సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నమ్మితే చాలు, ఆయన ఏ రూపంలోనైనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు


సాయిరాం.

ముందుగా, "నా వలన ఏమన్నా తప్పులు జరిగివుంటే క్షమించండి ప్రభూ!" అని సాయినాథుని చరణ కమలాలకు కోటి కోటి నమస్కారములు తెలియజేస్తున్నాను. నేను సదాశివ(AIR, సంబల్పూర్). మీతో మరో సాయిబాబా లీలను పంచుకుందామని వ్రాస్తున్నాను.

నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని. మరి బాబా దయ అనాలో, కృప అనాలో నాకు తెలియదు. బాబా లీల అనాలో, చమత్కారం అనాలో అది కూడా తెలీదు నాకు. నేను అంతగా చదువుకున్నవాడిని కూడా కాదు. మాధవి మేడం గారు నా అనుభవాలు వ్రాయమంటే "ఓహో, ఇలా కూడా బాబా మహిమలను నలుగురు సాయి బంధువులతో పంచుకోవచ్చునా" అనుకున్నాను. ఇపుడు అసలు విషయానికి వస్తాను.

మూడు సంవత్సరాల ముందు నా చెల్లికి, బాబా కృపాకటాక్షాలతో ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మేము ప్రయత్నం చేయకుండానే వచ్చిన సంబంధం. ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా నాన్న చిన్నవయసులోనే చనిపోయాడు. అమ్మ పెన్షన్ చాలా తక్కువ. పేదరికం వలన పెళ్లి ఎలా చెయ్యాలో తెలియక చాలా కష్టపడ్డాను. మా ఆఫీసులో అందరినీ డబ్బు అప్పుగా అడిగి చూశాను. కానీ అప్పు దొరకలేదు. ఇంక నా బాధ వర్ణనాతీతం. కానీ, సాయిబాబా మీద నమ్మకం వదలకుండా బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నిద్దామని బ్యాంకుకు వెళ్ళాను. మేనేజర్ నన్ను పిచ్చివాడ్ని చూసినట్లు చూసి, “పెళ్లికి ఎవరన్నా లోన్ ఇస్తారా?” అని, "మీ అమ్మ పెన్షన్ బుక్ తీసుకురా!" అన్నాడు. "మా ఇంట్లో ఆ బుక్ ఎక్కడో పోయింది, కనిపించడం లేద"ని చెప్పాను. మేనేజర్ వినలేదు, నన్ను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు. నేను ఇంటికి  తిరిగి వెళ్తున్నప్పుడు, మా ఇంటికి చేరువలో ఒక ముసలివాడు కనపడి, "ఏమిటి, అలా ఉన్నావు?" అని అడిగాడు. అతను ఎవరో, ఏమో ఆలోచించలేదు. నేను నా కథ మొత్తం చెప్పాను. అతను, "రేపు వెళ్ళు బాబు, లోన్ ఇస్తాడు" అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేశాయి. మరుసటిరోజు నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాను. మేనేజరునే బాబా అనుకుని, "సర్, చెల్లి పెళ్లి చేస్తాను, లోన్  ఇప్పించండి" అని చాలా వేడుకున్నాను. నా మాటలు నమ్మండి, ఆ సమయంలో నాకు బాబానే కనపడ్డారు. ఏ మంత్రం పనిచేసిందో తెలీదుకాని, ఆ మేనేజర్ వెంటనే 2లక్షల 50 వేల రూపాయల లోన్ శాంక్షన్ చేసి, "వెళ్ళు బాబు! నీ చెల్లి పెళ్లి బాగా చెయ్యి" అన్నాడు. అదే మేనేజర్ నిన్న చెయ్యలేదు, ఈరోజు చేసాడు. నేను ఆశ్చర్య పోయాను. మరో ముఖ్య విషయం ఏమిటంటే, నిన్న నాతో మాట్లాడిన ముసలివాని గొంతు, ఈరోజు ఇక్కడ మేనేజర్ గొంతు ఒక్కటే. ఇప్పటికీ ఆ విషయం నాకు అంతు చిక్కదు. 24 గంటల్లో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇది బాబా కృప కాకుంటే ఏమనాలి? నేను చెప్పేదేమిటంటే, నమ్మితే చాలు, ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు. నాలాంటి పేదవాడికి, చదువు కూడా రానివాడికి, ఎన్ని అనుభవాలో చెప్పలేను. మన సాయిబాబా 'దయాసాగరుడు' అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo