ఒకసారి ఒకమ్మాయి పూజ్యశ్రీ మాస్టరుగారి దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి తరచూ వచ్చే అమ్మాయే. ఆరోజు ఏదో బాధగానూ, కోపంగానూ వుంది. పూజ్యశ్రీ మాస్టరుగారు ఆ అమ్మాయిని, “ఏమ్మా! బాగున్నావా!?” అని అడిగారు.
అందుకా అమ్మాయి, 'ఆఁ' అన్నది.
పూజ్యశ్రీ మాస్టరుగారి ప్రశ్న: పారాయణ చేస్తున్నావా?
అమ్మాయి: చేస్తున్నాను మాస్టారూ! కానీ ఇంక చెయ్యదలచుకోలేదు.
మాస్టరుగారు: ఏం? ఎందుకని?
అమ్మాయి: ఎందుకేముంది? చేసినందువలన ప్రయోజనమేమీ కన్పించడం లేదు. ఎన్నాళ్ళు చేసినా ఏ సంబంధమూ కుదరడం లేదు. ఎవరో రావడము, వాళ్ళ ముందు నేను బొమ్మలా కూర్చోవడము, వాళ్ళు నన్ను చూడడము, వెళ్ళడము - ఇదీ తంతు. అందుకే ఇంక సాయిబాబాను పూజించదలచుకోలేదు.
మాస్టరుగారు (నవ్వుతూ): హమ్మయ్యా! ఆయన నెత్తిన పాలు పోశావ్!
అమ్మాయి: అదేంటి మాస్టారూ!?
మాస్టరుగారు: ఏముందీ! నువ్వు పారాయణ చేశావనుకో, పూజ చేశావనుకో, నీకు సంబంధం కుదిర్చాల్సిన బాధ్యత ఆయనకుంటుంది గదా! పైగా మంచి సంబంధం కుదర్చాలి. ఏదో ఒక సంబంధం చూస్తే చాలదు. నీకు నచ్చిన సంబంధమే కుదరాలాయె. మరి నువ్వు ఆయనను సేవించడం మానేస్తే ఆ శ్రమ ఆయనకు తగ్గించినట్లే గదా! ఆయన నెత్తిన పాలు పోసినట్లే గదా!
అమ్మాయి: మరి ఆయనను సేవిస్తుంటే కుదరట్లేదు గదా! ఇంకెందుకు పూజించడం?
మాస్టరుగారు: అదే నేను చెబుతున్నా. పోనీ, మానేసెయ్.
అమ్మాయి: నాకు బాబా మీద భలే కోపమొస్తున్నది మాస్టారూ!
మాస్టరుగారు: అవునమ్మా, ఆయన మీద కోపం రావడం సహజమే. మరి ఆయన మీద గాక ఇంకెవరి మీద వస్తుంది? ఎవరి మీద వస్తే ఎవరూరుకుంటారు గనుక? అసలు ఎవరి మీదైనా ఎందుకు కోపం రావాలి? నువ్వు సినిమాలు చూస్తావా?
అమ్మాయి: ఆఁ! చూస్తాను.
మాస్టరుగారు: నవలలు చదువుతావా?
అమ్మాయి: చదువుతాను.
మాస్టరుగారు: మరి పెళ్ళి చూపులంటే ఇంకా అందంగా వుండాలని మేకప్ (ఫేషియల్) చేయించుకుంటావా?
అమ్మాయి: అవును.
మాస్టరుగారు: మంచి చీరె కట్టుకోవాలనుకుంటావు గదా! ఒకసారి ఒక చీరె కట్టుకుంటే వచ్చినవారికి నచ్చలేదేమోనని ఈసారి అంతకంటే మంచి చీరె కట్టుకుందామని అనుకుంటావు కదా! మరి ఇన్ని చేసినా సంబంధాలు కుదరడం లేదు గదా! మరి వీటి వేటి మీదా కోపం రావడం లేదా?
మేకప్ చేసుకున్నందువలన కుదరడం లేదు, అయినా మేకప్ చేసుకోవడం మానడం లేదు. నవలలు చదివితే కుదరడం లేదు, గనుక అవి చదవడం మానుకోవచ్చు గదా! సినిమాలు చూస్తే కుదరడం లేదు, సినిమాలు చూడడం మానుకోవచ్చు గదా! పైగా ఇవన్నీ డబ్బు పెట్టి చేసేవే. అయినా వాటిని మాత్రం వదులుకోలేవు. ఇంకా ఇంకా విసుగులేకుండా చేస్తూనే వుంటావు. మరి పాపం ఆ 'ముసలాయన'(బాబా) ఏం ఖర్చు పెట్టించాడని మానుకుంటావు? ఆయన చెప్పిన విషయాలేవీ చెడ్డవి కావు గదా? సినిమాలు, నవలలు మన కాలాన్ని హరిస్తాయి, చెడుకు దోహదం చేస్తాయి. ఆలోచించు, సాయిబాబా చరిత్ర చదివినందువలన నీకు కలిగే నష్టమేమిటి? పోనీ చదవడం మానేస్తే వివాహమవుతుందని నీకు నమ్మకముందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఉంటే అట్లాగే చెయ్యవచ్చు.
అమ్మాయి: లేదు మాస్టారూ!
మాస్టరుగారు: గ్యారంటీ లేనప్పుడు వాటిని ఎందుకు వదులుకోలేకపోతున్నావు? వాటి మీద నీకు కోపం రాదు. ఇంకా ఇంకా చేస్తూనే వుంటావు, అవునా?
అమ్మాయి: మరి ఏం చేయాలి?
మాస్టరుగారు: ఇక్కడ నువ్వు ఒక విషయం ఆలోచించాలి. అసలు సాయిబాబాకు మనతో ఏమి సంబంధము? మనము ఆయనను ఎందుకు సేవిస్తున్నాము? ఆయనను పూజించినా, ఆయన చరిత్ర పారాయణ చేసినా ఆయనకు ఒరిగేదేమిటి? అసలాయన మన కోరికలు ఎందుకు తీర్చాలి?
అమ్మాయి: ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తారు మాస్టారూ!?
మాస్టరుగారు: మరి ఆ సంగతి తెలిస్తే నువ్వెందుకు కోపగించుకుంటున్నావు?
అమ్మాయి: ఇంకా తీరలేదు గనుక.
మాస్టరుగారు: ఎందుకు తీర్చలేదంటావ్?
అమ్మాయి: అదే తెలియదు.
మాస్టరుగారు: అందుకే ముందు అది తెలుసుకోవాలి మనం. చరిత్ర చదివేది ఇవన్నీ తెలుసుకోడానికే. బాగా అర్థం చేసుకుంటూ చదవాలి. కోరిక తీరాలని గబగబా పేజీలు తిరగేస్తే ఆయన ఏది ఎందుకు చేస్తాడో అర్థంగాదు. అసలు ఆయన గురించి అభిప్రాయమేమిటి? ఆయన అన్నీ తెలిసినవాడనే గదా!'
అమ్మాయి: అవును.
మాస్టరుగారు: నువ్వెందుకు ఆయనను పూజిస్తున్నావు? నీకేమీ తెలియదనే గదా!
అమ్మాయి: అవును.
మాస్టరుగారు: అంటే, ఆయనకన్నీ తెలుసని నీకు తెలుసు. నీకేమీ తెలియదని కూడా నీకు తెలుసు. అవునా?
అమ్మాయి: అవును.
మాస్టరుగారు: మరి మన సంగతులన్నీ తెలిసినాయన చేసినది సరియైనదా? లేక మనమనుకుంటున్నదా?
అమ్మాయి: ఆయన చేసినదే!
మాస్టరుగారు: ఒక డాక్టరు వున్నాడనుకో! ఆయనకు మన వ్యాధి ఏమిటో, దాని నివారణకు ఏమి ముందు యివ్వాలో తెలుసు. అందుకని డాక్టరు ఏమి చేసినా, అంటే ఆపరేషన్ చేసినా మనమేమీ మాట్లాడము. ఆయన మన మంచికే చేస్తున్నాడని అనుకుంటాము. అలాగే బాబాకు మన జన్మలు, కర్మలు తెలుసు. మన కోరికలు ఎప్పుడు ఎలా తీర్చాలో తెలుసు. అందుకని ఆయన మనకు శ్రేయస్కరమైనదే చేస్తాడని ఓర్పు వహించాలి. అంతేగాదు, ఆయన సర్వసమర్థుడు. అవసరమైన రీతిన మన కర్మలను మార్చగలడు, తీసివేయగలడు. నువ్వు ఆయనను సేవించలేదనుకో. నీ పూర్వకర్మ ప్రకారమే నీకు జరుగుతుంది. సేవించావనుకో, ఆయనకు నీ సమస్య తీర్చడానికి అవకాశముంటుంది. నువ్వు పారాయణ చేయకపోతే ఆయనకు పోయేదేమీలేదు. చేసినందువలన ఆయనకు ఒరిగేదేమీలేదు. కానీ చేస్తే నీకే మంచిది. ఆలోచించు!
అమ్మాయి: పారాయణ చేస్తాను మాస్టారూ!
మాస్టరుగారు: ఆయన తల్లివంటివారు. మనం ఆయన బిడ్డలం. ఆయన ఎప్పుడూ మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. పారాయణ తప్పక చేస్తుండు, ఆయన లీల చూద్దువుగాని.
పూజ్యశ్రీ మాస్టరుగారి మాట పొల్లుపోలేదు. ఆ అమ్మాయి పారాయణ చేసింది. మంచి సంబంధం కుదిరి పెళ్ళి జరిగింది. అంతేగాక, అంతకుముందు ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక రకంగా మంచివి కాదని తెలిసింది. వాటిలో ఎవరితో వివాహం జరిగినా కష్టమయ్యేదే! బాబా చేసిన మేలుకు కుటుంబమంతా కృతజ్ఞతతో, భక్తితో ఆయనను సేవించారు. పూజ్యశ్రీ మాస్టరుగారి వద్దకు వచ్చి చెప్పి ఎంతో ఆనందించారు. పూజ్యశ్రీ మాస్టరుగారి పట్ల వారికి భక్తి భావం దృఢతరమైంది.
పూజ్యశ్రీ మాస్టరుగారు ఇలా ఎందరికో బాబా పట్ల సరియైన అవగాహనను కలిగించారు. ఆయన చేసిన ఇలాంటి బోధలు ఎన్నో వున్నాయి.
('మహాపురుషుడు' గ్రంథం నుంచి)
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete