సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

స్వప్నంలో సాయి దివ్యదర్శనం


సాయిభక్తులందరికీ సాయిరాం. నా పేరుగాని, ఊరుగాని తెలియచేయడం నాకిష్టం లేదు. "నేను ఒక బాబా భక్తురాలిని" ఇది చాలనుకుంటాను నన్ను నేను ఈ సమాజానికి గర్వంగా చూపించుకోవడానికి. 'గర్వంగా' అని ఎందుకు అన్నానంటే, నేను బాబా నీడలో ఉన్నానని అలా అన్నాను. ఒక అద్భుతమైన లీలను "సాయిమహరాజ్ సన్నిధి" బ్లాగు ద్వారా పంచుకొనే అవకాశం బాబా ఇచ్చినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు.

నేను ప్రతి గురువారం తప్పనిసరిగా బాబా దర్శనం చేసుకుంటాను. మిగతా రోజులలో కూడా నాకు వీలు కుదిరినప్పుడల్లా బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. కానీ ఒక గురువారం ఎందుకోగానీ నా మనసులో, 'నవగురువారవ్రతం' చేయాలని ఒక చిన్న కోరిక కలిగింది. బాబా కూడా నా కోరిక తీర్చారు. బాబా ఆశీర్వాదంతో తర్వాత గురువారం నుండి వ్రతం మొదలుపెట్టాను. అప్పటికే ఇదివరకు ఒకసారి నాకు బాబా స్వప్నంలో దర్శనం ఇచ్చారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ విషయం వ్రతం మొదలుపెట్టిన రెండోవారం శుక్రవారంనాడు గుర్తుకొచ్చి‌, "ఇప్పుడు నేను నవగురువారవ్రతం చేస్తున్నాను కదా! బాబా, నాకు మరలా మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించండి" అని మనస్ఫూర్తిగా బాబాను అడిగాను.

నేను అడగటమే ఆలస్యం అన్నట్లు అదేరోజు రాత్రి నాకు కలలో బాబా దివ్యదర్శనం లభించింది. కలలో నేను షిరిడీలో బాబా విరాట్ స్వరూపమూర్తి ముందు లైన్లో ఉన్నాను. నన్ను వెనకనుండి అందరూ నెడుతుండటం వలన బాబాను సరిగా చూడలేకపోతున్నాను. నేను సరిగ్గా బాబా ముందుకు రాగానే లైనును ఆపివేశారు. అప్పుడు బాబా పూర్తిగా కనపడుతున్నారు. ఎంత సుందరమైన దివ్యదర్శనం అంటే నాకు కలలో దర్శనం అవుతున్నాగాని నా మనసుకు మాత్రం అది నిజదర్శనం అన్నట్లుగా ఉంది. ఆ దివ్యమంగళరూప దర్శనంతో కలత చెందిన మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఆ ఆనందస్వరూపాన్ని చూడటానికి నాకు రెండు కళ్ళూ సరిపోవడంలేదు. ఆ క్షణాలు అలాగే ఆగిపోతే బాగుండుననిపించింది. చిరుదరహాసంతో బాబా నన్నే చూస్తున్నారన్న అనుభూతిని నేను పొందాను. తన బిడ్డలమైన మన మీద బాబాకి ఎంత ప్రేమ! తన వెచ్చని చూపులతోనే తన పిల్లలని ఆప్యాయంగా లాలిస్తూ, తన ఒడిలో వెచ్చగా సేదతీరుస్తున్న అనుభూతి. కలలో నాది ఆ స్థితి, ఆనంద స్థితి, అర్ధంకాని స్థితి. ఎందుకంటే నేను కలలో పొందిన ఆ ఆనందానుభూతిని వర్ణించడానికి నాకు పదాలు, భాష సరిపోవట్లేదు. ఎందుకంటే సాయి మాతృప్రేమ అలాంటిది. తనని చూస్తూ నన్ను నేను మైమరచిపోతూ నా చేతి గుప్పిట్లో ఉన్న పసుపురంగు గులాబీ పువ్వుల్ని బాబాగారి విరాట్ మూర్తిపైన, సమాధిపైన ఎంతో ప్రేమగా ఆనందభాష్పాలతో సమర్పించుకున్నాను. అంతలో నా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నన్ను ప్రక్కకు జరిపారు. నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. కానీ నా కళ్ళ నుండి కన్నీళ్లు ఆగడం లేదు. అవి ఆనందభాష్పాలు! అడగగానే తన బిడ్డ మీద సాయి కురిపించిన ప్రేమవర్షం. అడిగినంతనే నా కోరికను తీర్చారు బాబా. ధన్యవాదములు బాబా. కలలోనైనా, ఇలలోనైనా నీ దర్శనభాగ్యంతో నా కర్మలన్నింటినీ తొలగించి నన్ను మీ దరికి చేర్చుకోండి బాబా. సదా మీ ఆశీర్వాదం నాపైన ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ! ఓం సాయిరాం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo