సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా దయతో గర్భవతినయ్యాను


ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరాం. సాయి నాకు ఇచ్చిన ఈ అనుభవం ద్వారా, బాబా తన  పిల్లలమైన మనం బాధపడుతుంటే చూస్తూ ఉండలేరని, అమితమైన తమ ప్రేమని మనపై ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారని తెలుసుకోవచ్చు. ఇలా బ్లాగ్ ద్వారా భక్తుల అనుభవాలు షేర్ చేసుకోవడం వలన పాఠకులందరిలో బాబా పట్ల భక్తి విశ్వాసాలు రెట్టింపు అవుతాయి.

నాకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి బాబా నాకు తెలుసు. కాని నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుండే సాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే నాకు ఒక మంచి వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అయిన తరువాత ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలు కావాలి అని అనుకున్నాం. కానీ ఒక సంవత్సరం 5 నెలలు గడిచినా అదృష్టం కలిసి రాలేదు. ఇంక హాస్పిటల్ లో చూపించుకోవడం మొదలుపెట్టాం. ఒక వారానికి రిపోర్ట్స్ వచ్చాయి. అందులో నా భర్తకి సమస్య ఉందని తెలిసింది. తను అందుకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా ఈసారి కూడా అదృష్టం లేదు. ఇంక చేసేది లేక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్లి అక్కడ IUI ట్రీట్ మెంట్ తీసుకుంటూ బాబా ఆశీస్సుల కోసం ప్రార్ధించాం. నాకు ఎప్పుడూ ఒక అలవాటు ఉండేది. ఏదైనా సమస్య వచ్చి‌నప్పుడు బాబా ముందర రెండు చీటీలు వేసి, తద్వారా బాబా నిర్ణయం తెలుసుకుంటూ ఉంటాను. అలా నేను ఎప్పుడు పిల్లల గురించి చీటీలు వేసినా ప్రతికూలమైన సమాధానాలే వచ్చేవి. Question & Answer సైట్ లో కూడా అలాగే వ్యతిరేక సమాధానాలు వచ్చేవి. నేను పూర్తిగా కృంగిపోయి సాయి ముందు ఏడ్చేదాన్ని. "నాకే ఎందుకు ఇలా అవుతుంది?" అని ఎన్నోసార్లు అడిగి గొడవ పెట్టుకునేదాన్ని, తిట్టేదాన్ని, కాని ఏనాడూ ఆయన చేయి విడువలేదు. అలాగే, సాయి కూడా నా చేయి విడువరు అనే నమ్మకంతో ఉండేదాన్ని.

ఈ క్రమంలోనే మరోవైపు 4 సార్లు IUI ట్రీట్ మెంట్ తీసుకున్నాను, అయినా ఫలితం దక్కలేదు. సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం, సాయి దివ్య పూజ, సాయి లీలామృతం పారాయణ చేశాను. ఆ సమయంలో మొదటిసారిగా నాకు సాయి స్వప్నంలో దర్శనం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు. అంత అద్భుతమైన సాయి రూపాన్ని నేను ఎప్పటికీ మరువలేను. తరువాత ఒక నెలకి మా బ్రదర్ షిరిడీ వెళ్లి నాకోసం సచ్చరిత్ర పుస్తకం, దానితోపాటుగా ఒక చిన్న సాయి ఫోటో కూడా తెచ్చి‌ ఇచ్చాడు. ఆ ఫోటోలో సాయి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చినట్టే ఉన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఊదీ నీళ్ళలో కలుపుకొని రోజూ తాగేదాన్ని. పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యింది, కానీ పిల్లలు కలగలేదు. ఆ 5 సంవత్సరాలుగా మేము వాడిన మందులతో బాగా విసిగిపోయి, కొద్దిరోజులు ఆపేసాము.

నాకు రోజూ వెబ్ సైటులో సాయిభక్తుల అనుభవాలు చదవడం బాగా అలవాటు. జూలై 27వ తేదీ నాడు కూడా భక్తుల అనుభవాలు చదివిన తరువాత, Question&Answer సైట్ లోకి వెళ్లి బాబాని అడిగాను. చాలా రోజుల తరువాత సాయి నుండి నాకు అనుకూలంగా సమాధానం వచ్చింది. "బాధలన్నీ 3 నెలలలో తీరిపోతాయి, అంతా మంచే జరుగుతుంది, శ్రీసాయిని గుర్తుపెట్టుకో” అని వచ్చింది. ఈ సందేశంతో సాయి నాలో కొత్త ఆశని కలిగించారు. సాయిపై విశ్వాసంతో అక్టోబర్ లో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ IVF తీసుకోమని చెప్పారు. మళ్ళీ మందులు వాడటం మొదలుపెట్టాము. ఈసారి బాబాని దృఢమైన భక్తి విశ్వాసాలతో ప్రార్ధించాను. నేను గట్టి పట్టుదలతో రోజూ హాస్పిటల్ కి వెళ్లి 3 షాట్స్ తీసుకునేదాన్ని, మొత్తం 35 నుండి 45 వరకు ఇంజక్షన్లు ఉండేవి. embryo(పిండం) ప్రవేశ పెట్టిన రెండు రోజుల తరువాత నుండి ఈసారి రిపోర్ట్ ఎలా వస్తుందో అని చాలా ఆందోళనగా ఉండేది. Question&Answer సైట్ ఓపెన్ చేసి సాయిని అడిగాను. “నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, త్వరలో నీకు పిల్లలు కలుగుతారు” అని సమాధానం వచ్చింది. సాయి ఓదార్పు మాటలతో నేను చాలా నమ్మకంగా ఉన్నాను. నవంబర్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం (HCG blood test)వెళ్ళినప్పుడు నా బ్లడ్ శాంపిల్ ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి Question&Answer సైట్ చూడగా, సాయి నాకు ఇలా చెప్పారు: "4 సంవత్సరాలుగా నీ మదిలో ఉన్నది, నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది” అని. అలా వచ్చాక ఆనందంగా, ఎంతో ధైర్యంగా బ్లడ్ ఇచ్చాను, రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. మా సంతోషానికి అవధులు లేవు. బాబా దయతో నేను గర్భవతిని అయ్యాను. "బాబా! నాకు ఎప్పుడూ నీ ఆశీర్వాదాలు కావాలి, నా చేయి ఎప్పుడూ విడువకు బాబా!"

సాయి భక్తులారా! శ్రద్ధ సబూరిలు కలిగి ఉండండి. సాయి ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరు. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసేవాళ్ళని బాబా ఎంతగానో ప్రేమిస్తారు.

కర్మఫలాన్ని కాలరాసే కరుణామయుడు


చేతులు జోడించి, మీ దివ్య చరణాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను బాబా. నాకు ఎల్లవేళలా తోడుగా ఉండి, ఎప్పటికప్పుడు రక్షణనిస్తున్న మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతా సుమాంజలి. సాయిబంధువులందరికీ నమస్కారం.

నా పేరు నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి. మాది యాదగిరిగుట్ట దగ్గర రాజపేట్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ప్రతిరోజూ హారతులకు హాజరవుతూ ఉంటాను. బాబా దయవలన నాకు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాలేదు. ఇది కేవలం నాపైన, నా కుటుంబంపైన ఉన్న "సాయి కృప” మాత్రమే. ఇప్పుడు నేను నా భార్యకు జరిగిన ఒక అనుభవాన్ని "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈమధ్యనే, అనగా 2017 జనవరి నెలలో హఠాత్తుగా నా భార్య అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. వారం రోజులయినా షుగర్ తగ్గట్లేదు. షుగర్ "480" చూపిస్తుండేది. డాక్టర్లు, "ఏమి చేసినా షుగర్ కంట్రోల్ కావట్లేదు, రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు" అన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్లి హారతి సమయంలో, "బాబా! నాకు ఇంజక్షన్లు ఇవ్వడం రాదు. డాక్టర్లేమో నా భార్యకు మూడుపూటలా ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వాలంటున్నారు. ఈ వయసులో నా భార్య హాస్పిటల్లో ఉండి బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంచేస్తావో ఏమో నాకు తెలియదు. నువ్వే తన సంగతి చూసుకోవాలి" అని మనస్ఫూర్తిగా నా మనసులోని బాధను ఆ సాయీశ్వరుడికి చెప్పుకున్నాను. ఆరోజు రాత్రి తెల్లవారుఝామున నాకు ఒక స్వప్నం వచ్చింది. కాషాయవస్త్రాలు ధరించి, భుజముకు జోలెతో, చేతిలో సటకాతో బాబా నా దగ్గరకు వచ్చారు. నేను బాబాకు నమస్కారం చేశాను. అప్పుడు బాబా, “ఏమీ బాధపడకు! నీ భార్యకు ఏమీ కాదు. తను కర్మఫలం అనుభవిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా! దిగులుపడకు” అని చెప్పి మాయమయ్యారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది.

తెల్లవారిన తరువాత బాబాను స్మరించుకుంటూ హాస్పిటల్ కు వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే, నా భార్య షుగర్ 480 నుండి 180కు వచ్చేసింది. "ఇది ఎలా సాధ్యం? ఒక్కరోజులో ఇది ఎలా జరిగింది?" అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ అవసరం లేకుండా నా భార్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ వయసులో ఆరోగ్యం కన్నా ఇంకేం కావాలి? అంతా ఆయన "కృప".

ఊదీ మహిమలు 2


హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు సాయి సింధు ఇలా చెప్తున్నారు...

అందరికీ సాయిరామ్. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ భక్తుల అనుభవాలు పంచుకుంటూ ఉండటం వలన ఇది 'ఆధునిక సాయి సచ్చరిత్ర' అని నాకనిపిస్తుంది.

ఒక నెల వయస్సున్న ఒక కుక్కపిల్ల మా వీధిలో ఉన్నది. దానికి మేము రోజూ ఆహారాన్ని పెట్టేవాళ్ళం. అది చాలా కొంటె కుక్క. మేము దానితో రోజూ సరదాగా ఆడుకుంటూ ఉంటాము. అది మా ఇంటి లోపలకి వచ్చి‌ మంచంమీద కూడా కూర్చుంటుంది. మాకు కుక్కలపట్ల ఉన్న ప్రేమ వలన దానిని ఏమీ అనేవాళ్ళం కాదు. ఒకరాత్రి దానిని ఎవరో గాయపరిచారు. ఆ గాయం కారణంగా అది నడవలేక, ఆహారం తినడానికి కూడా రాలేదు. మరుసటిరోజు ఉదయం మేము దాన్ని లోపలికి పిలిస్తే, చాలా కష్టంతో కుంటుకుంటూ లోపలికి వచ్చి, మా అమ్మ కొంత ఆహారం పెడితే తిన్నది. నేను బాబా ఊదీ తెచ్చి, బాబాను ప్రార్థిస్తూ, రక్తం కారుతూ ఉన్న తన కాలి గాయానికి ఊదీ వ్రాసి, దాని నుదుటిపైన కూడా పెట్టాను. కాసేపటికి అది మా కాంపౌండ్ లో పడుకుంది. మేము బయటకు వెళ్లి పనులు చూసుకొని తిరిగి వచ్చే సమయానికి గాయపడిన కాలు ముడుచుకొని గేట్ వద్దకు పరుగున వచ్చింది. మరుసటిరోజు అది సాధారణంగా నడవగలిగింది. తరువాత రోజున దాని గాయపడిన కాలిని కూడా ఉపయోగించి పరుగులు తీయడం ప్రారంభించింది. బాబా దయతో ఇప్పుడది మునుపటివలె చాలా చలాకీగా కొంటెగా ఉంది. బాబా ఊదీ వలన అది అంత త్వరగా కోలుకుంది. మేమంతా చాలా సంతోషించాము. నాలుగేళ్ళక్రితం మా పెంపుడు కుక్క 'టినీ' చివరి శ్వాస తీసుకునేటప్పుడు బాబా నాకు తెలిసి ఉంటే, దయతో బాబా దాన్ని కూడా కాపాడి ఉండేవారు. అలా జరిగివుంటే అది మాతోపాటు మరికొన్ని సంవత్సరాలు ఉండేది. కానీ 'టినీ'కి మాతో అంతే ఋణానుబంధం ఉందేమో!

"బాబా! అందరినీ ఆశీర్వదించండి."

 ఓం సాయిరామ్.

అదీ నా బాబా చెప్పే పద్దతి - ఆయన పద్ధతులే వేరు



సాయి బంధువు 'రిట్జ్' గారు నిన్న గురుపౌర్ణమి రోజు తనకు బాబా ఇచ్చిన చక్కని అనుభవాన్ని ఒక వాట్సాప్ గ్రూపులో తెలియజేసారు. చూడడానికి చిన్న అనుభవమైన అది నా మనస్సుకెంతో హత్తుకుంది. అందుకే సాయి బంధువులందరికి ఆ ఆనందాన్ని అందించాలని తెలుగులోకి అనువదించి మీకు అందిస్తున్నాను. తన మాటలలోనే చదివి ఆనందించండి.


అందరికీ సాయిరామ్
నాకు గురుపౌర్ణమి రోజు బాబా ఇచ్చిన ఒక చక్కటి అనుభూతిని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అది చిన్నదే అయినా చాలా అందమైనది, మధురమైనది. అందుకే మనస్సు ఆపుకోలేక వెంటనే మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాబా నేను చేసే చిన్న సేవని, ఆయనపట్ల నాకున్న ప్రేమని ఆయన స్వీకరిస్తున్నానని ఈ అనుభవం ద్వారా తెలియజేసారు.

ఈరోజు గురుపూర్ణిమ బాబా! అని చిన్నగా బాబాతో మాట్లాడుకుంటూ ఆయన పాదాలను ఉహించుకొని శిరస్సు వంచి నమస్కరిస్తూ "ఓ గురుదేవా! మీ పాదాలకు సమర్పించుకుంటున్న ఈ నమస్కారాలను స్వీకరించండి" అని బాబాతో సవినయంగా చెప్పుకున్నాను. మీరు నేను చెప్పేది నమ్మరు! ఆశ్చర్యం. మరుక్షణంలో నా మొబైల్లో ఒక పాట ప్లే అవ్వడం మొదలుపెట్టింది. గురుపూర్ణిమ రోజుకి తగిన అలాంటి పాట నా మొబైల్ లో దానంతట అదే ప్లే అవ్వడం మొదలుపెట్టింది. అంతటి అంద్భుతమైన పాట నా మొబైల్లో సేవ్ చేసి ఉందని కూడా నాకు తెలియదు.

ఆ పాట మీకోసం

"కోయి శిష్య్ జబ్ గురు చరణో మై షీష్ ఝుకత హై పరమాత్మా ఖుద్ ఆకార్ ఆశిష్ లుటతా  హై"

భావం: "ఎప్పుడైతే శిష్యుడు తన గురువు పాదాలపై తన శిరస్సు ఉంచుతాడో... మరుక్షణం దేవుడు అతనిని ఆశీర్వదించటానికి స్వయంగా వస్తాడు"

నేను బాబా పాదాలపై శిరస్సు ఉంచిన మరుక్షణం ఈ పాట ప్లే అయ్యింది. ఇంతకన్నా అందమైన అనుభవం ఏమి ఉంటుంది. ఆవిధంగా బాబా 'నా పాదాల మీద నీకున్న ప్రేమను మరియు నీ నమస్కారాలను స్వీకిరిస్తున్నానని' తెలియజేసారు. అదీ నా బాబా చెప్పే పద్దతి. ఆయన పద్ధతులే వేరు. "మా సంప్రదాయమే వేరు" అని స్వయంగా బాబాయే చెప్పారు కదా! 

ప్రియమైన సాయిబాబా, నా దేవా, నా సద్గురు సాయినాధ మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను.

ఓం సాయి రామ్.

బాబాయే కాపాడారు


సాయి బంధువులందరికి గురు పౌర్ణమి శుభాకంక్షాలు

ఓం సాయిరాం


నా పేరు దీప్తి, నేను బాబా భక్తురాలిని. సచ్చరిత్రలో "పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను నేనే నా దగ్గరికి లాక్కుంటాను" అని బాబా చెప్పినట్లుగా నన్ను కూడా తన దగ్గరకి లాక్కున్నారు బాబా. నేను 1995వ సంవత్సరం అక్టోబర్ నెలలో మొట్టమొదటిసారిగా షిర్డీ వెళ్ళాను. అప్పటినుంచి పూజలు, ఉపవాసాలు చేస్తూ ఆయనను ఆరాధించుకుంటున్నాను. కొన్ని కారణాల వలన మధ్యలో బాబాని దూరం చేసుకున్నాను. కానీ బిడ్డ చేసిన తప్పులను పట్టించుకోని తల్లిలా బాబా నన్ను సదా రక్షిస్తూనే ఉన్నారు. నేను రోజూ ఈ బ్లాగులో వచ్చే అందరి అనుభవాలు చదువుతూ, "నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, వాటిలో దేనిని సాయి బంధువులతో పంచుకోవాలి?" అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే బాబా నాకు ఈరోజు(తేదీ 24.07.2018) మధ్యాహ్నమే ఒక అనుభవాన్ని ఇచ్చారు. బహుశా ఈ అనుభవాన్నే మొట్టమొదటిసారి బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవాలని బాబా నిర్ణయమేమో. దానినే ఇప్పుడు మీతో పంచుకుంటాను.



ఈరోజు మధ్యాహ్నం బాబా మమ్మల్ని ఎలా కాపాడారో చెప్తాను. నేను, మా మామయ్య బైక్ పై వెళ్తున్నాము. ఇక్కడ మా ఏరియాలో చెయిన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందువలన నేను ఎప్పుడు బయటకు వెళ్లినా నా మెడ చుట్టూ చున్నీ వేసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు ఏదో మాట్లాడుకుంటూ పరధ్యానంగా చున్నీ మెడ చుట్టూ వేసుకోకుండా వెళ్ళిపోయాను. నేను మనసులో బాబా నామం అనుకుంటూ ఉన్నాను. కొంచెం దూరం వెళ్ళగానే ఎందుకో తెలియదుగాని వెనక్కి తిరిగి చూడాలని అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి బైక్ పై ఇద్దరు వ్యక్తులు మెల్లగా మమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నారు. నేను వెంటనే చున్నీ మెడ చుట్టూ వేసుకున్నాను. అంతే, అంతవరకూ మా వెనకే వస్తూ ఉన్న వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్లిపోయారు. వాళ్ళు నా చైన్ లాగి ఉంటే నేను, మా మామయ్య ఇద్దరం బైక్ పైనుంచి పడిపోయేవాళ్ళం. కానీ సరైన సమయానికి వెనక్కి చూసేలా నాకు ప్రేరణనిచ్చి ఆ ప్రమాదం జరగకుండా బాబాయే కాపాడారు. ఈవిధంగా నన్ను చాలాసార్లు బాబా కాపాడారు.



గత నెల మేము షిర్డీ వెళ్ళినపుడు నేను ఎలా దర్శించుకోవాలని అనుకున్నానో, అన్నీ అలాగే అనుగ్రహించారు బాబా.



ఓం సాయిరాం.



దీప్తి,

హైదరాబాద్.

నమ్మితే చాలు, ఆయన ఏ రూపంలోనైనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు


సాయిరాం.

ముందుగా, "నా వలన ఏమన్నా తప్పులు జరిగివుంటే క్షమించండి ప్రభూ!" అని సాయినాథుని చరణ కమలాలకు కోటి కోటి నమస్కారములు తెలియజేస్తున్నాను. నేను సదాశివ(AIR, సంబల్పూర్). మీతో మరో సాయిబాబా లీలను పంచుకుందామని వ్రాస్తున్నాను.

నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని. మరి బాబా దయ అనాలో, కృప అనాలో నాకు తెలియదు. బాబా లీల అనాలో, చమత్కారం అనాలో అది కూడా తెలీదు నాకు. నేను అంతగా చదువుకున్నవాడిని కూడా కాదు. మాధవి మేడం గారు నా అనుభవాలు వ్రాయమంటే "ఓహో, ఇలా కూడా బాబా మహిమలను నలుగురు సాయి బంధువులతో పంచుకోవచ్చునా" అనుకున్నాను. ఇపుడు అసలు విషయానికి వస్తాను.

మూడు సంవత్సరాల ముందు నా చెల్లికి, బాబా కృపాకటాక్షాలతో ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మేము ప్రయత్నం చేయకుండానే వచ్చిన సంబంధం. ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా నాన్న చిన్నవయసులోనే చనిపోయాడు. అమ్మ పెన్షన్ చాలా తక్కువ. పేదరికం వలన పెళ్లి ఎలా చెయ్యాలో తెలియక చాలా కష్టపడ్డాను. మా ఆఫీసులో అందరినీ డబ్బు అప్పుగా అడిగి చూశాను. కానీ అప్పు దొరకలేదు. ఇంక నా బాధ వర్ణనాతీతం. కానీ, సాయిబాబా మీద నమ్మకం వదలకుండా బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నిద్దామని బ్యాంకుకు వెళ్ళాను. మేనేజర్ నన్ను పిచ్చివాడ్ని చూసినట్లు చూసి, “పెళ్లికి ఎవరన్నా లోన్ ఇస్తారా?” అని, "మీ అమ్మ పెన్షన్ బుక్ తీసుకురా!" అన్నాడు. "మా ఇంట్లో ఆ బుక్ ఎక్కడో పోయింది, కనిపించడం లేద"ని చెప్పాను. మేనేజర్ వినలేదు, నన్ను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు. నేను ఇంటికి  తిరిగి వెళ్తున్నప్పుడు, మా ఇంటికి చేరువలో ఒక ముసలివాడు కనపడి, "ఏమిటి, అలా ఉన్నావు?" అని అడిగాడు. అతను ఎవరో, ఏమో ఆలోచించలేదు. నేను నా కథ మొత్తం చెప్పాను. అతను, "రేపు వెళ్ళు బాబు, లోన్ ఇస్తాడు" అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేశాయి. మరుసటిరోజు నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాను. మేనేజరునే బాబా అనుకుని, "సర్, చెల్లి పెళ్లి చేస్తాను, లోన్  ఇప్పించండి" అని చాలా వేడుకున్నాను. నా మాటలు నమ్మండి, ఆ సమయంలో నాకు బాబానే కనపడ్డారు. ఏ మంత్రం పనిచేసిందో తెలీదుకాని, ఆ మేనేజర్ వెంటనే 2లక్షల 50 వేల రూపాయల లోన్ శాంక్షన్ చేసి, "వెళ్ళు బాబు! నీ చెల్లి పెళ్లి బాగా చెయ్యి" అన్నాడు. అదే మేనేజర్ నిన్న చెయ్యలేదు, ఈరోజు చేసాడు. నేను ఆశ్చర్య పోయాను. మరో ముఖ్య విషయం ఏమిటంటే, నిన్న నాతో మాట్లాడిన ముసలివాని గొంతు, ఈరోజు ఇక్కడ మేనేజర్ గొంతు ఒక్కటే. ఇప్పటికీ ఆ విషయం నాకు అంతు చిక్కదు. 24 గంటల్లో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇది బాబా కృప కాకుంటే ఏమనాలి? నేను చెప్పేదేమిటంటే, నమ్మితే చాలు, ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు. నాలాంటి పేదవాడికి, చదువు కూడా రానివాడికి, ఎన్ని అనుభవాలో చెప్పలేను. మన సాయిబాబా 'దయాసాగరుడు' అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

సాయి బ్లెస్సింగ్స్


మలేషియా నుండి సాయిసోదరి దయలిని గారి అనుభవం:

ఓం సాయిరామ్! 2014 నుండి నేను షిరిడీ సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో జరిగిన నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

2014లో మా నాన్నగారు ఒక సాయి ఫోటో కొనుగోలు చేసి పూజా గదిలో పెట్టారు. అప్పటికి నాకు బాబా గురించి ఏమీ తెలియదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు ఎల్లప్పుడూ బాబా గురించి మాట్లాడుతుండేది. ఒకరోజు ఆమె నన్ను సాయి మందిరానికి తీసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకుంది. బాబా గురించి నాకు ఏమీ తెలియని కారణంగా నేను నిరాకరించాను. కానీ ఆమె తనతో నన్ను రమ్మని బలవంత పెట్టింది. సరే అని తనతో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. బాబా ఆలయంలో అడుగుపెట్టడం అదే మొదటిసారి. నేను బాబా ముందు ఒక నేతి దీపం పెట్టాను. నా పక్కన బెలూన్ తో ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంది. పాప రక్షణ కోసం బాబాకి అర్చన చేయడానికి ఆమె తల్లి చిన్న పాపతో గురుకుల్ నుండి వచ్చింది. హఠాత్తుగా ఏడుపు వినిపించింది. ఆ చిన్న పాప జుట్టుకి నిప్పు అంటుకుంది. అందరూ ఆ పాప సహాయానికి ముందుకు వెళ్లారు. అద్భుతం! పాపకి ఏ గాయం కాలేదు. కేవలం 1% జుట్టు కాలింది. బాబా కృప కారణంగా ఏమీ కాలేదని, ఇది బాబా మిరాకిల్ అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ బాబాపై నాకు విశ్వాసం కుదరలేదు.

మరుసటి వారం బాబాని చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. వెంటనే ట్రైన్ ఎక్కి సాయిబాబా మందిరానికి వెళ్ళాను. మందిరానికి సమీపంలో ఉండగా నా ఫోన్ రింగ్ అయ్యింది. మా అమ్మ, "ఇంటిలో పూజ ఉంది, వెంటనే ఇంటికి రా!" అని చెప్పింది. నేను చాలా నిరాశ చెంది, విచారంగా తిరిగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి తిరిగి రాగానే, అమ్మ పూజకు సహాయం చేయమని అడిగింది. ఆమె, "పొంగల్ చేసాను, పూజాగదిలోకి తీసుకొని వెళ్లి పెట్టు" అని చెప్పింది. నేను పూజాగదికి వెళ్ళాను. వెళ్లి నేను ఏమి చూశానో ఉహించగలరా!

సాయి ముఖం నిండా ఊదీ ఉంది. బాబా శక్తివంతమైన కళ్ళు మాత్రమే కనిపిస్తూ, ముఖం మొత్తం ఊదీతో కప్పబడి ఉంది. కన్నీళ్లతో నా కళ్ళు నిండిపోయాయి. వెంటనే మా అమ్మ దగ్గరకు పరుగెత్తాను. "అమ్మా, బాబా ముఖం నిండా ఊదీ పూశావా?" అని అడిగాను. ఆమె 'లేదు' అని చెప్పింది. మా అమ్మను నాతో రమ్మని పిలిచాను. కుటుంబమంతా నన్ను అనుసరించి పూజా గదికి వచ్చి బాబా యొక్క అద్భుతమైన లీలను చూశారు. నేను, "కొంతసేపటి క్రితం సాయి మందిరానికి వెళ్ళాను. మందిరానికి సమీపంలో ఉండగా, అమ్మ ఫోన్ వచ్చింది. వెంటనే నేను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాను. బాబా నన్ను అనుసరించి మన ఇంటికి వచ్చి, ఇక్కడ కూడా నేను ఉన్నానని నిరూపిస్తున్నారు" అని చెప్పాను. ఆ రోజు నుండి నేను విశ్వాసపాత్రురాలైన సాయి భక్తురాలిగా మారిపోయాను. అప్పటినుండి నా జీవితంలో చాలా అద్భుతాలను చూపుతున్నారు బాబా.

నా రెండవ అనుభవం:

ఇంటిలో సాయి మూర్తి (విగ్రహం) ఉండాలని నేను కోరుకున్నాను. నేను బాబాను, "మీరు ఇంట్లో ఉండాలి, అలా మీరు ఉంటే ప్రతి గురువారం నేను మీకు అభిషేకం చేసుకోగలను" అని ప్రార్థించాను. ఎప్పుడూ బాబా విగ్రహం కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ కొనుగోలు చేయలేకపోయాను. ఒకరోజు నేను నా తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాను. నా సోదరుడు నన్ను పిలిచి, "నీకోసం ఒక పార్సిల్ ఉన్నది" అని చెప్పాడు. నేను ఏమిటని అడిగాను. అతను, "తెలియదు, కానీ అది ఒక పెద్ద బాక్స్" అని చెప్పాడు. అతను బాక్స్ తెరిచి, అందులో సాయి మూర్తి వుంది అని నాకు చెప్పాడు. నా కజిన్ సోదరుడు నా జన్మదిన బహుమతిగా నాకు సాయి మూర్తి ఇచ్చాడు. ఆనందబాష్పాలు నా కళ్ళ నుండి జాలువారాయి. మళ్ళీ బాబా నా కోరిక నెరవేర్చారు. బాబా! నీ లీల అద్భుతం, అమోఘం. ప్రతి ఒక్కరి జీవితంలో బాబా అడుగు పెడితే వారి జీవితం అద్భుతమవుతుంది. ఓం సాయిరామ్. ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరినీ బాబా ఆశీర్వదించు గాక!

నేను బాబా వల్లే ఇంకా జీవించి ఉన్నాను.



ఖతర్ నుండి ఆర్య గారు తనని సాయి ఎలా రక్షించారో మన "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగ్ లో మన సాయి పరివార్ అందరికి తెలియచేయాలని వారు కోరుతున్నారు. వారి అనుభవాన్ని వారిమాటల్లోనే విందాం.
                                                                                  
ఓం సాయిరాం. నా పేరు "ఆర్య సిద్దార్థ్ ఇంగలె". గత 13సంవత్సరాల నుండి నేను మధ్య తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నాను. నా జీవితం నాకు సాయి ఇచ్చిన బహుమతి. కరుణామయుడు అయినా సాయి ఎల్లపుడూ తన చల్లని కరుణ నాపై చూపిస్తూనే ఉన్నారు. బాబా నన్ను ఎలా కాపాడారో ఇంకా వేరే రూపంలో ఎలా నాకు దర్శనం ఇచ్చారో ఇప్పుడు మీతో పంచుకుంటాను.
2008వ సంవత్సరంలో నేను మస్కట్(ఒమాన్)లో జాబు చేస్తున్నాను. అప్పుడు ఒకసారి  ఫిబ్రవరి నెలలో నాకు హై బ్లడ్ షుగర్ 485 ఉందని తెలిసింది. అయితే మధుమేహం మా ఇంట్లో అందరికి ఉన్నది. కాబట్టి సాధారణంగా అది వంశపారంపర్యంగా నాకు రావచ్చు, కానీ అప్పటికి  నా వయస్సు కేవలం 32సంవత్సరాలే. మరి ఇంత యర్లీగా నాకు షుగర్ ఎందుకు వచ్చిందా? అని నేను చాలా షాక్ అయ్యాను. నా జీవితం ఇంక అయిపోయింది అని బాగా క్రుంగిపోయాను. నా దైర్యాన్ని అంతా కూడ తీసుకోని పగలు రాత్రి బాబాని ప్రార్ధించే వాడిని." సాయి సచ్చరిత్ర"  పారాయణ చేస్తూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. సాయి నాతో ఉన్నారు. బాబా దయతో నా షుగర్ లెవెల్స్ 20 రోజులలో బాగా తగ్గుతూ వచ్చాయి. అప్పటినుండి ఇప్పటిదాక నేను ఏ మందులు వాడటంలేదు. కానీ నా షుగర్ లెవెల్స్ నార్మల్ గానే ఉన్నాయి. నేను అందరిలాగే ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఈరోజు జీవించి ఉన్నాను అంటే అదంతా బాబా దయ, ఆయన ఆశీర్వాదం వలననే.

ఇంకో మహా అధ్బుతమైన అనుభవాన్ని కూడా బాబా నాకు ఇచ్చి నన్ను మంత్రముగ్డుడ్ని చేసారు. అది నా జీవితంలో మరచిపోలేని అనుభవం. ఒకసారి నేను 120km/h వేగంతో కారు డ్రైవింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరో గట్టిగా అరుస్తూ నా వెనక వస్తున్నట్లు గమనించి వెంటనే నా కారు ఆపి చూస్తే ఒక ముసలి మనిషి చేపల వేటగాడిలా ఉన్నారు. అతను తన పాత వాన్ లో నుంచి  దిగి,  నా కారు వద్దకి వచ్చి కింద నా కారు సైలేన్సర్ కి   అంటుకుని ఉన్న పెద్ద పాలీతిన్ కవర్ ని లాగేసారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అతని చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాను. అదంతా రెప్పపాటు కాలంలో వేగంగా జరిగిపోయింది. నేను మరో ఆలోచన చేసేలోగా ఆయన తన వాన్ తీసుకుని ట్రాఫిక్ లో అదృశ్యమైపోయాడు. ఆ ముసలి వ్యక్తీ మొహం గుర్తు చేసుకుంటూ ఉంటే అతను నాకు బాగా తెలిసినా వారిలా అనిపించారు. రెండు రోజుల తర్వాత సాయిబాబాకు సంబందించిన ఒక టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అందులో సాయిబాబా ఒర్జినల్ ఫొటోలు చూపిస్తున్నారు. ఆ ఫోటోలు చూసిన వెంటనే నన్ను రెండు రోజుల క్రితం కాపాడడానికి వచ్చింది బాబానే కానీ వేరెవరో కాదు అని గ్రహించాను. ఇలా సాయి సదా నన్ను తను బిడ్డలా కాపాడుతూనే ఉన్నారు. బాబా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి కష్టాలు, బాధలు తొలగించుగాక!

ఓం సాయిరాం!!!

ఊది మహిమతో-బాబా పాదదాసుడగుట



సచ్చిదానంద స్వరూపుడు, జగత్తును సృష్టించి, పోషించి, లయింప చేసేవాడు, భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమిచ్చు సదాశివుడు, సద్గురువు అయిన ఆ సాయినాథునికి నమస్కారం.

నా పేరు ఎన్. జనార్ధన్. నేను హైదరాబాదులోని రాంనగర్ నివాసిని. నా వయసు 75 సంవత్సరాలు. కానిస్టేబులుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం బాబా సేవలో ఆనందంగా జీవితం గడుపుతున్నాను.

1975వ సంవత్సరంలో నేను కానిస్టేబుల్ గా చిత్తూరుకు దగ్గరగా ఉన్న చెన్నూరు గ్రామంలో పని చేశాను. ఆ గ్రామంలో ఒక ముస్లిం సాయిభక్తుడు ఉండేవాడు. అతని పేరు 'బషీరుద్దీన్ బాబా'. తను ఆ చెన్నూరులోనే ఒక ఆలయం నిర్మించాడు. అది 'రామ్ సాయి మందిర్'. ఇంతవరకు అలాంటి ఆలయాన్ని నేను ఎక్కడా చూడలేదు. సీత, రామ, లక్ష్మణుల మూర్తులు వెనుకకు ఉంటాయి. వారి ముందు బాబా మూర్తి ఉంటుంది. ఎంతో బాగుంటుంది.                       

మేము పదిమందిమి కలిసి సేవ చేయడం కోసం 'రామ్ సాయి మందిర్'కు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో గుడి కొత్తగా కట్టడం వల్ల చాలా రద్దీగా ఉండేది. మా పదిమంది ఒక్కొక్కరుగా విడిపోయి బాబా సేవ చేసుకొనేవాళ్ళము. నాది మందిరానికి వచ్చే భక్తుల నుండి కొబ్బరికాయలు తీసుకుని కొట్టే సేవ. అయితే, ఒకసారి కొబ్బరికాయలు కొట్టి, కొట్టి నా చేతులు కమిలిపోయి, గాయమై రక్తం వచ్చింది. బషీరుద్దీన్ బాబా నా చేతిలో నుండి రక్తం రావడం గమనించి, శేజ్ హారతికి ముందు బాబా ఊదీని నా చేతినిండా పూసి, ఒక రుమాలు తీసుకొని పైనుండి చేతికి కట్టి, "మళ్ళీ రేపు శేజ్ హారతికి కట్టు విప్పుతాను, అంతవరకూ అలాగే ఉండనీయండి" అని అన్నారు. మరుసటి రోజు నా చేతికున్న రుమాలుని తీసి చూస్తే ఆశ్చర్యం, అద్భుతం. ఊదీ మహిమ అమోఘం. కనీసం గాయం తాలుకు మచ్చ అయినా లేదు. నాకు గాయమై రక్తం వచ్చింది కదా! కొంచెం అయినా మచ్చ ఉండాలి కదా! అసలు గాయం కావడానికి మునుపు ఎలా ఉందో అలాగే ఉంది. అప్పటినుండి మొత్తం నా జీవితమే మారిపోయింది. అంతా సాయిమయం అయింది. ఏదో గుడిలో సేవ చేసుకుందాం, పుణ్యం వస్తుంది కదా అని వెళ్ళిన నేను సాయికి దాసుడనైపోయాను.

అలా 1975లో బాబా భక్తుడిగా మారిపోయాను. ఇప్పుడు నా వయస్సు 75 సంవత్సరాలు. అంటే బాబాతో నా అనుబంధం 42 సంవత్సరాలు. ఆయన నీడలో నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. నేను ప్రతిరోజూ రాంనగర్ సాయిబాబా గుడికి వెళ్తాను. ఆ బాబా రప్పించుకుంటున్నాడు. 

1975వ సంవత్సరంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఘంటసాలగారు కాకడ హారతికి వచ్చి ఆ గుడిలో రెండు రోజులు ఉండి కాకడ హారతి, సుప్రభాతం పాడారు. నా ఈ అమూల్యమైన మొదటి అనుభవాన్ని మీతో 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్' ద్వారా పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను


సాయిసోదరి గీత గారు తన చిన్న అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. 

ఇటీవల ఒక వాట్సాప్ గ్రూపులోని సభ్యులొకరు షిర్డీ వెళ్తూ, "మీ చిరునామా ఇవ్వండి, నేను మీకు ప్రసాదం పంపుతాన"ని చెప్పారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి చిరునామా ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మను చూడటానికి నేను ఎలాగూ అక్కడికి వెళ్తున్నాను కాబట్టి అక్కడే ప్రసాదం తీసుకోవచ్చని నా ఆలోచన. అనుకున్నట్లుగానే ఒకరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా, అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి మందిరానికి వెళ్తూ ఉంటాను. మొదటిసారిగా మా బాబును స్కూలుకి పంపిస్తూ, ముందుగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కణ్ణించి టెంపుల్ కి వెళ్లవచ్చనే కోరికతో. కానీ కొన్ని అనివార్య కారణాల వలన నేను సాయి మందిరాన్ని దర్శించకుండా ఇంటికి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. నేను అక్కడినుండి వచ్చేసిన మరుసటిరోజు అమ్మ ఫోన్ చేసి, షిర్డీ నుండి ఒక పార్సెల్ వచ్చిందని చెప్పింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది, కానీ అదేసమయంలో స్వయంగా వెళ్లి తీసుకోలేనని చాలా బాధపడ్డాను.

వారంరోజుల తరువాత ఒక ఉదయం నేను నా భర్తతో, "మన బాబుకు బాబా ఆశీస్సులకోసం సాయి మందిరానికి వెళ్లాలనుకున్నాను, అది జరగలేదు. అంతేకాకుండా షిర్డీ నుండి ప్రసాదం కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చాక వచ్చింది. ఈసారి నేను తనని దర్శించడానికి బాబా ఇష్టపడనట్లుగా కనిపిస్తోంది" అని బాధగా చెప్పుకున్నాను. మేము ఉదయం అనుకున్న ఈ మాటలు మా అమ్మకు తెలియవు. హఠాత్తుగా ఆమె, నా సోదరుడు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు బాబా ప్రసాదం తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. అలా నాకు బాబా ప్రసాదం అందుతుందని నేను అస్సలు ఊహించలేదు. "నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను' అన్న  బాబా సమయానికి షిర్డీ ప్రసాదాన్ని అందించి నా బాధను తీర్చేసారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబా! మీకు నా ధన్యవాదాలు.
-----------------------------------------------------------------------------------
హైదరాబాదుకి చెందిన మాలతిగారు అనుభవం:
సద్గురు సాయినాథా! మీకు ప్రణామాలు.

సాయిబంధువులందరికీ సాయిరామ్. నా పేరు మాలతి. నేను దిల్ సుఖ్ నగర్ నివాసిని. "నేను కూడా బాబా భక్తురాలిని" అని చెప్పుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఒక చిన్న బాబా లీలను "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

అవి దసరా నవరాత్రులు. ఒకరోజు బాబా దర్శనం చేసుకుని ప్రక్కనే ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళాను. అమ్మవారి శేషవస్త్రాలు, దండలు తొమ్మిదిమంది ముత్తైదువులకు పంచిపెడుతున్నారు. అయితే నాకు కూడా అమ్మవారి దండ కావాలని మనసులో అనిపించింది. కానీ మేము నిల్చున్న వరుసలో నా వరకు వచ్చేసరికి నా సంఖ్య పది అయింది. తొమ్మిదిమందికే ఇస్తారు కాబట్టి నాకు అవకాశం రాదని విచారంగా అక్కడినుండి మళ్ళీ బాబా గుడికి వచ్చి కూర్చున్నాను. కొంతసేపటికి నా స్నేహితురాలు వచ్చి, "రా! మనం బాబాకి అర్చన చేయిద్దాం" అని తీసుకువెళ్ళింది. సాయిబాబాను తదేకంగా చూస్తూ, "ఒక పూలదండ నీవైనా ఇవ్వచ్చుగా బాబా!" అని బాబాని అడిగాను. అర్చన అయిన తర్వాత అక్షింతలు వేసి పూజారిగారు బాబా మెడలో నుండి దండను తీసి నాకు ఇచ్చారు. 'నాకేనా?' అని అడిగాను. "బాబా ఇస్తుంటే ఆలోచిస్తున్నారా? బాబా నీకు ఇవ్వమన్నారు" అని అన్నారు పూజారిగారు. బాబా పిలిస్తే పలికే దైవం కదా! నేను పిలిస్తే పలికి నా కోరికను తీర్చారు. "నా భక్తుల బాధలన్నీ నా బాధలే" అని బాబా అంటుంటారుగా! నిజంగా ఆ సమయంలో నాకు చాలా బాధేసింది, అందుకే బాబా గుడి పూజారిగారికి ప్రేరణనిచ్చి నాకు దండని అనుగ్రహించారు. నా కళ్ళ నుండి ఆనందభాష్పాలు వచ్చేసాయి. కొద్దిసేపటి వరకు నా పరిస్థితి ఏమిటో నాకు అర్ధం కాలేదు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పటినుండి "మనకు ఏమి కావాలన్నా ఇవ్వడానికి బాబా ఉన్నారుగా!" అన్న ధైర్యం నాకు కలిగింది. "అందరినీ అనుగ్రహించడమే కదా బాబా అవతారకార్యం". అందుకే నన్ను ఇలా అనుగ్రహించారు. చిన్న కోరికే అయి ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితులలో నాకు అదే ఎక్కువ. ఎందుకంటే నా మనసు అప్పుడు బాబా దండను కోరుకుంది. "నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను' అని బాబా మరోసారి నా విషయంలో నిరూపించారు. ప్రతిసారి నా కోరికను తీరుస్తూ, మన మనసు తెలుసుకొని తిరుగుతున్న కలియుగ ప్రత్యక్షదైవం మన సాయిబాబా.

స్వప్నంలో సాయి దివ్యదర్శనం


సాయిభక్తులందరికీ సాయిరాం. నా పేరుగాని, ఊరుగాని తెలియచేయడం నాకిష్టం లేదు. "నేను ఒక బాబా భక్తురాలిని" ఇది చాలనుకుంటాను నన్ను నేను ఈ సమాజానికి గర్వంగా చూపించుకోవడానికి. 'గర్వంగా' అని ఎందుకు అన్నానంటే, నేను బాబా నీడలో ఉన్నానని అలా అన్నాను. ఒక అద్భుతమైన లీలను "సాయిమహరాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా పంచుకొనే అవకాశం బాబా ఇచ్చినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు.

నేను ప్రతి గురువారం తప్పనిసరిగా బాబా దర్శనం చేసుకుంటాను. మిగతా రోజులలో కూడా నాకు వీలు కుదిరినప్పుడల్లా బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. కానీ ఒక గురువారం ఎందుకోగానీ నా మనసులో, 'నవగురువారవ్రతం' చేయాలని ఒక చిన్న కోరిక కలిగింది. బాబా కూడా నా కోరిక తీర్చారు. బాబా ఆశీర్వాదంతో తర్వాత గురువారం నుండి వ్రతం మొదలుపెట్టాను. అప్పటికే ఇదివరకు ఒకసారి నాకు బాబా స్వప్నంలో దర్శనం ఇచ్చారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ విషయం వ్రతం మొదలుపెట్టిన రెండోవారం శుక్రవారంనాడు గుర్తుకొచ్చి‌, "ఇప్పుడు నేను నవగురువారవ్రతం చేస్తున్నాను కదా! బాబా, నాకు మరలా మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించండి" అని మనస్ఫూర్తిగా బాబాను అడిగాను.

నేను అడగటమే ఆలస్యం అన్నట్లు అదేరోజు రాత్రి నాకు కలలో బాబా దివ్యదర్శనం లభించింది. కలలో నేను షిరిడీలో బాబా విరాట్ స్వరూపమూర్తి ముందు లైన్లో ఉన్నాను. నన్ను వెనకనుండి అందరూ నెడుతుండటం వలన బాబాను సరిగా చూడలేకపోతున్నాను. నేను సరిగ్గా బాబా ముందుకు రాగానే లైనును ఆపివేశారు. అప్పుడు బాబా పూర్తిగా కనపడుతున్నారు. ఎంత సుందరమైన దివ్యదర్శనం అంటే నాకు కలలో దర్శనం అవుతున్నాగాని నా మనసుకు మాత్రం అది నిజదర్శనం అన్నట్లుగా ఉంది. ఆ దివ్యమంగళరూప దర్శనంతో కలత చెందిన మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఆ ఆనందస్వరూపాన్ని చూడటానికి నాకు రెండు కళ్ళూ సరిపోవడంలేదు. ఆ క్షణాలు అలాగే ఆగిపోతే బాగుండుననిపించింది. చిరుదరహాసంతో బాబా నన్నే చూస్తున్నారన్న అనుభూతిని నేను పొందాను. తన బిడ్డలమైన మన మీద బాబాకి ఎంత ప్రేమ! తన వెచ్చని చూపులతోనే తన పిల్లలని ఆప్యాయంగా లాలిస్తూ, తన ఒడిలో వెచ్చగా సేదతీరుస్తున్న అనుభూతి. కలలో నాది ఆ స్థితి, ఆనంద స్థితి, అర్ధంకాని స్థితి. ఎందుకంటే నేను కలలో పొందిన ఆ ఆనందానుభూతిని వర్ణించడానికి నాకు పదాలు, భాష సరిపోవట్లేదు. ఎందుకంటే సాయి మాతృప్రేమ అలాంటిది. తనని చూస్తూ నన్ను నేను మైమరచిపోతూ నా చేతి గుప్పిట్లో ఉన్న పసుపురంగు గులాబీ పువ్వుల్ని బాబాగారి విరాట్ మూర్తిపైన, సమాధిపైన ఎంతో ప్రేమగా ఆనందభాష్పాలతో సమర్పించుకున్నాను. అంతలో నా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నన్ను ప్రక్కకు జరిపారు. నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. కానీ నా కళ్ళ నుండి కన్నీళ్లు ఆగడం లేదు. అవి ఆనందభాష్పాలు! అడగగానే తన బిడ్డ మీద సాయి కురిపించిన ప్రేమవర్షం. అడిగినంతనే నా కోరికను తీర్చారు బాబా. ధన్యవాదములు బాబా. కలలోనైనా, ఇలలోనైనా నీ దర్శనభాగ్యంతో నా కర్మలన్నింటినీ తొలగించి నన్ను మీ దరికి చేర్చుకోండి బాబా. సదా మీ ఆశీర్వాదం నాపైన ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ! ఓం సాయిరాం.

సాయిబాబాకు నామీద ఇంత కృప ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.


ఓం సాయిరాం.

అన్నిటికన్నా ముందు సాయి చరణ కమలాలకు నా నమస్కారములు అందజేస్తూ, నేను మీ సదాశివ, సాయి అనుగ్రహంతో మీతో మరో సాయిలీల పంచుకుందామని వచ్చాను.

నేను చిన్నవయసు నుంచి సాయిబాబాను చాలా నమ్మి బ్రతికేవాడిని. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని. మా నాన్నగారు నా చిన్న వయసులోనే చనిపోవడంతో అనేక కష్టాలని ఎదుర్కొన్నాను. మా నాన్న చనిపోయినాక మేము ఒక మట్టితో కట్టిన ఇంటిలోకి మారినాము. వాన వస్తే ఇల్లు మొత్తం నీటితో నిండిపోయి చాలా కష్టాలు పడేవాళ్ళం. సాయిబాబా కృపాకటాక్షాల కోసం ఆయన పాదాల చెంతకే చేరాను. ఎందుకో చెప్పలేను కానీ, ఆయన దర్బారుకు చేరేసరికి అన్నీ మర్చిపోయేవాడిని. ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయేవాడిని. ఏమీ అడిగేవాడిని కాదు. కానీ ఆయన మన మనసెరిగిన దేవుడు. మనలోనే అంతర్గతంగా కొలువై ఉంటాడు. ఆయనకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నా దుఃఖం ఎలా దూరం చేశాడో చూడండి. నేను ఇల్లు మరమ్మత్తు చేయించడానికి లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళాను. నేను ఒక సాధారణ ఉద్యోగిని కావడంతో నాకు వచ్చే జీతం చాలా తక్కువగా ఉండేది. అందువలన నాకు లోన్ చాలా తక్కువ వస్తుంది. దానికి ఎవరో ఒకరి గ్యారంటీ కావాలి. నాలాంటి వాడికి గ్యారంటీ ఎవరు ఇస్తారు? దిక్కులేని చోట దేవుడే దిక్కు. నేను లోన్ కి ఐతే దరఖాస్తు చేసాను. "అది అంత సులువుగా అయ్యేపని కాదు" అని మేనేజర్ అన్న మాటలు విని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తరువాత బాబా ముందు కూర్చొని, ఎంతో బాధపడ్డాను. నాలుగు రోజులు గడిచిపోయినాయి. చాలా పెద్ద తుఫాను వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఇంతలో బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. "అరె, సదాశివా! నిన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. "మేము షిర్డీ నుంచి వచ్చాము. సదాశివ మాకు బాగా తెలిసిన వ్యక్తి. మేము అతనికి గ్యారంటీగా ఉంటాము, అతనికి లోన్ ఇవ్వండి. ఏ సమస్యా రాదు" అని చెప్పారు" అని చెప్పి, "ఇదిగో! నీ లోన్ శాంక్షన్ చేసాను. ఈ ఒకటిన్నర లక్షలు తీసుకొని వెళ్లి ఇల్లు మరమ్మత్తు చేసుకో" అని అన్నారు బ్యాంకు మేనేజర్. నాకు ఏమి చెప్పాలో తెలీలేదు. ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నమ్మండి. షిర్డీ నుంచి ఎవరు వచ్చారో నాకు తెలీదు. నేను ఎప్పుడూ షిర్డీ వెళ్ళలేదు. అంత అదృష్టం నాకసలు ఉందా? కానీ ఆయన లీలలు నా జీవితాన్ని నడిపిస్తున్నాయి.

15 నెలల చిన్నారిపై బాబా అనుగ్రహం


బాబా భక్తురాలు సంజీవని డోంగ్రే చౌహాన్ గారు తనకి బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం.
ముందుగా నా సాయికి కృతజ్ఞతలు. పిలచినంతనే పలికే మన సాయి తనపై నాకున్న నమ్మకాన్ని రోజురోజుకీ రెట్టింపు చేస్తున్నారు. నేను అసలు మహాపారాయణ యాత్ర చేయగలనా, లేదా అని అనుకునేదాన్ని. ఎందుకంటే మాకు సాయి దీవెనలతో పుట్టిన 15 నెలల బాబు ఉన్నాడు. బాబు నాకు సాయి ఇచ్చిన అమూల్యమైన కానుక.

మేము విదేశాలలో నివసిస్తూ ఉండటం వలన అక్కడ నాకు సహాయం చేసే వారు ఎవరూ లేరు. రోజంతా అన్ని పనులూ నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. అందుకే నేను మహాపారాయణ గ్రూపులో చేరడానికి చాలా ఆలోచించాను. కానీ, పారాయణ చేయడానికి బాబా నాకు ధైర్యం ఇచ్చారు. ప్రతివారం నాకు ఇచ్చిన అధ్యాయాలు నిర్ణయించిన సమయంలో చదివేదాన్ని. మా బాబుని కూడా నాతో కూర్చోపెట్టుకొని తనని కూడా పారాయణలో భాగస్వామి అయ్యేలా నేను ప్రయత్నం చేసేదాన్ని. వాడు అప్పటికే, “బాబా, బాబా” అని ముద్దుగా పలుకుతూ ఉండేవాడు. అంతేకాకుండా, ఇంట్లో ఎక్కడ సాయి ఫోటో చూసినా తన రెండు చేతులు జోడించి “జై!” అని పలుకుతూ ఉండేవాడు.

ఒక వారం మహాపారాయణ చేసే సమయంలో సాయి నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. ఆరోజు నాకు సాయి మహాసమాధి చెందే అధ్యాయాలు ఇచ్చారు. నేను పారాయణ మొదలుపెట్టే సమయానికి మా బాబు పడుకొని ఉన్నాడు. చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు. కాబట్టి నేను బాబు పక్కన కూర్చొని, తన చేయి పట్టుకొని చదవడం ప్రారంభించాను. సాయి మహాసమాధి చెందిన అధ్యాయాలు కదా, చదివేటప్పుడు నా మనసు చాలా భారంగా అయిపోయింది. అంతలో అకస్మాత్తుగా బాబు “బాబా, బాబా” అంటూ ఏడుస్తూ లేచాడు. నేను ఉలిక్కి పడ్డాను. ఎంత ఆశ్చర్యం! నా బాబుకి నేను చదువుతున్నది అర్థం అవుతుంది. హాయిగా నిద్రపోతున్న వాడు 'బాబా, బాబా' అని ఏడుస్తూ లేచాడంటే, సాయి దేహత్యాగం చేసిన ఆ కథ వాడికి బాధ కలిగించిందన్న మాట. నిద్రావస్థలో కూడా బాబా ప్రేమని పొందుతున్నాడు వాడు. ఎంతటి అదృష్టం నా బాబుని బాబా అంతలా అనుగ్రహిస్తున్నారు. బాబా మీకు నా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వాడిపై ఇలాగే మీ చల్లని ప్రేమను కురిపిస్తూ ఉండండి. అంత చిన్న వయస్సు నుండే వాడిలో బాబాపై అంత ఇష్టం ఏర్పడుతూ ఉంటే ఒక తల్లిగా నాకు అంతకంటే ఏమి కావాలి.

“విశ్వాసం మరియు సహనం కలిగి ఉండండి. అంతా బాబా చూసుకుంటారు”. కష్ట సమయాల్లో నాకు నేను ఈ మాటలే చెప్పుకుంటూ ఉంటాను. సాయి దీవెనలు సదా అద్భుతాలు చేసి చూపిస్తాయి సాయి భక్తులకు.

ఓం సాయిరాం!!!

అమెరికాలో - సాయి అనుగ్రహం


పేరు వెల్లడించని ఒక సాయిసోదరి ఇలా చెప్తున్నారు.

సాయిబంధువులందరికీ సాయిరాం. నా జీవితంలో బాబా చాలా మిరాకిల్స్ చేసారు. వాటిలో ఒక అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా మీతో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు బాబాకి నా పాదాభివందనాలు.

నేను మనసులో ఏ విషయం గురించైనా బాధపడితే చాలు, కొన్ని నిమిషాలలోనే బాబా ఏదోరకంగా నన్ను సంతోషపెడతారు. ఏదైనా కోరిక కోరిన వెంటనే కోరిన దానికన్నా పదిరెట్లు ఎక్కువ ఇస్తారు. లవ్ యూ బాబా! ఎప్పటికీ నన్ను ఒంటరిని చేయకు బాబా, నీ ఆశీస్సులు సదా నాపై ఉండనీ!

నా భర్త ఉద్యోగరీత్యా నేను, నా భర్త ఇండియా నుండి USA కి వెళ్ళాము. ఒక మూడునెలలు బాగానే గడిచాయి, తర్వాత నుండి మాకు కష్టాలు మొదలైనాయి. మావారు జాబ్ చేసే ప్రాజెక్ట్ వర్కులో ఏదో సమస్య ఉందని, మమ్మల్ని ఇండియాకి వెళ్లిపొమ్మని ఆఫీస్ వాళ్ళు చెప్పారు. ముందుగా చెప్పిన లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ రద్దయిందని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని నెలలు అక్కడే ఉండి జాబ్ చేస్తూ కొంత డబ్బు సంపాదించుకోవచ్చని మేము ఇండియాలో ఉన్నపుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ, హఠాత్తుగా ఇండియాకి వెళ్లిపొమ్మని చెప్పేసరికి మా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆఫీస్ నుండి ఆర్డర్ కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. మాకు ఇక వేరే దారి లేదు. ఏం చేయలేని పరిస్థితిలో మనస్ఫూర్తిగా బాబాతో, "నీవు తప్ప ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు బాబా, నేను నిన్నే నమ్ముకున్నాను. ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయండి బాబా" అని మొర పెట్టుకున్నాను. కానీ బాబా నుండి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ బాబాపై నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. బాబా నిర్ణయం కూడా మేము ఇండియాకి వెళ్లిపోవాలనేనేమో అనుకొని టికెట్స్ బుక్ చేసాం. కానీ మాకు అస్సలు ఇష్టం లేదు. సామానులన్నీ సర్దుకున్నాం. ఫ్లైటు శనివారంనాడు ఉండగా శుక్రవారంనాడు బాబా మందిరానికి వెళ్లి బాబాకి వీడ్కోలు చెప్పి, "బాబా! ప్రతి గురువారం ఇక్కడున్న రోజుల్లో క్రమం తప్పకుండా నీ దర్శనానికి వచ్చాను. ఇక నాకు తెలిసి అమెరికాలో ఇదే చివరి దర్శనం. ఎందుకంటే నేను రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉంటూ డబ్బు సంపాదించుకోవడం నీకు కూడా ఇష్టం లేదుగా .... వెళ్లిపోతున్నాను బాబా, ఇష్టంగా మాత్రం కాదు. నేను ఇంత బాధపడుతుంటే మీరెలా చూస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు బాబా. ఏదేమైనాగాని మీ నిర్ణయానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకు ఏది శ్రేయస్కరమో నాకన్నా మీకే ఎక్కువ తెలుసుకదా బాబా!" అనుకుంటూ బరువైన గుండెతో గుడి నుండి ఇంటికి బయలుదేరాను. నా మనసంతా ఎంత భారంగా ఉందో చెప్పలేను. నా బాధను బాబా గుర్తించారేమో!... నేను ఇంటికి వెళ్లే లోపలే ఒక లీల జరిగింది. దానినే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

మేము ఇంటికి వెళ్ళగానే మావారి ప్రాజెక్ట్ మేనేజర్ నుండి ఫోన్ వచ్చింది. అతను చెప్తూ ఉంటే మావారు 'సరే, సరే' అంటూ సమాధానం చెప్తూ ఫోను పెట్టేసారు. కొంతసేపటి వరకు తను మామూలు స్థితికి రాలేక, నాకు విషయం చెప్పడానికి కొంత సమయం తీసుకున్నారు. తన కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. ఇండియా వెళ్లాల్సి వస్తున్నందుకు తను బాధపడుతున్నారేమో అనుకున్నాను. తరువాత తను ఇలా చెప్తున్నారు. "బాబా కరుణ, ప్రేమ మన మీద సరిపడా ఉన్నాయి. మన జీవితంలో దేని గురించి మనం అస్సలు బాధపడకూడదు" అంటూ, "ప్రాజెక్ట్ మేనేజర్ ఏమన్నారో తెలుసా?" అతను ఫోన్ లో, "కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. నువ్వు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ ఐదు నెలలు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ నెలలు కూడా ఉండొచ్చు. కావున నీవు బుక్ చేసుకున్న టికెట్స్ రద్దు చేసుకొని రేపటి నుండి యధావిధిగా ఆఫీసుకి వచ్చి వర్క్ చేసుకోండ"ని చెప్పాడు" అని చెప్పారు. నిజంగా ఆ క్షణంలో బాబా నాకు ఇచ్చిన ఆనందాన్ని చెప్పడం నావల్ల కాదు, ఎంత చెప్పినా అది తక్కువే. బాబా చూపిన ప్రేమలో తడిసి ముద్దైపోయాము. మా సంతోషానికి అవధులులేవు. నేను ఆ క్షణంలో బాబా ముందు నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా బాబాకి ధన్యవాదములు చెప్పడంలో నిమగ్నమయ్యాను. మావారు టికెట్ కాన్సిల్ చేయడంలో నిమగ్నమయ్యారు. బాబా! మీరిచ్చిన ఈ సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. "నా భక్తులకు శ్రేయస్కరమైనవే నేను ప్రసాదిస్తుంటాను" అన్న తన మాటలు మరోసారి నిరూపించుకున్నారు బాబా.

అంతా బాబా దయ


నిన్నటి నా అనుభవాన్ని చదివి ఆనందించి ఉంటారు. ఇప్పుడు మరో అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. 

నేను 2018, మే 25న షిర్డీ వెళ్ళాను. అప్పుడు శిరిడీలో నాకు బాబా ఒక చక్కటి అనుభవాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను.

నేను 7 సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి కులాలు వేరు. ఇదే మాకు అసలైన సమస్య. పెద్దవాళ్ళ అంగీకారంతో నా వివాహం జరగాలని నేను ఆశించాను. కానీ, అలా జరగలేదు. నేను చాలా నిరాశ చెందాను. “బాబా! నిర్మలమైన మనస్సుతో ఉన్న నాకు ఎందుకు ఈ సమస్య? నేను అనుకున్నట్లుగా ఎందుకు జరగట్లేదు?” అని బాబాని వేడుకున్నాను. 4 సంవత్సరాల క్రితం నాకు కలలో బాబా కన్పించి, "నీ కోరిక నెరవేరుతుంద"ని చెప్పారు. కాబట్టి నేను బాబా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాను. కాలం గడుస్తూ ఉంది, కానీ నేను ఆశించినట్లుగా ఏమీ జరగలేదు. చివరికి నేను ఏడుస్తూ, "బాబా! నా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు నా తల్లిదండ్రులు అంగీకరిస్తారా, లేదా? అలా కానప్పుడు నాకు ఎందుకు ఆశ కలిగించారు?" అని అడిగాను. ఆ తరువాత మొత్తానికి బాబా దయవలన నా తల్లిదండ్రులు 'సరే' అన్నారు. కాని, కులాలు వేరైనందున సాంప్రదాయ పద్ధతిలో మా పెళ్లి చేయటానికి సిద్ధంగా లేరు. నేను ఎప్పుడూ, "నా వివాహం శిరిడీలో జరిగేలా వీలు కల్పించమ"ని బాబాను అడుగుతుండేదాన్ని. కానీ మేము తెలుగు వాళ్ళం, మరాఠి ఆచారాలు తెలియవు కదా అనే సంశయాలతో, "బాబా! కనీసం మా పెళ్ళికి ముందు శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించ"మని ప్రార్ధించాను. నేను అడిగినట్లుగానే బాబా మమ్మల్ని శిరిడీ పిలిచారు. మా శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. నేను ఈ శిరిడీ ప్రయాణంలో నిశ్చితార్ధం చేసుకోవాలని అనుకోని, "బాబా! నా ఈ కోరిక మీకు సమ్మతమైతే, పవిత్ర శిరిడీ క్షేత్రంలో, మీ సమక్షంలో నిశ్చితార్థం జరిగేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. కాబట్టి మేము శిరిడీ వెళ్ళి రెండు ఉంగరాలు కొనుగోలు చేసుకొని, సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెళ్లి, పంతులుగారి చేతికి ఆ ఉంగరాలు ఇచ్చాము. పంతులుగారు వాటిని బాబా దివ్య చరణాల వద్ద ఉంచి, తరువాత బాబా సమాధికి తాకించి, పువ్వులతోపాటు నా చేతికి ఇచ్చారు. అలా బాబా ఆశీర్వాదాలతో ఉంగరాలు నా చేతికి రావడంతో నేను చెప్పలేని ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి అయిపోయాను. ఆ ఆనందంలోనే బాబా సమక్షంలో మేము ఇద్దరమూ ఉంగరాలు మార్చుకున్నాము. అలా బాబా దివ్య ఆశీస్సులతో మా నిశ్చితార్థం జరిగిపోయింది. తరువాత నేను దీపాలు వెలిగించి, హారతికి హాజరయ్యి, చక్కటి బాబా దర్శన భాగ్యాన్ని పొంది తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. మేము బస్సు ఎక్కాము. బస్సు స్టార్ట్ అయ్యింది కూడా. కాసేపటికి  అతను తన ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని చెప్పాడు. బాబా అంగీకారంతో జరిగిన మా నిశ్చితార్ధపు ఉంగరాన్ని అతను పోగొట్టుకోవడంతో నా మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలు మొదలయ్యాయి. నేను ఆ బాధను తట్టుకోలేక ఒకటే ఏడుస్తూ ఉన్నాను. అంతలో అకస్మాత్తుగా హోటల్ నుండి ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి, మేము ఉంగరాన్ని అక్కడ మర్చిపోయామని, వచ్చి తీసుకోమని మాకు చెప్పాడు. నేను, "ఇప్పటికే మేము శిరిడీ నుండి దాదాపు 5 కిలోమీటర్లు దూరం వచ్చేశామ"ని అతనితో చెప్పాను. అతను, "ఆందోళన పడకండి దీదీ(అక్క), నేను ఒక అబ్బాయితో ఉంగరాన్ని ఇచ్చి‌ పంపుతాను, అతని నెంబర్ కూడా ఇస్తాను. మీరు అతనికి ఫోన్ చేసి మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నదీ చెప్పండి. దీదీ, ఇది బాబా ఉంగరం. ఖచ్చి‌తంగా మీకు అందేలా చేస్తాను. మీరు కాస్త బస్సు డ్రైవర్ కి చెప్పి బస్సు ఆపేలా చేయండి" అని చెప్పాడు. నేను అతనికి ధన్యవాదాలు చెప్పి, కొంత సమయం బస్సు ఆపమని డ్రైవరుని రిక్వెస్ట్ చేశాను. అందుకతను సమ్మతించి బస్సు ఆపాడు. కొద్దిసేపట్లో హోటల్ బాయ్ వచ్చి ఉంగరం ఇచ్చాడు. అంతా బాబా దయ. ఆయన ఇలా అనుగ్రహించకుంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. ధన్యవాదాలు బాబా!

బాబా ముందు జాతకాలు, జ్యోతిష్యాలు ఏవీ పనిచేయవు


సాయిబంధువులకు నమస్కారం! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు బ్యాంకు ఉద్యోగం అనుగ్రహించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నేను 2015వ సంవత్సరంలో బి.టెక్ పూర్తిచేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న కోరికతో బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాను. నేను ప్రతి బ్యాంకు పరీక్షా వ్రాశాను. కానీ నేను ఓపెన్ కేటగిరీకి చెందినందువల్ల ప్రతిసారీ 0.5 మార్కుల తేడాతో సెలెక్ట్ కాలేకపోయేదాన్ని. అప్పుడు నేను శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురుచరిత్ర, శ్రీపాదశ్రీవల్లభచరిత్ర చదవటం మొదలుపెట్టాను. విష్ణుసహస్రనామ పారాయణ, సిద్ధమంగళస్తోత్ర పారాయణ చేశాను. అనేకసార్లు గురువారవ్రతం, సాయిదివ్యపూజ కూడా చేశాను. ఇన్ని చేసిన తరువాత కూడా అనేక వైఫల్యాలు ఎదుర్కొన్నాను. ఇంక సహనాన్ని కోల్పోయి, "బాబా! ఒక ఉద్యోగం పొందడానికి నాకు ఎందుకు ఇన్ని ఆటంకాలు? ఇన్ని పూజలు, పారాయణలు చేసిన తర్వాత కూడా ఎందుకు నేను వైఫల్యాలు ఎదుర్కోవాలి?" అని బాబాను అడిగాను. ఒకానొక స్థితిలో బాబాపై ఆశ కూడా కోల్పోయాను. రెండు సంవత్సరాల్లో శిరిడీ, అక్కల్కోట, పిఠాపురం సందర్శించాను. ప్రతిసారీ, "నాకు ఉద్యోగం వస్తుందా, రాదా?" అని చీటీల ద్వారా బాబాని అడిగేదాన్ని. ప్రతిసారీ బాబా నుండి సానుకూలమైన సమాధానం వచ్చేది. కానీ, వైఫల్యమే ఎదురయ్యేది. ఇవన్నీ చూసిన తరువాత మా అమ్మ నా భవిష్యత్తు తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళింది. అతను నాకు గవర్నమెంట్ ఉద్యోగంగానీ, బ్యాంకు ఉద్యోగంగానీ రాదనీ, అసలు ఏ ఉద్యోగమూ రాదనీ, వందల ఇంటర్వ్యూలకు హాజరైనా ఏ ఉద్యోగమూ రాదనీ, ఉద్యోగం తన రాతలో లేదనీ చెప్పాడు. అది విని నేను చాలా నిరాశకు గురయ్యాను. పూజారి చెప్పిన పూజలు కూడా చేశాను. ఆ రాత్రి నేను బాధతో చాలా ఏడ్చాను. తరువాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను బాబాని, "నాకు ఉద్యోగం వస్తుందా, లేదా?" అని అడిగాను. అప్పుడు బాబా నన్ను చూసి చిన్నగా నవ్వి, "ఆందోళనపడకు, నీకు ఉద్యోగం వస్తుంది" అని చెప్పారు. అలా బాబా చెప్పడంతో నాకు విశ్వాసం కుదిరి, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఈసారి నేను చీటీలు వేసి బాబాను అడగకుండా, నేరుగా పరీక్ష వ్రాసి, ఫలితాల కోసం వేచిచూశాను. బాబా మాట నిజమైంది. కరూర్ వైశ్యా బ్యాంకు(kvb)లో నాకు మొదటి ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగంలో ఒక నెలరోజులు పనిచేశాను. ఆలోగా నాకు కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను kvbకి రాజీనామా చేసి, కెనరా బ్యాంకులో చేరాను. విజయవంతంగా 6 నెలలు పూర్తి కావడంతో నన్ను పర్మినెంట్ చేశారు. ఆ రెండు సంవత్సరాలలో నేను బాబాకి ఎంతో దగ్గరయ్యాను. ఇప్పుడు బాబా పట్ల నా విశ్వాసం చాలా దృఢమైంది. నేను శ్రద్ధ, సబూరి యొక్క నిజమైన అర్థం తెలుసుకున్నాను. 2015లోనే బాబా నాకు ఉద్యోగం ఇచ్చేవారు, కానీ ఆయన నాకు 'విశ్వాసం' మరియు 'సహనం' అనే రెండు పైసలకు అర్థం తెలియజేయాలనుకున్నారు. అంతేకాకుండా, సద్గురువును ఆశ్రయించి ప్రార్ధిస్తే ఆయన మన తలరాతను కూడా మార్చగలరని తెలియజేశారు. నిజంగా ఉద్యోగం నా అదృష్టంలో లేకపోయినప్పటికీ బాబా నాకు ఉద్యోగాన్ని ఇచ్చి నా తలరాతనే మార్చేశారు. ఆయన నన్ను అయిదు దత్త అవతారాలను పూజించేలా చేశారు. ఈ రెండు సంవత్సరాలలో బాబా నాకు  కలలో చాలాసార్లు దర్శనమిచ్చి, 'నేను తమ ప్రియమైన భక్తురాలిని' అని చెప్పారు. నేను ఉద్యోగం సంపాదించడంలో చాలా బాధపడినప్పటికీ, ఎటువంటి పరిస్థితులలోనైనా బాబా తన భక్తులకు సదా తోడుగా ఉంటారని తెలుసుకొని ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరియర్‌లో మాత్రమే కాదు, నా వ్యక్తిగత సమస్యలు కూడా బాబా పరిష్కరించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

బాబా ముందు జాతకాలు, జ్యోతిష్యాలు ఏవీ పనిచేయవు. జాతకాలు, జ్యోతిష్యాలు అంటూ కాలయాపన చేసుకోకండి. బాబానే దృఢవిశ్వాసంతో పట్టుకోండి. ఆయన సర్వసమర్థులు. మీ అభీష్టం నెరవేరుతుంది.

సాయి తీర్చిన నా కోరికలు


సౌత్ ఆఫ్రికా నుండి ఒక సాయిభక్తురాలు తన కోరికలన్నింటిని సాయి ఎలా తీర్చారో ఇక్కడ మనతో పంచుకుంటున్నారు.

అందరికీ నమస్కారం. నేను సాయిభక్తుల అనుభవాలను బ్లాగ్ లో క్రమం తప్పకుండా చదువుతుంటాను. వాళ్ళు చేస్తున్న కృషి వల్ల అందరికీ సాయిపై ఉన్న నమ్మకం ఇంకా రెట్టింపవుతుంది. ఇప్పుడు నేను నా అనుభవాలను, దాదాపు 80 ఏళ్లపాటు బాబా నివసించిన పుణ్యభూమి, సాయిభక్తులకు భూలోక స్వర్గధామమైన షిరిడీ నుండి వ్రాస్తున్నాను. నా జీవితం నిండా బాబా చేసిన అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాను.

నా వైవాహిక జీవితంలో నేను చాలా సమస్యలతో పోరాడుతున్నాను. నేను 2015 సంవత్సరంలో ఇండియాకి వచ్చాను. నేను అప్పటికి షిరిడీ వచ్చి బహుశా ఇంకా రెండు నెలలు కూడా కాలేదనుకుంటాను. నవంబర్ నెలలో నేను షిరిడీలో 9 రోజులపాటు బస చేశాను. నిజానికి నేను 15 రోజులపాటు ఉండాలని ప్లాన్ చేసుకున్నాను, కానీ బాబా ఆజ్ఞ పాటించాలి కదా! అందువల్ల 9రోజులు ఉండి వచ్చేసాను. టైంలో ఒకరోజు నేను ధూప్ ఆరతికి వెళ్ళాను. నేను క్యూ లైన్ లో ఉండగా ఒక పూజారి అందరికీ పువ్వులు ఇస్తున్నారు. వాటిని ఆరతి పూర్తయిన తరువాత మరలా వెనకకి తీసుకుంటారు. కానీ సమయంలో ఒక ఎరుపురంగు గులాబీపువ్వు జారి కిందపడింది. నేను అత్యాశ కలిగిన భక్తురాల్ని కావడంతో, పువ్వు నాకే రావాలని మనసులో కోరుకున్నాను. పూజారి తన చేతులతో తనంతట తానే నాకు పువ్వు ఇవ్వాలని బాబాని అడిగాను. అలా అయితే అది బాబాయే స్వయంగా నాకు ఇచ్చినట్లు అనుకున్నాను. ఆరతి పూర్తయిన తరువాత సమాధి మందిరం నుండి బయటకి వస్తూ కూడా బాబా నాకు పువ్వు ఇప్పిస్తారనే ఆశతో ఉన్నాను. కానీ ఇవ్వలేదు. కాసేపు చూసి ఇక నా పారాయణకి సమయం అవ్వడంతో నేరుగా రూమ్ కి బయల్దేరాను. నేను రూమ్ దగ్గరకు చేరేసరికి అక్కడ మెడలో రుద్రాక్షమాల ధరించి ఉన్న ఒక ముసలాయన నేలపై కూర్చొని కనిపించారు. ఆయన నన్ను చూస్తూ, 'ఓం సాయిరాం' అన్నారు. నేను కూడా 'ఓం సాయిరాం' అని బదులిచ్చాను. తరువాత నేను నా గదిలోకి వెళ్లి బాబా ఫోటోకి నమస్కరించి, పారాయణ ప్రారంభించాను. కానీ నా మనసులో మాత్రం బాబా నాకు పువ్వు ఇస్తారనే ఆలోచన కొనసాగుతూ ఉంది. పారాయణం పూర్తైన వెంటనే, క్రింద కనపడ్డ ముసలాయనకి దక్షిణ ఇవ్వాలని అనిపించింది. నేను క్రిందకి వెళ్లి అతనికి దక్షిణ ఇవ్వగానే ఏం జరిగిందో ఊహించండి. ముసలాయన నాకు ఒక పువ్వులగుత్తి ఇచ్చి, వాటిని బాబాకి సమర్పించమని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆయన నాకు ఊదీ ప్రసాదం కూడా ఇచ్చారు. అవి పట్టుకొని నా గదికి వెళ్లి చూస్తే, పువ్వులలో ఒక ఎరుపురంగు గులాబీపువ్వు కూడా ఉన్నది. అది చూడగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బాబాకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నాకు ఎప్పుడు విషయం గుర్తుకు వచ్చినా ఎందుకో తెలియకుండా బాబా ముఖం నా మదిలోకి వస్తుంది. ఆరోజు నా దగ్గరకి వచ్చిన ముసలాయన నా సాయే. నా సిల్లీ కోరికని తీర్చడానికి ఆయనే స్వయంగా వచ్చారు. లవ్ యు బాబా! మీరే నా సర్వస్వం, మీరే నా జీవితంఎన్నో లీలలు నాకు సాయి ఇచ్చినా, లీల ద్వారా నేను సాయిపై అమితంగా నా ప్రేమని పెంచుకున్నాను.

మరునాడు ఉదయం కాకడ ఆరతికి వెళ్ళాను. ఆరతి జరుగుతూ ఉండగా గుండె లోతుల నుండి నేను ఏడుస్తూ సాయిని చూస్తూనే ఉన్నాను. నేను పిచ్చిదానిలా అడిగి, నా కోరికని తీర్చడానికి సాక్షాత్తూ సాయినాథుడినే కదిలి వచ్చేలా చేసానని నన్ను నేనే నిందించుకుంటున్నాను. అలా చిన్నపిల్లలా హాల్ లో ఏడుస్తూనే ఉన్నాను. తరువాత బాబాతో, "మీరు ఎలా అయినా ఈరోజు వచ్చి నా సమస్యకి పరిష్కారం చెప్పాలిఅది నా కోరిక. ఎందుకంటే మీరు పరోక్షంగా ఇచ్చే సంకేతాలు నాకు అర్థం కావడంలేదు. నేను ఎంత సమయమైనా మీకోసం ఇక్కడే మందిరంలో వేచి ఉంటాను" అని చెప్పాను. దర్శనం పూర్తయిన తరువాత నేను నందాదీపం దగ్గర ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రదక్షిణలు పూర్తిచేసి, ప్రతి ఒక్కరిలో సాయిని వెతుకుతూ ఉన్నాను. ఇక నాలో ఓపిక నశిస్తూ ఉండటంతో, సాయీ, నువ్వు రూపంలో అయినా, ఆకారంలో అయినా వచ్చి నాకు ఏదైనా చిన్న సంకేతం ఇవ్వు అని దీనంగా వేడుకున్నాను. "నీ బిడ్డనైన నన్ను భారమైన మనసుతో నీ దగ్గరనుండి పంపకు" అని అర్ధించాను. పారాయణ మందిరం బయట కార్నర్ లో కూర్చొని నా సాయి ప్రపంచంలో సాయితో మాట్లాడుకుంటూ ఉన్నాను. కానీ నా కన్నులు మాత్రం సాయినే వెతుకుతూ ఉన్నాయి. నేను చాలా సమయం నుండి అక్కడే ఉన్నందున నన్ను కొందరు భక్తులు, ఇంకా సెక్యూరిటీ సిబ్బంది గమనిస్తున్నారు. కొంతసేపటికి నన్ను నడివయసు ఉన్న ఒక అంకుల్ కలిసారు. నా సమస్య ఏమిటో ఒక్కసారి కూడా వివరాలు ఏమీ అడగకుండా, నవ్వుతూ, నీ భర్త ఇక్కడికి ఎప్పుడు వస్తారో నాకు ముందు చెప్పు, నేను అతనితో మాట్లాడాలి అని అన్నారు. నేను మాట మార్చి నేను ఉండే దేశం మరియు అక్కడి ప్రదేశాల గురించి చెప్పాను. ఆయన, "నేను మందిరానికి 12 గంటలకి మరియు సాయంత్రం 3 గంటలకి మాత్రమే వస్తాన"ని చెప్పారు. నేను నా బాబా ఆలోచనలలో ఉండగా అంకుల్ కుడివైపు నుండి వచ్చి, 'ఏమాలోచిస్తున్నావు?' అని అడిగారు. నాకు ఎందుకో కొంచెం భయంగా అనిపించినా తర్వాత నవ్వుకున్నాను. ఆయన నాకు చెప్పిన మాటలు ఇక్కడ రాయలేను, కానీ అనుభూతి మాత్రం మాటలలో చెప్పనలవి కానిది. నా బాబాని ప్రేమతో రూపంలో అయినా వచ్చి నాతో డైరెక్ట్ గా మాట్లాడమని వేడుకున్నందుకు అలా వచ్చి, "అంతా బాగుంటుంది" అని చెప్పారు.

దయగల నా తండ్రీ! సాయిదేవా! నీ ప్రేమామృతధారల నుండి నేను ఇంకా తేరుకోలేక పోతున్నాను. ఆశ్చర్యంగా ఉంది, నేను మాటలైతే వినాలని అనుకున్నానో అవే అతని ద్వారా చెప్పించారు బాబా. ఇంకా నా ఊహకి అందని విషయాలు కూడా నాతో మాట్లాడారు. నేను ఎప్పుడూ అంకుల్ నెమ్మదిగా ఉండడం చూసాను, కానీ రోజు ఉదయం మాత్రం చాలా హుషారుగా కనిపించారు.

ప్రియమైన సాయిభక్తులారా! బాబాపై పూర్తి విశ్వాసం ఉంచి ఆయనకి మీ భారాన్ని అప్పగించండి. నా పరిస్థితి అసలు మీకు ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు. ఏదో చెప్పాలనుకున్నాను కానీ, నా తండ్రి సాయి అంతా మార్చేసారు. నాకు సాయి అంటే పిచ్చి ప్రేమ. మనల్ని భగవంతుడు కూడా అంతే ప్రేమిస్తున్నాడంటే, భావాన్ని చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. ఆయన మన బాధలను, భయాలను చూస్తూ ఊరుకోరు. సాయిని నమ్ముకొని ఉంటే ఆయన సదా మనతోనే ఉంటారు. మీ గుండె తలుపులు ఆయన కోసం తీసి ఉంచండి. సమయం వచ్చినపుడు మీ కోరికల్ని అడగడం మానేసి ఆయనని ప్రేమించడం మొదలు పెడతారు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాము, కానీ సచ్చరిత్రలో సాయి చెప్పినట్టు కొంతమంది భక్తులు మాత్రమే సమస్యలకు తట్టుకోగలరు. సాయిభక్తులందరికీ నా మనవి. అందరూ “Shiridi Sai Baba is still alive(సాయి ఇప్పటికీ సజీవులే)” by Jaya Wahi పుస్తకాన్ని తప్పక చదవండి. కొన్నివారాల క్రిందట ఎవరో దాని గురించి షేర్ చేసారు. అప్పటినుండి నేను కూడా బుక్ తీసుకోవాలని చాలా కుతూహలపడ్డాను. చివరికి బాబా దయవలన బుక్ తీసుకొని కొన్ని అధ్యాయాలు చదివాను. అది నా హృదయాంతరాళంలో చెరగని ముద్ర వేసింది.

నేను బాబాకి సదా ఋణపడి ఉంటాను. త్వరలో ప్రపంచమంతా సాయిప్రపంచం కావాలని మనమంతా ప్రార్ధిద్దాం. ఇక్కడ మోసాలు, గొడవలు, బాధపెట్టడం ఏవీ ఉండవు. కేవలం నమ్మకం మరియు ఓపిక కలిగి ఉండండి, బాబా తప్పక మన ప్రార్ధనలు విని మనల్ని అనుగ్రహిస్తారు. నేను ఇప్పటికే చాలా పెద్ద పోస్ట్ రాసాను. కాని ఇంకా చాలా అనుభవాలు అలానే ఉన్నాయి. అవి ఇంకోసారి మీతో పంచుకుంటాను. బిజీ ప్రపంచంలో కూడా సాయి నన్ను ఇక్కడికి పిలిచి అమితమైన ప్రేమని చూపించారు. మీలో ఉన్న ప్రేమనంతా సాయిపై చూపండి, పిచ్చిగా ప్రేమించండి. ఆయన మీ ప్రతి కదలికలో మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ముందుకి నడిపిస్తారు. మీ ప్రతి శ్వాసలో ఉంటారు. సాయి అందరిపై తన కరుణ చూపిస్తారు. మీ నమ్మకాన్ని విడువకండి.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo