న్నారు. నేను బ్రతిమిలాడి బలవంతంగా కొంచెం విభూతి తెచ్చుకున్నాను. అలాంటిది ఈసారి నేను అడగకనే విభూతి ఇచ్చారు. నాకు ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను.


కొద్దిసేపటికి ఆరతి ఇవ్వడం కోసం బాబాకు చేసిన అలంకరణను తీస్తున్నారు. నేను కొన్ని పూలు తెచ్చుకుందామని దగ్గరకు వెళ్లాను. పెద్ద కనకాంబరాల మాల నాకు ఇచ్చారు. దాన్ని కొంచెం కొంచెం చొప్పున అక్కడున్న కొంతమంది భక్తులకు పంచి, నేను కొంచెం ఉంచుకున్నాను. తరువాత అక్కడే కూర్చుని, 'గుడిలో ఎవరూ లేరు. పూజారిగారిని అడిగి బాబా పాదాలు పట్టుకుని నమస్కరించుకుని, ఒత్తుదామ'ని ఆలోచిస్తున్నాను. నా మనసు అందుకోసం చాలా ఆరాటపడుతోంది. కానీ ఆ గుడిలో అలా చేయడానికి ఒప్పుకోరు. అలాంటిది నాకు ఆ కోరిక ఎందుకు కలిగిందో తెలియదు. సరే, 'అది జరగదులే' అనుకుని మరోసారి బాబాకి నమస్కారం చేసుకుని ఇంటికి వెళదామని బాబా దగ్గరకు వెళ్లి నమస్కరించుకుంటుండగా పూజారి నా చేతికి బాబాకు కట్టిన వస్త్రాన్ని ఇచ్చి, మడత పెట్టమన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబా నా మనసులో కోరికను పసిగట్టి ఈ విధంగా తీర్చారన్న సంతోషంతో నా కంటనీరు ఆగలేదు. అది చూసి మావారు, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. నేను, "ఇది ఏడుపు కాదు, ఆనందం" అని చెబితే, "దేనికి?" అని మావారు అడిగారు. అప్పుడు నేను, "మీ ప్రక్కన కూర్చుని నా మనసులో ఇలా అనుకున్నాను" అని విషయం చెప్పాను. మావారు, "నాకు చెప్పి ఉంటే నేను అడిగేవాడిని కదా! ఎందుకు అంత ఆలోచన చేశావు?" అన్నారు. "ఒకవేళ అలా జరిగినా నాకు ఇంత ఆనందం ఉండేది కాదేమో! నా మనసులో కోరికను బాబానే తెలుసుకుని తీర్చినందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను" అన్నాను. అది విని మావారు కూడా చాలా సంతోషించారు. ఆరోజు రాత్రంతా నేను నిద్రపోలేదు. పదేపదే బాబా అనుగ్రహాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఆ ఆనందంలో మునిగితేలాను. ఇప్పుడు ఈ అనుభవాన్ని వ్రాస్తున్నపుడు కూడా అవధులు లేని ఆనందంలో తేలియాడుతున్నాను. "బాబా! సాయితండ్రీ! ఎప్పుడూ మా అందరినీ ఇలా చల్లగా చూడు తండ్రీ. నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. 'బాబా.. సాయిబాబా' అని పిలిస్తే పలికే తండ్రివి నీవు. నీ చల్లని కృపాదృష్టి నాపై, నా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా, నాకు కొన్ని పనులు కావడం లేదు. అవి తొందరగా నెరవేర్చినట్లైతే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను బాబా".


ఓంసాయి ఓంసాయి ఓంసాయి.


నమ్ముకున్న బాబా దయచూపారు


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు మావారికి దగ్గు, జలుబు వచ్చాయి. రెండు రోజులైనా తగ్గకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. అప్పుడు సాయిబాబాని తలచుకుని ఇంట్లో అందరమూ కరోనా టెస్ట్ చేయించుకున్నాము. మా అందరికీ పాజిటివ్ వచ్చింది. ఆ సాయినాథుడినే నమ్ముకుని మందులు వాడసాగాము. నేను బాబాకు నమస్కరించుకుని, "మా అందరికీ నయమైతే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. 14 రోజులు చాలా భయపడుతూ గడిపినప్పటికీ బాబానే నమ్ముకున్నాను. బాబా దయవలన అందరికీ తగ్గిపోయింది. బాబాకి ఇచ్చిన మాట ప్రకారమే ఇలా మీతో నా అనుభవాన్ని పంచుకున్నాను. "బాబా! మావారికి కొంచెం దగ్గు వస్తోంది. దాన్ని కూడా తగ్గించండి. అలా జరిగితే, ఆ అనుభవాన్ని కూడా పంచుకుంటాను. సాయీ! ఎప్పుడూ ఇలాగే మాపై కరుణ చూపుతూ కాపాడుతూ ఉండండి. మీ దయ ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలి తండ్రీ!"


11 comments:

  1. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri please

    ReplyDelete
  3. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  4. Baba santosh ki putra santanam kaliginchu thandri

    ReplyDelete
  5. 🌷🙏🙏🙏🌷 Om Sri Sai Ram 🌷🙏🙏🙏🌷

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼

    ReplyDelete
  7. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  8. Om Sri Sai Ram ��������

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo