సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అదృశ్య హస్తం - ఆదుకున్న సాయిమహరాజ్.


ఓ సాయీ! మీ కృపాదృష్టి మాపై ఉంచండి. మీ పిల్లలమైన మమ్మల్ని ఏలుకోండి సాయి. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న మీ బానిసని నేను. నాకు మీరే భగవంతుడు సాయి. మీకు నా ప్రణామాలు. నా ఈ సాయి అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

సాయిబంధువులకు సాయిరాం. నా పేరు అనూరాధ. మాది అంబర్ పేట్. నా చిన్నప్పుడు అంటే 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మా అందరినీ ప్రతినెలా శిరిడీ తీసుకుని వెళ్ళేవారు. మేము అక్కడ 5 రోజులుండి వచ్చేవాళ్ళం. అక్కడి పూజారులు మా నాన్నగారికి పరిచయం ఉండడం వల్ల మా నాన్నగారు స్వయంగా బాబాకి అభిషేకం చేసేవారు. మేము రాత్రిళ్ళు సమాధిమందిరంలోనే బాబాకు ఎదురుగా పడుకునేవాళ్ళం. రోజూ నాలుగు హారతులు పాడేవాళ్ళం. మా నాన్నగారైతే బలవంతంగా అయినా మమ్మల్ని హారతికి తీసుకెళ్లేవారు. నేను అప్పుడు మా నాన్నగారికి పిచ్చి అని, బాబా పిచ్చి అని అనేదాన్ని. అంత తరచుగా ప్రతి నెలా శిరిడీ వెళ్లినా, నాకు బాబాపై నమ్మకం కలిగేది కాదు. నాకు పెళ్ళైన తరువాత కూడా పెద్దగా భగవంతుడిని నమ్మేదానిని కాదు. జీవితంలో చాలా కష్టాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నాం. సాయి "నా భక్తులెంత దూరాన ఉన్నా‌‌, వారిని పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నా వద్దకు లాక్కుంటాను" అని అంటారు కదా! అలా సాయి నన్ను తన భక్తురాలిగా పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు మా నాన్నగారిని 'బాబా పిచ్చి' అన్న నేను ప్రస్తుతం ఆయన భక్తి, ప్రేమ అనే పిచ్చిలో పూర్తిగా మునిగి ఉన్నాను. నాకున్న ఈ పిచ్చి ప్రేమవల్లనేమో "నా భక్తులను అన్నివిధాలుగా ఆదుకోవడానికే  నేను ఉన్నది" అన్న సాయి సూక్తి నా విషయంలో నిజం అనిపిస్తుంది. ఆ లీలను సాయి అనుగ్రహంతో మీతో పంచుకుంటున్నాను.

నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం అది. నాకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. తప్పనిసరిగా ఆపరేషన్ అవసరమవుతుందని కూడా డాక్టర్లు చెప్పారు. కాబట్టి నేను తొమ్మిది నెలల వరకు మంచం మీదే ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. నాకు తొమ్మిదవ నెల నడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను మంచం మీద మగతగా పడుకొని ఉన్నాను. ఆ సమయంలో నా ప్రక్కన ఎవరూ లేరు. కానీ నా కడుపు ప్రక్కన ఒక 'అదృశ్యహస్తం' నాకు కనపడుతోంది. చెయ్యి, చేతివేళ్ళు కనపడుతున్నాయి. నాకు స్పృహ వచ్చేసరికి నా కడుపు మీద గట్టిగా కొట్టినట్టు అయింది. వెంటనే గట్టిగా అరుస్తూ మా అమ్మని పిలిచి, "ఎవరో నా కడుపు మీద కొట్టారమ్మా" అని చెప్పాను. మా అమ్మ అంతా చూసి, "ఇక్కడ ఎవరూ లేరు" అని చెప్పింది. "నిజంగా నేను చేతులు చూసాను" అని అంటే, ఆమె "అంతా నీ భ్రమ" అని కొట్టిపారేసింది. నేను ఏదో టెన్షన్ పడుతున్నానని, డాక్టర్ తో మాట్లాడితే కాస్త కుదుటపడతానని భావించి, మా అమ్మ నన్ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది. డాక్టర్ పరీక్ష చేసి, ఇంక రెండు గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పారు. "అసలు తనకి డెలివరీ అవటానికి చాలా సమయం ఉంది. కానీ బేబీ తల క్రిందకు వచ్చింది. ఇంత తొందరగా ఇలా జరగనే జరగదు. ఇది ఎలా సాధ్యం?" అంటూ డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ అవసరమే లేకుండా బాబా దయవలన నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. తర్వాత కుండపోతగా వర్షం కురుస్తూ ఉండటంతో బాబుకు పాలు పట్టడానికి బాటిల్ కూడా బయట నుండి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఏమి చేయాలో తోచక బాబాను ప్రార్థిస్తే, ఎవరో పాలబాటిల్ తెచ్చి ఇచ్చారు.

ఆ అదృశ్య హస్తం ఖచ్చి‌తంగా నా బాబాదే. ఆరోజు బాబా నాకు ఆ అనుభవాన్ని ఇవ్వకుంటే నేను హాస్పిటల్ కి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఇంటివద్దే ఉండి ఉంటే బేబీకి ప్రమాదం జరిగి ఉండేదని డాక్టర్ చెప్పారు. బాబా అంటారుగా, "నీ జాతకంలో బిడ్డలు పుట్టే యోగం లేదు. నేను నా దేహాన్ని చీల్చి నీకు బిడ్డను ప్రసాదించాను" అని. అది నా విషయంలో బాబా ఇలా చేశారేమో అని ఎప్పుడూ అనిపిస్తుంది. ఎందుకంటే, నాకు అంతకుముందు మూడుసార్లు అబార్షన్ అయింది. ఇప్పుడూ అదే జరిగితే నేను తట్టుకోలేకపోయేదాన్ని. నన్ను, నా కడుపులోని బిడ్డను కాపాడింది ఆ సాయినాథుడే! ఎన్ని  కృతఙ్ఞతలు చెప్పినా గాని తక్కువే ఆయనకి. నిజంగా ఆయన లీలలు అగాధాలు. ఒక్కొక్కరిని ఒక్కోరకంగా ఆయన అనుగ్రహిస్తుంటారు.  అదృశ్యహస్తంతో నన్ను, నా బిడ్డని కాపాడారు. సాయి దయామయుడు. నన్ను 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్' వారు ఒక 35  సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే, అవి తేనెకన్నా తీయనైన సాయి స్మృతులు.

2 comments:

  1. Aa baba Krupa mee pai unnanduku Meeru Chaala adrushtavantulu 🙏🏼🙏🏼🙏🏼 Sai ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo