సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను


సాయిసోదరి గీత గారు తన చిన్న అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. 

ఇటీవల ఒక వాట్సాప్ గ్రూపులోని సభ్యులొకరు షిర్డీ వెళ్తూ, "మీ చిరునామా ఇవ్వండి, నేను మీకు ప్రసాదం పంపుతాన"ని చెప్పారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి చిరునామా ఇచ్చాను. ఎందుకంటే మా అమ్మను చూడటానికి నేను ఎలాగూ అక్కడికి వెళ్తున్నాను కాబట్టి అక్కడే ప్రసాదం తీసుకోవచ్చని నా ఆలోచన. అనుకున్నట్లుగానే ఒకరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా, అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి మందిరానికి వెళ్తూ ఉంటాను. మొదటిసారిగా మా బాబును స్కూలుకి పంపిస్తూ, ముందుగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కణ్ణించి టెంపుల్ కి వెళ్లవచ్చనే కోరికతో. కానీ కొన్ని అనివార్య కారణాల వలన నేను సాయి మందిరాన్ని దర్శించకుండా ఇంటికి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. నేను అక్కడినుండి వచ్చేసిన మరుసటిరోజు అమ్మ ఫోన్ చేసి, షిర్డీ నుండి ఒక పార్సెల్ వచ్చిందని చెప్పింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది, కానీ అదేసమయంలో స్వయంగా వెళ్లి తీసుకోలేనని చాలా బాధపడ్డాను.

వారంరోజుల తరువాత ఒక ఉదయం నేను నా భర్తతో, "మన బాబుకు బాబా ఆశీస్సులకోసం సాయి మందిరానికి వెళ్లాలనుకున్నాను, అది జరగలేదు. అంతేకాకుండా షిర్డీ నుండి ప్రసాదం కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చాక వచ్చింది. ఈసారి నేను తనని దర్శించడానికి బాబా ఇష్టపడనట్లుగా కనిపిస్తోంది" అని బాధగా చెప్పుకున్నాను. మేము ఉదయం అనుకున్న ఈ మాటలు మా అమ్మకు తెలియవు. హఠాత్తుగా ఆమె, నా సోదరుడు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు బాబా ప్రసాదం తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. అలా నాకు బాబా ప్రసాదం అందుతుందని నేను అస్సలు ఊహించలేదు. "నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను' అన్న  బాబా సమయానికి షిర్డీ ప్రసాదాన్ని అందించి నా బాధను తీర్చేసారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబా! మీకు నా ధన్యవాదాలు.
-----------------------------------------------------------------------------------
హైదరాబాదుకి చెందిన మాలతిగారు అనుభవం:
సద్గురు సాయినాథా! మీకు ప్రణామాలు.

సాయిబంధువులందరికీ సాయిరామ్. నా పేరు మాలతి. నేను దిల్ సుఖ్ నగర్ నివాసిని. "నేను కూడా బాబా భక్తురాలిని" అని చెప్పుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఒక చిన్న బాబా లీలను "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

అవి దసరా నవరాత్రులు. ఒకరోజు బాబా దర్శనం చేసుకుని ప్రక్కనే ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళాను. అమ్మవారి శేషవస్త్రాలు, దండలు తొమ్మిదిమంది ముత్తైదువులకు పంచిపెడుతున్నారు. అయితే నాకు కూడా అమ్మవారి దండ కావాలని మనసులో అనిపించింది. కానీ మేము నిల్చున్న వరుసలో నా వరకు వచ్చేసరికి నా సంఖ్య పది అయింది. తొమ్మిదిమందికే ఇస్తారు కాబట్టి నాకు అవకాశం రాదని విచారంగా అక్కడినుండి మళ్ళీ బాబా గుడికి వచ్చి కూర్చున్నాను. కొంతసేపటికి నా స్నేహితురాలు వచ్చి, "రా! మనం బాబాకి అర్చన చేయిద్దాం" అని తీసుకువెళ్ళింది. సాయిబాబాను తదేకంగా చూస్తూ, "ఒక పూలదండ నీవైనా ఇవ్వచ్చుగా బాబా!" అని బాబాని అడిగాను. అర్చన అయిన తర్వాత అక్షింతలు వేసి పూజారిగారు బాబా మెడలో నుండి దండను తీసి నాకు ఇచ్చారు. 'నాకేనా?' అని అడిగాను. "బాబా ఇస్తుంటే ఆలోచిస్తున్నారా? బాబా నీకు ఇవ్వమన్నారు" అని అన్నారు పూజారిగారు. బాబా పిలిస్తే పలికే దైవం కదా! నేను పిలిస్తే పలికి నా కోరికను తీర్చారు. "నా భక్తుల బాధలన్నీ నా బాధలే" అని బాబా అంటుంటారుగా! నిజంగా ఆ సమయంలో నాకు చాలా బాధేసింది, అందుకే బాబా గుడి పూజారిగారికి ప్రేరణనిచ్చి నాకు దండని అనుగ్రహించారు. నా కళ్ళ నుండి ఆనందభాష్పాలు వచ్చేసాయి. కొద్దిసేపటి వరకు నా పరిస్థితి ఏమిటో నాకు అర్ధం కాలేదు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పటినుండి "మనకు ఏమి కావాలన్నా ఇవ్వడానికి బాబా ఉన్నారుగా!" అన్న ధైర్యం నాకు కలిగింది. "అందరినీ అనుగ్రహించడమే కదా బాబా అవతారకార్యం". అందుకే నన్ను ఇలా అనుగ్రహించారు. చిన్న కోరికే అయి ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితులలో నాకు అదే ఎక్కువ. ఎందుకంటే నా మనసు అప్పుడు బాబా దండను కోరుకుంది. "నా భక్తుల మనసెరిగి నేను ప్రవర్తిస్తుంటాను' అని బాబా మరోసారి నా విషయంలో నిరూపించారు. ప్రతిసారి నా కోరికను తీరుస్తూ, మన మనసు తెలుసుకొని తిరుగుతున్న కలియుగ ప్రత్యక్షదైవం మన సాయిబాబా.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo