సాయిబంధువులందరికీ సాయిరాం. మలేసియా నుండి సాయిబంధువు, బాబా తన బిడ్డలమైన మన మీద తన ప్రేమను, రక్షణను ఎలా చూపిస్తారో ఈ లీల ద్వారా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకు తెలియచేయాలనుకుంటున్నారు.
బాబా తన ప్రేమ వర్షాన్ని నామీద అంతలా కురిపిస్తారని నేను నిజంగా అనుకోలేదు. నేను ఎప్పుడైతే ఇండియాకి తిరిగివచ్చానో అప్పటినుండి నాకు కష్టాలు మొదలైనాయి. అంతా చీకటిగా తోచింది, ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి నన్ను చుట్టుముట్టింది. నేను ఎదుర్కొన్న పరిస్థితిని మాత్రం మీకు వివరించలేను కానీ, నేను ఎదుర్కొన్న ఆ పరిస్థితులలో బాబా నన్ను ఆ సమస్య నుండి ఎలా కాపాడారో వివరించాలని మాత్రం అనుకుంటున్నాను.
ఆ పరిస్థితిలో నేను బాబాతో, "బాబా! నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీవే నా ఇష్టదైవానివి. నిన్ను తప్ప వేరొక దైవాన్ని తలచుకోను కూడా తలచుకోను. నాకు అన్నీ నీవే, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు. నేను నీ భక్తురాలినని నీవనుకున్నట్లైతే మరి నా ఓపికని ఎందుకు పరీక్షిస్తున్నావ్? నేను నీ 'సచ్చరిత్ర' చదివాను, పారాయణం కూడా అయిపోయింది. కానీ పరిస్థితులలో ఎలాంటి మార్పు రాలేదు. నాకు నీవు ఇచ్చిన ఈ సమస్య నుండి బయటపడేసేవరకు నేను ఇక సచ్ఛరిత్ర పుస్తకాన్ని ముట్టుకోను చూడు, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదని నేను అనుకుంటుంటే, నీవు మాత్రం నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు కదా!" అని చెప్పుకుంటూ బాబా మీద చాలా కోపంగా ఉన్నాను.
తరువాత బాబా తన దయాపూరితమైన వర్షాన్ని నా మీద ఈ విధంగా కురిపించారు. అప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతున్నట్లుంది. నేను షిప్ నుండి బయటకు వస్తున్నాను. నా వస్తువులని, లగేజ్ ని తీసుకొని బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. నా ప్రక్కనుండి ఎవరో, 'అమ్మా, అమ్మా' అని నన్ను పిలుస్తున్నారు. అక్కడ చాలా రద్దీగా ఉంది, పైగా నా బస్సు వచ్చే సమయం అవుతుండటంతో నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేని పరిస్థితులలో ఉన్నాను. మరలా 'అమ్మా, అమ్మా' అని ఎంతో తీయనైన స్వరం వినిపిస్తుంది, అయినా నేను తిరిగి చూడలేదు. నేను చూడటం లేదని తను నా భుజాన్ని తట్టి, "ఆగు తల్లీ!" అన్నారు. వెనక్కి తిరిగి చూసాను. తను తెల్లటి వస్త్రాలు ధరించి, గడ్డంతో వున్నారు. చేతిలో ఏదో బట్టల మూటలాగా ఉంది. తన కళ్ళు ఎంతో తేజోవంతంగా మెరుస్తున్నాయి. తనని చూస్తున్న ఆక్షణంలో నా మనసుకెంతో ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఆలోచనలూ లేని స్థితి. అతనిని చూస్తుంటే కళ్ళు ప్రక్కకు తిప్పి చూడాలని కూడా అనిపించడం లేదు. తన చేతి స్పర్శ మహిమో, ఏమో గాని నా నోటి నుండి ఏమీ మాటలు రావడం లేదు. నా కళ్ళు తనని చూస్తున్నాయి, నా చెవులు తను చెప్తున్న ఈ వాక్యాలు వింటున్నాయి.. తను నాతో, "ఎందుకు బాధ పడుతున్నావు? ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్? ఈ కష్టకాలం అంతా ఎప్పటికీ ఉంటుందా? నీవెందుకు నీ దైవ ప్రార్థనని ఆపుతున్నావు? నా నామస్మరణని ఆపకు. నీవు ఎక్కడికి వెళ్లినాగాని నేను నీ వెంటనే ఉంటానుగా, ఇంకెందుకు అంతగా చింతిస్తున్నావ్? అంతా మంచి జరుగుతుంది. నీవు నిశ్చింతగా ఉండు!" అని చెప్పారు. మరుక్షణం నేను వెళ్లాల్సిన బస్సు నాముందు వచ్చి ఆగింది. తను నాతో, "బస్సు ఎక్కు" అన్నారు, నేను ఎక్కాను. బస్సులో కూర్చున్న నా ఆలోచనల వేగం బస్సు వేగం కన్నా వేగంగా ఉన్నాయి. తన స్పర్శతో నాలో కలిగిన పారవశ్యంతో నా నోట మాట ఇంకా రావడం లేదు. తర్వాత నిదానంగా అర్ధం అవుతోంది...జగత్తునంతటినీ తన గుప్పెట్లో ఉంచుకున్న ఆ సాయినాథుడే నాకోసం వచ్చి నన్ను ఓదారుస్తూ తన ప్రేమని ఎంత బాగా వ్యక్తపరిచారో అని. తన పిల్లల బాగోగుల మీద నా సాయికి ఎంత నిశిత దృష్టి! చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళి 'సాయి సచ్చరిత్ర' పారాయణని, సాయి పూజని ప్రారంభించాను. కొన్ని రోజుల్లో నా సమస్యని బాబా తీర్చేసారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.
"సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరించు, సదా నీకు రక్షగా ఉంటాను" అని సాయి నాకు బోధించారు.
🕉 sai Ram
ReplyDeleteYou are so blessed 🙏
ReplyDelete