సాయిబంధువులకు నమస్కారం! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు బ్యాంకు ఉద్యోగం అనుగ్రహించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
నేను 2015వ సంవత్సరంలో బి.టెక్ పూర్తిచేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న కోరికతో బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాను. నేను ప్రతి బ్యాంకు పరీక్షా వ్రాశాను. కానీ నేను ఓపెన్ కేటగిరీకి చెందినందువల్ల ప్రతిసారీ 0.5 మార్కుల తేడాతో సెలెక్ట్ కాలేకపోయేదాన్ని. అప్పుడు నేను శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురుచరిత్ర, శ్రీపాదశ్రీవల్లభచరిత్ర చదవటం మొదలుపెట్టాను. విష్ణుసహస్రనామ పారాయణ, సిద్ధమంగళస్తోత్ర పారాయణ చేశాను. అనేకసార్లు గురువారవ్రతం, సాయిదివ్యపూజ కూడా చేశాను. ఇన్ని చేసిన తరువాత కూడా అనేక వైఫల్యాలు ఎదుర్కొన్నాను. ఇంక సహనాన్ని కోల్పోయి, "బాబా! ఒక ఉద్యోగం పొందడానికి నాకు ఎందుకు ఇన్ని ఆటంకాలు? ఇన్ని పూజలు, పారాయణలు చేసిన తర్వాత కూడా ఎందుకు నేను వైఫల్యాలు ఎదుర్కోవాలి?" అని బాబాను అడిగాను. ఒకానొక స్థితిలో బాబాపై ఆశ కూడా కోల్పోయాను. రెండు సంవత్సరాల్లో శిరిడీ, అక్కల్కోట, పిఠాపురం సందర్శించాను. ప్రతిసారీ, "నాకు ఉద్యోగం వస్తుందా, రాదా?" అని చీటీల ద్వారా బాబాని అడిగేదాన్ని. ప్రతిసారీ బాబా నుండి సానుకూలమైన సమాధానం వచ్చేది. కానీ, వైఫల్యమే ఎదురయ్యేది. ఇవన్నీ చూసిన తరువాత మా అమ్మ నా భవిష్యత్తు తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళింది. అతను నాకు గవర్నమెంట్ ఉద్యోగంగానీ, బ్యాంకు ఉద్యోగంగానీ రాదనీ, అసలు ఏ ఉద్యోగమూ రాదనీ, వందల ఇంటర్వ్యూలకు హాజరైనా ఏ ఉద్యోగమూ రాదనీ, ఉద్యోగం తన రాతలో లేదనీ చెప్పాడు. అది విని నేను చాలా నిరాశకు గురయ్యాను. పూజారి చెప్పిన పూజలు కూడా చేశాను. ఆ రాత్రి నేను బాధతో చాలా ఏడ్చాను. తరువాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను బాబాని, "నాకు ఉద్యోగం వస్తుందా, లేదా?" అని అడిగాను. అప్పుడు బాబా నన్ను చూసి చిన్నగా నవ్వి, "ఆందోళనపడకు, నీకు ఉద్యోగం వస్తుంది" అని చెప్పారు. అలా బాబా చెప్పడంతో నాకు విశ్వాసం కుదిరి, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఈసారి నేను చీటీలు వేసి బాబాను అడగకుండా, నేరుగా పరీక్ష వ్రాసి, ఫలితాల కోసం వేచిచూశాను. బాబా మాట నిజమైంది. కరూర్ వైశ్యా బ్యాంకు(kvb)లో నాకు మొదటి ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగంలో ఒక నెలరోజులు పనిచేశాను. ఆలోగా నాకు కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను kvbకి రాజీనామా చేసి, కెనరా బ్యాంకులో చేరాను. విజయవంతంగా 6 నెలలు పూర్తి కావడంతో నన్ను పర్మినెంట్ చేశారు. ఆ రెండు సంవత్సరాలలో నేను బాబాకి ఎంతో దగ్గరయ్యాను. ఇప్పుడు బాబా పట్ల నా విశ్వాసం చాలా దృఢమైంది. నేను శ్రద్ధ, సబూరి యొక్క నిజమైన అర్థం తెలుసుకున్నాను. 2015లోనే బాబా నాకు ఉద్యోగం ఇచ్చేవారు, కానీ ఆయన నాకు 'విశ్వాసం' మరియు 'సహనం' అనే రెండు పైసలకు అర్థం తెలియజేయాలనుకున్నారు. అంతేకాకుండా, సద్గురువును ఆశ్రయించి ప్రార్ధిస్తే ఆయన మన తలరాతను కూడా మార్చగలరని తెలియజేశారు. నిజంగా ఉద్యోగం నా అదృష్టంలో లేకపోయినప్పటికీ బాబా నాకు ఉద్యోగాన్ని ఇచ్చి నా తలరాతనే మార్చేశారు. ఆయన నన్ను అయిదు దత్త అవతారాలను పూజించేలా చేశారు. ఈ రెండు సంవత్సరాలలో బాబా నాకు కలలో చాలాసార్లు దర్శనమిచ్చి, 'నేను తమ ప్రియమైన భక్తురాలిని' అని చెప్పారు. నేను ఉద్యోగం సంపాదించడంలో చాలా బాధపడినప్పటికీ, ఎటువంటి పరిస్థితులలోనైనా బాబా తన భక్తులకు సదా తోడుగా ఉంటారని తెలుసుకొని ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరియర్‌లో మాత్రమే కాదు, నా వ్యక్తిగత సమస్యలు కూడా బాబా పరిష్కరించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"
బాబా ముందు జాతకాలు, జ్యోతిష్యాలు ఏవీ పనిచేయవు. జాతకాలు, జ్యోతిష్యాలు అంటూ కాలయాపన చేసుకోకండి. బాబానే దృఢవిశ్వాసంతో పట్టుకోండి. ఆయన సర్వసమర్థులు. మీ అభీష్టం నెరవేరుతుంది.
No comments:
Post a Comment