సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 860వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహాశీస్సులు
2. సాయిబాబా వాత్సల్యం
3. 'సాయీ' అంటే చాలు, కష్టాలన్నీ తీరుస్తారు బాబా

బాబా అనుగ్రహాశీస్సులు


సాయిభక్తులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పుష్పలత. మా అమ్మాయి ఇంజనీరింగ్ విద్య అడ్మిషన్ విషయంలో బాబా చేసిన అద్భుతం గురించి నేను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 


2021, ఏప్రిల్ మొదటివారంలో మా చిన్నాన్నగారు మరణించారు. మా స్వగ్రామంలో జరిగిన వారి కర్మకాండలకు నేను, మావారు, పిల్లలు హాజరయ్యాము. తర్వాత ఏప్రిల్ 6వ తారీఖున నాకు జ్వరంగా అనిపించింది. మరో రెండురోజులకి నాకు వాసన కూడా తెలియలేదు. దాంతో అనుమానమొచ్చి మేము నలుగురం కరోనా టెస్ట్ చేయించుకున్నాము. నాకు, మా పెద్దపాపకి పాజిటివ్ వచ్చింది. అప్పటికే నాకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నందున చాలా భయం వేసి అనుక్షణం బాబాను స్మరిస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించసాగాను. బాబా దయవల్ల హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం రాకుండా గృహనిర్బంధంలోనే మాకు పూర్తిగా కోవిడ్ తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. కొంచెం ఆలస్యంగా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి".


రెండవ అనుభవం: నాకు 20 సంవత్సరాల క్రితం గాల్‌బ్లాడర్ తీసేశారు. అప్పటినుండి నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉండేది. దానికోసం చాలారోజులుగా టాబ్లెట్స్ వాడుతున్న నేను ఒకరోజు బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించి, "బాబా! నాకు గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గిపోవాలి" అని చెప్పుకుని టాబ్లెట్స్ వేసుకోవడం ఆపేశాను. బాబా దయవల్ల ఆ సమస్య నుండి నేనిప్పుడు పూర్తిగా విముక్తి పొందాను. నాకు ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. సాయి దయవల్ల త్వరలో వాటినుండి కూడా బయటపడాలని కోరుకుంటున్నాను.


మూడవ అనుభవం: నేను వృత్తిరీత్యా జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేదాన్ని. అందరిలాగానే 2020, మార్చి నుండి నాకు ఎలాంటి తరగతులూ లేవు. ఆ సమయంలో నా ప్రమేయం లేకుండానే ఆస్ట్రేలియా నుండి ఇద్దరు విద్యార్థులకు టీచ్ చేసే అవకాశంతోపాటు మేము ఎప్పటినుండో నడిపిస్తున్న ట్యుటోరియల్‌ను ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నడిపించేలా బాబా అనుగ్రహించారు. ఇప్పటికీ ట్యుటోరియల్ విజయవంతంగా నడుస్తోంది. వాటితోపాటు మా స్నేహితురాలి ద్వారా ఒక మంచి పేరున్న సంస్థలో సి.ఏ ఫౌండేషన్ కోర్సుకి టీచ్ చేసే అవకాశం బాబా ఇచ్చారు. దానిలో భాగంగా ట్రైనింగ్ పీరియడ్‌లో బాబా నాకు ఎంతో సహాయాన్ని మరియు చేయూతనిచ్చి నన్ను ముందుకు నడిపించి అతి తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్‌గా నాకు మంచి పేరు వచ్చేలా ఆశీర్వదించారు. ఇంకా ఆర్థికంగా ఎంతో సహాయాన్ని అందించారు. బాబా ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలనీ మరియు బాబా స్మరణలో మన అందరి జీవితాలు సాఫీగా ముందుకు సాగాలనీ ఆశిస్తూ ముగిస్తున్నాను.


జై సాయినాథాయ నమః.


సాయిబాబా వాత్సల్యం


సమస్త జగత్తును ఆవరించివున్న నా సాయిబాబాకి, బాబా లీలలను తెలుపుతూ, రోజురోజుకీ ఆ సమర్థ సద్గురు శ్రీసాయినాథుని పట్ల భక్తివిశ్వాసాలను మరింత వృద్ధిపరుస్తున్న ఈ బ్లాగ్ నిర్వహకులకు, సాయినే మనస్సునిండా నింపుకున్న భక్తులందరికీ నా నమస్సులు. ఈమధ్య బాబా తమ వాత్సల్యాన్ని మా కుటుంబం పట్ల ఎలా చూపారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


ప్రేమతో మా అమ్మగారిని అనేక గండాల నుండి కాపాడారు బాబా. ఒకసారి మా చెల్లి కొడుకుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి, రోజూ 103 డిగ్రీల జ్వరం ఉంటుండేది. మందులు వాడినా, హాస్పిటల్‌కి వెళ్ళినా జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను మా చెల్లితో, "బాబాను ప్రార్థించి, బాబా ఊదీని బాబు నుదుటన పెట్టి, కొద్దిగా ఊదీని నోట్లో వేసి, ‘జ్వరం తగ్గితే బాబాకు కిచిడీ నైవేద్యం పెట్టి, తరువాత దానిని ఎవరికైనా తినడానికి ఇస్తాను’ అని మ్రొక్కుకో” అని చెప్పాను. తను 'సరే' అంది. కానీ మరుసటిరోజు టెన్షన్లో ఆ విషయం మర్చిపోయింది. తను చేస్తుందో లేదోనని నేను గురువారంనాడు కిచిడీ చేసి, బాబాకు నైవేద్యం పెట్టి, దానిని మా పనివాళ్ళ పిల్లలకి పంపాను. ఆ క్షణంనుండి బాబుకి జ్వరం తగ్గడం మొదలై మామూలు అయ్యాడు. ఇంక ఏ మందులూ వాడలేదు. "బాబా! ఇదేవిధంగా మీ ఆశీస్సులు సదా మీ భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".


ఈమధ్య ఒకరోజు హడావుడిలో నా ఐదు తులాల బంగారు గొలుసు, లాకెట్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. తరువాత ఎంత వెతికినా అది దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! నా నిర్లక్ష్యాన్ని మన్నించి నా గొలుసు దొరికేలా చెయ్యండి" అని బాబాతో చెప్పుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. తరువాత మళ్ళీ వెతుకుతుంటే ఒక జిప్ పర్స్  కనిపించింది. ఎందుకైనా మంచిదని దాన్ని తీసి చూస్తే, అందులో జిగేల్ మంటూ ఆ నగ కనిపించేసరికి సంతోషంతో నా సాయిబాబాకి మనస్సులోనే పాదాభివందనం చేసుకున్నాను. "బాబా తండ్రీ! నా సమస్యలు నీకు తెలుసు. అనుదినం వాటిని విన్నవించి నిన్ను విసిగిస్తూ ఉన్నాను కూడా. నా పెండింగ్ పనులు పూర్తయ్యేలా ఆశీర్వదించండి. మాకు రావాల్సిన పేపర్లు, డాక్యుమెంట్లు, డబ్బులు అతి త్వరలో మాకు అందేలా అనుగ్రహించండి. మాపై మీ కృపాకటాక్షాలు సదా ఉండేలా అనుగ్రహించి సదా మమ్ము రక్షించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన నా సాయి సద్గురునికి కోటానుకోట్ల నమస్కారాలు.


'సాయీ' అంటే చాలు, కష్టాలన్నీ తీరుస్తారు బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయినాథుని పాదాలకు అనంతకోటి నమస్కారాలు. పిలిస్తే పలికే దైవం శ్రీసాయి. అసాధ్యాలను సుసాధ్యాలు చేసేది మన సాయి ఒక్కడే. సాయిని నమ్మడం మన పూర్వజన్మ సుకృతం. నా పేరు శ్రీదేవి. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకుంటున్నాను. నా భర్త ఒక బ్యాంకు ఉద్యోగి. ఆయనకి ప్రమోషన్ మీద దాదాపు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ఊరికి బదిలీ అయింది. నేను కూడా ఉద్యోగస్థురాలిని అయినందున నా భర్తకు దూరంగా ఉండవలసి వచ్చింది. నాలుగు సంవత్సరాలు గడిచినా, మావారికి మళ్లీ బదిలీ ఇవ్వకుండా కరోనా కారణంగా ఇప్పుడు, అప్పుడు అని అంటూ రోజులు గడిపేస్తుంటే 2021, జూన్ 24, గురువారంనాడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నా భర్తను మాకు ఎంత దగ్గరకు వీలైతే అంత దగ్గరకు బదిలీ చేయించండి. వచ్చే గురువారానికల్లా నేను శుభవార్త వినాలి బాబా" అని ప్రార్థించాను. సాయి అద్భుతం చేశారు. 2021, జూలై 1, గురువారం రాత్రి 10 గంటలకు నా భర్త ఫోన్ చేసి, మేముండే చోటునుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి తనకు బదిలీ వచ్చిందని చెప్పారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషం కలిగింది. బాబా చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కాలేదు. సాయి సహాయాన్ని, కరుణను, మనపై చూపిస్తున్న ప్రేమను కొలవడానికి ముల్లోకాల్లో కొలమానాలేవీ లేవు. 'సాయీ' అంటే చాలు, బాబా మన కష్టాలన్నీ తీరుస్తారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. క్రొత్తచోట నా భర్తకు తోడునీడవై ఉంటూ ఉద్యోగంలో అంతా మంచిగా ఉండేలా అనుగ్రహించమని కోరుకుంటున్నాను సాయీ!"


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

బోలో సాయినాథ్ మహరాజ్ కీ జై!


9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  3. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  4. Baba santosh ki chest pain gastric valla ayi vundali kani aa problem vundakudadu baba

    ReplyDelete
  5. Baba karthik ki thyroid taggipovali thandri normal reports ravali thandri

    ReplyDelete
  6. Baba naku menalludu ni prasadinchu baba

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🌼🕉🙏😊😀🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo